"తాగటం అలవాటు చేసుకున్న తరవాతనే నాకు ప్రపంచం లో సుఖం ఉన్నట్లు తోచింది. ఏదో స్వేచ్చ; ఈ లౌకిక బంధనాలన్నిటి ని తెంపేసుకున్నట్లుగా అనుభూతి! కాసేపు ఈ జగతిని మరిపించే అనుభవం. ఓహ్, నాకు జీవితం ఇప్పుడు నిండుగా అనిపిస్తున్నది."
రవి లేచి కూర్చున్నాడు.
"ఒంటరితనం దుర్బరమయింది. అమ్మా, నాన్నా ఇద్దరూ కాల గర్భంలో కలిసి పోయినప్పటికి నేను విచార పడలేదు. కానీ....నా చెల్లెలు ....నా ప్రాణం కంటే మిన్నగా చూసుకున్న నా చెల్లెల్ని ఆ దుర్మార్గుడు , కేవలం తాళి కట్టినంత మాత్రాన అధికారాన్ని చలాయించ వచ్చు అనుకున్న ఆ కాఠినుడు ఘోరంగా , దారుణంగా హింసిస్తుంటే నేను ఏమీ చేయలేక పోయాను." కైపు అతనికి బాగా ఎక్కింది. అయినప్పటికీ చెల్లెలు జ్ఞాపకం వచ్చి అతను చలించి పోవడమే గాకుండా ఆ మాటలంటూ నిజంగా ఏడవటం మొదలు పెట్టాడు.
రవి "ఛీ.....ఏమిటిది పసి పిల్లాడిలా?" అన్నాడు సురేంద్రను చూస్తూ. ఆ మాటతో సురేంద్ర ఇంకా భోరు మన్నాడు.
"నిజంగానే నా గుండెల్లోదాచుకున్న బాధ, ఆ హాలాహలం అగ్ని వలె దహిస్తున్నప్పటికి , నేను నా అనేవాడు దొరక్క ఇంతకాలం వెళ్ళబుచ్చుకోలేక పోయాను. చెప్పనీ, రవీ, నీముందు చెప్పనీ, నన్ను ఎడవనీ బాగా నేనింత కాలం పుక్కిట పట్టుకున్న దుఃఖాన్ని , విచారాన్నీ, అంతా వెళ్ళగక్కనీ! నేను తాగినా, కాన్శాన్స్ లోనే ఉన్నాను."
రవి నివ్వెరపోయి అతన్ని బెరుగ్గా చూడసాగాడు.
"సుమతి నీకు తెలుసుగా. చిన్నప్పుడు ఒక్క క్షణం కూడా నన్ను విడిచి ఉండేది కాదు. 'అన్నయ్యా, అన్నయ్యా అంటూ నా కాళ్ళ లోనే తిరిగేది. అదృష్టం కలిసి రాక ఆటగాణ్ణి ప్రేమించింది. అలా ప్రేమించానన్నప్పుడే నాకెందుకనో అతనంటే ఇష్టం లేక శతవిధాల ప్రయత్నించాను ఆమె మనస్సు మార్చాలని. కాని వినలేదు. పెళ్లి అయిన తరవాత ఆమె కష్టాలన్నీ సహిస్తూ ఒక్కసారి అయినా నాతొ చెప్పలేదు. అన్నీ మౌనంగానే భారిస్తుంటే , నాకు తెలియదను కుంది కాబోలు! అలాగే మౌనంగా ఆ దెబ్బ లన్నింటిని సహించి ప్రాణాల ర్పించింది. నా గుండెల్లో చిచ్చు రగిల్చింది. నాకెవరు న్నారు చెప్పు, రవీ? నాకెవరున్నారు?"
క్షణకాలం చిన్నప్పటి సుమతి రవి కళ్ళల్లో మెదిలి హృదయం బరువెక్కింది.
"అందుకనే నిన్ను చూడగానే నాకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. నా అన్నవారు లేకుండా వాడిపోయి శుష్కించిన జీవితాన్ని గడుపుతున్న నాకు నీవు కనపడే సరికి ఏమిటో చెప్పలేని ఆనందం కలిగింది. నిన్ను వదలలేనంతగా బంధం ఏర్పడింది. ఒంటరితనం పేరుకు పోయిన నా గదిలో నీవు మాట్లాడకుండా కూర్చున్నా చాలు! ఏదో తృప్తి. నాకు నా వాళ్లున్నారనేటువంటి శాంతి!' అతని కళ్ళల్లోని మెరుపు చూసి రవి నిజంగా ఆశ్చర్యపోయాడు.
:రవీ, నాకిలాంటి అలవాట్లున్నాయని దూరంగా పోతావా? నన్ను అసహ్యించు కున్నప్పటికి సరే రవీ, నన్ను వదిలి వెళ్ళబోకు. నేను ఇన్నాళ్ళ నుంచీ చాలా నిగ్రహంతో నీముందు బయటపడకుండా వచ్చాను. ఇవ్వాళ ఎప్పటి అలవాటుతో వాళ్ళు వచ్చి కూర్చుంటే నేను కాదన లేకపోయాను. నిగ్రహించుకోలేక పోయాను. రవీ, నన్ను క్షమించు.....నన్ను వదిలి వెళ్ళబోకు" అతను రవిని గట్టిగా పట్టుకొని తూలుతూ పిచ్చిగా పేలడం మొదలు పెట్టాడు.
"నిన్ను వదిలి వెళతానని ఎప్పుదన్నాను? ఎందుకలా చిన్న పిల్లవాడిలా ప్రవర్తిస్తావు? మాట్లాడకుండా పడుకో." రవి అతన్ని ఓదారుస్తున్న ధోరణిలో అన్నాడు.
సురేంద్ర నాలిక మడత పడి మాటలు స్పష్టంగా రావడం లేదు. ఏదో వాగుతూ "చెల్లీ, చెల్లీ" అంటూ దిండు గుండెలకు ఆనించుకొని పక్క మీదికి ఒరిగాడు.
రవి నెమ్మదిగా అక్కడి నించి లేచి బయట గదిలోకి వెళ్లి పక్క పరుచు కున్నాడు. కాని నిద్ర పట్టలేదు. ఏమీ తోచక కిటికీ దగ్గిరికి వెళ్లి ఆకాశం లోని నక్షత్రాలను చూడసాగాడు. తనలో ఉన్న లెక్కకు మించిన సమస్యల్లాగ నక్షత్రాలు ఆకాశంలో మినుకు మినుకు మంటున్నాయి.
* * * *
రవిచంద్ర లేచిన చాలాసేపటికి సురేంద్ర లేచాడు. రవి సూటిగా చూడలేక మాటిమాటికి పని ఉన్న వాడిలా లోపలి నించి బయటకు , బయట నుంచి లోపలకు తిరగసాగాడు.
టీ తాగిన తరవాత ఇహ నిగ్రహించుకోలేక రవి వద్దకు వచ్చి అన్నాడు. "రాత్రి నేను చాలా గొడవ చేసినట్లుంది కదూ?' అని.
"ఆ సంగతి నీకే తెలియాలి .' చిరునవ్వుతో రవి జవాబిచ్చాడు.
మ్లాన వదనంతో "కొంచెం ఎక్కువయినట్లుంది. ఏదన్నా పిచ్చిగా వాగానా?' ఆత్రంగా అడిగాడు.
'అలాంటిదేమీ లేదు. ధన్ వట్ రంగ్ మందిర్ లో బదులు నా ముందు ఇంకో సీన్ యాక్ట్ చేశావు. అంతే!"
తెచ్చిపెట్టుకున్న నవ్వుతో సురేంద్ర ఇంకేమీ మాట్లాడలేక పోయాడు. రవి ఏదో చదువుకుంటూ కూర్చున్నాడు.
చాలాసేపటి వరకూ ఏదో చెప్పాలని పదేపదే ప్రయత్నం చేశాడు. కాని ఏమీ అనలేక పోయాడు. తరవాత నెమ్మదిగా రవిని చూస్తూ సురేంద్ర మొదలు పెట్టాడు.
"రాజగోపాలం గారికి నీవంటే చాలా మంచి అభిప్రాయం ఉంది. అదెలా ఏర్పడిందో తెలియదు గాని, నేనెప్పుడన్నా కనబడితే నిన్ను గురించే చాలా ఎక్కువగా మాట్లాడుతుంటారు."
ఈ అప్రస్తుతపు ప్రసంగానికి రవి కొంచెం విస్మయం చెంది పుస్తకం పక్కన పెట్టి వినసాగాడు.
"తప్పకుండా నీవేదో చేయగలవని, చేస్తావని ఆయనకు నమ్మకం ఉంది."
రవి నవ్వుతూ , "నా కర్ధం కాలేదు. ఏం చేస్తానని? ఇదివరకు చేసిన గొప్ప పని లాంటిదే ఇంకేదన్నా చేస్తానని నమ్మకం ఉందా?' అన్నాడు.
"ఛ, ఛ . అలా కాదు. నిజంగానే చెబుతున్నాను. అయన ఉద్దేశ్యం లో నీవేదన్నా పరీక్షకు కూర్చుంటే బాగుంటుందని , ఆ వ్యాపకం తో అన్నిటిని మరిచి పోవచ్చని నాకు అనిపించింది."
రవి ఆలోచిస్తూ అతన్ని చూడసాగాడు.
"నీ వయస్సు కూడా ఎక్కువేమీ కాదు. ఆ పరీక్ష ను గురించి మేము ఇద్దరమూ ఆలోచించాము కూడా. అంతకంటే మంచి పని నాకేమీ తోచటం లేదు."
"చూడబోతే నేను బరువయినట్లయింది . ఇలా మాట్లాడుతున్నారు."
"రవీ!" ఆర్ద్రంగా సురేంద్ర పిలిచిన పిలుపుతో రవి ఒళ్ళు జలదరించింది.
"కలలో కూడా నీవు అలా ఊహించడం సహించలేను. ఏ పరిస్థితుల్లో నీవు వచ్చావో నాకు తెలుసు. అవి నీకు వ్యక్తిగతంగా విచారాన్ని, దుఃఖాన్ని తెచ్చి పెట్టినప్పటికీ. అప్పుడప్పుడు నావరకు అవి మేలు చేకూర్చాయని పిస్తుంటుంది. లేకపోయినట్లయితే ఈ నాగపూర్ లాంటి ప్రదేశానికి నీవు వచ్చే వాడివా? ముఖం వాచీ ఉన్న నాకు నీలాంటి అప్తుడి సహచర్యం లభించేదా? నీవు ఆవిధంగా ఊహిస్తే మాత్రం నేను నీకేమీ చెప్పదలుచు కోలేదు" అని లేవబోయాడు.
రవి నవ్వుతూ "కూర్చోరా. ఇంత మాత్రానికే తీవ్రంగా అయిపోతే ఎలా?" అన్నాడు.
అప్పుడు గాని సురేంద్ర తేలిగ్గా గాలి పీల్చుకొని అనలేదు. "నీవు ఐ.ఎ.యస్ పరీక్ష కు కూర్చోవాలి రా!" కంఠస్వరంలో ఆప్యాయతతో కూడుకొన్న అధికారం ధ్వనించింది.
షాక్ తిన్నట్టు వెనక్కి తిరిగాడు రవి.
"నీకు ఏమైనా పిచ్చి ఎక్కిందా? నేనేమిటి ఐ.ఎ.ఎస్ కు కూర్చోవడమేమిటి?"
"నాకు కాదు పిచ్చి ఎక్కింది , నీకు! నీకు ఏమి తక్కువని అలా అనుకుంటున్నావు? క్వాలిఫికేషన్ ఉంది. ప్రస్తుత తెలివితేటలూ గలవాడివి. ప్రయత్నం చేస్తే నష్టమేమిటి?"
"నీ ధోరణి నాకేమీ అర్ధం కావడంలేదు. ఈ తెలివి తక్కువ సలహా నీకేవడిచ్చాడు?"
"నీవేమన్నా అనుకో. సలహా ఇచ్చినవారు తెలివి తక్కువ వారు మాత్రం కారు. నీవేదో ఐ.ఎ.యస్ అయి, మమ్మల్ని ఉద్దరిస్తావని కాదోయ్! ఆ వ్యాపకం లో ఇవన్నీ మరిచి పోతావని. పరీక్ష అయ్యావా, అది నీ అదృష్టం. కాకపోయినా నష్టం లేదు. పరీక్షకు కూర్చున్నా నాన్న సంతృప్తి అన్నా మిగులుతుంది. నీవేమన్నా అనుకో, నీవు ఐ.ఎ.యస్. కు కూర్చోక తప్పదు."
విభ్రాంతుడై రవి అతణ్ణి చూడడం మినహా ఏమీ చేయలేకపోయాడు.
"నీవు ఎందుకు సందేహిస్తున్నావో నా కర్ధం కావడం లేదు. పుస్తకాల పురుగువు, ఆమాత్రం చాలెంజి జీవితంలో తీసుకోలేవా? నాకు క్వాలిఫికేషన్ లేదు కానీ ఉంటేనా సరదాగా నైనా ఇచ్చి ఉండేవాణ్ణి."
ఆ మాటలకు రవి నవ్వుతూ, "ఎడ్చావ్ లే , రాసిన పరీక్షలు ప్యాసయి అఘోరించి నట్లు!"
"అదే నే చెప్పేది. పరీక్షలు పాసయ్యే హాబీ నాకు లేదు. పరీక్షలు కూర్చోవడం వరకే! అలా నీవు ఎందుకు చేయకూడదు?"
"పరీక్షకు కూర్చున్నప్పుడు పాసు కాకపొతే నాకు ఎలానో ఉంటుంది."
"రవీ, నీవు తప్పకుండా పాసవుతావు. చదవడం మాత్రం నీవు చేయి. మిగతాది నేను చేస్తాను. ప్లీజ్'."
రవి ఏం మాట్లాడలేకపోయాడు. అతని చేతులను సురేంద్ర ఆప్యాయంగా టచ్ చేస్తూ కొంచెం బొంగురు పోయిన కంఠం తో అన్నాడు : "వచ్చినప్పటి కంటే ఇప్పుడు ఫర్వాలేదు కాని, నీవు ఇంకా ఆ సంఘటనను గురించి ఆలోచించడం మానుకోలేదు. నీవు పూర్తిగా ఆ విషయాన్ని మరిచిపోవాలి. నీవు మళ్ళీ మామూలుగా తయారవ్వాలి."
రవికి టక్కున రాజగోపాలం ఒకనాడన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి. సురేంద్ర అంటుంటే.
వీళ్ళకెందుకు తనంటే ఇంత అపేక్ష? అతనికి జవాబు దొరకలేదు కాని ' ఆరాత్రి' ఒక్కసారి అతని మనః ఫలకం లో మెరిసింది. ఒక్క క్షణం ఆ బాధ , ఆ ఆవేదన, ఆ సంక్షోభం , ఆ పరిస్థితులన్నీ గిర్రున కళ్ళ ముందు తిరిగాయి.
భవిష్యత్తు భయంకరంగా వెక్కిరించింది.
గతం మళ్ళీ ఎదగసాగింది. వేయి మూగ గొంతుకలు లక్ష మూగ బోయిన వీణలు ఆతన్ని వెక్కిరిస్తూ వికటాట్టహాసం చేసినట్లనిపించాయి. తను ఆ వలయం నుంచి తప్పించు కోవాలి. జ్ఞాపకం అనే ఆ సుడిగుండం నుంచి తప్పించుకోవాలి. ఎలా? ఎలా?
"నేను పరీక్ష ఇస్తాను. నన్ను నేను మరిచి పోవడాని కైనా పరీక్ష ఇస్తాను, సూరీ" ఏదో లోకంలో నుంచి చెబుతున్నవాడిలా నీరసంగా అన్నాడు రవిచంద్ర మాటలను.
సురేంద్ర రవిచంద్ర ఏ పరిస్థితులలో ఉన్నాడో కూడా చూడకుండా అమాంతంగా కౌగలించుకొని ఊపిరి సలపనీయకుండా "థాంక్స్" అని బిగ్గరగా అరిచాడు.
