9
రోజులు పరువులు పెడుతున్నాయి. సుఖదుఖాల్ని రంగరించుకుంటూ . అనూరాధ ను ఎంతగానో విసిగించుతున్నాడు హరికృష్ణ. పదిరోజుల నుంచి అతని ధోరణి ఏమంత ఆశాజనకంగా లేదు. ప్రతిదానికీ పేచీ పెడుతున్నాడు.
సరిగా భోజనం చేసి అయిదారు రోజులయింది. ముఖాన అలసట కొట్టవచ్చినట్లు కన్పించుతోంది. సన్నబడ్డాడు. ఆరోజున గడ్డం కూడా గీయించుకొనని పట్టుబట్టాడు. అపుడపుడు బజార్లో కి వెళ్లి గంటల కొలదీ వచ్చే పోయే వాహనాల్నీ , జనాన్నీ చూస్తూ నిలబడి పోతున్నాడు.
మందు మ్రింగించడం మహాకష్టమై పోయిందానాడు. రానురాను పెద్దగా కేకలు పెట్టడం మొదలెట్టాడు. అనూరాధ మనస్సున ఆవేదన పర్వతం లా ఎదిగి పోతోంది. శారద చివురుటాకులా విలవిల లాడిపోతోంది అతని పరిస్థితికి.
ఆరోగ్యంతో కళకళ లాదవలసిన ఆ డాక్టర్ ముఖం , దీనంగా, చూసేవారికి జాలి గోల్పుతోంది. అనూరాధ హృదయం తరుక్కు పోతోంది బాధతో.
మధ్యాహ్నం దాటిపోయినా అతడు అన్నం ముట్టనే ;లేదు. ఎంతగా బ్రతిమలాడినా పట్టు విడువనే లేదు.
'అన్నం తింటే పాపం! తినను! అయినా నీకెందుకు యింత బాధ నా గురించి. నా యిష్టం! మా యింటికి వెళ్లి పోతాను యిలా మాటిమాటి కి అది తిను, యిది తిను అని వేధించావంటే! ఏయ్! అమ్మాయ్! ముందు నివ్విక్కడ నుంచి వెళ్ళిపో! ఊ! నేనే వెళ్లి పోనా? ఆ! అలా వెళ్లు! లేకపోతె! బయల్దేరిందండి! మహారాణి!! ఎందుకు తిన్నాలో అన్నం?! అంత ఆకలైతే తను తినరాదూ?! పాపం! ! పిచ్చిదేమో! అందుకే యిలా వెంట పడుతోంది.' అనూరాధను పేరు పెట్టి పిలవడం కూడా మానివేశాడతడు. పిచ్చి ధోరణి మరింత అధికమయ్యిండానాడు. శారదకు ఫోను చేసి జరిగినదంతా వివరంగా చెప్పింది విని నిట్టూర్చిందామె.
'అక్కా! అయన పరిస్థితి చూస్తోంటే భయం వేస్తోంది. ఈరాత్రికి నువ్వు రా! సాయంగా వుంటావని అంటున్నాను. ఒక్క మెతుకైనా లోనికి పోనివ్వలేదింతవరకూ! జోగులతో ఎలాగో కాసిని పాలు త్రాగించాను , అదీ బలవంతానే! మరీ బలహీనంగా వున్నారు . అయినా అరుస్తూనే వున్నారు పెద్దగా. నీరసం వచ్చి తూలిపోతున్నా గొడవ మానడం లేదు.' అన్నది అనూరాధ బాధగా.
రాత్రికి వస్తానని మాట యిచ్చింది శారద. ఆపిల్ పళ్ళూ తెచ్చి ఎలాగో తిన్పించింది. తరువాత బడలికగా వుండడం మూలాన స్నానం చేయబోయింది. హరికృష్ణ కళ్ళు మూసుకుని పడుకున్నాడు. జోగుల్ని అతని గది ముందరే కాపలా వుంచి వెళ్ళింది.
అంధకారం దట్టంగా అలుముకుంటోంది. స్నానం ముగించి చీర కట్టుకుని, నుదుట కుంకుమ వుంచుకుని 'పాలు' కాసిని గొంతులో పోసుకుంది. ఆమెకు కూడా వుదయాన్నుంచీ ఆకలి అన్పించడం లేదు. అన్నం చూడగానే అతడు గుర్తుకు వస్తున్నాడు. ఆకలి వేస్తున్నా తెలియని ఆ శాపగ్రస్తుడ్ని తలచుకున్న కొలదీ దుఃఖం ఆగడం లేదామెకు.
ఆలోచనలు ముసురుకుంటున్నా నిగ్రహించుకుని హల్లో అడుగు పెట్టింది. జోగుల్ని పిలిచింది. అతడు పలకలేదు. ఆతురతతో హరికృష్ణ గది వైపు వెళ్ళింది. జోగులు గుమ్మాని కానుకుని నిదుర బోతున్నాడు. దుప్పటి కూడా కప్పుకున్నాడు. అది హరికృష్ణ దుప్పటి. అతడే అలా చేసి వుంటాడనుకున్నదామే.
ఏం చేస్తున్నాడో! మెలకువ వచ్చిందా! అని చూసిందామె. కొయ్యబొమ్మలా నిల్చుండి పోయింది. నోట మాటే లేదు. ఆ కనులలో జీవన కాంతే లేకుండా పోయింది. హరికృష్ణ లేడు అక్కడ! అందుకే విగ్రహమే అయ్యిందామె. జోగుల్ని లేపింది. మేడంతా గాలించింది. అందరూ కలిసి వెదికారు ఎంతోసేపు. గేటు తీసి వుంది. అనూరాధ గుండెలలో భయం వికటాట్టహాసం చేస్తోంది. ఆమె మనస్సు మనస్సు లో లేదు. మరబోమ్మలా తిరుగుతోంది . చూసిన చోటనే మళ్ళీ మళ్ళీ చూస్తోంది.
ఎవరికీ కన్పించకుండా ఎక్కడికి వెళ్లినట్లు? ఎలా అదృశ్యమయ్యారు? పారిపోలేదు గదా!! భగవాన్! ఈ స్థితిలో అయన!!ఎక్కడ వుండగలరు? ఎవరు మనిషి అని గుర్తించి వో గుప్పెడు మెతుకులు పెడతారు?! అంత కరుణా పూర్ణ హృదయాలున్నాయా యింకా?! ఎలా??! ' ఆమె అనుమానంతో వూగిపోతోంది.
అంతలో శారద వచ్చింది. విని విభ్రాంత అయ్యింది. నౌకర్ల ను పిలిచి నాలుగు వైపులా పంపించారు. అనూరాధా, శారద కలిసి వో వైపు కు బయలుదేరారు.
ఆ రాత్రి గృహాన నిదుర లేదు. ప్రశాంతత నిలిచి కలలు గనలేదు. ఎప్పటిలా అ పిచ్చి వాని కేకలు లేవు. పెద్దగా అరవడమూ విన్పించలేదు . మనుష్యులే లేనట్లు నిశ్శబ్దం లో విలీనమై పోయిందా గృహం.

రాత్రి గడిచి పోయింది. వెలుగు ప్రవేశించింది. కానీ ఆ అక్కా, చెల్లెళ్ళు యింకా చీకటి లోనే వున్నట్లు కనులు మూసికొని, సోఫాలో చెరో వైపున బొమ్మలా కూర్చున్నారు.
అక్కడ కూర్చున్నది , నిర్జీవ ప్రతిమలు గావు, చైతన్య స్రవంతులేనని తెలియడాని కన్నట్లు వుండి వుండి నిట్టుర్పులు మాత్రం వినవస్తున్నాయి.
గాడ నిశ్శబ్దం లో నుంచి ఏ ఒక్కరూ తలెత్టలేక పోతున్నారు. ఏ వ్యక్తీ కోసం ఆ అనురాగ పూర్ణ హృదయాలు అంతగా తల్లడిల్లి పోతున్నాయో, అతనికి అవంతైనా ఆ సంగతి తెలియదు. అందుకే అంతనిర్దయగా ఎవరి కంటికి కన్పించకుండా మాయమై పొయాడతడు. వెదకపోయిన వాళ్ళు ఒక్కొక్కరే వచ్చి ఆ నిశ్శబ్దం లో లీనమై పోతున్నారు. ఎవరి కంటికీ కన్పించకుండా వా వ్యక్తీ ఎక్కడా దాగి వున్నదీ ఎవరికీ అంతుబట్టడం లేదు.
శారద చేసేది లేక 'పోలీసులకు' కూడా తెలియబరిచింది. అనూరాధ ప్రముఖ దిన పత్రిక లన్నింటి లోనూ ప్రకటన చేయించింది.
ఆ రోజంతా మరలా అన్వేషణే! కానీ నిరాశ తప్ప మరొకటి మిగలలేదు. తెల్లవారే వరకూ ఆ అనురాగమయి ఆశలతో మాలల నల్లుకుంటూనే వుంది. కనులలో వత్తులు వేసికొని నిరీక్షించుతూనే వుంది. నిలువెల్లా నిరీక్షణతో వేగిపోతూనే వుంది. హృదయాన అతని పిలుపు విన్పించుతూనే వుంది అనుక్షణమూ.
శారద, అనూరాధ కళ్ళల్లో కి చూడలేక పోతోంది. ఏ విధంగా ఆ అనూరగమయిని ఊరడించ;లో అర్ధం గావడం లేదేవ్వరికి. ఆ త్యాగమయి ఏ సుఖాన్నిశించి పూర్తిగా తనను తానె అర్పించు కుందో ఆ సుఖానికి వున్న పునాది కూడా లేచిపోయింది. రంగురంగుల బంగారు కలలు గన్న ఆ అమృత హృదయం నిరాశ తో, నిస్పృహతో , అలమటించుతోంది.
రోజులు గడిచి పోతున్నాయి. నిరీక్షణ పెరిగి పోతున్నది. ఆవేదన అధికమౌతోంది. అనురాగం నిట్టురుస్తోంది అవిరామంగా. ఆపశ్రుతులు పలుకుతోంది అనురాగ వీణియ.
హరికృష్ణ అదృశ్యమైన నాటి నుంచీ, అనురాధ ముఖాన నవ్వు చూసి ఎరుగ రెవ్వరూ! పెదవి విప్పి పెద్దగా మాట్లాడి ఎరుగదామె. అన్నపూర్ణమ్మ గారికి బాధకు అంతులేకుండా పోయింది. కన్నబిడ్డ మంచిని ఎంచుకుని వెళ్తోందనుకుని ఆనందించింది, కానీ చివరకు నిరాశే ఎదురై పరిహసించేసరికి ఆ సంధ్యా సమయాన ఆ మాతృమూర్తి వ్యధతో కుమిలి పోసాగింది. తల్లి తన కోసమే క్రుంగి కృశించి పోతోందని గ్రహించీ, పెదవి కదుపలేక పోయింది అనూరాధ.
పదిహేను రోజులు గడిచిపోయాయి. ఏవైపు నుంచీ హరి కృష్ణ గురించి అక్షరం కూడా తెలియలేదు. అనూరాధ హృదయం ముక్కలై పోతోంది.
ఆ గదిలో కూర్చుని గంటల కొలదీ రోడ్డు వైపు చూస్తుంటుంది. మౌనం తప్ప మరో స్నేహమయి లేదా అనురాగమయి కి. దుఖం తప్ప మరో ఆత్మీయురాలు లేదు వూరడించడానికి. ఎర్రవారిన ఆమె కనులలో పరచుకున్న నీలి నీడలు శారదను భయ కంపితురాల్ని చేస్తున్నాయి.
'అనూ! బావ రాకుండా పోడని చెప్తోంది అంతరంగం!' అన్నది శారద. శారద వంక చూసి నవ్విందామె. ఆ నవ్వులో మాధుర్యం నర్తించ లేదు. విరక్తి విరుచుకు పడింది.
'అక్కా! నా మీది మమకారం అలా అన్పించుతోంది నిన్ను! ఎలా నమ్మమంటావు?! అసలే పిచ్చి మనిషి!! ఆ పైన ఆశ్రయం లేదు! ఇంకా వస్తారని ఏ ఆశతో , ధైర్యంతో ఎదురు చూద్దాం?!" నిరాశతో క్రుంగి పోయిందామె.
'లేదు అనూ! ఎప్పటికైనా సరే! బావ తిరిగి వస్తాడు.'
'నిజమే అక్కా! అంతవరకూ ఈ అనూరాధ బ్రతికి వుండలేదేమో నన్పించుతోంది!'
'అనూ! ఏమిటా మాటలు?!"
'మాటలు గావు! జరగబోయే దాన్ని చెప్పానక్కా! నీకు బాధగా వుంటుంది. కానీ జీవితాంతం నిరీక్షణతో ఏమనిషీ నిలువలేడు!'
శారద మాటాడలేక పోయింది. ఆ త్యాగమయిని గుండెలకు హత్తుకుని అలాగే వుండి పోయింది ఎంతో సేపు. ఆమె పెదవులు వణికి పోతున్నాయి.
'నాకు తెలుసు అనూ! నీ అంతరంగాన ఆవేదన ఘోషించుతుందని. కానీ అక్కగా యింకా ఆర్దిస్తున్నానమ్మా! ధైర్యాన్ని మాత్రం వదిలి పారిపోకు. జీవితాన ఆశ ప్రతిక్షణం వూపిరి పీలుస్తూనే వుండాలి. అపుడే ఆనందం అందుతుంది. నీ అనురాగం పవిత్ర మైనదే గాదు. త్యాగ ప్రపూర్ణమైనది కూడా. అందుకే నిరాశ నిన్ను జయించలేదని చెబుతున్నాను.' అన్నదామె ఆప్యాయంగా!
