Previous Page Next Page 
మనిషి - మిథ్య పేజి 16


    "ఇప్పటికి నా విషయం గుర్తు కొచ్చిందన్న మాట"
    "అదేమిటి? అదేం మాట?"
    "ఏ.......నీకు గొప్ప ఇదిగా ఉందా? పాపం........" అన్నాడు అవతలి వైపుకి మొహం తిప్పుకుంటూ.
    "ఈ అలకకి కారణం ఏమిటో"
    "తమ వదనం"
    "అనగా"
    "నీ ముఖం"
    "అంటే"
    "గాడిద గుడ్డు"
    మృణాళిని పక పకా నవ్వేసింది. ఆ నవ్వుతో మరింత కోపం వచ్చింది ప్రసాదానికీ.
    "నవ్వుతావ్..........ఛీ......మీ ఆడవాళ్ళంతా ఇంతే"
    "నువ్వు మాటాడే దేమిటో బొత్తిగా తెలీడం లేదు"
    "తెలుగు"
    "అది తెలుసు. నీ కోపానికి. కారణం చెప్పకుండానే ఖస్సు బుస్సనడం ఏం బాగోలేదు బావా!"
    "అవునవును. నీకేం బాగుండదు."

 

                      
    "ఇంతకీ నువ్వు భోజనానికి వస్తావా రావా?"
    "రామ."
    "అలా అని అమ్మతో చెప్పనా?"
    "ఏం.....నాకేమైనా భయమా? అసలు నా మీద మీ అందరికీ పెత్తనం ఏమిటి? మీ రెవరూ? నేనెవర్ని"
    "నువ్వు నా బావవి"
    "సిగ్గులేకపోతే సరి"
    "ఎవరికి?"
    "అనవసరంగా వాగించకు. నాకు కోపం వస్తే మనిషిని కాదసలు. తెలుసా"
    "ఏమిటీ? అయితే ఆ విడ్డూర మేదో చూడాలని ఉంది."
    "ఉంటుందుంటుంది. ముందు మనిక్కడ్నుంచి కదుల్తావా? లేక నన్నే కదలమంటావా?"
    మృణాళిని రెండు క్షణాలు నిశ్శబ్దంగా ఉండి, తర్వాత అడిగింది.
    "అయితే ఇదంతా నిజమైన కోపమేనన్న మాట."
    "కాకపోతే నేనేమైనా గొప్ప నటుడినా వల్లకాడా?"
    "కారణం చెప్పకుండా నిష్టూరాలు పలికే వాళ్ళని ఏమంటారో తెలుసా?"
    "నువు నాకేం పాఠాలు చెప్పక్కర్లేదు. నేనేమీ పసిపిల్లవాడినీ, అమాయకుడినీ కాను."
    "నాకు నమ్మకంలేదు."
    "అంటే నీ ఉద్దేశ్యం?"
    "బావా సీరియస్ గా అడుగుతున్నాను. నీ కోపానికి కారణం చెప్పవూ" అని ప్రాధేయపడింది మృణాళిని.
    అతను చల్లబడిపోయాడు.
    "కొందర్ని చూస్తూంటే నాకు చెడ్డ చిరాకు. ఆ శాస్త్రిగాడు లేడు - అదె ..... నీ ఫేవరేట్ యాక్టర్....."
    "ఇదేమిటి? అతను నా ఫేవరేటని నీ కెవరు చెప్పారు?"
    "ఎవరో చెపితే తలాడించే రకం కాదు."
    "మరి."
    "నాటక కళ గురించి వాడి బొంద వాడి కేమిటో తెలిసినట్టు గొప్ప ఉపన్యాసమిస్తుంటే తమరు వినలా? విని మెచ్చుకోలేదూ?"
    "అయితే కావచ్చు. అతను మా కాలేజీ బెస్ట్ యాక్టర్"
    "అవునవును. మహా బాగా తెలుసు. వాడు పయోముఖ విషకుంభం. మేకతోలు కప్పిన పులి, దౌర్భాగయుడు. వాడు మా ఆఫీసులో ఎంత గందర గోళం చేస్తున్నాడో, ఎందర్ని ఏడిపిస్తున్నాడో నీకేమైతే తెలుసా?"
    "నాటకాలకీ, వ్యక్తిగత విషయాలకీ ముడి పెట్టడ మెందుకు?"
    "అయితే నువ్విప్పుడేమంటావ్?"    
    "అదేం ప్రశ్న?"
    "నువ్వు వాడితో మాటాడటం నా కిష్టంలేదు"
    "ఎందుకనిట"
    "చెప్పాగా వాడు ఉత్త ఫూలనీ......."
    "కాని, అతను మా స్నేహితురాలికి అన్నయ్య. మా కాలేజీ బెస్ట్ యాక్టర్."
    "అందుకనే అంటాను మీ ఆడవాళ్ళందరూ..."
    "బావా.......నీ ఇష్టం వచ్చినట్టు మాటాడితే నే సహించేది లేదు....."
    "అవును నువ్వు సహించవు. సరే...... ఈ విషయమేమిటో మావయ్యని అడిగి తేల్చుకుంటాను. నేను మీ అందరిముందూ ఈ ఇంట్లో ఉండాలనుకుంటే ఆ రోగ్ తో నువ్వు మాటాడటం మానుకోవాలి. లేదూ-నే నేదైనా ఇల్లు చూచుకుని నా తిప్పలేవో నేను పడతాను."
    మృణాళిని మరేమీ మాట్లాడలేదు. ప్రసాదం అత్తయ్య భోజనానికి రావలసిందిగా పిలవడంతో, గబ గబా వంట గదిలోకి పరుగెత్తాడు.
    అతని పద్ధతికి లోలోన నవ్వుకుంది మృణాళిని.

                                     *    *    *

    "వీడు నాటకాలు వేసి ఆ యొక్క కలతో సంఘాన్ని గజంన్నర మందాన్న పెంచేస్తాడట. షేక్ స్పియర్, నాటకాలు వేయని వాళ్ళందర్నీ వొట్టి వెధవలూ అన్నాట్ట. కళాపూర్ణోదయం ఆ పెద్ద మనిషీ పింగళి సూరన్నా ఇద్దరూ రాశారుట. అబ్బ...వాడు వాడిన 'గ్యాస్'ఇంతా అంతా కాదు ఈ ఫూల్ కి సినిమాల్లో చేరాలని ఉందిట. ఆకాడికి అవతల ఆ ఫీల్డు వీడు లేని వెలితిచేత లబోమని ఏడుస్తున్నట్టు! వెధవ ఫోజూ వీడూను. వీడి వరస చూస్తూంటే నాకు భయంగా ఉంది. ఆడపిల్లల మనసు కనిపెట్టడం, సృష్టించిన ఆ బ్రహ్మదేవుడికే తెలీదంటారు. నువ్వేమంటావ్" జరిగినదంతా చెప్పేడు ప్రసాదం పతితో.
    పతి సిగరెట్టు పొగ గట్టిగా పీల్చి నింపాదిగా వదులుతూ.
    "నీది ఉత్తి పిరిగి గుండె అంటాను" అన్నాడు.
    ఈ మాటతో చలిచింపోయేడు ప్రసాదం. తీక్షణంగా పతివైపు చూస్తూ.
    "నువ్వు గనక సరిపోయింది. మరోడు ఆ మాటంటే"
    "నే నొకటి చెప్తా వింటావ్?"
    "తప్పకుండాను."
    "మీ మృణాళినికి నువ్వంటే అమితమైన ప్రేమ"
    "అది నీకెలా తెలుసు?"
    "తెలుసంతే. పోతే, శాస్త్రి వట్టి ఫూలన్న విషయం అందరికీ తెలుసు. వాడిని ఒక ఆట ఆడించి చిత్తు చేయించగల ప్రయోజకత్త్వం మనకీ ఉంది"
    "అదెలాగా?"
    "వాడు వేయబోయే నాటకానికి మనమూ వెళ్ళాలి"
    "టాట్.........ఇంత బ్రతికూ బ్రతికి-అది గోపా కష్టంలే గురూ. నావల్ల కాదు."
    "నిజానికి వాడు మంచి నటుడే. అది వప్పుకుని తీరాల్సిందే. పోతే మనం నాటకానికి వెళ్ళేది వాడి నటనని మెచ్చుకుని, వాడి మెళ్ళో హారం వేయడానికి కాదు. ఆ మహానటుడ్ని మంచి నీళ్ళు తాగించి బాబోయ్ అని పించేందుకు"
    "అదెలా?"
    "అప్పుడు చెపుతాను"
    "వాడు మంచి నీళ్ళు తాగితే మన కొచ్చిపడే లాభం."
    "అందుకే నిన్ను మీ కాబోయే శ్రీమతి ఆడిస్తున్నది. ఓయి పిచ్చి ప్రసాదం, వాడు మంచి నీళ్ళు తాగడమంటే స్టేజీమీద పోర్షను మరిచి డాన్స్ చేయడ మన్నమాట. దాంతో ఆ నటశేఖరుని కీర్తి అభాసుపాలై పోగలదు. వాడు డాన్స్ చేయటానికి అనువైన వాతావరణం మనం ఏర్పాటు చేసుకోవాలి. సీరియస్ గా నడుస్తున్న సీన్ లో పిల్లి కూతలూ, తుమ్ములూ లాటి మందులు ఉండనే ఉన్నాయి. దాంతో ఎంత మగాడైనా ఫంకాల్సిందే మరి. వివరాలన్నీ ఆ రోజున చెప్తాను సరా. అయితే మనం చేయబోయేది అన్యాయం" అన్నాడు పతి.
    "పోవోస్. అన్యాయంట అన్యాయం. దెబ్బతీసే వాడిని దెబ్బతోనే పడగొట్టాలన్నారు జనం. నీ కెందుకు గురూ ఆ పాడు పనేదో నా నెత్తి నేసు కుంటానుగా. గొప్ప అల్లరిచేసి వదిలి పెట్టనూ......హు ........చూపిస్తా నా తడాఖా"
    "ఈలోగా మృణాళిని ముందు, నీకున్న టాలెంట్ ని ప్రదర్శించుకోవాలి."
    "నాకా.......టేలంటా?"
    "అవును నీకున్న టాలెంటే"
    "నాకు దేన్లో ఉంది టాలెంటు?"
    "టాలెంటు రెండు రకాలు. ఒకటి బైబర్త్ వచ్చి అభ్యాసం కొద్దీ పెరిగి పెద్దదై, "ఓహో" అనిపించేది. రెండు, అప్పటికప్పుడు చూచి నేర్చుకుని, అనుకరించి 'ఆహా'అని పించుకునేది. "ఓహో నీ కెలాగో లేదు కాబట్టి 'ఆహా' ఆచరించి-అదే ఆడపిల్లల్ని ఆకర్షించే టాలెంటై యుండాలి-షో మెయిన్ టైన్ చేయడం."
    "ఇది గొప్ప కష్టం."
    "ఇప్పుడు కావలసిందీ ఇదే. ఈనాడు చాలా మంది ప్రేమికులూ, మహానుభావులూ, పెద్ద మనుషులూ అందరూ చేస్తున్నది 'ఆహా' నే"
    "నా చాతనవుతుందంటావా?"
    "నిజమైన ప్రేమికుడి కిదేం లెక్కలోది కాదు"
    "ఒకవేళ కథ అడ్డం తిరిగితే?"
    "కలిగే నష్టమూలేదు. ఏమంటావా? నువ్వంటే మృణాళినికి ప్రేమ ఉండనే ఉందని ముందే చెప్పాను. గదా ఈ 'ఆహా'లో నువ్వు గనక ఫెయిలైతే ఆవిడ సానుభూతితో పాటూ, హృదయమూ నీ స్వంతమై పోగలవు."
    "మరి టాలెంట్ ఏ రంగంలో కావాలి?"
    "చెప్పాగా ఆడపిల్లల్ని ఆకర్షించేదిగా ఉండాలని. నాకు తెలిసినంతవరకూ వాళ్ళకి సంగీతమన్నా కవిత్వమన్నా విపరీతమైన మోజని. ఈ మధ్యనే, ఒక పేరొందిన సైకాలజిస్టూ, ఇలాగే రాశాడు."
    "సంగీతం ఈ జన్మకి చాతకొచ్చే విద్య కాదు, నేర్చుకున్నా రానేరాదు. పోతే-కవిత్వం ద్వారా, రిజల్టే మవుతుందో తేల్చి చెప్పలేను" అన్నాడు ప్రసాదం.
    "ప్రయత్నించమన్నా నేగాని ఫలితం గురించి ఆలోచించమనలేదే?"
    "బాగానే ఉందయ్యా. కవిత్వం నేర్చుకోవాలంటే ఏం చేయాలో గూడా చెప్పు."
    "పుట్శాకల్ చదువు. భావకవులుగా చలామణీ అయినవార్ని కాస్త కనిపెట్టుకునుండి. వాళ్ళు ఎప్పుడో ఎక్కడో చెప్పిన నాలుగు ముక్కల్నీ నేషనలైనా చేసుకుని నీ స్వంత భావాల్లా ఉపయోగించు. ఆవిడ మెప్పు సంపాయించు."
    "భేష్."
    "ఎందుకైనా మంచిది త్వమే వాహమ్, మహా ప్రస్థానం శ్రద్దగా చదవడం మొదలు పెట్టు ఇప్పట్నుంచే."
    "అవేమిటి?"
    "పుస్తకాలోయ్. విలువగల పుస్తకాలు. వేడీ, ఉద్రేకం, జాలీ, దయా అన్ని రసాలూ వాటిల్లో ఉన్నాయి. నువ్వూ మీ మృణాళినీ ఏకాంతంగా ఉన్నప్పుడు వాటిల్లో నాలుగు ముక్కలు రాం బాణాల్లా గంభీరంగా భావయుక్తంగా పెద్ద ఫోజుతో ప్రయోగించు."
    "నువ్వింత చెప్తూంటే నా కిప్పుడే ఆవేశం కలుగుతోంది. నీకు పుణ్యముంటుందిగానీ ఆ రెండు పుస్తకాలూ తెచ్చిపెడుదూ."
    "అలాగే" అన్నాడు పతి.
    మరి కొంతసేపు ఆ పార్కులో పచ్చ గడ్డి మీద, ముందు చేయబోయే కార్యక్రమాన్ని కూలంకషంగా చర్చించి, ఇళ్ళకి బయలు దేరారు మిత్రద్వయం.
    దార్లో తన హృదయ పూర్వకమైన కృతజ్ఞత తెలియజేశాడు ప్రసాదం, పతికి.
    
                                    *    *    *

    నిరంజనం ఇంటి కొచ్చేసరికి రాత్రి పది గంటలయ్యింది. వరండాలో లైటు వెలుగుతూనే ఉంది. రేణుక సోఫాలో కూర్చుని ఏదో మేగజైన్ తిరగేస్తోంది. నిరంజనం రావడం చూచి పుస్తకం మూసి లేచి నిలబడింది.
    అతను కొత్తగా కనిపించేడు. తల రేగి ఉంది. కళ్ళు ఎర్రపడ్డాయి. తూలుతున్నాడుగాని తమాయించుకుంటున్నాడు.
    అతని వాలకం చూచి రేణుక కలవరపడింది.
    అతను సరాసరి అతని గదిలోకి వెళ్ళి పోయాడు. ఫేము కుర్చీలో కూలపడి సిగరెట్ ముట్టించాడు. రేణుక వచ్చింది. గుమ్మం దగ్గర నిలబడి అడిగింది.
    "చాలా ఆలస్యంగా వచ్చారు."
    ".............................."
    "ఆఫీసులో అంత పని ఉందా?"
    అతను రేణుకవైపు కోపంగా చూచి, సమాధానం చెప్పకుండానే డ్రెస్సింగ్ టేబిల్ దగ్గరకు వెళ్ళి టై విప్పుకుంటున్నాడు.
    "మధ్యాన్నం గూడా ఇంటికి రాలేదు"    
    "..............................."
    "రెండు రోజుల్నుంచీ మీరు పరాకుగా ఉంటున్నారుగదూ."
    "అయ్యిందా ఇంకా ఏమైనా ఉందా?" అన్నాడు బూట్లు విప్పుకుంటూ.
    పిన్నీవాళ్ళు వచ్చిన రోజు జరిగిన రగడ నెమ్మదిగా నాలుగు రోజుల్లో సర్దుకుంది. దాదాపు అన్నీ మరిచిపోయి మొన్నటివరకూ మౌనంగా గడిపేరు. మళ్ళా మొన్నట్నుంచి జగడం ప్రారంభమైంది. బుర్రలో మాసిపోయిన రగడ మళ్ళా కెలికింది.
    "జరిగిపోయిన దాన్ని మళ్ళా గుర్తు చేసుకుని బాధ పడటం భావ్యంగాదు."
    "నోరు మూసుకుంటావా? నన్నెక్కడికయినా వెళ్ళిపోమంటావా?"
    ఆమెకి అతన్ని చూస్తూంటే భయంగా ఉంది. ప్రేమ పెళ్ళితో స్వస్తి అని చాలామంది అంటున్నది నిజమేనేమో. కాలేజీ రోజుల్లో అతను తనంటే ప్రాణం పెట్టేవాడు. ఒకరిద్దరు గడుగ్గాయి విద్యార్ధులు చెవాకులు పేలితే వాళ్ళ నోళ్ళు మూయించేడు. ప్రేమ బూటకం కాదనీ, శాశ్వతమనీ, పవిత్ర బంధమనీ చెప్పేడు. అతని మాటలు విని తన అదృష్టానికి మురిసిపోయింది తను.
    ఏది? ఇప్పుడా మాటలన్నీ ఎక్కడికి పోయాయి? ఒక చిన్న మాట పట్టింపుకోసం ప్రాణధికంగా ప్రేమించిన తనని అలక్ష్యం చేయడం తగునా?
    పరిచయస్థులు చాలామంది తమ పెళ్ళికి విపరీత అర్ధాలు తీసేరు. ఒక బంగారు పిచ్చుకని ప్రేమించి పెళ్ళి చేసుకోడంలో ప్రేమ కంటే స్వార్ధం ఎక్కువని దెప్పి పొడిచేరు. ఇది నిజం చేస్తాడా నిరంజనం?
    రేణుక తల్లడిల్లి పోయింది.
    ఈ రోజు అతని పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. సభ్యత గలవాడూ, పది మందిలోనూ తలెత్తుకు తిరుగ నేర్చనవాడూ చెయ్యరాని పనిని చేశాడు. తప్ప తాగి ఇంటికి వచ్చాడు. ఈ మాట గుర్తుకు రాగానే దుఃఖం పెల్లుబికింది.
    తను కట్టుకున్నవన్నీ గాలి మేడలేనా?
    "ఏం? ఇంకా ఇక్కడే నిలబడ్డావ్ బొమ్మలాగా" అన్నాడు నిరంజనం బట్టలు మార్చుకుని వచ్చి.
    "లేవండి భోజనం చేద్దాం"
    "నాకేం అక్కర్లేదు. హోటల్లో భోంచేసి, క్లబ్బులో హాయిగా కాలక్షేపం చేసి వచ్చాను. తినాలని ఉంటే నువ్వే తిను. మరీ అంత పతిభక్తి తగునా రేణూ?" అన్నాడు అపహాస్యంగా.    
    ఆమెకి సహనం చచ్చిపోతుంది. ఎన్నాళ్ళని ఈ రంపపు కోత?
    "వొద్దు రేణూ! మీతో ......... మీ ఆస్థిలో నేను సుఖపడలేను. నిన్ను పెళ్ళిచేసుకోడం పాత పాటేనేమో" అన్నాడతను.
    "ప్లీజ్ ......... మీ రామాట అనొద్దు" అంది కళ్ళల్లో నీళ్ళు నింపుకుని.
    "నన్నీ మాత్రమే అర్ధం చేసుకున్నారా? అప్పుడే మన కాలేజీ రోజులు మరిచిపోయేరా?" అన్నది బాధగా.
    "ఊహు ........ లేదు. అక్కడే, ఆ రోజుల్లోనే పొరపాటు చేశాను. ప్రతిఫలం అనుభవిస్తున్నాను"
    ఆమె రెండు క్షణాలు ఏమీ మాటాడలేదు.
    "మా నాన్న చేసింది తప్పే ఆయన తరఫున నేను క్షమాపణ వేడుకుంటూన్నాను."
    "గూడ్......నువ్విట్నుంచీ, మీ నాన్న అట్నుంచీ, నన్ను బొమ్మలా ఆడించేస్తున్నారు. నువ్వు రాసిన ఉత్తరానికి ఆయనింతవరకూ సమాధానం రాశారా చెపుదూ."
    "ఒక పక్క మీ మాటనే నేగ్గించుకుని నిష్టూరాలు కూడా వేయడం ఎందుకు చెప్పండి."
    "అంటే?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS