ఇంత ఘోరం జరిగిందని కామాక్షి రమేష్ కు ఉత్తరం వ్రాసింది. ఉత్తరం చూడగానే రమేష్ వచ్చాడు. తండ్రి ఏమీ చెప్పలేకపోయినా కామాక్షి అంతా చెప్పింది.
"రాఘవరావు ఇంత గ్రంధం జరిపినప్పుడు నాతొ ఎందుకు చెప్పలేదే, అక్కా? అప్పుడే చెప్పి ఉంటె ఈపాటికి తగిన బుద్ది చెప్పేవాడిని." అన్నాడు రమేష్ కోపంతో.
"నేను ఆడదాన్ని. ఈ విషయం నలుగురితో చెప్పానే అనుకో. నావల్ల తప్పు లేకపోయినా నన్ను నమ్మరు. నా పరిస్థితి అటువంటిది. ఇంత దారుణానికి తెగించావా అని ఎవరన్నా రాఘవరావు ను నిలదీసి అడుగుతే, కామాక్షి నన్ను పిల్చింది, నేనే నీతి మంతుడిని గనుక ఒప్పుకోలేదు. నేను ఒప్పుకోక పోవడం నుంచీ నా మీద క్రోధం కొద్దీ ఇట్లాంటి అభాండం వేసింది అంటాడనుకో . అప్పుడు నా గతేం కావాలి చెప్పు. నలుగురి నోళ్ళలోనూ పడి అప్రతిష్ట తెచ్చుకోవడమే అవుతుంది. నీతి నియమాలు పాటిస్తున్నా నా మాటలు ఎవరూ నమ్మరు. నేను వితంతువు ని . వయస్సు మీరినదాన్ని కాదు. ముల్లు పోయి అరిటాకు మీద పడ్డా, ఆకు పోయి ముళ్ళు మీద పడ్డా , ఆకుకే ప్రమాదం కదా1 ఈ పరిస్థితులన్నీ ఆలోచించే ఈ సంఘాన్ని మెప్పించి, నమ్మించ లేకనే, అంత పరాభవం జరిగినా ఊరుకున్నాను. అంతటి తోనైనా రాఘవరావు తన బుద్ది మార్చుకుంటాడను కున్నను. వాడి క్రోధం తీరక ఈ దారుణానికి పాల్పడ్డాడు."అని కళ్ళంట నీరు పెట్టుకుంది కామాక్షి.
తన అంతర్యం లోని అన్ని విషయాలు , అన్ని అవమానాలు ఈరోజున విప్పి చెప్పేసరికి పెద్ద బరువు దించి నట్లయి , ఆమె హృదయం తేలిక పడ్డది. అవమానాన్ని దిగమ్రింగి ఊరుకోవడం చేతనే ఇంతవరకూ వచ్చిందని వాపోయింది కామాక్షి.
"అందుకే కాబోలు నాతొ ఏదో చెప్పాలని అనుకోని ఏమీ చెప్పక ఆ ఇంట్లో ఉన్న తండ్రి కూతుళ్ళ ది తలో దారి అని చెప్పి తన అక్కసు తీర్చుకున్నాడు. తేనే పూసిన కత్తి. అంటే నీ మీద అపనింద వేయాలనేగా వాడి ఉద్దేశ్యం? నాకప్పుడు తోచలేదు. ఇప్పుడు అన్నీ తెలిసినయ్యి. సరే కానియ్యి. ఎంతకాలం వీదిట్లా మన కుటుంబం మీద అభాండాలు వేస్తాడో చూస్తాను." అన్నాడు రమేష్ కోపంతో.
"ఊరుకో తమ్ముడూ. కుర్రతనం వల్ల తొందరపడి వాడి మీద ఏ అఘాయిత్యానికి పూనుకోకు. వాడు అన్నిటికీ తెగించిన వాడు" అన్నది కామాక్షి.
రమేష్ మర్నాడే గుంటూరు వెళ్ళడానికి ప్రయాణ మయ్యాడు. తండ్రి నడిగి డబ్బు తీసుకున్నాడు. అసలే దిగులుపడి కూర్చున్న నాగభూషణం ఇంకా దిగులు పడ్డాడు. అయన మనస్సు ఎందుకో ఆవేదనతో నిండిపోయింది. ముఖం లో విచారం ప్రస్పుటంగా కనిపిస్తున్న కొడుకును ఎన్నాళ్ళ నుంచో ఒక విషయం అడగాలని అనుకొంటున్నాడు. ఇదివరకు కూడా అడగలేక పోయాడు. ఈ పరిస్థితుల్లో అయన మనసు ఎంతో క్షోభించింది. ఇంక రమేష్ ను అడగలేకుండా ఉండలేక పోయాడు.
"సరిగ్గా చదువుకుంటున్నావురా?"
"ఏం నాన్నా! అట్లా అడుగుతున్నావు?"
"నువ్వు చదువు కుంటున్నావనే నేనను కొంటున్నాను. కాని లోకం అనుకోలేదుగా? నువ్వేదో ప్రేమ కలాపాలు సాగిస్తున్నావని నేను చాలాసార్లు విన్నాను. వయస్సటు వంటిది. నేను పెద్దవాణ్ణి అయ్యాను. అన్నయ్యల విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళూ వాళ్ళ సంసారాలూ దిద్దుకుంటూ కన్నతండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడనే అభిమానమయినా లేకుండా వాళ్ళ తాపత్రయాల్లో వాళ్ళున్నారు. ఇంక అన్ని ఆశలూ నీ మీదనే పెట్టుకున్నానురా! నాకేమీ నీవు సంపాదించి పెట్టక్కర్లేదు. అరవై ఏండ్ల వాడిని. ఊరు పొమ్మంటున్నది, కాడు రమ్మంటున్నది. నేచేప్పే వన్నీ నీకు చాదస్తం గా కనపడవచ్చు. పెద్ద తనం వల్ల చాదస్తం ఉండనే ఉంటుంది. ఈరోజుల్లో ఎవరి బాగోగులు వాళ్ళవి. ఎవరి పచ్చదనం వాళ్ళది. ఎవళ్ళ సుఖం వాళ్ళది. ఎవరి బాగు వాళ్ళు సవ్యంగా చూచుకొన్నా అంతవరకూ మంచిదే. ఇంతగా ఎందుకు చెప్పుతున్నా నంటే నువ్వు పెద్దవాడి వయ్యావు. నీకు అనుభవం తక్కువ. ఆలోచనలు ఎక్కువ. అందులోనూ ఏదో నాలుగు కధలూ, పుస్తకాలూ వ్రాసేవారుకి మరీ ఆలోచనలు జాస్తి. అడ్డాల నాడే బిడ్డలు గాని, గడ్డాలోచ్చిన తర్వాత కొడుకులు కూడా తండ్రులకు స్నేహితులే. నా జీవితం పూర్తయి పోతున్నది. ఎప్పుడో రాలిపోవచ్చు. అందుకు నేను విచారపడను. నా దిగులు ఒక్కటే. అక్కయ్య కామాక్షి పాతికేళ్ళ లోగానే డానికి అన్ని అనుభవాలు తీరినాయి. దాని మనస్తత్వం, మంచి చెడ్డలు నాకు తెలుసు. అది గంగి గోవు లాంటిది. డానికి నెత్తి మీద గొడుగు లేకపోవడం చేత తెగిన గాలిపటం లా భావించి, సంఘం లో కొంతమంది కామంధులు దాని మీద కన్ను వేశారు. దాని జీవితం బండలు కాకుండా గౌరవ ప్రదంగా వెళ్ళిపోయేటట్లు చూడవలసిన బాధ్యత నీమీద పెడుతున్నా . ఇంతకన్నా చెప్పవలసింది లేదు. తరువాత నీ ఇష్టం." అన్నాడు.
అయన కళ్ళు చేమర్చినాయి. పై పంచతో కళ్ళు తుడుచుకున్నాడు. తండ్రి ఆవేదన అర్ధం చేసుకున్నాడు రమేష్.
"నాన్నా! నేను పుట్టి బుద్దేరిగిన తర్వాత ఇంతగా నాతొ నువ్వు ఎప్పుడూ మాట్లాడలేదు. ఇవాళ ఇట్లా మనస్సు విప్పి, నీ మనస్సులోని భాదను వ్యక్త పరుస్తూ మాట్లాడా వంటే, నేనేం చెప్పాలో నాకు అర్ధం కావడం లేదు. నువ్వు మనస్సులో ఏ సంకోచమూ పెట్టుకోనక్కర లేదు. అక్కయ్య బాధ్యత నేను తీసుకొంటున్నాను. అక్కయ్య గురించి మీరేమీ దిగులు పడద్దు. సంఘంలో రకరకాల మనస్తత్వాలు గల వ్యక్తు లుంటారు. అందరినీ మనం మెప్పించ లెం. అందర్నీ కాదనలేం. మన మనస్సుకు మనస్సే సాక్షి. అక్కయ్య విషయం లో నువ్వేమి బెంగ పెట్టుకోవద్దు. అక్కయ్య దేవత" అన్నాడు రమేష్. నాగభూషణం తృప్తిగా కళ్ళు తుడుచుకున్నాడు. కామాక్షి మనస్సులో తమ్ముణ్ణి మనసారా దీవించింది.
ఆ రోజునే రమేష్ గుంటూరు వెళ్ళిపోయాడు.

13
ఎన్నికలు పూర్తయినాయి. రాయుడు గారి నియోజక వర్గం లో అయన చాలా పెద్ద మెజారిటీ తో గెలిచారు. క్రితం సారి కన్నా ఈ తడవ ఆయనకు వచ్చిన ఓట్లు కూడా ఎక్కువే. రామయ్య గారి నియోజకవర్గం లో అయన మళ్ళీ ఓడిపోయాడు. ఆ పల్లెల్లో ని మహమ్మదీయులెవరూ ఆయనకు ఓట్లు వెయ్యలేదు. కార్మీకులు, కర్షకులు కూడా ఈ ఎన్నికలలో కొంత మంది ఓట్లు వెయ్యలేదు. ఫలితంగా అయన ఓడిపోవటమే గాక ఇదివరకు కన్నా చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి. ఆయనకు కార్మీకుల మీదా, పాటకపు ప్రజల మీద కోపంగా ఉంది. భర్త కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు అన్నట్లుగా ఉందాయన మనస్తత్వం . క్రితం సారి ఒట్లిచ్చిన కార్మికులు ఈసారి ఎందు కిట్లా చేశారో ఆయనకు అర్ధం కాలేదు. అది అయన వ్యక్తిగతమైన పరాజయం గానే భావించాడు. ఈ ఎన్నికలకు పాతిక వేలు ఖర్చయినాయి. సురేంద్ర కు తండ్రి ఎన్నికల గొడవే పెట్టలేదు.
"ఏరా, మీనాన్న చిత్తుగా ఓడిపొతే ఒక్క ముక్క కూడా మాట్లాడ వెంరా?" అన్నాడు రమేష్.
"రాజకీయాల విషయం మన కెందుకురా? మన నెత్తి మీదున్నా బరువులూ, మన మనస్సు లోని ఆలోచనల తోనే మనం సతమతమై పోతుంటే ఇంకా ఆ గొడవలు కూడా ఎందుకు?" అన్నాడు సురేంద్ర.
"ఆ తండ్రి కడుపున తప్ప బుట్టావురా" అన్నాడు రమేష్.
మార్చి నెలలో పరీక్ష లయినాయి. విద్యార్ధినుల ప్రోద్భలం వల్లా, వసుంధర ఒప్పుకోవటం వల్లా, వసుంధర ను రమేష్ కిచ్చి పెళ్లి చెయ్యటానికి అంగీకరించారు వసుంధర తల్లి తండ్రులు. నాగభూషణం గారితో వసుంధర తండ్రి సంప్రదించి తాంబూలాలు పుచ్చుకున్నారు. విషయాలన్నీ కామాక్షి కి తెలుసు గనుక కామాక్షి కూడా తండ్రిని ఒప్పించింది. అంతా ఆనందంగా అంగీకరించారు.
వైశాఖ మాసం లో వివాహం జరిగింది. రమేష్ ఇంటరు పాసయినాడు. వసుంధర స్కూలు ఫైనలు పాసయింది. సురేంద్ర ఇంటరు మొదటి సంవత్సరం పూర్తయి , రెండవ సంవత్సరం చదువు తున్నాడు. రాయుడు గారు ఎం.ఎల్. ఎ అయినారు. రామయ్య గారికి సురేంద్ర మీద కోపం జాస్తి అయింది. వరలక్షమ్మ ఏమీ చెప్పలేక మనస్సు లో బాధపడుతూ ఊరుకున్నది.
మొదటి రోజు రాత్రి రమేష్, వసుంధర తో అన్నాడు: "వసూ, నేను మొట్ట మొదటగా నిన్ను చూసినప్పుడు ఒక రకమైన సద్భావాన్ని నాలో ఇముడ్చు కున్నాను. నా కోరిక సిద్దిస్తుందా అనే అపనమ్మకం మాత్రం అప్పుడప్పుడూ కలుగుతూ ఉండేది. నామీద నీకు ఏ అభిప్రాయం ఉందొ నాకు తెలీదు."
'చెప్పమన్నారా?"
"ఊ చెప్పు."
"ఉత్తరాల వల్ల మొదట్లో స్త్రీ గానే భావించాను. మొట్టమొదటి సారిగా మగవారిని తెలిశాక నన్ను మోసం చేసి పాడు చెయ్యటానికి సంకల్పించుతున్న వంచకుడు గా భావించాను. మీ మాటల వల్ల, మీతో ఏర్పడిన పరిచయం వల్ల నా అనుమానం తీరిపోయింది. మిమ్మల్ని ప్రేమించేశాని మొట్ట మొదటి సారిగా 'స్త్రీ పాత్ర' నాటిక ప్రదర్శించాక, మిమ్మల్ని స్టేజి మీద పరిచయం చెయ్యటానికి పిలిచినప్పుడే నాలో నేను తెలుసుకున్నాను. మీరు స్టేజి మీద మాట్లాడిన ఆ నాలుగు మాటలే మిమ్మల్ని ప్రేమించే టట్లుగా చేసినాయి. కాని నా స్నేహితులంతా అదివరకే మనం ప్రేమించేసుకున్నామని అనుకున్నారు" అన్నది వసుంధర.
* * * *
వసుంధర కాపురానికి వచ్చింది. మొదటి సరిగా ప్రసాదపురం చూసేసరికి ఈ పల్లెటూళ్ళో ఉండాలా అనుకున్నది. చక్కగా మాట్లాడుతూ కలుపుగోలు తనంగా ఉండే మరదలు వచ్చినందుకు ఎంతో సంతోషించింది కామాక్షి. అంతా దైవానుగ్రహం అనుకున్నాడు నాగభూషణం.
"వసూ, ఒక్క విషయం నీకు చెప్పాలను కున్నాను. పెళ్ళికి మా ఇద్దరన్న లూ, వదినేలూ వచ్చారు. అందర్నీ నువ్వు చూశావను కుంటున్నాను. అన్నయ్య లూ, వదినెలు అంతా పరాయి వాళ్ళ మాదిరే చూస్తారు మమ్మల్ని. అందుకనే పెళ్లి అయి అప్పగింతలు కాగానే, వాళ్ళు అట్నించి ఆటే వెళ్ళిపోయారు. గృహ ప్రవేశానికి కూడా రాలేదు. ఒక రక్తాన్ని పంచుకుని పుట్టినా అన్నయ్య లకు మా మీద అపేక్ష లేదు. ఇంకా నలుగుతూ ఏమయినా అనుకుంటారని పెళ్లి కి మాత్రం వచ్చారు. వాళ్ళ వల్ల మాకేమీ సహాయ సానుభూతులు లేవు. ఇంక మిగిలింది మా కామాక్షి అక్కయ్య. మా ఇద్దరికీ మూడు నాలుగేళ్ళు తేడా. భగవంతుడు భర్త విషయంలో చిన్న చూపు చూసినా గుణ గుణాల్లో ఏ లోపమూ చెయ్యలేదు. కామాక్షి అక్కయ్యంటే నాకేంతో ప్రేమా, భయమూ, చనువూ, ఆప్యాయతా ఉన్నాయి. ఆమెకు ఏ విషయం లోనూ నేను ఎదురు చెప్పను. కారణం, అక్కయ్య మనసు నాకు తెలుసు. మా ఇంటికి దేవత లాంటిది. ఇదే నీకు చెప్పాలను కున్నాను." అన్నాడు, రమేష్. వసుంధర నివ్వెర పోయింది. రమేష్ ఎందు కిట్లా అంటున్నాడో అర్ధం కాలేదు.
"మీకు గౌరవనీయులైన వారూ, పూజనీయులైన వారూ నాకు మాత్రం కారా? వారి గౌరవ ప్రతిష్టలూ, మంచి చెడ్డలూ కాపాడే భారం నాయందూ ఉన్నది" అన్నది వసుంధర. ఈ మాటలకు సంతృప్తి పడ్డాడు రమేష్.
వారం రోజులు గడిచినాయి. వసుంధర కు అ ఊళ్ళో ఏమీ తోచటం లేదు. కామాక్షి తో ఏవిధమైన బెరుకూ లేకుండా కలిసి మెలిసే ఉంటున్నది. అయినా ఆ పల్లెటూరి వాతావరణం వసుంధర కు నచ్చలేదు.
ఒకరోజున తండ్రితో రమేష్, "నా చదువు పూర్తయినట్లే. అంటే బి.ఎ. చదవవచ్చు. కాని వివాహమయిన తరవాత ఇంక చదువు సాగటం కష్టమే. నా యిష్టాను సారంగానే నేను కోరుతున్న పిల్లనే పెళ్లి చేశారు. ఇదంతా మీ ఆశీర్వాద బలమే. ఇంకొక్క విషయం లో మీ అభిప్రాయం తీసుకోవాలని ఉంది" అన్నాడు.
"ఏమిటది?"
"నే నేదయినా ఉద్యోగం సంపాదించి మనమంతా ఒక్క చోటనే ఉండాలని నా కోరిక. ఈ పల్లెటూళ్ళో , అందులో పార్టీ తత్వాలు పాతుకు పోయిన ఈ ఊళ్ళో , ఈ పెద్ద తనం లో మీరు అవస్థ పడటం ఎందుకు నాన్నా? నా జీతం ఈ పంటల మీద అయివేజు ఉంటె మనం గౌరవంగా జీవించవచ్చు." అన్నాడు రమేష్.
