Previous Page Next Page 
మనిషి పేజి 16


    "హెలెన్ ! ఇలాటి వాళ్ళందర్నీ ఎందుకు చేరనిస్తున్నావు దగ్గిరికి?"
    "ఎందుకా? కాలక్షేపానికి. పిల్లల్లేక చచ్చిపోయిన ఒక పిల్ల జమీందారు పెంపుడు కొడుకీయన. అన్నీ ఉన్నాయి అల్లుడి నోట్లో శని అని సుఖ పడాలని మహా దేబిరింపు లే. లక్షలు మూల్గుతున్నాయి. అరక్షణం సుఖం కోసం పది వేలు తగలబెట్టే ఘనుడు. తాను తియ్యబోయే పిక్చర్లో నన్ను హీరోయిన్ చేస్తానంటూ వచ్చాడు. అతను పిక్చరు తీసేది లేదు. నేను హీరోయిన్నయ్యేది లేదు. అయితే అతనికి నేను, నాకు అతను కాలక్షేపానికి ఉపయోగ పడుతున్నాం."
    "అతనితో రేపు మద్రాసు వెళుతున్నావా?"
    "ముగ్గుర్ని పిల్లల్ని కన్నాక, అసూయ లాంటి వాటిని నువ్వు దగ్గిరికి రానియ్య కూడదు. తమకి సంబంధం లేని వస్తువుల్ని ఎవరో అనుభవిస్తున్నారని కూడా మగవాళ్ళు కత్తులు నూరుతుంటారు. ఇంతకీ మద్రాసు ఎందుకు వేలుతున్నానో తెలుసా?"
    "ఎందుకు?"
    "ఫిలిం లో హీరోయిన్నవుదామని కాదు."
    "మరెందుకు."
    "చెబితే నవ్వుతావా?"
    "నువ్వేం చెప్పినా నమ్ముతాను."
    "సారధి కోసం."
    ఆమె ముఖం లోకి చూశాను. పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసం, నిజాయితీ కరిగి ఆమె కళ్ళల్లో పొంగాయి.
    మనిషిని దేవత చేసే శక్తి కన్నీటి లో ఉంది. లేడి పిల్లలా చెంగు చెంగున గెంతు తున్నట్లు నడుస్తూ , నవ్వుల పువ్వులు కురిపిస్తూ మాట్లాడుతూ, ఎన్నటికీ వాడని ఎర్ర గులాబి లా కనిపించే హెలెన్, ఆకస్మికంగా వాడి, కుంగి, విషాద మూర్తి కావటం, అతి నిర్మలమైన అనురాగ వాహిని ఆమె నరనరాల్లో అనంత జాహ్నవీ తరంగాల్లా పొంగటం నేను చూశాను.
    సృష్టిలో ఉద్భవించిన ఈ అనంత ప్రాణి కోటి అంతరాంతరాలళాలలో, ఎట్టి అనుభూతులు, ఎట్టి ఉద్వేగ పరంపరలు , ఆశలు , కాంక్షలు దాగి ఉన్నవో, ఎన్ని విషాద వీరచాలు , ఎన్ని సంతోష స్రవంతులు అంతర్వాహి నులై అజ్ఞాతంగా ప్రవహిస్తున్నవో ఏ అతీత వ్యక్తీ అంచనా కట్టగలడు? ఏ అపూర్వ శక్తి శోధించగలదు?
    సారధి కోసం కల్యాణి కంట తడి పెట్టటం నాకు తెలుసు. సారధి కోసం లింగరాజు కళ్ళు తుడుచుకోవటం నాకు తెలుసు. సారధి కోసం నా మనస్సెంత తపించిందో నాకు తెలుసు. ఇప్పుడు సారధి కోసం హెలెన్ కళ్ళల్లో పొంగిందేమిటో నాకు తెలుసు. అది కన్నీరు కాదు. హృదయం లోంచి పొంగి, కళ్ళ పైన చిమ్మిన ఉష్ణ రుధిరం.
    హెలెన్ మహా గబీర స్రవంతి లా కనిపించింది. తన జీవితాన్ని గురించి భర్తని గురించి , నాయుణ్ణి గురించి, తన జీవిత రంగంలో ప్రవేశించిన ఇతర వ్యక్తులను గురించి, తన వ్యధలని గురించి, సారధిని గురించి ఎన్నో సంగతులు చెప్పింది. ఆ చెప్పటం లో ఓ క్రమం లేదు. ఓ సందర్భం లేదు. చెప్పిన మాటలే అనేక సార్లు చెప్పింది. సారధి తనకి దక్కితే, తన సర్వస్వాన్నీ త్యాగం చేస్తానంది. ఆమె చెప్పిన మాటల్ని ఒక క్రమంలో అమర్చటానికి ప్రయత్నిస్తాను.
    బ్రతికున్న మనుష్యుల్ని గురించి అభిప్రాయాలు ఏర్పరచు కోవటం, అని శాశ్వతమైనవను కోవటం ఎంత తెలివి తక్కువో నా కర్ధమైంది. ప్రతి మనిషిలోనూ అంతర్గతంగా అజ్ఞాతంగా ఒకే ఒక అతీత స్వరూపం నిక్షిప్తమై ఉందనిపించింది. అఖండ మానవాళి ని , అనంత ప్రాణి కోటిని సృష్టి సర్వస్వాన్ని ఏకం చేసే మూల శక్తి అదే కావాలి. బి.ఏ చదువుతుండగా కాలేజీ మాగజైన్ లో మిత్రుడు విశ్వం వ్రాసిన 'వాసవదత్త' గుర్తుకి వచ్చింది. బౌద్ద భిక్షువు ఒకడు వచ్చి, వాసవ దత్త అనే జవ్వని సౌధం ముందు నిలబడి "భిక్షాం దేహి" అంటాడు.
    వీణ మీటుతున్న ఆ యౌవని ఆ స్వరం విని తడబడుతున్న కాళ్ళతో, వశం తప్పిన మేనుతో , తందరించు గుండెలతో ఆ బిక్షువు దగ్గిరికి వచ్చి భిక్ష వేయటానికి చేతులు చాస్తుంది. ఆ చేతుల్లో ఏమీ ఉండదు. "వట్టి చేతులు చాపినావు. ఏమివ్వాలని?' అని అడుగుతాడు భిక్షువు.
    వాసవ దత్త కోర్కెల ముద్ద అయి ఎర్రబడి , "ప్రభూ!ఇవ్వటానికి ఒకటేమిటి , నా సర్వస్వం నీముందుంచాను . రాజులు, రారాజులు రజితరత్న సువర్ణ రాసులు నా పాదాల ముందు నీరాజన ముంచినారు. రాజుల కాలదన్నితినిరా! పవళింతువు గాని రమ్మిదే! ఈ లేజవరాలి లేయేడదాయే ఒక మెత్తని పూల పాన్పు గా!" అంటుంది.
    భిక్షువు ఆమెను తిరస్కరించి, "అరిగేద మరల వత్తులే ఒయారమునిండిన నీదు మేడకున్" అంటూ వెళ్ళిపోతాడు.
    అదొక మధురమైన విషాద గాధ. జీవిత మధుభాండాన్ని కావాలని ముక్కలు చేసుకొని, జీవన మకరందాన్ని కింద పారబోసే శక్తి పరమ మూర్ఖులకు, మహా యోగులకు మాత్రమే ఉంటుంది.

                                                                15
    "బొంబాయి నుంచి తిరిగి వచ్చిన తరువాత సారధి అనేక సార్లు నాకోసం గుంటూరు వచ్చాడు. అతన్ని చూడకుండా నే బతకలేనేమో అనిపించేది. వారం వారం వచ్చేవాడు. వారానికి ఒకరోజు మాకు సెలవుంటుంది. ఆరోజు రమ్మనే దాన్ని. ఆరోజు మహా పర్వదినం లా రోజంతా క్షణం లా గడిచి పోయేది. ఇవాళ ఎందుకనో నా జీవితాన్నంతా నా బాధనంతా, బైటకు విసిరి పారేయాలని పిస్తుంది. నీకు ఓపిక ఉంటె చాలాసేపు చెబుతాను చాలా విషయాలు' అంటూ నా ముఖం లోకి సందేహం తో చూసింది హెలెన్.
    "చెప్పు, ఇవాళ అంతా ఇక్కడే ఉంటాను. నువ్వు చెప్పేదంతా వింటాను. నాకూ వినాలనిపిస్తుంది. బాధ ఆత్మీయులతో పంచుకుంటే ఎంత హాయి కలుగుతుందో నాకు తెలుసు" అన్నాను.
    హెలెన్ ప్రారంభించింది.
    "నేను మంచిదాన్ని కాదని నీకు వేరే చెప్పనవసరం లేదను కుంటా ఎందరో పురుషులు శరీరాన్ని పంకిలం చేసి, నరకం లో స్వర్గాన్ని వెతుక్కున్నారు. కాని నాకు స్వరం కూడా నరకం లా కనిపించేది; అనిపించేది. ఏమైనా , శరీరం నాకు సుఖాన్ని ఇవ్వలేదు. అందం ఉంది. అవయవ సౌష్టవం ఉంది. అనుభవించే అవకాశం ఉంది. అడ్డు పెట్టె వాళ్ళు లేరు. తాడు తెగిన గాలిపటం నా బ్రతుకు. రాలిన పువ్వు నా జీవితం. ఎప్పటి కైనా రాలిపోతుంది గాలి పటం. ఎప్పటి కైనా వాడిపోతుంది రాలిన పువ్వు. కాని నాకా అదృష్టం కూడా లేదు. ఏ శాపం నన్ను దాహిస్తున్నాడో , ఏ దుష్టశక్తి నన్ను పీడిస్తున్నదో నాకు తెలియటం లేదు. మన్మధుడి లాటి పురుషుడి కౌగిట్లో నులువేచ్చని కమ్మదనం నన్ను సుఖ పెట్టలేదు. కాల్చింది. శరీరంలో ఎక్కడ గాయముందో, మనస్సులో ఎక్కడ ఏ లోటుందో నాకు తెలియదు. కాలానికి లొంగి, లోకానికి లొంగి, పైశాచి కులకు లొంగి శరీరాన్ని అప్ప జెప్పెదాన్ని. ఎవరూ నాకు ఆనందాన్ని పంచి ఇవ్వలేదు. ఎవరి మీదా నాకు మమకారం ఏర్పడలేదు. కాని, సారధి ని చూసి నేను ఓడిపోయాను. లొంగిపోయాను. అతని కోసం నాకు సుఖాన్నివ్వని వల్ల మాలిన సంపదను కాలదన్నాను. అతనితో ఎక్కడికి రావటాని కైనా , ఏం చేయటాని కైనా , ఎలా బ్రతకటా నీకైనా సిద్దపడ్డాను. అతను నన్ను స్వీకరించలేక, తిరస్కరించలేక , రోజులు దోర్లిస్తున్నాడు.
    రోజురోజుకీ నాలో ప్రవేశించిన శూన్యం పెరుగి పెద్దదై, నా జీవితమంతా వ్యాపిస్తుంది. ఒంటరిగా బతకలేనని పించింది. గడ్డి పోచను చూసి పామని భయపడటం అలవాటై పోయింది. మనస్సు పాదరసం లా పరిగెత్తేది. ఎక్కడ వాలకూడదో అక్కడే వాలేవి ఆలోచనలు. ఏదో దిగులు, ఏదో బెంగ , వెలితి తడిగుడ్డను పిండినట్టు హృదయాన్ని పిండు తున్నాయి. నన్ను పెళ్లి చేసుకోమని సారధి ని అడిగాను. ఒప్పుకోలేదు. జవాబు చెప్పలేదు. ఆలోచిస్తా నన్నాడు. ఇది ఆలోచించవలసిన సమస్య కాదని చెప్పాను. మౌనంగా నవ్వేవాడు. ఒక వారం అతను రాలేదు. నేను ఎదురు చూసి చూసి విసిగి పోయాను. డ్రమ్ము వాయించినట్లు గుండెలు ప్రళయ వేగంతో కొట్టుకున్నాయి. ఆయన్ని చూడాలనిపించింది. అతని ఒళ్లో తల పెట్టి నా బరువంతా దించుకొని, ప్రశాంతంగా నిద్ర పోవాలని పించింది. దీన్ని నువ్వు పురుష వాంఛ అని నిర్వచిస్తే , ప్రపంచం భస్మమై పోతుంది. డానికి మించిన అనుబంధం అతని దగ్గిరికి నన్ను లాగింది.
    నేను ఆ సాయంత్రం బెజవాడ వెళ్లాను. అతను గదిలో చాప మీద సున్నాలా చుట్టుకొని పడుకొని ఉన్నాడు. నా కడుపు తరుక్కు పోయింది. నన్ను చూసి, నవ్వుతూ తలుపు తీసి లోపలికి రమ్మన్నాడు.
    సారధి పరమ భయంకరమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాడు.
    "గుంటూరు ఎందుకు రాలే దివాళ?' అని అడిగాను.
    "టికెట్ లేకుండా రైలేక్కితే జైల్లో పెడుతున్నారు" అంటూ నవ్వాడు మళ్ళీ.
    అలా అందరూ నవ్వలేరు.
    మృత్యువు ను జయించే శక్తి ఆ నవ్వులో ఉంది.
    హలాహలాన్ని అమృతం లా స్వీకరించే శక్తి ఆ నవ్వులో ఉంది.
    "అంటే?" అన్నాను అర్ధం కాక.
    "నేను బీదవాణ్ణి. డబ్బు దొరకలేదు గుంటూరు రావటానికి" అన్నాడు.
    ఆ విషయం తర్కించి ప్రయోజనం లేదని నాకు తెలుసు. ఒకరి సహాయాన్ని అంతగా అసహ్యించు కొనే సారధి మీద నాకు ఆ సమయంలో వర్ణించవీల్లెన్నంత చికాకు కలిగింది.
    "నువ్వేదో చెప్పాలని వచ్చావు కదూ?' అన్నాడు.
    నేను చెప్పాలనే వచ్చాను. ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను.
    "ఔను ,. నీకెలా తెలుసు?"
    "నీ మనస్సు నాకు తెలియకపోతే , ఇంకెవరి కి తెలుస్తుంది లోకంలో?'
    "నిన్నొక విషయం అడగాలను కుంటున్నాను ."
    "అడుగు."
    "నేను బ్రతికుండగా డబ్బు కోసం నువ్వెందుకు ఇబ్బంది పడాలి?"
    "నువ్వు అంత శ్రీమంతు రాలివా? నీ జీతమెంత?"
    "జీతం సంగతి ఎందుకులే. నాలాటి వాళ్లకు డబ్బు సంపాదించటానికి ఎన్ని మార్గాలు లేవు. ఈ దిక్కుమాలిన ప్రపంచంలో?"
    "నీ డబ్బు నా కవసరం లేదు హేల్లీ"
    సారధి నాకు పెట్టిన ముద్దు పేరు హెల్లీ.
    "నేనంత నీచు రాలినంటావా? నా డబ్బు అంటుకుంటేనే మీరు మైల పడిపోతారా?"
    సారదీ ఆర్ద్రంగా చూశాడు. నా ప్రశ్నకు ఆ చూపే సమాధానం చెప్పింది. అంతకంటే స్పష్టంగా భావాల్ని చెప్పే శక్తి ఏ భాషకీ లేదు. ఏ మాటల్లోనూ లేదు.
    'అందరిలా బ్రతికి, అందరిలా చచ్చిపోవాలని నాకు లేదు" అన్నాడు సారధి.
    "ఎలా బ్రతకాలనుంది? గాలిలోనా?"
    "ఎక్కడైనా కానీ, జీవిత రహస్యం కనుక్కుందామానుకుంటున్నాను. జీవితంలో పరిశోధనలు చేసి, చేసి ఏదో చెయ్యాలనుంది. ఇంకా నా ఆలోచనలు స్పష్టంగా లేవు."
    "ఏదన్నా మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకో."
    "నేనా?"
    "ఏం? ఇంకా నువ్వు ఉయ్యాలలో ఊగే బాలుడి వను కుంటున్నావా?"
    "నేను పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించు కున్నాను."
    "అందరూ అలాగే అంటారు. చివరికి గప్ చిప్ గా మూడు ముళ్ళూ వేసి సంసారుల్లో కలిసిపోతారు."
    'అందరిలాగే నేనూ అనుకుంటే ఏం చేసేది? నేను ఒక నిశ్చయానికి వచ్చాను. ఈ నిశ్చయం మార్చు కోవలసిన అవసరం లేదనుకుంటా. ఒకవేళ నేను పెళ్లి చేసుకోవటమే జరిగితే , ఎటువంటి పిల్లను చేసుకుంటానో నీకు తెలియదూ?"
    "అలా మాట్లాడకు, సారదీ. మాటలకి మెలికలు పెట్టకు. నా పరిస్థితి నీకర్ధం కానట్టు నటించకు."
    నా స్వరం జీరపోయింది. నా కళ్ళు చెమ్మగిల్లాయి.
    'ఏడవబోకు , హేల్లీ నిన్ను ఏడిపించటం నా ఉద్దేశం కాదు. నీలాగా నాకూ ఏడవాలని పిస్తుంది. మనస్సు లోని నరకాన్ని స్వర్గంగా మార్చే మంత్ర జలం కన్నీరు'  అంటూ సారధి నా దగ్గిరికి వచ్చి, మొదటిసారిగా నన్ను స్పృశించి తన రెండు చేతులతోనూ నా చెంపల్ని పట్టుకొని తల పై కెత్తి , "ఏడవకు, హేల్లీ... నేను నీకెందుకూ పనికి రాను. ఎందుకు నా మీద ఆశ పెట్టుకుంటావు? ఎందుకు కొరమాలిన మమతలు పెంచు కుంటావు? నిజం చెబుతున్నాను. నీకంటే ఆత్మీయులు నాకు లేరీ లోకంలో. నిన్ను మనః స్పూర్తిగా ప్రేమిస్తున్నాను." అన్నాడు.
    నా నరాల్లో నెత్తురు అమృత మైంది. శరీరం స్వర్గ మందిర మైంది. మనస్సు రెక్కలు కట్టుకొని భూమిని వదిలి వింగి కేగసింది.
    ఆకాశం లోంచి ఒక క్షణం భూమి మీదికి దిగి , అలోచించి "సారధి ప్రేమిస్తున్నాని నువ్వంటూన్నావు. నేను నమ్ముతున్నాను. కాని, మనం ఇంత దూరంగా ఉండటం న్యాయమా? నన్ను పెళ్లిచేసుకో నక్కర్లేదు. కాని, ఇద్దరం కలిసి బ్రతకటం నాక్కావాలి. నిన్ను సుఖ పెడతాను. నీ నీడలో నన్ను నిలవనీ , నీ సేవలో తరిస్తాను. నీ మాటలో సంగీతం వింటాను. నీ జీవితంలో నా జీవితాన్ని అనుభవిస్తాను. నీకోసం బ్రతుకుతాను . నీకోసం మరణిస్తాను. ఇవి ఉద్రేకంలో అంటున్న వ్యర్ధ భాషణలు కావు. ఇది నా హృదయాంతరాలలోంచి పొంగుతున్న నా జీవన సత్యం."
    "హేల్లీ! నీవేది అమూల్య మను కుంటున్నావో , దీన్ని వాంఛ నీయమను కుంటున్నావో, దేని కోసం తపిస్తున్నావో, అది నాకు నిస్తేజంగా, పేలవంగా అవాంఛ నీయంగా కనిపిస్తుంది. నీ మార్గం వేరు. నా మార్గం వేరు. ఇవి కలవాలని మనం ఎంత కోరిన , కాలం దాని పని చేసుకు పోతుంది. కన్నీటి విలవ కాలానికేం తెలుస్తుంది, హేల్లీ?"
    "సృష్టి సత్యాన్ని వదిలి నువ్వు బ్రతగ్గలవా , సారదీ? వదిలి ఏ ప్రాణీ జీవించ లేదు. మనమంతా రెక్కలు లేని పక్షులం. మనస్సు ఎగిరిందని, మనమూ ఎగిరితే , నెత్తురు కక్కుకుంటూ రాలి నశించి పోతాం!"
    "మృత్యువంటే నాకు భయం లేదు, హేల్లీ."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS