Previous Page Next Page 
బ్రతుకు బాట పేజి 16


    'నువ్వే ఇల్లా అనుకుంటే, పైనలియర్ స్టూడెంట్ ని నేనెలా అనుకోవాలి!' అన్నది కుముదిని.
    'నీకు చదువు ఒక్కటే లోకం. నాకు అలా కాదు. ఎన్నో పన్ల మధ్య చదువొక్కటే ఆశా దీపం ' అంటుంది సుమిత్ర.
    'ఒక పని చేద్దాం సుమిత్రా! మా ప్రొఫెసర్ గారు చాలా మంచివారు. ఇంటి దగ్గర ఏదైనా అడిగితె చెప్పకుండా వుండరు. అయన దగ్గర చాలా రిఫరెన్స్  బుక్స్ వుంటాయి. నీకు హెల్ప్ చేస్తారు. ఆయన్ని పరిచయం చేస్తాను -- నాతొ ఒక రోజు రాకూడదూ?' అన్నది కుముదిని.
    మహా ప్రవాహం లో కొట్టుకుపోయే వాడిని నావ వెతుక్కుంటూ వచ్చినప్పుడు కలిగే సంతోషం కలిగింది సుమిత్రకి.
    'కష్టపడి చదువుకునే ఆడపిల్ల లంటే ఆయనకి చాలా యిష్టం -- అయన పిల్లలంతా మంచి చదువుల్లో వున్నారు. అన్నది కుముదిని.
    ఆమె అన్నట్లు ప్రొఫెసర్ కరుణాకరం చాలా మంచివాడు. వయస్సుతో పాటు హృదయాన్ని, విశాలమూ, మెదడును విజ్ఞాన సుసంపన్న మూ చేసుకున్న జ్ఞాన వృద్దుడు. పేరుకు తగ్గ ప్రవర్తన.
    'కుముదం చాలా మంచి పిల్ల. మీరు కూడా నాకెంతో నచ్చారు!' అన్నాడాయన.
    'రోజుకి రెండు మూడు గంటలు ఏకాగ్రతతో చదవండి. తప్పకుండా పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటారు. బెనారస్ లో మా స్నేహితులు చాలామంది వున్నారు. నేను ఉత్తరం వ్రాసిస్తాను. వాళ్ళు మీకు అక్కడ ఏర్పాట్లన్నీ చూస్తారు -- తప్పకుండా చదవండి.' అని ప్రోత్సహించాడు అయన.
    సుమిత్ర ఉత్సాహం రెట్టింపైంది. ఏది ఏమైనా చదివి తీరాలని నిర్ణయించుకుంది.
    ప్రీవియస్ క్లాసు లో తను వ్రాసుకున్న నోట్సు లూ, కొనుక్కున్న పుస్తకాలు సుమిత్ర కిచ్చింది కుముదిని.
    "ప్రొఫెసర్ గారి దగ్గరకు ఎక్కువగా వెడుతూ వుండు సుమిత్రా! ఆయనేమీ అనుకోరు-- నీకే పుస్తకం కావాలన్నా యిస్తారు' అని మరీ మరీ చెప్పింది సుమిత్రకి....సుమిత్ర అక్కడికి వెళ్ళినప్పుడల్లా కుముదినీ వచ్చేది. కానీ త్వరగా అక్కడ నుంచీ బయలుదేరేది కాదు. వాకిట్లో నీలం రంగు కారు ఆగడం ప్రొఫెసర్ పెద్ద కొడుకు డాక్టర్ శివరాం లోపలికి రావడం , కుముదిని ని పలకరించడం జరిగితేనే కానీ కుముదిని కదిలేది కాదు. అతనితో మాట్లాడే టప్పుడు ఆమె ముఖంలో వెలిగే కళా కాంతుల ను పరిశీలిస్తూ కూర్చునేది సుమిత్రా!
    'డాక్టర్ శివరాం గురించి నీ ఉద్దేశ్యం ఏమిటి!' అనడిగేసింది ఓరోజు స్నేహితురాలిని.
    'ఆయనంటే నాకు చాలా యిష్టం. ఆయనకీ నేను నచ్చాను. ఫైనల్ పరీక్షలయ్యాక మేము వివాహం చేసుకుంటాం -- ఎలాంటి పరిస్థితులేదురైనా సరే! కొడుకు మాట ప్రొఫెసర్ కాదనరు. అన్నది కుముదిని వెంటనే.
    'ఇన్నాళ్ళూ చెప్పావు కాదే! గడుసు దానివి!'
    'ఇన్నాళ్ళూ అతనిపై నాకు గల యిష్టానికి కారణమూ, అర్ధమూ తెలుసుకునే ప్రయత్నం నేను చెయ్యలేదు. ఈ మధ్యనే ఈ నిర్ణయానికి వచ్చాం --'
    'మరి మీ బావ మాటో! అతన్ని చేసుకోనంటే నాన్నగారు బాధపడరా?'
    'ఈ రోజుల్లో బోలెడు కట్నం పోయనిదె ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కావడం లేదు. బావకిచ్చిన డబ్బు నా పెళ్ళికి కట్నం యిచ్చినట్లు సమాధానం చెప్పుకునే శక్తి నాన్నగారి కుంది సుమిత్రా! ఒక యువకుడికి విద్యాదానం చేశాననే సంతృప్తి అయినా ఆయనకి మిగులుతుంది. ఈ విషయం గురించి ఇప్పుడు మేమెవరమూ విచారించడం లేదు.' అనేసింది కుముదిని. అల్లా అన్నప్పుడు ఆ అమ్మాయి ముఖంలో గంబీర్యం తప్ప మరే భావమూ లేదు --
    'ఇన్నాళ్ళ కి నీ సమస్య కి పరిష్కారం దొరికింది. చాలా సంతోషం కుముదినీ!' అన్నది సుమిత్ర.
    'ధైర్యమూ, చొరవ లేని వాళ్ళెవరూ జీవితంలో సుఖపడరు అనే సత్యం తెలుసుకున్నాను సుమిత్రా! ప్రొఫెసర్ గారి భార్య ఎవరో నీకు తెలుసా? ఆవిడ ముస్లీం స్త్రీ ! ఆ కాలంలో బంధువులనూ, స్నేహితులనూ అందరినీ ధిక్కరించి ఆమెను చేపట్టారు అయన...అందువలన అయన గౌరవం తగ్గిందా! అందుకే దేనికైనా ధైర్యం వుండాలి. చొరవ వుండాలి. పదివేల డబ్బు కోసం జీవితం అంతా దుఃఖ పడగలమా ?' అన్నది కుముదిని. 
    
      'మా చిన్నన్నయ్యది కూడా ఇదే సిద్దాంతం. అందుకే వాడి జీవితం పూల బాట అయింది. నువ్వూ అలాగే వుంటావు కుముదినీ!' అన్నది సుమిత్ర స్నేహితురాలి భుజం తట్టి.
    'నీకూ నేనొక సలహా చెబుతాను విను -- ఎందుకొచ్చిన బాధ్యతలన్నీ నెత్తిన వేసుకుంటావు -- హాయిగా ఎవర్నైనా పెళ్లి చేసుకుని నీడ పట్టున వుండకూడదూ?'
    'బావుంది -- ఇందులో . ఏ బాధ్యతా ఏరికోరి నేను భుజాన వేసుకోలేదు. వాటంతటవే వచ్చి నామీద పడుతున్నాయి. కానీ లెమ్మని మోస్తున్నాను-- పెళ్లి చేసుకుంటే నన్నెవ్వరూ వద్దనరు-- కానీ, ఎం.ఏ, ప్యాసయ్యే దాకా పెళ్లి చేసుకోడం నాకిష్టం లేదు కుముదినీ -- ఈ ఉద్యోగం నేను చెయ్యలేకుండా వున్నాను. లెక్చరర్ గా చేరిపోతే హాయిగా వుంటుంది. జీవితంలో సెటిల్ అయినట్లే లెక్క -- వీలున్నంత వరకూ సంపాదించడం మానుకొను గదా పెళ్ళైనా!' అన్నది సుమిత్ర దూరంగా చూస్తూ, ఆలోచన నిండిన కళ్ళతో.
    'నీ కోర్కెలన్నీ నెరవేరే సరికి ముసలి దానివై పోతావు!' అని నవ్వింది కుముదిని.
    'పోనిద్దూ -- నాకోసం వేచి వుండే వాళ్ళూ-- నాతొ పాటే వృద్దు లౌతారుగా!' అన్నది సుమిత్ర . అప్పుడే ఆకాశంలో మొలిచిన నక్షత్రాలను చూసి నవ్వుకుంటూ.
    
                                      *    *    *    *
    ఆదివారం అంటే ఊపిరి తీసుకునే రోజు అనే నిర్వచనం చెబుతారు ఉద్యోగినులు.
    తలంటు పోసుకున్న జుత్తు ఆరబెట్టుకుంటూ కొలీగ్ కల్యాణి తో మాట్లాడుతూ కూర్చుంది సుమిత్ర.
    అక్క కొడుకు కృష్ణమూర్తి స్నేహితుడి గదికి వెళ్ళాడు చదువుకోడానికి. బసవరాజు ఇంటికి భోజనానికి వస్తానని మాట యిచ్చిన సుమిత్ర వంట చెయ్యకుండానే కల్యాణి తో కబుర్లు చెబుతూ కూర్చుంది.
    కిటికీలో నుంచి సున్నితమైన తెల్లని ఎండ లోపలికి వస్తుంది.
    పది కావస్తూన్న కల్యాణి కదల పోవడం చూసి ఆశ్చర్య పడింది.
    'మీ అయన ఊళ్ళో లేరా ఏం?' అన్నది.
    'ఉన్నారు. ఆయన ప్రపంచం ఆయనది-- అయన స్నేహితులతో మార్నింగ్ షో కి వెడతారు. ఎవరైనా బలవంతం చేస్తే అక్కడే ఏ హోటల్లో నో భోం చేస్తారు -- ఎప్పటికో ఇంటికి చేరుకుంటారు -- ' నీరసంగా చెప్పింది కళ్యాణి.
    'బావుంది మీ వరస -- అయితే మీ వక్కరి కోసం వండు కోరన్న మాట -- ఇల్లా పస్తుండి ఉద్యోగం చెయ్యడం దేనికి కల్యాణీ -- ఆస్తీ వుంది-- మీవారికి మంచి ఉద్యోగమూ వుంది -- ' అన్నది సుమిత్ర.
    'కాలం ఎలా గడవాలి సుమిత్రా! ఒక్క దాన్ని ఇంటి దగ్గర కూర్చుని ఏం చెయ్యను? ఆఫీసు వున్న రోజున నాకు హాయిగా వుంటుంది-- నాదంతా ఒక గొడవ -- చెబితే తీరేది కాదు -- అదంతా చెప్పి విసిగించడం ఎందుకు?'
    'విసుగెం లేదు కల్యాణీ! వూరికే అన్నాను. రండి కాఫీ చేసుకుందాం. నన్ను భోజనానికి పిలిచి వుండకపోతే ఇవాళ మిమ్మల్ని భోజనానికి వుండ మనేదాన్ని --' అన్నది సుమిత్ర.
    'ఇంటిదగ్గర ఒక్కదాన్నీ ఎంతసేపు కూర్చున్నా కాలం తరగదు-- ఆప్యాయంగా పిలిచి పలకరించే వాళ్ళంటే నాకు ఇష్టం ' అన్నది కల్యాణి.
    'అవును మనసులో మాట చెప్పుకోడానికి మన సుఖ సంతోషాలు పంచుకోడానికి కష్టాలు తెలుసుకోడానికి స్నేహితులుండాలంటారు -- అందుకే.'
    'స్నేహితులంటే నాకు చాలా యిష్టం-- ఆపద సమయంలో మనకి చల్లని మాటలతో ఓదార్చే శక్తి వాళ్ళోక్కరికే వుంటుంది' అన్నది మళ్ళీ కల్యాణి.
    'అపదలనేవి కొన్ని నిజంగా వుంటాయి -- కొన్ని మనం కల్పించుకోడాన్ని బట్టి వుంటాయి. తినడాని కింత తిండి, కట్టుకోడానికి బట్ట, వుండడానికోక ఇల్లూ లేక నిత్య జీవితం పెద్ద సమస్యగా పీడిస్తున్న వాళ్ళే ఆపదలను లెక్క చెయ్యక జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొంటున్నప్పుడు, పైవన్నీ వున్న మనం చిన్న చిన్న సమస్యలకి అపదలనే పెద్ద పేర్లు అంట గట్టడం హాస్యాస్పదంగా వుంటుంది.' అన్నది సుమిత్ర , కల్యాణి చేతికి కాఫీ కప్పు ఇస్తూ.
    'ఎవరి సమస్యలు వాళ్లకి క్లిష్టం గానే కనబడతాయి కదా!' అన్నది కల్యాణి.
    'కనబడతాయి . అలాంటప్పుడు మనకన్నా ఎక్కువ సమస్యలతో సతమతమయ్యే వాళ్ళని చూసి మనం సంతోషపడాలి --'
    'మీరు చెప్పేది నాకు ఆన్వయించదు లెండి' అనేసి మౌనం దాల్చింది కల్యాణి.
    సుమిత్ర నవ్వుకుంది.
    'మావారు ఒక్కొక్కరోజు ఫ్రెండ్స్ తో కలిసి బార్ కి వెడతారు. అక్కడ నుంచీ హోటల్ కి వెళ్లి మాంసాహారం తింటారు. నృత్య సంగీతాలు చూస్తారు. రాత్రి పన్నెండింటి కి ఇంటికి వచ్చి తెగ నిద్ర పోతారు. ఉదయం నేను ఆఫీసు కి వెళ్ళే దాకా లెవరు. నిజం చెప్పండి. ఇది మీరు భరించగలరా?!' అన్నది కల్యాణి మరి కాసేపాగి.
    'ఎవరైనా అలాంటి స్థితి భరించడం కష్టమే కల్యాణి కాదనను -- కాని అటువంటి పరిస్థితి వలన మనని మనం ఒడార్చుకుంటూ , సానుభూతి కురిపించు కుంటూ వుండే కన్నా, దాన్ని మార్చడానికి కెందుకు ప్రయత్నించ కూడదు అని ణా వాదన!' అన్నది సుమిత్ర. వాకిట్లో రిక్షా ఆగిన చప్పుడుకి ఉలిక్కిపడి అటు తిరిగింది కల్యాణి.  
    తరువాత సుమిత్ర వంక ప్రశ్నార్ధకంగా చూసింది.
    నీలం చీరే కి ఎర్ర పమిట కొంగు!
    ఆవిడ బసవరాజు చెల్లెలూ కాదు, కుముదిని అంత కన్నా కాదు!
    గుమ్మం దగ్గరికి వచ్చి చూసింది! ఆశ్చర్యంతో కళ్ళు నులుముకుని మరీ చూసింది!
    ఆవిడ సాక్షాత్తూ ఇందుమతీ దేవి. ప్రక్కన సావిత్రి . పెట్టె, బెడ్డింగ్.
    'అదేమిటోదినా! ఉత్తరం వ్రాస్తే స్టేషను కి రానూ?' నొచ్చుకుంటూ ఎదురు వెళ్లి చేతిలో పెట్టె అందుకుంది సుమిత్ర.
    'రాయలేకపోయాను సుమిత్రా! ఇల్లు కనుక్కోడం ఏమంత కష్టం కాలేదులే -- అనుకోకుండా బయలుదేరాం!' అంటూ లోపలికి వచ్చింది ఇందుమతి.
    సావిత్రి ముఖం నీరసంగా, పాలిపోయినట్లు వుంది.
    'రా! సావిత్రీ , అలా బిడియ పడతా వెందుకూ? మంచినీళ్ళు త్రాగు!' అని మేనకోడలి వైపు కుర్చీ జరిపింది సుమిత్ర.
    మంచి నీళ్ళ గ్లాసు అందుకుంటూన్నప్పుడు ఆ అమ్మాయి కళ్ళ నిండా నీళ్ళు తిరగడం గమనించింది సుమిత్ర.
    ఎప్పుడూ ఉత్సాహంగా మిలమిల మెరిసే సావిత్రి కళ్ళు వాలిపోయి వున్నాయి. వదిన కూడా తల వంచుకుని కూర్చుంది.
    'చిట్టినీ తీసుకు రాలేదేం వొదినా!' అన్నది సుమిత్ర, వదిన భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా.
    'దీన్నీ తీసుకు వచ్చానుగా!' అన్నది ఆవిడ విరక్తిగా.
    ఎదుట వున్న పరాయి వ్యక్తీ మూలంగా ఏదో చెప్పడానికి ఆవిడ సంశయిస్తున్నదని గ్రహించింది సుమిత్ర.
    'ఇవ్వాళ నా ప్రోగ్రాం కాన్సిల్ అయింది కనుక మీరు మా ఇంట భోజనానికుండండి  కల్యాణి=-- ప్లీజ్-!'
    కళ్యాణికి బ్రతిమిలాడింది సుమిత్ర.
    అటువంటి ఆహ్వానం కోసం పరితపిస్తున్న కల్యాణి వెంటనే వోప్పుకుంది.
    స్టౌ లు రెండూ వెలిగించి వాటి మీద అన్నం, కూర పడేసి --
    ''ఇప్పుడే వస్తాను . ఇంటి వాళ్ళ దగ్గర ఫోను వుంది. ఫ్రెండు తో అర్జెంటుగా మాట్లాడాలి. అని, వెళ్ళింది సుమిత్ర.
    'చూశావా సావిత్రీ, ఉన్న ఒక్క గదినీ ఎంత పొందికగా సర్దుకుందో మీ అత్తయ్యా! మనిషి చూడు ఎంత తీరుగా వుంటుందో! పూర్వ జన్మ సంస్కారం అంటే ఇదే!' అన్నది ఇందుమతి వంట దగ్గర కూర్చుని సావిత్రితో.
    'ఆవిడ ఆఫీసులో కూడా చాలా కరెక్ట్ గా పని చేస్తారు. ఎవరితోనైనా నిర్మొహమాటంగా మాట్లాడతారు. కానీ ఒక్కొక్కసారి వెన్నలాగా కరిగిపోతారు. మొత్తానికి చాలా మంచివాడు' అన్నది కల్యాణి.
    'అవును-- మా సుమిత్ర చాలా బుద్ది మంతురాలు !' అని తల వంచుకుంది ఇందుమతి.
    'ఎవరోదినా అంత బుద్ది మంతురాలూ!' అంటూ గదిలోకి వచ్చింది సుమిత్ర....
    'పాపం! మీ ఫ్రెండ్ కి కోపం వచ్చింది కాబోలు మీ మీద! అన్నది కల్యాణి.
    'అలా కోపం వచ్చే మనిషి కాదు లెండి. ఇప్పటికి సంవత్సరం నుంచీ వాళ్ళింటికి రమ్మని పిలుస్తున్నారు. ఇవ్వాళ తప్పించుకోడానికి వీల్లేక పోయింది. ఇంతలో వదినోచ్చింది-- ఏం వదినా? వస్తూనే పొయ్యి దగ్గర కూర్చోకపోతే నన్ను చెయ్యనివ్వ కూడదూ?' అని వదిన ప్రక్కన కూర్చుంది సుమిత్ర.
    'వద్దులే సుమిత్రా! నువ్వు వెళ్ళు -- నేను త్వరగా చేసేస్తాను -- ' అని సుమిత్రని వెనక్కి నెట్టింది ఇందుమతి. సాయంత్రం ఆరు గంటల వరకూ కల్యాణి కదలలేదు. 'ఇంటిదగ్గర వంటరి తనాన్ని చూసి జడుసుకుంది కాబోలు పాపం!' అనుకుంది సుమిత్ర జాలిగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS