"ఉహూఁ ...... సరే పద, నేనూ వస్తా" నన్నాడు. "ఆ సముద్రం మనిద్దరిదీను" అన్నాడు.
మలుపు తిరిగి ...... "అదో మా ఇల్లు..... మా అమ్మని చూస్తారా! మరి?" అడిగింది పద్మ.
చకితుడయ్యాడు భాస్కరం.
"ఐ.సీ.! ఇల్లు దొరకడం, మీ అమ్మగారిని తీసుకురావడం అన్నీ అయ్యాయన్నమాట" అడుగులు తడబడ్డాడు. నుదుటి చెమట తుడుచుకున్నాడు.
"మరి నాకు దిక్కెవ్వరు?"
ఆమె నవ్వడానికి ప్రయత్నం చేసింది.
"ఛా! అదికాదు నా ఉద్దేశం.....సరే! రేపు వస్తాను....." భాస్కరం నిలబడిపోయాద్.....పద్మావతిని ముందుకు సాగిపొమ్మన్నట్లు.
అభిజాత్యమున్న ఆడపిల్ల నొచ్చుకుందికి ఎంత సేపు కావాలి? పద్మావతి తాచుపాములా వెళ్ళి పోయింది. అతని మాట వినడానికేనా ఆగలేదు.
భాస్కరం గట్టిగా అరుద్దామనుకున్నాడు "పద్మా" "పద్మా" అని ..... పెదాలు విడలేదు. రివ్వున పరుగెడదా మనుకున్నాడు కాళ్ళు కదల్లేదు. యాంత్రికంగా వెనుదిరిగి వెళ్ళిపోయాడు. అలాగే నేరుగా బస్సెక్కి 'రూమ్' కి వెళ్ళిపోయాడు.
'గది'కి వెళ్ళి పిన్నికి తన ప్రేమగాధ యావత్తు పూసగుచ్చినట్లు రాయాలనుకున్నాడు. కాని శ్రీకారం దగ్గరే పది పదిహేను కాయితాలు చింపేసి ఆ కార్యం విరమించుకున్నాడు.
ఇక లాభంలేదు. సురేఖను కల్సుకుని తాను ప్రస్తుతం ఇరుక్కున్న చిక్కు పరిస్థితులను విడమర్చి చెప్పి ఆమె సహాయం కోరాలనుకున్నాడు.
మర్నాడు క్లాసులకు వెళ్ళాడే గాని తను సురేఖను ఎలా కలుసుకోడం ఎలాగ? ఈ విషయమంతా ఆమెకు చెప్పడం అనే ఆలోచనలే అతని బుర్ర నిండా ఆందోళనలు రేపేయి.
సురేఖ ఏమంటుంది?
"ఒకవేళ ఇదంతా "దగాకోరు" వ్యవహారం.....నేను నీతో ఏకీభవించను" అని కోపంగా ధనమ్మ వద్దకు పోయి ఈ వైనమంతా చెబుతుందేమో..?
"అహఁ ! ఆ పిల్ల సంస్కారం మంచిది" అనుకున్నాడు తనని తానే ఓదార్చుకుంటున్నట్లు భాస్కరం.
కాని ఈ విషయంలో ఆమె తన కోర్కెను మన్నించడానికి, సురేఖలోని సంస్కారానికి సంబంధ మేమిటి? అనే ప్రశ్న ఎదురవడంతో ఈ ఆలోచనలన్నీ నీరుగారి పోయాయి.
సురేఖకూ అహంకార ముంటుంది. పైగా ఆమెలో దర్పమున్నదన్న విషయం తొలిసారి ఆమెను చూసినప్పుడే భాస్కరం అనుకున్నమాట.
"హే! భగవాన్!"

24
"పోస్ట్!" ఒక ఉత్తరం అందించాడు పోస్టుమాన్. కవరు అటూ ఇటూ తిప్పి చూసుకున్నాడు భాస్కరం.
"ఇంటి దగ్గర్నుంచి" అనుకుంటూ చింపేడు.
పిన్ని రాసింది. వసంత దస్తూరీలో ఉంది. ఉత్తరం. పిన్ని స్వయంగా ఉత్తరాలు భాస్కరానికి రాయదు. "నేనేం ఇంగిలీషు చదువులు చదవ లేదు. నీ చెల్లిని పంపించావుగా ఒళ్లోకి. దాని చేత రాయిస్తాను" అంటుంది. తన కొడుకు తానురాసే తప్పులను ఒకవేళ ఉంటే గమనించడం ఆమెకు యిష్టంలేదు.
"భాసడెంత చదివినా నాలోని తప్పులు పట్టడానికికాదు" అన్నది ఆమె నమ్మకం.
"చిరంజీవి భాస్కరానికి అమ్మ ఆశీర్వచనములు. ఇక్కడంతా క్షేమం. మీ నాన్నగారు ఆరోగ్యముగా కోర్టు కచేరీ పనులు చూసుకుంటున్నారు. చిరంజీవులు సరళా బాబూ బుద్దిగా ఉన్నారు. అన్నయ్యను చూస్తా మంటున్నారు. చిరంజీవి వసంత వీణ పాఠాలు నేర్చుకుని వస్తున్నది. అది కూడా అన్నయ్యను చూడాలని ఉందని అంటున్నది. వీలైతే ఒకమారు వచ్చి నన్నూ పిల్లలను చూసివెళ్ళ వలెను. నీకు అక్కడి భోజనము సదుపాయము బాగులేదేమో. ఆరోగ్యం జాగ్రత్త.."
ఇలా అన్ని సంగతులు రాసిన తర్వాత పిన్ని ఎట్టకెలకు నాలుగో పేజీలో అసలు సంగతి రాసింది-
"నీకు పై ఏడాది వివాహానికి సమ్మతమేనన్న మాటను ధనమ్మగారి చాత రాఘవేంద్రం వియ్యం కుడుగారు ఒప్పించారుట! వసంతకు మనం అనుకున్న లాంఛనాలకు సమ్మంధం ఖాయ పర్చుకోమని ధనమ్మగారన్నదట. అంచాత నువ్వు వసంత పెళ్ళి స్థిరపర్చుకోమని రాస్తే ముహూర్తం పెట్టించుకోవచ్చును. నీ వివాహ విషయంలో ఇంక నీకు పదేపదే చెప్పలేకుండా ఉన్నాను. చి|| సురేఖ నాకు మీ నాన్నగారికి నచ్చింది. గ్రహించు-ఆరోగ్యం ఆలోచనలతో పాడుచేసుకోకు-నాకు బెంగగా ఉంటుంది. కట్నం నువ్వు వద్దన్నా సమ్మతమే కాని ఆలోచించు......"
- అని రాసింది పిన్ని. ఆమెకు భాస్కరం మీద అనుమానం ఉన్నది. మళ్ళీ భాస్కరం ఉత్తరం రెండోసారి చదవుకున్నాడు.
"పిన్నీ! నువ్వు చెడ్డదానివైనా ఎందుకు కాక పోయావమ్మా" అనుకున్నాడు.
కట్నం పుచ్చుకోడమా? మానడమా అన్నది కాదే సమస్య- అసలు సురేఖను తాను ఎలా ఒప్పుకుంటాడు? ధనమ్మగారికింత అహంకారం ఉంటుందనుకోలేదు.
ఆఖరికి ముకుందరావును వసంతకు చేసుకోడం వల్ల ఆమెకు రాగల లాభంగాని తాను సురేఖను వివాహమాడకపోడంవల్ల రాగల నష్టంగాని ఏమీలేదు. కదా?
మనుషుల సంస్కారం వాళ్ళ అహంకారం కోసరం ఇటువంటి క్లిష్ట సమస్యలను చెయ్యడంవల్ల పెరుగుతుందా?
ధనమ్మగారిదంతా ఆలోచించినా బాగుణ్ణు. అసలు సురేఖకు తెలుసుకదా? పద్మావతితో తనకు స్నేహమున్నదని. సురేఖ ఎందుకు చెప్పకూడదూ?
"నా పిచ్చిగాని! నేను చెప్పగలిగేనా పిన్నితో, పిన్నీ నేను పద్మావతిని ప్రేమిస్తున్నాను అనీ...." పేలవంగా నవ్వుకుని లేచాడు భాస్కరం.
"ఏది ఏమేనాసరే వసంతపెళ్ళి అయితీరాలి' అనుకున్నాడు గట్టిగా.
స్వయంగా నేనే వెళ్ళి వసంతపెళ్ళి స్థిరపర్చుకుని మరీ వస్తాను. అనుకున్నాడు- ఆరోజు శనివారం ప్రొఫెసర్ గారి ఇంటికి వెళ్ళి,
"సార్! నేను సోమవారం రాను సార్....మా చెల్లి పెళ్ళి ఖాయమైంది. ఇప్పుడు రైలెక్కి పోతున్నా" నన్నాడు.
"వెరీ గుడ్!" అన్నాడు ప్రొఫెసర్. పైగా నాలుగు ప్రశ్నలూ అడిగాడు.
"కొందరు ప్రొఫెసర్ లంటే కేర్ చెయ్యరోయ్! అంచేతే వాళ్ళు "అల్టిమేట్ గా" అనుభవిస్తారూ" అన్నాడు-కేవలం తానో సృష్టికర్తలా నిలబడి.
"నేను చెప్పందే వెళ్ళను సార్" అని భాస్కరం నవ్వుతూ వచ్చేశాడు.
పద్మావతికి చెబితే బాగున్నుగాని-వాళ్ళ ఇల్లు ఎటో, అదీగాక వేరుగా వెళ్ళి వాళ్ళ ఇంటిముందు నిలబడి ఏమని కేకవెయ్యాలీ?
"ఐనా రైలు వేళఐపోయిందే"నని చివరకు సాకు చెప్పుకుని నేరుగా టెలిఫోన్ దగ్గరకు వెళ్ళాడు.
సురేఖ వాళ్ళ హాస్టల్ కు ఫోన్ చేశాడు సురేఖ వచ్చింది. "హల్లోవ్ సురేఖా స్పీకింగ్"
"నేను....నేనూ భాస్కరాన్ని.....నేను బెజవాడ వెడుతున్నాను చెబుదామని పిలిచాను."
"................"
"మా చెల్లాయి పెళ్ళి "ఫిక్స్" అయింది సురేఖ గారూ!....."
ఎట్టకేలకు "కంగ్రాచ్యులేషన్స్" అన్నది సురేఖ.
"మీరు ఈ విషయం విని ఆనందించాలి. మీ దొడ్డమ్మగారి చలవే ఇదంతా......" "సరిలెండి.........నాకు ఈ విషయం చెప్పాలనుకోడం............."
"పద్మావతీ వాళ్ళ యిల్లు నాకు తెలీదండీ.......మీరే కాస్త సోమవారం చెబుతారుగా......"
"అలాగే"
"మీకు నేను థాంక్స్......"
"అక్కర్లేదు లెండి....." అంతే.
ఆమె ఫోను పడేసిందని తోచింది. దాంతో సిగ్గు పడ్డాడు; నొచ్చుకున్నాడు కూడా. భాస్కరం-రైలుకు వేళైంది-తొందరలో అన్నీ మరిచిపోయాడు.
సురేఖకు అతగాడి ప్రవర్తన కించిత్ కోపాన్ని తప్ప మరేం తెప్పించలేదు.
"ఇద్దరి మధ్య నాటకమా? ఇది" అనుకుంది.
"వాసనత పెళ్ళి అవ్వాలీ అంటే దొడ్డమ్మ షర్తులేమో తనకు తెల్సు-అంటే........అంటే..... భాస్కరం ...... భాస్కరాన్ని తను.....తనూ.....ఛీ......"
తన కాళ్ళక్రింద భూమి చెరిగినట్లైంది. "తమ పద్మావతికి మొహం చూపించలేదిక."
రూములోకి ఎలాగో వెళ్ళి కూలబడిపోయింది.
"హే భగవాన్! ఇదేం కర్మ"
భాస్కరంలోని ఔదార్యాని కర్ధం వెతక నక్కర్లేక పోయింది సురేఖకు.
"తన అంతస్తూ ధనమూ రెండూ పద్మావతి కన్నా ఎక్కువ గనుక-తన చెల్లి పెళ్ళి సాకు ఎలాగా వచ్చింది గనుక-తన దొడ్డమ్మకి ఇతగాడు మాట ఇచ్చాడు" అనిపించింది.
"కాని, కట్నం వద్దన్నాడు?" అదో ప్రశ్న.
"తలనొప్పి-అబ్బా" అనుకుంది. పనిమనిషి నూకాలమ్మను మాత్రలు తెమ్మని పంపించింది.
"అన్నట్టు సోమవారం డిబేటుంది"-ఏదో నవలలో పేర్కొన్నట్లు సినీమాలో పాడినట్లు "ఖేసరా సరా" అనుకుని లేని ఉషారు తెచ్చుకుంది-'డిబేట్' గురించి ఆలోచించాలనుకుంది.
25
"పరిస్థితులను తూచి, బేరీజువేసి సమ్మందాలను నిర్ణయించాలనుకునే రోజులు మారి, రాను రాను యువతీ యువకులు మొదట గాంధర్వంగా కూడ పలుకుకుని ఆనక ఎన్నో అవాంతరాలు గడిచి గట్టెక్కే కధగా మారింది పెళ్ళి."
ఆరోజు సాయంకాలం డిబేటులో మాట్లాడ వల్సిన "ప్రేమలూ - పెళ్ళిళ్ళూ" విషయానికి తయారవుతున్నది సురేఖ.
పద్మావతి వచ్చింది. కాని, సురేఖ గమనించనే లేదు. సురేఖకు వక్త్రుత్వపు పోటీలో పాల్గొనాలన్న, సర్దాకన్నా మాటాడి, నలుగుర్నీ మెప్పించాలీ, అనే పట్టుదలే ఎక్కువ.
"ఏమిటోయ్ అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావ్?" పద్మావతి స్నేహితురాలి కనులు వెనుక వాటుగా వచ్చి మూసి, అంతలో చేతులు తీసేసింది. ముందుకు వంగి, సురేఖ మొహంలోకి చూసింది.
"గాంధర్వ గొప్పదా? ప్రేమకి మంత్రాల పెళ్ళి గొప్పదా?" అని ఆలోచిస్తున్నాను.
"సరే, శాకుంతలోపాఖ్యాన మన్న మాట" నవ్వింది పద్మావతి. "గాంధర్వం గొప్పదేగాని, సాక్షులు ఉండరు...... ఉన్నా పంచ భూతాలేగాని వాటికి నోరూ, వాయీ లేదూ........."
"ఆకాశవాణి పలుకుతుంది గాని, ఆ రోజులు వదిలేసెయ్.......ప్రకృతం మనం వక్త్రుత్వం తయారు చేస్తున్నాం ...... నెచ్చెలీ! వర్తమానంబునకు రమ్ము"-సురేఖ చివాలున లేచి స్నేహితురాలి భుజాలుపట్టి కుర్చీలో కూలదోసి 'డ్రమటిక్'గా నించుంది.
"అదా? రాణిగారి తాపత్రయం........సరే ఆ వాగుడు మీరే ఆలోచించుకొనుడు. నేను లెస్స డస్సి తిని....."
"ఏం తిని............?"
ఇద్దరూ విరగబడి నవ్వుకున్నారు.
"అది కాదోయ్! నీతో పనుండి వచ్చానూ" అంది పద్మ సీరియస్ గా.
"చెప్పు" బుద్దిగా కూర్చుని గెడ్డాం క్రింద చెయ్యి ఆన్చుకుంది సురేఖ.
"నాకేమిటో భయంగావుంది సురే.........."
సురేఖ గ్రహించకపోలేదు పద్మావతి ఆంతర్యం.
"ఎందుకేమిటే!" అన్నదాప్యాయంగా.
"ఏ ప్రేమకోసమై ఇంత సాహసం చేశానొ అదే చివరికి నన్ను ముంచేస్తుందేమోనే......."
"ఛా! ఏం మాటలవి?"-సురేఖ స్నేహితురాలిని వారించిందిగాని, తనకి మాత్రం ఆ దైర్య మెక్కడిది?
