"నిజంగానే ఉండిపోనా?"
"నిజంగానే ఉండిపో...కాని మీ ఆవిడ, పిల్లలు, ఫిలిం డబ్బాలు , డబ్బూ -- వీటిని మరిచి పోవాలి. లేకపోతె ఏమీ ప్రయోజనం లేదు. వాటిని మరిచిపోతే ఎక్కడున్నా ఒకటే."
"కాని, ఏ సామాన్యుడు గానో జీవిస్తూ, ఉంటె నిన్ను దక్కించు కోగలిగే వాడినేమో!"
"ఏ సామాన్యురాలో నీకు దక్కేది."
"అప్పుడు నువ్వు నాకు దొరకవా?"
"ఎలా? రోజుకు పది రూపాయల హోటల్లో నువ్వూ ఉండలేవు. అందాల రాణి నానా నీకు దక్కేదీ కాదు."
"అయితే నా డబ్బు వల్లనా నాకు దక్కావు?"
"అందువల్ల కాదు. నానుంచి సామాన్యుడు ఏం పొందుతాడు?"
"ఇదివరకు నీ వియోగం ఇంత బాధించేది కాదు. ఇప్పుడు చాలా బరువుగా ఉంది."
"పోనీ సినిమాలకు డబ్బు ఎలాగూ పెడుతున్నావు. డైలాగులు వ్రాయరాదూ?"
నవ్వాడు బాలచంద్ర.
"ఇంతకాలం అందం ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? మీ అమ్మగారు బాగుంటుందా?"
"నీ మనసులో నేను అందంగా ఉంటాననే విషయం నమ్మి ఆ దృష్టి తో చూస్తున్నావు నువ్వు. మనసనేది వేరు కాదు బాలా. మన మనసునే లక్ష చోట్ల లక్ష కోణాల నుంచి ప్రతి ఫలింప చేసుకుంటాం మనం. నీ సంగతే ఆలోచించు. నీలో నువ్వు నింపుకున్న కోటి జన్మల స్త్రీ వాంఛ అనేక మంది స్త్రీలాగా మారి నిన్నలరిస్తున్నది. నీ అతి జాత్యం యుగాల నుంచీ వస్తున్న నీ వాంఛ నీ మనసులోనే ఉంది."
"కాని, అందరూ నిందిస్తారు."
"ఆ అందర్నీ వదిలెయ్యరాదూ?"
"ఎట్లా? మనిషన్న తరువాత బ్రతకాలి గద?"
"బ్రతకాలనే ఉద్దేశ్యంతో జ్ఞాపకాన్ని ఈడుచుకుంటూ ఎవరూ నడవరు."
"నువ్వేదో ఈ లోకం సమస్యావిహీన మైనట్లు మాట్లాడతావు."
నానా నవ్వి ---
"మనకు బోధపడని సత్యమే సమస్యగా కనిపిస్తుంది. బాధకన్న బాధా భయం జాస్తీ" అన్నది.
"ఏదో అంటావు. దగ్గరగా రారాదూ?'
"మనస్సు లో ముళ్ళ కంచేల నుంచి తప్పించుకో ముందు. ఆ తరవాత దగ్గరగా వద్దాం."
"నానా....ఏమిటీ శిక్ష నాకు?"
"ఈ దేహాన్ని , మనసు నూ నీకోసమే అట్టి పెట్టాను. నీవు ఇరుకు జీవితం నుంచి బైట పడిన నాడు ఇవన్నీ నీవే. పరమ సుందరమైన నీ దేహం తో పాటు ఆత్మ కూడా సౌందర్య పూరితం కావాలి. ఇన్ద్రియాలన్నవి చాలా ఇరుకు. బాలా. వాటి ద్వారా పొందగలిగే సుఖ దుఃఖాల మీద పెద్ద విలువ లేదు నాకు."
"ఎందుకు అలా పారిపోవటం?"
"ఎక్కడ నుంచి పారిపోతున్నాను?"
"నా నుంచి."
"అవును బాలా. నామీద నీకు సవాలక్ష అనుమానాలు, నాలో నీకు అసంతృప్తి, నేనెవరో తెలుసా? స్త్రీ హృదయపు సౌందర్యాన్నంతా మూర్తి కట్టుకుని నీకోసం నిరీక్షిస్తున్న స్త్రీని. నీనుంచి మిగతా జ్ఞాపకాలు పోయి నేనొక్కదాన్నే మిగలాలని నా కోరిక. ఎందుకంటె నీ మనసులో ఐక్యం కాగల శక్తి నా మనసుకు భగవంతుడు ప్రసాదించాడు. నీ దేహంతో కాదు."
"ఆ శక్తి భగవంతుడు నాకెందుకు ఇవ్వలేదు."
"నీ మనసును ముడుచుకుని కూర్చుంటే ఏ దేవుడు ,మాత్రం ఏం చేస్తాడు?"
"నీకు తెలుసుగా నా సంగతి?"
"నాకు తెలియటం కాదు. నీకు నువ్వు తెలియచెప్పుకుని నిజం ఏదో అర్ధం చేసుకోవాలి."
"చాలా సార్లు అలాగే అనుకున్నాను., నానా. విశ్వాస హీనుడిని అవుతాననే భయం చేత ఆగిపొయినాను. అదీ కాక నాకే సరిగా అర్ధం కాని విషయాలు నా వచ్చీ రాని భాషలో చెపితే అవి అబద్దాలవుతాయి కూడా."
"నాతోనూ అంతేనా?"
"నువ్వు చూపించే అధికారం అంటే ఒళ్ళు మంట-- నువ్వు నాకన్న తెలివి గల దానివే కావచ్చును. కాని నాకంటే ఎత్తుగా ఉండటం సహించ లేను. నేను ఎంత ప్రాధేయపడి ఆరాధించినా నీకు దూరమవుతున్నాననే బాధ అమితం నాకు."
"నిన్ను నీవు ఇచ్చేసుకున్న రోజున నానా హృదయ సామ్రాజ్యం లో నీవోక్కడివే చక్రవర్తివి."
బాలచంద్ర నవ్వి -- కావచ్చును. కాని మగవాడి కింత ఆధిక్యాన్ని చూపించాలని ఉంటుంది. నీవు అలిసిపోయి బలహీనంగా నామీద వాలిపోవాలని ఉంటుంది. అదీ కాక సమాజంతో సంబంధం లేకపోతె జీవిస్తున్నట్లు ఉండదు" అన్నాడు.
"అవును. మామూలు మగవాడు తన ఇతర గొప్పతనాల చేతనే ఆడదాన్ని ఆకర్షించాలని చూస్తాడు. ఆడదానికి అలా కాదు. ఏ గొప్ప పనో చేసి దృడ పరుచుకున్న ఆధిక్యం కంటే అధిక మైన ఆత్మ గౌరవం సహజంగా ఉంది. అందుకే లోంగీ కూడా ఎన్నడూ అర్ధం కాని ఆమెలోని ఆధిక్యం వలననే మగవాడు ఆమెను అర్ధం చేసుకోలేక పోతున్నాడు. తాను బలహీనంగా అతన్ని చుట్టుకుని ఆప్యాయత పొందాలని ఆమె కూడా అనుకుంటుంది. తన బరువునూ, జ్ఞాన భావాన్నీ బొత్తిగా మొయ్యలేని మగవాడి నుంచి ఏం పొంద గలుగుతుంది? అదిగో అప్పుడే మలుపు తిరుగుతుంది జీవితం."
"నాకు అర్ధం కావటం లేదు."
"నేను ఫ్రెంచి లో మాట్లాడటం లేదు. స్వచ్చమైన తెలుగు లో మాట్లాడుతున్నాను. ఆడదాని లాగా నీ చేత అనుభవించబడి నీకు దూరం అయినాను. అంతకన్న గౌరవమూ, ఉజ్జ్వలమూ అయిన ప్రెమకు అర్హత పొందుదామనే ఈ తపస్సు."
"నేను మనిషిని. నాలో వాంఛ ఉంది. కోరిక ఉంది. నీనుంచి అన్నీ పొందాలనే దాహం ఉన్నది. నాకోసం అయినా నన్ను కాదనరాదు నువ్వు" అన్నాడు బాలచంద్ర. అతని కన్నులు కలువ పూల రేకులు. వాటిలోకి చూసి ముగ్ధురాలాయి పోయింది నానా. కొన్ని క్షణాల్లో నే తనను తాను నిగ్రహించు కుని --
"మీ మగవాళ్ళ అంతర్యాలు అలాగే అర్ధ విహీనంగా ఆలోచిస్తాయి. అసలు సత్యం అర్ధం కాదు మీకు. నాకు నీ మీద మామూలు స్త్రీ కుండే ప్రేమ కొన్నాళ్ళ క్రిందట ఉండేది. ఇప్పుడు లేదు. కాని నా ప్రేమ అనుపమానమైనది. నిన్ను కలుసు కోవడం కూడా అనివార్య మైనది. అలా నిన్ను చూడని రోజున నా బ్రతుక్కు అర్ధమే లేదు. ఏదో ఒక శక్తి నీమీద విసిగి ఫ్రాన్సు వెళ్ళిన నన్ను తిరిగీ నీ దగ్గరికి తోసింది. నీకు మల్లె బాహ్య జీవితానికి ప్రాధాన్యం ఇస్తే ఫ్రాన్సు నుంచి ఇండియా కు రానే రాను. అది శాపం గానీ మరేమైనా కానీ నీ అసత్యం సంకుచితత్వం ఏవీ నన్ను దూరం చెయ్యలేదు. నన్ను, నా బ్రతుకులో మిగతా విలువలను అన్నిటినీ అధిగమించి నా ఆత్మను ఆవరించిన అసలు సత్యం నీ మీద నా ప్రేమ" అన్నది నానా.
భాలచంద్ర ఆశ్చర్యపోయినాడు. నానా చెప్పేదేమిటో వింతగా అనిపిస్తున్నది. ఆమె రూపం తెలివి అన్నీ కూడా అతనికి ఆశ్చర్యాన్నే కలిగిస్తున్నాయి. తన చేతుల్లోకి వచ్చి తనకు సర్వస్వమూ అర్పణ చేసిన సమయాల్లో కూడా ఆమె తనకు అర్ధం అవనట్లే ఉండేది. ఇప్పుడది మరీ ఎక్కువయింది.
"నువ్వు చివర చివరికీ నా కర్ధం కావటం మానివేశావు" అన్నాడతను సిగరెట్ యాష్ ట్రేలో పదవేస్తూ.
"అర్ధం కానిది నేను కాదు. అద్భుతమూ అనంతమూ అయిన వాటిని కూడా అతి తేలికగా చూసే మనుష్యుల మధ్య నీవు జీవిస్తున్నావు. అటు చూడు. ఆ సంధ్య కాంతి -- ఆ అద్భుతాన్ని ప్రతి రోజూ చూస్తూ బ్రతుకటం కన్న మరేం కావాలి" అన్నది నానా.
"నీవు నాకు కనిపించకుండా ఉండరాదూ?'
"ఎలా? నువ్వు నన్ను పోమ్మన్నప్పుడే పోలేక పోయాను. నా ప్రేమ నీనుంచి దూరం కావటం లేదు. అంత నిరదారురాల్ని నేను."
"అందుకని నన్నిలా బాధిస్తున్నానా?"
"నీ సంకుచితపు ఆలోచనలలో లోతు తక్కువ ప్రేమలకూ, వాంఛలకూ అలవాటయి నావు. నా సంబంధం ప్రేమ ఎందువల్ల అని వార్యాలో అర్ధం చేసుకో వాలంటే చాలా ఎదగాలి."
"నా నుంచి నువ్వు పొందుతున్న దేమిటి?"
"తీసుకోడం కన్న ఇవ్వటం లో ఆనందం ఉంది నాకు."
"అదీ ఇవ్వటం లేదుగా?"
"అలా బాధపడకు. ఇవ్వటానికే ఈ ప్రయత్నం అంతా-- నేను అనేది నీకోసమే."
'సరే వెడతాను."
"అనుక్షణం బయటి ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటావు" అని నవ్వింది నానా.
"ఎందుకు ఉండాలి. ఇక్కడ నాకేం ఉంది?' అని నిట్టూర్చాడు బాలచంద్ర.
"ఎప్పుడూ శరీర వాంఛ నీకు."
"శరీరం లేకుండా అనుభవం ఎలా? అనుభవం లేని ఆరాధనకు అర్ధం ఏమిటి? అన్నాడు మరో సిగరెట్ వెలిగిస్తూ అతను.
"ప్రతి నిమిషం మారుతున్న జీవితానికి గతించి పోయిన అనుభవాల వల్ల ప్రయోజనం లేదు."
"పగలల్లా ఒంటరిగా ఏం చేస్తావు?"
"నీకై నిరీక్షిస్తాను."
"నీకు....ఇతర...సరే....పోనీలే."
"నువ్వు అడగబోయేది తెలుసు. నాకు నాగేశ్వర్రావు తో అనుభవం ఉంది."
"మరి నాకోసం నిరీక్షించడం దేనికి?"
అసూయ కాదు గాని అలాటిదే ఏదో కలిగింది అతనికి.
"పిచ్చి పిల్లాడివి. స్త్రీని ఇంతే అర్ధం చేసుకుంటారు మీరు. స్త్రీ అంటే ఒక అనుభవం -- శరీరం అనుకోటమే మీరు చేస్తున్న పొరపాటు."
"మరి ఇక నానా బాలచంద్ర కోసం స్వదేశాన్ని విడిచేసిందనటం లో అర్ధం ఏమిటి?"
"బాలచంద్ర తన సుకృతం ఫలితంగా నానా ప్రేమను అనుభవించడానికి అర్హుడవుతున్నాడన్నమాట."
"మరి నాగేశ్వర్రావు, రామచంద్రా రెడ్డి-- వాళ్ళు కూడా నిన్ను పొందారు గదా?' కక్షగా సిగరెట్ పొగ వదిలి ఆ రింగు లలోకి చూస్తూ అన్నాడు బాలచంద్ర.
"ఎందుకంత అసూయ నీకు? ఎట్లా తెలియచేప్పాలో తెలియకుండా ఉంది. నానా నీ ప్రియురాలన్న గర్వం-- ఇతరులు కూడా ఆమెను పొందుతున్నారనే వ్యధ లో పడి ఎందుకంత చౌక చేసుకుంటావు చెప్పు?-- ఈ సంధ్యా రక్తిమ అందం తగ్గిందని ఎందు కనుకుంటావు నువ్వు?"
