"నే పట్టుకు వెళతాను తేనే" అంటూనే సీతారామయ్య పంచె చెంగు పైకి దోపుకున్నాడు.
ఆ సాయంత్రమే భగ్గుమంది ఇంట్లో అని సుభద్రమ్మ ఊచేసింది. తనకే తెలివి తప్పినట్లయ్యింది, వింటుంటే.
"ఇనప్పెట్టి తాళాలు ఊళ్లా క్కుంటూనే, 'మీరు వచ్చిన పని అయ్యింది. ఇక వెళ్ళవచ్చు' అనేసింది రుక్మిణి. పైగా ఓ రెండు వేల రూపాయిలు గిరవాటేసి, 'దానికోసమేకా మీ ఎత్తులు? అని అయిపోతే కార్డు వ్రాయండి. మళ్ళీ పంపుతా' అంది.
'ఈ యిల్లు సరిదిద్దుతాము. నీకు అండగా ఉంటాము - అన్న సాకులు చెపుతూమాత్రం రాకండి. ఎందుకంటే, అది నేను భరించుకోలేను. పైగా ఎదురుగా మీరుండడంతో నాకు గుండెలమీద పెట్టిన కుంపటి రవులుకుంటూ ఉంటుంది. అందువల్ల ఏం చేస్తానో కూడా నాకు తెలియదు.
'ఆ అత్తయ్య నాకు నేర్పింది యిల్లు సవరించడం. ఆ మార్గంలో నడవడం నా ఆశయం. ఇక చేసేనా లేదా అన్నది, నా అదృష్ట, దురదృష్టాల మధ్య తీర్పు. నుదుటి వ్రాత ఏ విధంగా ఉందో అల్లాగే జరుగుతుంది' అనేసింది. వాళ్ళమ్మ ముక్కుమీద వేలు వేసుకుని 'ఎంతదానివైయ్యేవే!' అందట.
తోక త్రొక్కినట్లు లేచిపోతూనే, 'కన్నందుకు, మీ బరువు తీర్చుకున్నారు. ఇక పుట్టి నందుకు నా ఋణం మిగిలింది. అది డబ్బుతో తీరుతుందన్న నమ్మకం నాకు ఉంది.
అయినా మీ దృక్పథంలో నాకు, నా శరీరానికి ఒక్కటే విలువ. డబ్బు సంపాదించి బంగారపు తొడుగు తొడిగించుకోవాలి. అది నీ ఆశయం. అందుకేకా నాకు తాళి కట్టించేవు?
దీని విలువ ఎంత ఉందో నువ్వూ తెలుసుకోవడం మంచిదే' అనే ఝుమాయించిందిట." సుభద్రమ్మ ఆనందం పట్ట పగ్గాలు లేకుండానే ఉన్నట్లు ధ్వనిలో ద్యోతకమయింది.
"ఆయనేమన్నారు?"
"బెల్లంకొట్టిన రాయి. ఏమంటాడు? కిమన్నాస్తి."
"అంతేనా?"
"ఊఁ.! వెళ్ళేటప్పుడు రెండొందలు పెట్టి చీరా చాపూ తెప్పించి ఫస్టు క్లాసు టిక్కెట్టు కొని రైలెక్కించి ఇంటికి వచ్చింది రుక్మిణి. అక్కయ్యా, దానిలో ఇంత విప్లవం ఉందని నేనెప్పుడూ అనుకోలేదు."
చిన్నగా నవ్వేస్తూనే తను చూసింది. చెప్పింది అప్పుడు పార్వతమ్మ. ముఖంమీద నీళ్ళు చిలకరించవలసినంత పనైయ్యింది సుభద్రమ్మకు.
"రాజు వచ్చేడా?"
"ముఖం సరిగ్గా కన్పడలేదు. మాటల్ని పట్టి అతనే అనుకున్నాను."
"మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయినట్లో?"
"పిల్లవాడిని చూస్తే మెరువుపూసలా ఉన్నాడు. కాస్త మాట తొణక లేదు, చేష్ట బిరి తప్పలేదు. ఆఖరున ఆవిడికి నమస్కారం పెట్టేడు."
ఒక్కటే పరుగుపెట్టింది సుభద్రమ్మ అప్పుడు.
-ఇవన్నీ రైల్లో కూర్చున్నప్పుడే ఆయనకు చెప్పింది. వెంకటమ్మ వద్ద కథలు విని, విని, చెప్పడం నేర్చుకున్నట్లే రసవత్తరం చేసింది. మధురిమ చిలకరించింది. ఆయన వింటూనే ఉన్నాడు. మధ్యలో ఆవేశాలూ, రసాస్వాదనలూ ప్రకటించలేదు.
చెప్పిన తర్వాతనే ప్రశ్న మిగిలింది. అది ఆఖరుకే ఉంచినట్లు "ఏమండీ? ఆ అబ్బాయి ఆఖరున అన్నాడు - తన భార్యని చూచినట్లు. పెండ్లా కాలేదు. భార్యా అన్నది రాలేదు. మరి దాని అర్ధం నాకు బోధపడడం లేదండీ" అంది.
ఇరుకున పడ్డాడు. నిజంగా ఒప్పుకోవాలంటే తను జవాబు చెప్పలేడు. తనకే సందిగ్ధంగా ఉంది పరిస్థితి. ఆలోచించాలి. అయినా దానికి తాడూ బొంగరం లేదు. ఉన్నా తను చుట్టలేడు. చుట్టడానికి కూడా ఊగులాట ఉంది. ఠక్కున శాంత జ్ఞాపకం వచ్చింది. దాని మాటలూ ఎదురు తిరిగేయి. దానిలో ఉన్న జ్ఞానచిహ్న తను విపులీకరించలేడు. ఏదో స్మృతి ఛాయ అయినా ప్రజలు నమ్మలేరు. తను చెప్పించి నమ్మేట్లు చెయ్యలేడు. కాని తను నమ్మగలడు. అదే శక్తి ఈ అబ్బాయిలోనూ అంతర్గతంగా ప్రవహిస్తూందా? తనెప్పుడూ అతని కుండలి చూడలేదు.
క్షణికం దిమ్మతిరిగినట్లుగా భావన కలిగింది. హడిలిపోయేడు. 'ఏమిటది, అమ్మా!' అని అంతఃకరణ గగ్గోలే పెట్టేసింది. వాళ్ళిద్దరూ జన్మవాసనల చిహ్నాలా? ఇదే నిజమైతే అతను తన రామం అయ్యేడా?
కళ్ళు గట్టిగా మూసుకున్నాడు.
పార్వతమ్మ కంగారు పడింది. "ఏమిటండీ?తలనొప్పిగా ఉందా? కళ్ళు తిరుగుతున్నాయా?"
"ఏమీ లేదే."
"మరి? క్షణికం ఎల్లాగో అయిపోయేరే?"
"ఏదో అనుకోని ఆలోచన వచ్చింది."
"ఏమిటది?"
చెప్పేడు. "ఆఁ!" అంటూనే మౌనంలో పడింది పార్వతమ్మ. ఇదే సంభవమా? తను చెప్పలేదు. ఆయనే చెప్పాలి.
"అమ్మ అన్నీ తనలో దాచుకుంది. ఎప్పుడో చెపుతుంది. మనం ఎదురుచూస్తూ ఉండడమే. ఎందువల్ల అంటే నిమిత్త మాత్రులం."
తల ఊపుతూనే మనస్సులో అమ్మకే నమస్కరించుకుంది.
ఊరి పొలిమేరల్లోకి వచ్చేసరికి, తన్ను అందరూ పలకరించేవారే. క్షేమం అడిగేవారే. 'పెండ్లి బాగా జరిగిందా? ఇన్నాళ్ళు ఉండి పోయేరు? ఊరంతా చిన్నబోయిందండీ?' ఇవి భౌతికాలు. అన్నిటికీ ఉచితరీతే సమాధానం చెప్పేడు.
ఇంటి గుమ్మంవద్ద బండి ఆగేసరికి వెంకటమ్మ, లక్ష్మయ్యతో కొంజాలో కూర్చుని ఊసులాడుతూంది. క్షణికం, 'వీళ్ళెక్కడినుండి ముహూర్తం పెట్టించుకోవడానికి వచ్చేరో" అన్న చిన్నచూపులోనే కూర్చుండి పోయింది.
'ఎవరో వచ్చేరు' అన్న దృష్టిలో లక్ష్మయ్య ఉన్నాడు.
"లక్ష్మయ్యా, వెంకన్నని పిలు" అని అవధాని అనడంతో ప్రకృతిలోపడి, కంగారు కంగారయ్యేడు. దానితోపాటు వెంకటమ్మకు నోరు పెకలి రాలేదు. గుండెలకు కఫం దాచేసింది.
ప్రత్యేకంగా ఆ రోజు రాత్రి దగ్గరినుండి, శాంత నడవడికలో మార్పు వచ్చింది. పెట్లో ఉన్న బట్టల్లో మాంచివి, బొట్టు, శిఖతో పువ్వులు, మెళ్ళో పసుపుకొమ్ముతో తాడు - ఇది ఈనాటి రూపం. రోజూ రాత్రిళ్ళు కూడా భోజనం మొదలుపెట్టింది. ఇదివరకటి నత్తాలు లేవు. ఊహల్లో ఆనందం వెల్లువ విరిసిన ముఖం. పరధ్యాన్నం ఎక్కువే అయ్యింది. ఇది మొదట్లో ఆరాటన కలిగినా, వాడి మ్రోడైన వృక్షం చిగిర్చినట్లు ఉండడంతో తను మాట్లాడలేక పోయింది. నిస్సారంగా, ఏ దారీ లేక ఎడారి బ్రతుకు కాకుండా, కాస్త ఆశ కల్సుకుంది అన్న ఆనందం కలిగింది.
ఏదో చిన్నగా చెప్పాలంటే అవధానులు ఇంట్లో లక్ష్మీదేవి నడుస్తున్నట్లనిపించేది.
అయినా వాళ్ళు రేపు వచ్చేవరకే ఈ విజ్రుంభణ. దాని తర్వాత? సందేహం జావళీ అయ్యింది. తను ఓ విధంగా ఒప్పుకోగలదు. నిత్య అగ్ని హోత్రుడు, వైష్టికపరుడు అయిన అవధాని ఒప్పుకోడు. ఆమె దుఃఖం, పరువూ మ్రింగుకున్నా, మొత్తంమీద మాట్లాడలేని ముత్తయిదువతనంలో మౌనంగానే ఉండవచ్చు.
ఇక మిగిలింది తను ఇచ్చిన స్వేచ్చ. ఇది గర్హనీయం కాదు. తన్నే దుమ్మెత్తి పోస్తారు. ఈ నిర్ణయమే ఇన్నాళ్ళూ కళ్ళల్లో కలికం పెట్టినట్లయ్యింది. అది ఇంకా రెండు మూడు రోజులు సాగుతుందనుకున్నా, ఈ క్షణంతో ముద్దాయిలా, కోర్టు కెక్కుతుంది. అందులో శిక్షా, క్షమా ఇవే త్రాసులో ఊగుతున్నాయి. తను ఇప్పుడు భరించుకోవాలి.
ఎందుకో లోపలినుండి వణుకు వచ్చింది. అది సాంప్రదాయికమైన వంశ కట్నాన్ని భగ్నం చేయడం అన్నది తన చేతుల్లోనే అయ్యిందన్న భయమేనా కావచ్చు, లేక ఆలోచించని వయస్సు పరిణామమేనా రూపొంది ఉండవచ్చు.
ఆనాడు రాత్రే తలవాచా చివాట్లు పెట్టి ఉంటే ఇది జరగకపోవును. తను చెయ్యలేక పోయింది. చెయ్యగలిగీ చెయ్యనందుకే ఇప్పుడు క్షోభ.
"ఏం, వెంకటమ్మా! వంట్లో బావోలేదా?" అవధానులే అడిగేడు - ఎప్పుడూ ఉన్నట్లు ఉండకపోవడంవల్ల.
"ఉందండి." ముక్తసరిగా అంది.
"అమ్మాయి కులాసాయేనా?" పార్వతమ్మ.
లోపలికి కాళ్ళు కడుక్కునే వచ్చేరు. అదో ఆచారం. లోపల శక్తిపీఠం ఉంది. ముఖం తుడుచుకునే కవాచీ బల్లమీద కూర్చున్నాడు. పార్వతమ్మ సంశయంలో పడింది; శాంత ఇంకా కన్పడలేదేం అని. ఆయన కళ్ళు పడమటింటి మీద క్షణికం నిలిచి, పార్వతమ్మమీద పడ్డాయి.
నవ్వు తొణికిసలాడి, బుగ్గలు గుంటలు పడుతుంటే, జడలో తురిమిన సన్నజాజుల మధ్య కనకాంబరాలు ఊగుతున్నాయి. వస్తూనే మంచినీళ్ళు బల్లమీద పెట్టింది. అప్పటికి ఇద్దరూ శాంతను చూచేరు. నోరు ఎండుకుపోయి ద్రష్టలే అయ్యేరు. దిగ్భ్రమ పట్టం కట్టింది.
శాంతేనా!?
"మావయ్యా! దీవించు." వంగి నమస్కారం పెట్టింది. అచేతనంగా అక్షింతలు క్రిందికి రాలేయి. పునరావృత్తే అన్నట్లు పార్వతమ్మ వద్దా జరిగింది. దీనితో లక్ష్మయ్యా అటు, ఇటు వెంకటమ్మా రాయి కొట్టినట్లయి, ప్రతిమలే అయ్యేరు.
అవధానే తేరుకున్నాడు. కళ్ళు నులుముకున్నట్లు తెలియనివ్వకుండా, ముఖం అంగ వస్త్రంతో తుడుచుకుని "ఏమిటిది?" అన్నాడు. అందులో స్వరభేదం ఉంది.
"వారు వచ్చేరు." అతిముక్తసరిగా శాంత అనేసి తల దింపుకుంది. కాలిబొటనవేలు నేల మీద ఆడుతూంది.
"ఎవరు?"
"ఎవరికోసమైతే ఇన్నాళ్ళూ ఎదురు చూస్తున్నారో వారు."
ఉలిక్కిపడింది పార్వతమ్మ. ఏమిటి శాంత అంటున్నది? అదేవతులో అవధాని ఊగినా, ఆలోచన విపరీతంగా వెళ్ళింది. వయస్సు నిబ్బరం తక్కువైతే ఏదారేపోయె వాడిలోనో, కాస్త ఆ రూపాలు కల్పించుకుని, భ్రమపడి, పతనం చెందిందా? అదే జరిగి ఉంటే, ఈ క్షణంతో తన పేరు ప్రతిష్టలు మంటకలిసినట్లే.
"నా కొడుకు రామంపోయేడు. మళ్ళీ రావడం ఏమిటి? పిచ్చెత్త లేదు కదా?" పార్వతమ్మ.
"లేదు. నా హృదయం నాకు చెప్పింది ఆయనే అని."
"హృదయం కాదు. కామం."
"మావయ్యా!" ఒక్క అరుపే.
క్షణికం ఒక్క అవధానేమిటి, అందరూ జంకేరు. క్రమ్ముకున్నట్లుగానే అవధాని తెప్పరిల్లినా మాట రాలేదు.
"అంత కండకావరం ఎక్కి, చెడు పనులేమీ నేను చెయ్యలేదు. ఇకముందు చెయ్యను. ఆ ధైర్యం 'అమ్మ' నాకేనాడో ఇచ్చింది. ఇప్పుడున్నూ నమ్మండి. నేను పతనంకాలేదు. నాలోంచి నన్నెవ్వరో కెక్కరించి, ఒక్కుమ్మడిగా 'నీభార్త' అనే ఆయన్ని చూపేరు..... కాని......"
ఎనిమిది కళ్ళూ శాంత మీద నిలిచేయి.
"ఆయన నాకన్న చిన్న. ఇదే లోకం గుర్తించ లేదు." ఉస్సురన్నట్టే దిగజారిపోయింది.
