"చెప్పండి చూద్దాం! కరెక్టుగా చెప్తే మీకు చాక్లెట్ ఇస్తాను...." అంది.
"బెట్ ఎందుకు? నిష్కారణంగా ఓడిపోతారు .. ఆ అమ్మాయి పేరు ప్రియం వద....!"
గీత నవ్వింది.
కాదు....! ఇంకో చాన్సు ఇస్తాను చెప్పండి...."
మోహన్ కాస్త అలోచించి "కృష్ణ ప్రియ! విష్ణు ప్రియ! దేవ ప్రియ!... ఇలాంటి వాటిల్లో ఏదో ఒకటి!" అన్నాడు.
గీత తల అడ్డంగా తిప్పింది.
"అవేమీ కావు.... లక్ష చాన్సు లిచ్చినా మీరు చెప్పుకో లేరండి...."
"ఫెయిరీ టేల్స్ లో చెప్తారు చూడండి. ఎవడో మరగుజ్జు వెధవ వాడి పేరు చెప్పుకోక పొతే రాణీగారి పిల్లాడిని తీసుకు పోతానని షరతు పెడతాడు! అలా మీ స్నేహితురాలి పేరు ఎవరికి తెలీని వింత పేరా?"
"ప్రియ పూర్తీ పేరు ఖరహర ప్రియ!"
"వాట్?" అంటూ మోహన్ నోరు తెరిచి చూశాడు.
"ఖర....హర.... ప్రియ....! అంటే గాడిద కి , దేవుడికి ఇష్టమైన వారా?" అనడిగాడు.
గీత బుగ్గలు లోత్తలు పడ్డాయి.
"బాగుందండీ మీ వ్యాఖ్యానం! అది ఒక రాగం పేరు! ప్రియా వాళ్ళ నాన్నగారికి సంగీతమంటే చాలా ఇష్టం .... అందుకని పిల్లలందరికీ రాగాల పేరు పెట్టారు... వాళ్ళు ముగ్గురికి అక్క చెల్లెళ్ళు , ఒక అన్నయ్య..... చెల్లెళ్ళ పేర్లేమిటో తెలుసా? బిలహరి, హరి కాంభోజి, వాళ్ళన్నయ్య పేరు సారంగ."
"నా సామిరంగ! ఇవేం పెర్లండి?" అంటూ ఆశ్చర్యం వెలిబుచ్చాడు మోహన్.
"అలా ఆశ్చర్య పోతారేం ? ఇంచుమించు ఆడవాళ్ళు పేర్లన్నీ సంగీత రాగాల పేర్లే ....వసంత, కల్యాణి, శ్రీరంజని, లలిత, భాగేశ్వరి....."
"ఆ.....? మరి మీదో....?"
"నా పేరరాగమేది లేదనుకోండి.... అయినా సంగీతం లో సగం భాగం నేనేగా....?' అని వివరించింది గీత.
"మీరు చెప్పిన పేర్లన్నీ శ్రావ్యంగా ఉన్నాయి. ఎంచి, ఎంచి అయన ఇంత కఠోరమైన పేర్లు పెట్టాడెం....?"
"అవన్నీ మామూలు పెర్లేగా? అవి పెడితే అయన సంగీతాభిలాష అందరికీ ఎలా తెలుస్తుంది. అని రాగాల పేర్లని ఎవరు గుర్తు పడతారు?"
"ఇప్పుడు మాత్రం నాకేం తెలిసింది లెండి?" అంటూ మోహన్ బుర్ర గోక్కున్నాడు.
"సరే లెండి! జడ్జి చేసి కూర్చో పెట్టారు కదాని నిజంగానే సంగీతం వచ్చను కుంటున్నారు కాబోలు! సంగీతం ఏమాత్రం తెలిసిన వాళ్ళ కైనా అవి రాగాల పేర్లని నిమిషంలో తెలిసిపోతుంది...."
"ఖర.... హర....ప్రియ , బిలహరి, హరి కాంభోజి, సారంగ....!' మోహన్ నాలుగు పేర్లు వరుసగా ఉచ్చరించి చూసుకున్నాడు చెవులకు ఎలా వినపడతాయో విందామని.
మోహన్ కు ఒక సందేహం వచ్చింది.
"అందరికీ హరి ఉన్నది కదా, అబ్బాయి పేరెందుకు రైమ్ లేకుండా చెడి పేశారు?"
"అందరి కంటే అబ్బాయే పెద్దవాడు.... వాళ్ళ తాతాగారి పేరు రంగయ్యట. 'సారంగ' అని పెడితే తండ్రి పేరు పెట్టుకున్నట్టూ ఉంటుంది. తన సరదా తీరినట్టూ ఉంటుందని వాళ్ళ నాన్నగారు 'సారంగ' అని పెరు పెట్టారట... వాళ్ళేమో వైష్ణవులు.... అందుకని హరి, రాగం కలిసి వచ్చే పేర్లు పెట్టారు...." అని వివరించింది గీత.
"కొంతమంది తల్లిదండ్రులు మరీ విడ్డూరంగా ఉంటారు లెండి...." అని వ్యాఖ్యానించాడు చివరికి మోహన్.
"ఆ మాట కొస్తే మీ పేరు కూడా ఒక రాగమే. 'మోహన' ఎంత చక్కని రాగం అనుకున్నారు?' మొహాన్ని ఉడికించడానికన్నట్టు.
మోహన్ కెవ్వుమన్నాడు.
"సంగీతం పేరెత్తితేనే మా నాన్నగారికి వాంతి. నేనెప్పుడన్నా కులాసాగా పాడుకోబోతే అయన 'ఆ కూని రాగాలన్నీ కట్టి పెట్టి కుదురుగా ఏదైనా చదువుకో!' అని గసిరేవారు. చక్కని పాటలన్నీ ఆయనకి కూని రాగాలు... ఖూనీ రాగాలు ....!"
గీత నవ్వింది.
"కొన్ని రాగాలు ఖూనీ రాగాల్లానే ఉంటాయి లెండి. ఖర హర ప్రియ సంగతే తీసుకోండి.... అదంటే నాకు ఎక్కడ లేని చిరాకు...."
"ఈ మాటు ఆవిడ నాకు కనబడనివ్వండి చెబుతాను....." అంటూ బెదరించాడు మోహన్.
గీత లక్ష్య పెట్టలేదు.
"చెప్పండి! నాకేం భయం లేదు....అదంటే ఎంత ఇష్టమో ఆ రాగం అంత రోత..... ఆ సంగతి దానికేం తెలుసు..... ప్రియా , నేను క్లాసు మేటులం.... ఒకే గ్రూపు... అదీ, నేను స్వంత అక్క చెల్లెళ్ళలా మసులు కుంటాం..."
వెంటనే అడిగాడు మోహన్ "మీరు , కళకు మల్లేనా?" అని.
"పొండి! మీరు మరీనూ....!" అని కోపగించుకుంది గీత.
"మీ ప్రియ కోసం మీరు వైజాగ్ వెళ్ళిపోతారా మరి....?' అంటూ దిగులుగా చూశాడు మోహన్.
"వెళ్ళాలనే అనుకుంటున్నాను..." అంది సీరియస్ గా చూస్తూ.
"మరి...మరి .... ట్రాన్సి స్టర్ కోసం ఎప్పుడు రాను?"
గీత ముఖం ముడుచుకుంది.
"అవున్లెండి ....! మీ తాపత్రయం ట్రాన్సి స్టర్ కోసం గాని నా కోసమా ఏమిటి?"
మోహన్ పై ప్రాణాలు పై పైనే ఎగిరి పోయాయి.... కాళ్ళు పట్టుకుంటే సత్యభామలా ఈడ్చి పెట్టి తన్నితే? తను కృష్ణుడా ఏమన్నా నా తల బ్రద్దలవకుండా బ్రతికి బైట పడటానికి?.... ఎంత పొరపాటు జరిగిపోయింది! ఆడవాళ్ళ తో మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి....!
"నన్ను నమ్మండి....! ట్రాన్సి స్టర్ మీరు వీధిలోకి గిరవాటేసినా అవసరం లేదు.... అది సుధాకర్ మికిచ్చాడని కళ వాడితో మాట్లాడటం మానేసింది.... అది మీ దగ్గర ఉన్నంతకాలం వాళ్ళిద్దరి మధ్య తుఫానులు ....జంఝుమారుతాలు."
గీత కొద్దిగా నవ్వింది, మోహన్ మనస్సు కుదుట పడింది.
"మీరు వైజాగ్ వెళ్తే నేనూ మీ వెనకాతల వస్తాను.... మీతో పాటు మీ నాన్నగారు కూడా వస్తారా...?"
మోహన్ బిక్క మొహం చూసి గీత కిలకిలలాడింది.
"మీరేం బెంగ పెట్టుకోకండి....నాన్నగారు వెళ్ళినా నేను వెళ్ళదలచుకోలేదు... ఇక్కడే ఉంటాను...." అంది గీత సముదాయిస్తూ..
"అమ్మయ్య! రక్షించారు!"
గీత చేత్తో వారిస్తూ హోటల్లోంచి వినిపిస్తున్న పాట వింటూ "ఒంటిగా ఉయ్యాలలూగితివా....!" సూర్యకుమారి రికార్డు వేస్తున్నాడు..... "ఈ రాగం నాకు భలే ఇష్టం ....!" అంది.
మోహన్ ఊ కొట్టాడు.
"ఏ రాగమో చెప్పుకోండి!" అంది గీత హటాత్తుగా..
మోహన్ గుండెల్లో రాయి పడింది.
ఖరహర ప్రియ కాదు కదా? అబ్బే! అయుండదు.. ఇందాక ఇష్టం లేదని చెప్పిందిగా? మరి ఏ రేగమై ఉంటుంది చెప్మా?.....
ఏదో గభాలున జ్ఞాపకం వచ్చి "బెగడ!" అన్నాడు మోహన్.
గీత కళ్ళు సంతోషంతో మిలమిల మెరిశాయి.
"కరెక్టు ....! ఎలా పోల్చు కున్నారండీ....?" అంది గీత అతన్ని అభినందిస్తూ.
మోహన్ గుండెలు నిమురుకున్నాడు.
గీతకు బెగడంటే చాల ఇష్టమని సుధాకర్ తనతో చెప్పాడు. 'బేగడ మీగడ లాంటి రాగం' అని చెప్పిందిట.... సుధాకర్ తనకు తెలిసినంత వరకు ఆవిడా ఇష్టాయిష్టాలేమిటో , ఆవిడ దగ్గర ఎలా మసలుకోవాలో అన్నీ వివరంగా చెప్పాడు.... అవన్నీ "లవ్ సీక్రెట్స్' .... గీతకేం చెప్పడం?
"నేనింక ఇంటికి వెళ్ళాలి.... ట్రాన్సి స్టర్ సుధాకర్ గారి కిచ్చేస్తా లెండి.... నేను వూళ్ళో నే ఉంటాను,. వీలు చూసుకుని వస్తుంటారు కదూ....?"
"మీరు ఆ మాటనటమే చాలు. నేను రాక పోవటం ఉంటుందా?"
గీత బస్సులో ఎక్కెంత వరకు ఉండి ఇంటి దారి పట్టాడు మోహన్.
* * * *
రాత్రి భోజనాలయ్యాక రామయ్య గారు జానకమ్మ తో అన్నారు.
"జయమ్మ వైజాగ్ రమ్మని రాసిందిగా? పిల్లలు, నువ్వు సెలవులంతా అక్కడ గడిపి రండి.... జయమ్మ నీ మాట ప్రత్యేకంగా రాసింది కూడా. వదిన కొన్నాళ్ళు వైజాగ్ వచ్చి ఉంటె ఆరోగ్యం బాగు పడుతుందనుకుంటాను అని...."
"అయితే ఎప్పుడెల్దామంటారు?' అనడిగింది జానకమ్మ.
"నాకు రావటానికి వీలుండదు... నువ్వూ పిల్లలు వెళ్ళండి...."
"మీరు కూడా వచ్చి అమ్మాయి పెళ్ళి విషయం అడిగితె బాగుంటుందేమో నండి?" అంది జానకమ్మ మనస్సులో మాట బైట పెడుతూ.
"మా చెల్లికి ఆ పట్టింపు లేవీ లేవులే. లాంచనంగా నువ్వు అడిగితె సరిపోతుంది.... " అన్నారు రామయ్యగారు.
"సరే....! ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడే వెళ్తాను. నాదెం పోయింది?"
"సుధాకర్ ఇంటి కెళ్ళాలని ఒకటే తొందర పడుతున్నాడు. రెండు, మూడు రోజుల్లో వెళ్ళారంటే అంతా కలిసి వెళ్ళొచ్చు. సగం దూరం వరకైనా మీకు తోడుగా ఉంటాడు...."
జానకమ్మ సరే అన్నది.
తర్వాత కళ దగ్గర ప్రయాణం సంగతి ఎత్తితే "నాన్నగారు ఉండి పొతే నేనూ రాను..." అంది.
'అదేమిటే? నువ్వు రాకుండా ఏమిటి? బావ మళ్ళా ఒకసారి చూసుకుంటాడు..." అంది జానకమ్మ.
"నన్నేం చూడక్కర్లేదు....?" అని చిరాకు పడింది కళ.
"పోనీ ? బావను నువ్వే చూద్దూ గానిలే?' అంటూ నవ్వింది జానకమ్మ.
ఎలా చెప్పటం? కళ హృదయం మూల్గింది... వైజాగ్ వెళ్ళి తీరాల్సిందే! అక్కడ బావ... మేనత్త....! బావ, తనూ మొగుడూ పెళ్ళాలైనట్టూ పరిహాసాలు ప్రారంభిస్తారు....
ఛీ! ఛీ! మేనత్త లకు కొడుకు లుండకూడదు ఉంటె చిన్న వాళ్లుండాలి. లేకపోతె బావ ప్రాణానికి బంకలా పట్టుకుంటాడు....
కళకు ప్రయాణం తప్పలేదు. గీత, ఉష మేము రామంటే రామన్నారు. నన్నాగారికి తోడుగా ఉంటామన్నారు.
నేనూ ఉండి పోతేనే అమ్మా! లేకపోతె అక్కయ్య పనేం చేసుకో గలరు?' అంది శారద.
"ఇన్నేళ్ళు వచ్చి ఇంకా చూసుకోలేక పొతే ఎలా? నిన్ను చూసుకునే, వాళ్ళలా ఆడ్తారు.... నువ్వు ఎక్కడికీ కదలవు. నాతొ పాటు రావాల్సిందే.... అదీ గాక నువ్వు నా దగ్గర లేకపోతె నేను పిలిస్తే పలికే వాళ్ళే ఉండరు! మీ అక్కయ్య లందరికీ వళ్ళు వంచటానికి బద్ధకం....!" అంది జానకమ్మ.
అందర్లోకి ప్రయాణమంటే సంబర పడింది చిత్ర ఒక్కతే. మిట్ట పల్లాల మధ్య మెలికలు తిరిగే రోడ్డు, అటూ ఇటూ ఠీవిగా నిలబడే కొండలు.... కొండల పైన రోడ్ల పక్కన పచ్చని చెట్లు, ....చెట్ల నుంచి తొంగి చూసే రంగు రంగుల పూలు.... ఇష్టం వచ్చి నన్ని స్కెచ్ లు వేసుకోవచ్చు ననుకుంది చిత్ర.
ప్రయాణం రోజున ఇంటికి తాళం వేసుకుని అంతా స్టేషను కు బయల్దేరారు.
సుధాకర్ రామయ్య గారి దగ్గర సెలవు తీసుకున్నాడు. అయన "మమ్మల్ని మర్చిపోకుండా ఉత్తరాలు రాస్తూ ఉండవయ్యా.." అన్నారు. తర్వాత సుధాకర్ గీత తోనూ, ఉష తోనూ వెళ్ళొస్తానని చెప్పాడు.... ఇంట్లో మనిషోకరు శాశ్వతంగా దూర మవుతున్నట్టు ఇద్దరూ మనస్సులో బాధపడ్డారు......
రైలు కిటకిట లాడుతూ ఉంది....
రైలు కదిలే వేళకు రామయ్య గారు "కాస్త మా వాళ్ళను నువ్వు బెజవాడ లో దిగి పోయేంత వరకు చూస్తూ ఉండు నాయనా!" అన్నారు.

