'ఆస్పత్రికట్టే ఆలోచనలో ఉండడం కాదు కట్టడంపని ప్రారంభమైంది. పునాదులు లేచాయట. పని ఎంతో చురుకుగా సాగుతూ ఉందట! మొన్ననే ఉత్తరం వచ్చింది.'
'అలాగా! చాలా సంతోషం!' అని శారదవైపు ప్రశ్నార్ధకంగా చూశాడు. అతని ఉద్దేశాన్ని గుర్తించిన శాంత 'ఓహ్....! పరిచయం చేయడం మర్చే పోయాను. ఈమె నా స్నేహితురాలు శారద. ఒకే క్లాసు, హాస్టలులో ఒకే రూము.' అని శారదను చూస్తూ 'శారదా! ఇతను బావకు క్లాసుమేటు. అంతే కాకుండా బావకు ప్రాణస్నేహితుడు. బావ ప్రోత్సాహంవల్లనే మెడిసిన్ చదువుతూ ఉన్నాడు. పేరు సుందరం. బహుశా ఫైనలియర్ చదువుతున్నాడనుకుంటాను. కలిసి చాలా రోజులైంది. వివరాలు సరీగా తెలియవు.' అని తన పని ముగిసినట్లు ఒక్కసారి మౌనం దాల్చింది శాంత.
శారద, సుందరం పరస్పరం నమస్కారాలు చేసుకున్నారు.
'శాంతా! అలా ఎటైనా వెళ్ళి మాట్లాడుకుందాం పద.' అంది శారద.
'అలాగే! పద సుందరం. అలా న్యూ తాజ్ కు వెళ్ళి కాఫీ త్రాగుతూ మాట్లాడుకుందాం. ముగ్గురూ న్యూతాజ్ వైపు నడిచారు. ఫ్యామిలీస్ సెక్షనులో ప్రత్యేకంగా ఒక రూములో కూర్చున్నారు. శాంత, శారదలు వద్దని ఎంత వారిస్తున్నా వినకుండా సుందరం టిఫినుకు ఆర్డరిచ్చాడు.
'సుందరం....నీకు పల్లెటూర్లో ఉండాలంటే విసుగు పుడుతుందంటున్నావు....మరి బావేమో నిన్ను దృష్టిలో ఉంచుకొని హాస్పిటలు కడుతున్నాడు!' విస్మయంతో ప్రశ్నించింది శాంత.
'నేను హవుస్ సర్జన్ పూర్తి చేసేసరికి ఆస్పత్రి తయారౌతుందనీ, తప్ప కుండా నేను అందులో డాక్టరుగా పని చేయాలనీ, ఆజ్ఞాపిస్తునట్లుగా నిన్ననే ఉత్తరం వ్రాశాడు రామం. వాడి ఉత్తరం నన్ను సందిగ్దావస్థలో పడేసింది, నాకేమో యిష్టంలేదు. వాడేమో రమ్మంటున్నాడు. ఈ సమస్య ఎలా పరిష్కారమౌతుందో చెప్పలేను.' ఏదో తీరని సమస్యను పరిష్కరించలేనివాడి ముఖ కవళికలను గుర్తుకు తెస్తూందతని ముఖం.
'మీకు పల్లెటూరంటే అంత అయిష్టమెందుకండీ?' ప్రశ్నించింది శారద.
'ఏమిటోనండీ! మొదటినుండీ ఆ వాతావరణమంటే నాకు నచ్చదు. ఆ మనుషులు. వారి ఆ తీరు చూస్తుంటే నాకు ఏదో విధంగా ఉంటుంది.' పల్లె జీవితంపై తనకుగల అసహ్యాన్ని ముఖంలో ప్రస్ఫుటింపజేస్తూ అన్నాడు సుందరం.
అంతలో టిఫిను వచ్చింది. టిఫిను చేస్తూ కబుర్లలో పడ్డారు శాంత, సుందరం. వారి సంభాషణలో పాల్గొన లేదు శారద. సుందరం మాట తీరు. ప్రవర్తన శారదకు నచ్చలేదు. పైగా యిప్పుడే లండనునుండి దిగివచ్చిన సీమ దొరలా మాట్లాడుతున్నాడు. పల్లె టూర్లు అతనికి విసుగు కలిగిస్తాయనడం శారదకు ఎక్కడలేని ఆశ్చర్యాన్ని కలిగించింది.
'సుందరం! బావ నిన్నలా కోరడం న్యాయంగానే ఉంది. మన ప్రాంతంలో మంచి డాక్టర్లేవరున్నారు? పైగా నీవైతే మాలో కలిసిపోతావు.' అతని అభిప్రాయం తెలుసుకోవాలనే ఉద్దేశంతో అంది శాంత.
'అక్కడే చిక్కు వస్తుంది శాంతా! అక్కడ మనిషి విలువను సరీగా గుర్తించరు. అంతా తెలిసినవాళ్ళు. 'ఒరేయ్ సుందిగా' అని పిలిచేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారలా పిలుస్తున్నారని బాధ పడడానికీ వీలు లేదు. వారలా పిలుస్తూ ఉంటే సహించి ఊరుకోలేను. వారలా పిలవడంలో తప్పు లేదు. అలా పిలవడం సహజం కూడా ! కాని అలా పిలిపించుకోవడానికి నా మనసు ఒప్పుకోదు. అదీ యిబ్బంది' విషయం తేల్చేశానన్న తృప్తితో నిట్టూర్చాడు.
టిఫిను పూర్తిచేశారు. మూడు కాఫీలు ఆర్డరివ్వబోయాడు సుందరం. శాంత ఆ ఆర్డరును రెండు కాఫీ ఒకపాలు అని సవరించింది. శారద కాఫీ త్రాగదని ఊహించుకున్నాడు సుందరం.
'ఓ...! మీరు కాఫీ త్రాగరా?' తన ఊహను నిర్ధారణ చేసుకోవడానికి ప్రశ్నించాడు.
'లేదండీ!' సమాధాన మిచ్చింది శారద.
'ఏం...?' అని శారదవైపు ప్రశ్నార్ధకంగా చూశాడు.
'మొదటినుండీ నాకు అలవాటు లేదండీ! లేని అలవాటును యిప్పుడు చేసుకోవాలనే ఉత్సాహం అంతకన్నా లేదు.'
'అదేమిటండీ....! ఈ రోజుల్లో మీలాంటి వారుండడం ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. పైగా కాలేజీలో చదువు తున్నారు....!! కాలేజీలలో చదివేవారంతా కాఫీ త్రాగి తీరాలనే అర్ధం స్ఫురిస్తుంది అతని మాటలలో.
'మీరు భలేవారండీ! కాలేజీలో చదివి నంత మాత్రాన అవసరంలేని అలవాట్లు చేసుకోవాలని ఎక్కడుంది?' సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ ప్రశ్నించింది శారద.
అలాంటి సూటి ప్రశ్నకు అతనివద్ద సమాధానం లేదు. 'అబ్బే! అటువంటిదేమీ లేదండీ! సాధారణంగా యివన్నీ మామూలుగా అబ్బే అలవాట్లనీ....!' నీళ్ళు నములుతూ సమాధాన మిచ్చాడు.
శారదతో మాట్లాడిన అ కొద్ది సమయంలోనే ఆమె సంగతి పూర్తిగా అర్ధం చేసుకున్నాడు సుందరం; ఆమె నేటి నాగరికతకు పూర్తి విరుద్ధమని. ఆ సమస్య అంతటితో ఆగిపోయింది.
'సరే! మరి నీవేం నిర్ణయించుకున్నావు?' సుందరాన్ని ప్రశ్నించింది శాంత.
'ఇంకా ఎక్కడ? హౌస్ సర్జన్ పూర్తి చేయాలిగా! చాలా సమయముంది. నెమ్మదిగా ఆలోచిస్తాను' అన్నాడు సుందరం.
'అదేమిటండీ! పల్లెలోపుట్టి, పల్లెలో పెరిగారు. బహుశా మీరు యిక్కడికి వచ్చి ఐదారు సంవత్సరాలు అయి ఉంటుంది. ఈ కృత్రిమ వాతావరణానికి లొంగిపోయి పుట్టిన గడ్డను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. మీ నిర్ణయం రామం అన్నయ్య ఆశయానికి అనుకూలంగా ఉండాలని ప్ర్రార్దిస్తున్నాను. ఇక్కడ డాక్టర్లకు కొదువలేదు. వారందరిమధ్య మీరు రాణించడం కూడా చాలా కష్టం. అక్కడ మీకు లభించే గౌరవమర్యాదలు యిక్కడ మీకు మచ్చుకుకూడా కనుపించవు. మీరు బాగా చదువుకున్నవారు. ప్రత్యేకించి ఒకరు చెప్పవలసినదేముంది...? జాగ్రత్తగా ఆలోచించుకోండి!' చురక వేసింది శారద.
శారద మాటలలోని నగ్నసత్యాన్ని కాదనలేకపోయాడు సుందరం ఆమె మాట్లాడుతున్న తీరు, ఆమె మాటల లోని ఖచ్చితానికి ఆశ్చర్యపోయాడు.
'అలాగే ఆలోచిస్తానండీ!' అన్నాడు సుందరం శలవు తీసుకుంటూ. శాంతవైపు చూస్తూ 'అప్పుడప్పుడు కలుస్తూండు శాంతా! ఇది నా రూం అడ్రసు' అని ఒక కాగితంమీద తన అడ్రసు వ్రాసి చ్చాడు సుందరం.
'ప్రయత్నిస్తాను' ముభావంగా అని అతనిచ్చిన అడ్రసు కాగితం తీసుకుంది శాంత.
సుందరం వెళ్ళిపోయాడు. అతనిని గురించి శాంత ఒకరకంగా, శారద ఒక విధంగా ఆలోచిస్తూ తమ హాస్టలువైపు వెళ్ళే బస్సుకోసం నిరీక్షించసాగారు.
* * *
7
హాస్టలులో రాత్రి భోజనాలు ముగిశాయి. చాలా రాత్రివరకు ఇద్దరూ చదువు కున్నారు, ఆ తర్వాత శాంత పడుకొని నిద్రపోయింది. సాయంత్రం సుందరంతో జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చి ఆ ఆలోచనలో పడింది శారద.
'హుఁ...పల్లె జీవితమంటే ఎందుకో విసుగు? ఈవిధంగా ఆలోచిస్తూ పల్లెలను నిర్లక్ష్యం చేస్తూ, బస్తీ విలాసాలకు అలవడి, నిజమైన జీవితం అదేనని భ్రమ పడుతూ తమకు తాము తీరని ద్రోహం చేసుకుంటున్నారు. వైద్యవృత్తిలో పట్టా తీసుకోబోతున్న సుందరం, తను పుట్టిపెరిగిన స్థలాన్ని అసహ్యించు కుంటున్నాడంటే నాకు ఎంతో బాధ కలుగుతూ ఉంది. ఒకవేళ అతను ఇక్కడ ప్రాక్టీసు పెట్టినా బాగా సాగుతుందన్న నమ్మకం లేదు. బోలెడుమంది డాక్టర్లు, స్పెషలిస్టులు ఉన్నారిక్కడ. ఇక ఉద్యోగ విషయం. ఉద్యోగంలో స్వతంత్రం వుండదు. రామం అన్నయ్య అభిప్రాయం ప్రకారం చక్కగా ఆ ఊరిలో ఉంటే గౌరవ మర్యాదలు మన్నన లభిస్తాయి. కాని అతను ఆ విషయంలో అన్నయ్య అభిప్రాయంతో ఏకీభవిస్తాడన్న నమ్మకం నాకేమాత్రం కలగడం లేదు. ఒక్క సుందరమే కాదు. గొర్రెదాటు సామెతలూ మన సాంప్రదాయాలను సంస్కృతీ సభ్యతలను విస్మరించి తామేదో నవ నాగరికుల మనుకుంటున్న వారెందరో ఉన్నారు-
'ఈ విధంగా మనము కేవలము నవ నాగరికతా వ్యామోహంలో పడి అలమటించి పోతున్నాము. ఎవరైనా ఒకరు సనాతన ఆచార వ్యవహారాలను మరిచిపోలేక వాటిని పాటిస్తూ వుంటే వారిని హేళన చేస్తున్నాము. ఇలా ఎంతకాలం సాగుతుంది? స్వాతంత్ర్యం సిధ్డించి రెండు దశాబ్దాలు దాటుతున్నా మనం హిందూ ధర్మాన్ని సక్రమంగా పాటించలేక పోతున్నాం. భవిష్యత్తులో పాటించగలమా? ఏమో? ప్రజలలో చైతన్యం రావాలి. అదెలా సాధ్యం? పూర్వం వచ్చిన చైతన్యం ఎలా రాగలిగింది...? .... అవును.........మళ్ళీ హిందూమతాన్ని పునరుద్ధరించగల రచనలు కావాలి. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, అరవింద మహర్షి, రమణ మహర్షి, అప్పటి ఆ సంఘంలోని కుళ్ళును కొంతవరకు తొలగించగలిగారు? వివేకానందుని సింహగర్జన యితర దేశాలను కూడా దద్దరిల్ల జేసింది. ఇప్పుడు కూడా ఎవరైనా ఆ విధంగానే పూనుకో వాలి.' అని ఆలోచిస్తూ ఒక దృఢ నిర్ణయానికి వచ్చి చాలా పొద్దుపోవడం వల్ల అలసటతో నిద్ర పోయింది శారద.
* * *
సాయంత్రమైంది. దినకరుడు పశ్చిమానికి పయనించాడు. పడమటి దిక్కు అరుణవర్ణంతో రాగరంజితమైంది. నీరజ శ్రీపతిగారు యింటి ముందున్న తోటలో కూర్చున్నారు. ప్రభాకరాన్ని గురించి ఆలోచిస్తూన్న నీరజ ముఖంలో వచ్చిన ఎర్రదనం ఆనాటి సంధ్యా సమయ అరుణ కాంతితో పోటీ పడుతోంది. ఎలక్షనులో పోటీ చేసి వోడిపోయిన అభ్యర్ధిలా విచారంతో దీనంగా ముఖ కవళికలను మార్చుకొని ఆమెకు యెదురుగా వున్న కుర్చీలో కూర్చున్నారు శ్రీపతిగారు. ఎండాకాలం అప్పుడే ప్రారంభమౌతోంది. తోటలో కూర్చున్నప్పటికీ ఏదో తీవ్రమైన ఆలోచనలతో సతమతమౌతూ వుండడం వల్ల వారిద్దరి ముఖాలపై చమట బిందువు లుద్భవిస్తూ ఒక్క క్షణం ముత్యాలలా మెరుస్తూ, క్రమంగా ధారలు కట్టి క్రిందికి చేరుకున్నాయి.
ప్రభాకరానికి, వారిద్దరికీ మధ్య జరిగిన వాగ్వివాదమే వారిద్దరినీ ఆ స్థితికి తీసుకువచ్చింది. ప్రభాకరం అప్పుడు ఆ రెండు వేల రూపాయలు తీసినప్పటి నుండీ శ్రీపతిగారు ఎంతో జాగ్రత్త పడుతున్నారు. అందువల్ల ప్రభాకరం ఆటకట్టింది. ప్రతి వారం రోజుల కొకసారి డబ్బు విషయంలో తండ్రితో పేచీ పడుతూ, చిర్రు బుర్రు లాడుతున్నాడు. అయినా ఈసారి శ్రీపతిగారు తమ మనసు కఠినంగా మార్చుకున్నారు. ఎంత పోరాడినా ప్రభాకరానికి మాత్రం పుష్కలంగా డబ్బి స్వదలచుకోలేదు. రెండు గంటల క్రితమే తండ్రికి. కొడుకుకి జరిగిన ఘర్షణలో నీరజ పాల్గొని ప్రభాకరంచేత తీవ్రంగా అవమానించబడింది.
'మామయ్యా! ఇంక లాభం లేదు. ఇంతకాలం అతనిలో మార్పు వస్తుందని ఊహించాను. నేను, నాన్నగారు ఈ ఇంట్లో వుండడం అతనికి ఎంతో కష్టాన్ని కలిగిస్తూ వుంది. వోర్వలేక పోతున్నాడు. ఎంత దగ్గరి బంధువులమైనా ఎంత కాల మని మీ యింట్లో ఉండగలం?' ప్రభాకరం అవమానించాడన్న ఉక్రోషంతో జేవురించిన ముఖ కవళికలతో చిటపట లాడుతూ అంది నీరజ.

'అమ్మా! నీవు యిలా మాట్లాడడం న్యాయం కాదు. మీరు వచ్చినప్పటినుండి ఈయిల్లు ఎంతో కళకళలాడుతూ ఉంది. వాడి విషయం నీకు తెలిసినదే! అమాయకత్వంతోకూడుకున్న మూర్కత్వం. కొన్ని కొన్ని విషయాలు చెప్పగానే అర్ధం చేసుకుంటాడు .... వింటాడు.' దిక్కుతోచక బాధపడుతూ అన్నారు శ్రీపతిగారు.
డాక్టరు దగ్గరకు వెళ్ళి అప్పుడే లోపలికివస్తూన్న సుందర్రామయ్యగారు శ్రీపతిగారి మాటలు విన్నారు.
'బావగారూ! అమ్మాయి నేను ఒక నిర్ణయానికి వచ్చాము. అమ్మాయికి ప్రభాకరాన్ని చేసుకోవడం యిష్టంలేదు. ఎన్నిసార్లో మీకు చెబుదామని, ఆ విషయం తెలుస్తే మీరు ఎక్కువ బాధ పడతారోనని సంకోచిస్తూ చెప్పలేకపోయాను. నాకు వైద్యం చేస్తున్న డాక్టరుగారి యింటికి దగ్గరలోనే ఒక యిల్లు అమ్మజూపు తున్నారు. ధర ఖాయంచేసి అడ్వాన్సు యిచ్చాను. నాలుగైదు రోజులలో రిజిస్ట్రేషను జరుగుతుంది. రేపు మంచిరోజు. అందులో ప్రవేశించాలను కుంటున్నాము. అందులో కిరాయికి ఉన్నవారు నిన్ననే ఖాళీ చేశారు' ఆప్యాయతతో మాట్లాడినా ఆమాటలు నిష్కర్షగా ఉన్నాయి.
