Previous Page Next Page 
ఇందుమతి పేజి 16

    చైత్ర మాసం లో పరీక్షలు అయ్యాయి. తన తండ్రి వెంకటా చలపతి గారు శ్రీరామ భక్తుడు. గుంటూరు లో భజన సమాజాలెన్నో ఉన్నాయి. తమ పేటలో ఉన్న భజన సమాజం లో అయన సభ్యుడు. ప్రతి దినమూ తెల్లవారు ఝామున సభ్యులందరూ కూడి భజనలు చేసుకుంటూ పేటలోని ముఖ్య వీదిలన్నీ చుట్టి, చివరికి ఏ ఆంజనేయస్వామి అలయానికో, రంగనాయక స్వామి అలయానికో, శివాలయాని కో చేరి, మంగళాలు పాడి , స్వామికి కొబ్బరి కాయలు కొట్టి, ప్రసాదాలు తీసుకుని ఇల్లు చేరుతుంటారు. నెలకొక రోజున ఒక్కొక్క సభ్యుడి ఇంటిలో భజనలు. రామ నవమికి , కృష్ణా ష్టమి కి , వినాయక చవితి కి , శివరాత్రి కి చందాలు పోగు చేసి ఏ ఆలయం లోనో ఉత్సవాలు జరిపిస్తుంటారు. ముఖ్యంగా శ్రీరమ నవమి కి సప్తాహాలు లు  జరుగుతాయి. ఆ ఏడు రోజులు అఖండ రామ నామ కీర్తనలు, హరికధలు , ఉపన్యాసాలు , పాట కచేరీ లు జరుగుతాయి. ఆ సమయంలో వెంకటా చలపతి గారికి పనులు తల మునకలు. ఉత్సవాలకు రాజశేఖర మూర్తి కూడా అప్పుడప్పుడు వెళుతుంటాడు.
    సప్తాహం అయిన తరవాత రాజశేఖర మూర్తి ఒక శుభ దినంలో ఆనంతవరం ప్రయాణ మయినాడు. రైలు లో , బస్సులో ప్రయాణం చేసినంత సేపూ ఇందుమతి మనోజ్ఞమూర్తి అతని మనస్సు లో మెదులుతూనే ఉన్నది. ప్రియురాలి నెప్పుడు చూస్తానా అని ఉవ్విళ్ళురుతూ అనంతవరం లో బస్సు దిగాడు. బస్సు దగ్గిరికి అనంత కృష్ణ శర్మ గారు, త్రివక్రమ రావు, వామన రావు వచ్చి రాజశేఖర మూర్తిని తీసుకు వెళ్ళారు. ఇల్లు చేరగానే రేవతి కాళ్ళు కడుక్కోవటానికి చెంబుతో నీళ్ళు, తువ్వాలు తీసుకు వచ్చి ఇచ్చింది. కడుక్కుని నవారు మంచం మీద కూర్చుని అత్తగారు తెచ్చి ఇచ్చిన మంచినీళ్ళు తాగాడు. శర్మగారు కుశల ప్రశ్నలు  చేశారు. సమాధానాలు చెప్పాడు. అయన మాధవరావు సంగతి చర్చించారు. రాజశేఖర మూర్తి ఆయనకు ధైర్యం చెప్పాడు. శర్మగారు త్రివిక్రమముని, పై చదువు లకు బస్తీ కి పంపవలసిన అగత్యాన్ని గూర్చి ప్రసంగించారు. రాజశేఖర మూర్తి అతణ్ణి విజయవాడ లో నారాయణ రావు గారి దగ్గిర  ఉంచి చదివించమని సలహా ఇచ్చాడు.
    ఇంతలో అనంత కృష్ణ శర్మ గారి బావమరిది సదాశివయ్యగారు మేనకోడలి భర్తను చూసి పోదామని వచ్చారు. పెళ్ళిలో ఆయనను చూసిన గుర్తే కాని, ఆయనతో ఎక్కువ పరిచయం కలగలేదు రాజశేఖర మూర్తి కి. కుశల ప్రశ్నలయిన తరవాత తన భూముల సంగతి, పంటల సంగతి, ఊరి వారితో తన తగాదాల సంగతి కోర్టుల సంగతి గంట సేపు చర్చించారు. రాజశేఖర మూర్తికి ఇరువంటి చర్చలలో అభిరుచి లేదు. అతనికి విసుగెత్తింది. ఇంతలో దేవుడు లాగ వామనరావు భావగారిని స్నానానికి లెమ్మని కబురు తెచ్చాడు.
    కబురు వచ్చిందే తడువుగా లేచి, లుంగీ కట్టుకుని, తువ్వాలు భుజం మీద వేసుకుని స్నానానికి పెరటి లోకి వెళ్ళాడు రాజశేఖర మూర్తి. పెరటి లో అరిటి చెట్టు కింద బిందె లో వేడ్నీల్లు , చన్నీళ్ళు సమ పాళాలుగా కలుపుతున్నది ఇందుమతి. అతని మనస్సు లేచి వచ్చింది.
    "ఇందూ, క్షేమమా?' అని ప్రేమతో ప్రశ్నించాడు రాజశేఖర మూర్తి.
    ఆమె ముఖం ఎత్తి చూసింది. అది శుద్ధ త్రయోదశి. నీలాకాశం లో రజనీ మోహనుడు పదమూడు కళలతో వెలుగుతున్నాడు. ఆ వెలుగులో ఇందుమతీ ముఖార విందం ఎందు చేతనో వెలవెల బారినట్ల నిపించింది . ఆమె ఆధరం పై చిరునవ్వు కళా విహీనమై కనిపించింది.
    "ఇందూ, ఒంట్లో సరిగా లేదా ?" అని అనునయంగా ప్రశ్నించాడు రాజశేఖర మూర్తి.
    "కొంచెం తల నొప్పిగా ఉంది" అని మెల్లిగా జవాబు చెప్పింది ఇందుమతి.
    "మందు తీసుకున్నవా?"
    "తల నొప్పికి మందేమిటి? కొంతసేపటి కి కదే పోతుంది."
    "నేను వచ్చి గంటన్నర అయింది. ఇంతవరకు నన్ను చూడటానీకైనా రాలేదేం? కొత్త పెళ్లి కూతురివా?"
    "కాదా?"
    "సంవత్సరం అయింది. ఇంకేం కొత్త? గుంటూరు లో నెలరోజులూ ఇలాగే ఉన్నావా?"
    "అది గుంటూరు. అక్కడ మీ ఇష్టం. ఇది పల్లెటూరు . అమ్మా, నాన్నా ఏమైనా అనుకుంటారు."
    "బాగుంది. ఈ వెన్నెల రాత్రి , ఈ అరిటి చెట్టు కింద ఇలా ఒంటరిగా నాతొ మాట్లాడితే ఏమీ అనుకోరా?"
    "మీరు అప్పుడే వచ్చేస్తా రనుకోలేదు."
    "నా ఆరాటం అటువంటిది. పిలుపు అందిన వెంటనే వచ్చి పడ్డాను. ఇక్కడైనా నువ్వు కనిపిస్తావేమో నని. నిన్ను చూడాలని, నీతో ఏవేవో చెప్పుకోవాలని నా హృదయం ఎంత పరుగులు పెడుతుందో నీకేం తెలుసు?"
    "నాకు తెలుసు గాని, స్నానం చెయ్యండి. భోజనానికి వేళ అయింది. " అని లోపలికి వెళ్ళిపోయింది ఇందుమతి.
    స్నానం చేసి వచ్చేసరికి పెట్టె నుంచి పట్టు పంచే తీసి రేవతికి ఇచ్చి పంపింది. భోజనం చేసి వచ్చేసరికి నవారు మంచం మీద తెల్లని పక్క పరిచి, ఉతికిన ధోవతీ  తీసి పక్కనే పెట్టి, విడిచిన ధోవతి ఉతికించటానికి తీసుకు వెళ్ళింది. ధోవతి మార్చుకునే లోపల తమల పాకులు, సున్నం, వక్కలు వెండి పళ్ళెం లో పెట్రి రేవతికి ఇచ్చి పంపింది. రాజశేఖర మూర్తి కి భార్య చేత పనులు చేయించు కొనటానికి ఇదే మొదటి సారి. మూడు నిద్రలకు వచ్చినప్పుడు ప్రతి డానికి శారద నే పిలిచేవాడు. ఇందుమతి గుంటూరు వచ్చినప్పుడు ఎవరినీ పిలవ వలసిన పనే లేదు. మామూలుగా తన పనులు తనే చేసుకునే వాడు. ఇప్పుడు ఇందుమతి తన పనులన్నీ తాను అడగకుండానే చేస్తున్నది, కాని, ఆమె తన ఎదటికి ఎక్కువగా రాదు. రేవతి చేతనో, వామనుడి చేతనో, త్రివిక్రముడి చేతనో కావలసినవన్నీ పంపుతుంది. తాను అడగవలసినవి వారి చేతనే అడిగిస్తుంది.
    ఎంత ఆశతో ఇందుమతీ సాన్నిధ్యం చేరాలని వచ్చాడో అంత నిరాశ అయింది రాజశేఖర మూర్తి కి. పునస్సంధానం కాక పూర్వం భార్య భర్తలు చనువుగా ఉండకూడదా? నిగ్రహం లేనివారు, సంస్కారం లేని వారు తప్పతడుగులు వెయ్యవచ్చును. తానటు వంటి వాడు కాదే! గుంటూరు లో ఒక నేల రోజులు కలిసి మెలసి ఉన్నారు. తానెన్నడూ హద్దు మీరలేదు. మరి ఎందు కింత కట్టడి? పల్లెటూరు చాదస్తాలనుకున్నాడు. తన ఎదటి కే రానిది రేపు తనతో కూడా ఏలూరు, బందరు, విజయవాడ ఎలా వస్తుంది? ఆమె రాకపోతే తనూ వెళ్ళడు.
    మరునాడు ఉదయాన సదాశివయ్య గారి జ్యేష్ట పుత్రుడు నాగభూషణ రావు వచ్చాడు. అతడు రాజశేఖర మూర్తి కన్న మూడేళ్ళు పెద్దవాడుట. సన్నగా పొడుగ్గా రివటలా ఉన్నాడు. మల్లు లాల్చీ, తెల్ల పైజమా ఎడమ చేతిలో ఒక తోలు పెట్టె , కుడి చేతిలో సిగరెట్టు, పేరుకు తగినట్టు మెడలో నాగుబాము వంటి స్టేత స్కోపు, ఖళ్ళున దగ్గుతూ విచ్చేశాడు. 'అయన ఒక విలాస పురుషుడు కాబోలు' అని అనుకున్నాడు రాజశేఖర మూర్తి. విజయవాడ లో స్కూలు ఫైనల్ పరీక్ష రెండు సార్లు తప్పి , చదువుకు స్వస్తి చెప్పి ప్రస్తుతం స్వగ్రామం లో హోమియో పతీ వైద్యం చేస్తున్నాడట. చవకబారు కదల పత్రికలలో అతడు అప్పుడప్పుడు కధలు వ్రాస్తుంటాడు. ఆ కధలన్నిటి లోనూ ఒక్కటే తరహ విషయాలు. స్త్రీ పురుష సంబంధాలు, ప్రేమ అన్న పేర్లతో భర్తలను విడిచి భార్యలు లేచి పోవటం, భార్యల కన్నులు గప్పి భర్తల పర స్త్రీ సమాగమాలు. అయన కింకా పెళ్లి కాలేదు. ఊళ్ళో కొంతమంది వనితలను ఉద్దరిస్తున్నాడని ప్రతీతి. ఇందుమతి ని పెళ్లి చేసుకోవాలని ఆయన ఎంతో కుతూహల పడ్డాడట. కాని, ఇందుమతి కి అతడంటే అసహ్యం. అన్నపూర్ణమ్మ గారికి మేనల్లుడంటే హృదయాంతరం లో ఏ కోశాన్నో కొంత మెత్తదనం లేకపోలేదు. అతడు పెళ్లి కాకపోవడం వల్లనే ఆ విధంగా చెడి పోతున్నాడని ఆమె ఉద్దేశం. అతని పేరు వింటేనే అనంత కృష్ణ శర్మ గారికి మంట. ఇందుమతి వివాహ విషయం లో తల్లికి భానుమతి గట్టిగా చెప్పిందిట. డానికి పెళ్లి కాకపోయినా సరికాని, అటువంటి దౌర్భాగ్యుడి కి మాత్రం కట్టి పెట్టవద్దని.
    ఆ ఊళ్ళో వేరొక వైద్యుడెవరూ లేకపోవటం చేత నాగభూషణరావే అక్కడ ఘన వైద్యుడై నాడు. ఇందుమతి కి ఏ వేళనైనా సరే తల నొప్పి గానీ, జలుబు గానీ వస్తే తనను పిలవకపోయినా వచ్చి మందు ఇచ్చి , ఒక అరగంట వెకిలి కబుర్లు చెప్పి వెళ్ళటం అతని కలవాటు. అతడు అటుపోయిన వెంటనే ఇందుమతి కి ఆ మాత్రలు తీసుకొని పోయి బురద గుంటలో పొయ్యటం అలవాటు. ఇందుమతి కి తరచుగా తల నొప్పి వస్తున్నదని అన్నపూర్ణమ్మ గారు అన్నగారైన సదాశివయ్య గారితో అన్నదట. అయన పోయి తన సుపుత్రుని తో చెప్పాడు. అందుకే ఈ రాక.
    నాగభూషణ రావు ముందర వరండా లో రాజశేఖర మూర్తి ని ముభావంగా పలకరించి నేరుగా వంటింట్లో కి వెళ్ళాడు.
    "ఏమే, ఇందుమతీ, తలనొప్పి వస్తున్నదటగా? ఏమిటి సంగతి? మీ అయన వచ్చాడుగా , ఇక పోతుందిలే."
    "నాకు తలనేప్పీ లేదు, కడుపు నొప్పీ లేదు. నువ్వు వెళుదూ , బాబూ, నీకూ నీ మందులకూ ఒక నమస్కారం" అన్నది ఇందుమతి విసుగుతో.
    "ఏం, నా మందులు నీకు నచ్చలేదా? మరదలివి కదా అని తియ్య తియ్యని మందు లిస్తుంటే వద్దంటా వేమే? అసలు ఏమిటి విశేషం?"
    "విశేష మేమీ లేదు, మామూలే. నీ మాటలు వింటుంటే నాకు తలనొప్పి కొంచెం ఎక్కువవుతుంది. నా మీద దయతలచి నీ పని నువ్వు చూసుకో పో" అని గదిలో కి పోయి తలుపు వేసుకున్నది ఇందుమతి.
    "ఒసేవ్, నన్ను పెళ్లాడకపోతే పోయావ్, నా మందులు కూడా చేదుటే నీకు? అత్తయ్యా, ఇదిగో మందు. రోజుకు మూడు సార్లు వెయ్యి. ఎట్లా ఉన్నదీ నాకు తెలియ జెయ్యి. ఎల్లుండి మళ్లీ వస్తానులే" అని బయటికి వచ్చేశాడు నాగభూషణ రావు.
    ఈ సంభాషణ బయటి నుంచి వింటున్న రాజశేఖర మూర్తి కి నాగభూషణ రావు ప్రవర్తన అసభ్యంగా ఉన్నదని పించింది.
    "ఏమండీ, రాజశేఖరం గారూ , మీ ఆవిడ మందు తిననంటుంది. మీరైనా చెప్పండి" అన్నాడు ఎదురుగా ఉన్న నులక మంచం మీద చతికిల బడుతూ నాగభూషణ రావు.
    రాజశేఖర మూర్తి కి ఇందుమతి కి కలిగిన అనారోగ్యం ఎటువంటిదో పూర్తిగా తెలియదు.
    "దేనికండీ మందు?"
    "తల నొప్పి వస్తున్నదటగా?"
    "ఎన్నాళ్ళ బట్టి?"
    "అబ్బే, ఈ మధ్యనే."
    "నాకు తెలియదు లెండి. మీరు హోమోయో పతి పరీక్షలు పాసయ్యారా?"
    "అబ్బే, దీనికి పరీక్ష లెందు కండీ? మేటీరియా మెడికా దగ్గిర పెట్టుకుంటే ఎవరైనా ఇవ్వచ్చు హోమోయో మందులు."
    "మేటీరియో మెడికా దగ్గిర పెట్టుకున్నంత మాత్రం లో ఆ వైద్య పద్దతి, మందుల తరహా శరీర విజ్ఞానం పూర్తిగా అలవడుతుందంటారా?"
    "దాని కేముందండీ? అదంతా జనరల్ నాలెడ్జి,"
    "మీరు పరీక్షలకు కట్టి ఎందుకు పాసవ కూడదు?"
    "సరే, మన కంత ఒపిక ఉంటె ఇక లేని దేముంది? ఈ పాటికి ఏమ్.బి.బి.యస్ అయి ఉండనూ?"
    "తగిన పరీక్షలు పాసు కాకుండా వైద్యం చెయ్యటం అంత మంచిది కాదను కుంటాను. ఇందుమతి కి మందు అక్కరలేదంటే అంత బలవంతం చెయ్యకండి" అని నిస్సంకోచంగా చెప్పాడు రాజశేఖర మూర్తి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS