"నోర్మూయ్! నేనెలా చెబితే అలా చేసి పడుండాలి. నువ్వు నా పెళ్లానివి. భారతీయుల భాషలో దాసీ అని డానికి మరో అర్ధం ఉంది. ముందా టెరిలిన్ చీర విప్పి, ముతక చీరోకటి కట్టుకురా! ఆ పైన చెయ్యవలసిన అలంకరణ నే చేస్తాను."
అతని అధికార స్వరానికి మండిపడింది పార్వతి. "మనలో ఎవరు ముందర నోరు మూసుకోవాలో వేరే చెప్పనవసరం లేదు. నేనింతైనాక ఒక్కరూ ఒక్క మాటనడానికి సహించలేకపోయారు. నువ్వంటే నేను పడతాననుకున్నావా?- ఇంకా మితి మీరావంటే నలుగురి లో నవ్వుల పాలవుతావు. నన్ను క్షణ క్షణానికి రేగ గొడుతున్నది నువ్వే!"
"ఉట్టినే నోరు పారేసుకోకే పిల్లా! నేను పెట్టె తిండి తిని తిన్నగా పనులు చెయ్యి." ఒక్కొక్క నిమిషం గడుస్తున్న కొద్ది రాజు విచిత్రంగా మారిపోతున్నాడు.
కసి తీరు తున్నప్పటి హాయిలో అతని కేమీ తెలియడం లేదు. కళ్ళు ఎర్రగా మారుతున్నాయి. ఒళ్ళంతా నిప్పులు కక్కుతున్నట్లు చెమటలు, మామూలుగా కనిపిస్తూనే ఉద్వేగంతో మాట్లాడుతున్నాడు.
"రాజూ! ఇంకొక మాట అన్నావంటే మర్యాద కాదు. నువ్వు పెట్టె తిండి తినడానికి కాదు, నేను పెళ్లి చేసుకున్నది. నేను చదువు కోలేదా? నాకు గతి లేదా? హు! నువ్వు అధికారికంగా మాట్లాడితే లొంగి పోతానాను కున్నావు కాబోలు."
"చాలు విపరీత ప్రసంగం! ప్రతి దానికీ వ్యాసాలు చదువుతుంది. ఈసారి రాజూ, గీజూ అన్నావంటే ఊరుకునేది లేదు. మర్యాదగా "మీరు" అని సంబోధించు."
"చస్తే అనను. అలవాటు ప్రకారం పిలుస్తాను. కావాలంటే పిలవడం మానేస్తాను. 'బావా' అని పిలిపించుకునే అర్హత నీకుంటే గదా, అసలు?"
"పార్వతీ!" అదిరింది గది. ఎవరికైనా వినిపిస్తుందనే జ్ఞానం నశించింది రాజు మెదడు ను.
"ఏం?" అన్నది పార్వతి మరింత ధీమాగా నిలబడి.
"రాస్కెల్! పొగరెక్కినట్లుండడానికి నీకు హక్కు లేదు. ఇల్లాటి చీరలంటే నాకు మంట అని తెలియదూ? తిన్నగా వెళ్లి మార్చి వస్తావా లేదా? నా పెళ్ళాం కావడానికి ముచ్చట పడ్డావుగా?" అనుభవించు."
రాజు జడిపించబోయినా పార్వతి నిశ్చలంగా ఉంది.
"అందుకే కాబోలు నీ పగ. నువ్వు పశువ్వి కావూ? ఇలాటి మాటలనే మగవాడు రాక్షసుడు తప్ప మరొకడు కాడు. అయినా లోకంలో ఆడవాళ్ళందరూ , ముఖ్యంగా మీ సరోజ దేవి అటువంటి నాజూకు బట్టలు కట్టుకుంటే పొంగిపోతావు కానీ, నేనైతేనే నీకింత అసహనం, చూడలేని తనం."
"నువ్వు నక్కవై ఉండి నాగలోకం గురించి ఆలోచిస్తున్నావు. సరోజ కీ, నీకూ సామ్యం ఎక్కడ?' రాజు తల ఎగరేసి అన్నాడు.
పార్వతి అదొక మాదిరిగా నవ్వింది. "హు! అంత హీనంగా చూడబడుతూన్నావన్న మాట? నిజానికి సరోజ నా కాలి గోటికి కూడా సరిపోలదు."
ఎంత ధైర్యంతో ఆ మాట అనగలిగిందో కానీ, రాజు ఒక్కసారి రెచ్చిపోయాడు దానితో.
"ఏదీ, మళ్ళీ అను ఆ మాట!" అన్నాడు, దగ్గరకు వచ్చేస్తూనే.
చాలా దినాల నుంచి అలాంటి భీకరాకృతి చూడలేదు పార్వతి. అయినా ధైర్యం నటించింది. చెదరకుండా "నా కాలి గోటికి కూడా పోలదామే అంటున్నాను." అంది మళ్ళీ.
ఆమె మాట ముగించిందో లేదో ఆమెకే తెలియదు. రాజు ఆమె జుత్తు దొరక బుచ్చుకుని రెండు చెంపల మీదా నాలుగు వేశాడు కుదిపి వదిలాడు.
బాధకు పార్వతి కళ్ళు ఎర్రబడి, రెండు చుక్కలు కనుకోలకుల్లో కి వచ్చాయి.
"ఛీ! నీ మొహం చూస్తె ప్రపంచంలో ఉన్న పాపాలన్నీ నాకే చుట్టూ కుంటాయి. వెళ్ళు ఇక్కడ్నుంచి. వెళ్లి ఎక్కడో ఏడువు, నా ఎదురుగా కాకుండా!" రాజు గొంతు బొంగురు పోయింది . తీక్షణమైన అతని చూపుల వేడికి తట్టుకోలేనట్లయింది పార్వతి.
అవమానపు సెగలు ముఖాన్ని కాలుస్తుంటే, కొద్ది ఆగ్రహం తప్ప ఎక్కువ మార్పు కనిపించ నీయకుండా అతని వైపు చూస్తూ, "కొట్టినంత మాత్రానికి నేను బానిసనై పోయానా? ఉద్యోగం చేసుకుంటూ నన్ను నేను పోషించు కుంటాను. నువ్వు నన్ను కాదంటే నాకు ఎప్పటికీ నష్టం లేదు. కష్టమంతా నీదే ; అవమానమంతా నీదే. ఇంకో సంగతి. నీలాటి కఠినుడు , రాక్షసుడూ అయిన మనిషి దగ్గర ఎప్పుడూ ఏడవను. జన్మలో నీ ఎదురుగా కన్నీరు కార్చే గతి నాకు పడుతుందని అనుకోకు" అన్నది పార్వతి తీవ్రంగానే. అని, వెంటనే ద్వారం వైపు రెండడుగులు ఆమె వెయ్యడం, రాజు గొంతు బొంగురుగా ధ్వనించడం ఒక్కసారే జరిగాయి.
"ఆ తలుపులు తియ్యకు. అటు వెళ్ళావంటే మళ్ళీ ఎముకలు సున్నం అవుతాయి."
పార్వతి ఆగిపోయింది. నిమిషం ఆలోచించింది. ఒకసారి అతన్ని అసహ్యించు కున్నట్లు చూసి, పై గదిలోకి ఉన్న మెట్లెక్కి వెళ్లి పోయింది.
చెదిరి ఉంగరాలు గా ముందుకు పడి స్వేదం లో హత్తుకుపోయిన జుత్తును సర్దుకో నైనా సర్దు కోకుండా రాజు పక్క మీద వాలాడు. చాలా సేపటి వరకు అతనికి నిద్ర రాలేదు. అతనివి అంతు తెగని ఆలోచనలు.
ఆలోచనలకు అర్ధం ఉండదు కాబట్టే ఎక్కువకాలం వ్యర్ధం కావడం జరుగుతుంది మరి.
14
"జీవిత పోరాటం ' అనే వాడుక పదం రాజు, పార్వతి. దాంపత్య జీవితానికి సరిగ్గా వర్తించింది. ఎవరి పాటికి వారు పట్టుదలగానూ, గొప్ప గానూ ఉంటున్నారు. బింకం చెడటం లేదు ఇద్దరిలో. ఒకరి కొకరు జవాబు లిచ్చుకోవడం లో తమను తాము తక్కువ చేసుకోరు. అందులో ఇద్దరూ ప్రవీణులైపోయారు, పెళ్ళయిన తర్వాత . తిట్టుకోవడం లో సరిసమానం.
ఏరోజు ఎటువంటి రంగస్థల నాటకం గృహంతర్భాగం లో జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఉన్న ప్రేక్షకులైనా జానకమ్మా , రామనాధం గారూ మాత్రమె. గతిలేక ఏ చుట్టమైనా వచ్చినా, ఆ ఇంట్లో మౌన గంబీర్యాల మధ్య జరిగిన సన్మానానికి తట్టుకోలేక అపార్ధాలు చేసుకుని పారిపోవలసిందే.

రామనాధం గారికి రాజు పార్వతుల వర్తనలు సాధారణంగా కనిపించేవి. ఆ వయసులో కీచులాటలు, జగడాలు అతి సహజం అనుకునే ధోరణి ఆయనది. మిగిలిన దిగులంతా జానకమ్మదే. కొడుకూ, కోడలూ ముచ్చటగా సంసారం సాగిస్తుంటే ఆ నవ దంపతులను చూసి మురిసి పోవాలనుకున్న అతి సామాన్యమైన ఆవిడ ఆశ అడియసై కూచుంది. తన కొడుకు అపరాదో, కోడలు మూర్ఖురాలో నిర్ణయించు కోలేక సతమత మైపోతుంది. 'పార్వతి కూడా తన దగ్గరే పెరిగింది. ఆ పిల్ల గుణం చిన్నతనం నుంచీ తనకు తెలిసినదే. రాజును పెళ్లి చేసుకోవాలని ఆ పిల్లకు ఉబలాటం ఉన్నదంటే అసహజం కాదు; అసంజసం కాదు. పోనీ, అటువంటి అమ్మాయి వాడి కిష్టమైనట్లు నడుచుకొని , ప్రేమ సంపాదించు కోకూడదూ? అదే అర్ధం కావడం లేదు. ఇక రాజు సంగతా? మొదటి నుంచి మొత్తు కుంటూనే ఉన్నాడు. ఇప్పుడు, "దాన్ని అలా చూస్తున్నా వేమిటిరా" అని కానీ, "దాని పొడ గిట్టకుండా ఉంటె ఎలా, బాబూ" అని కానీ అడగడానికి తన కెంత సాహసం ఉండాలి? మీద విరుచుకు పడడూ?"
అందుకే జానకమ్మ నోరు కదప కుండా ఉంది -- "వీళ్ళీద్దరూ వేరింటి కాపరం పెడితే బాగుండును" అనుకుంటూ.
రాజు ఏకాగ్రత అంతా పార్వతి అలంకరణ మీదనే. ఆమె ఇష్టపడనివి చెయ్యడం, ఇష్టపడినవి దక్కకుండా చూడడం -- ఇదే అతని సాధన. మరొక విధంగా ఆమె మీద విద్వేష భావాన్నిప్రకటించడం చేత కాదు. సాధ్యమైనదల్లా-- తిట్టడం, కొట్టడం. కాని అవి విపరీతం అయితే తనెక్కడ పశువు కన్నా హీనంగా పరిగణించబడతాడో నన్న భయం. సహజమైన నాగరికత భావపూరిత హృదయం.
పార్వతిని ఉద్యోగం చెయ్యకుండా అడ్డు పెట్టడం సాధ్యం కాలేదు రాజుకు. అతను ఆ ఊళ్ళో లెక్చరర్ గా ఉద్యోగం ప్రారంభించిన ఆరు నెలల కల్లా ఒక ఆఫీసులో స్టెనో గ్రాఫరు గా చేరింది ఆ అమ్మాయి.
రాజు ఆమెను మానిపించాలని వ్యర్ధం ప్రయత్నాలు చేశాడు. ఆమెకు చీమ కుట్టలేదు.
మగవాళ్లు ఉండే ఆఫీసులో పనిమాని ఏదైనా అడ ఉద్యోగం చూసుకో మన్నాడు. అప్పటి నుంచి ఆ మగ మనుషులను ఇంటికి తేవడమే మొదలు పెట్టింది -- స్నేహితులు లెమ్మని సమర్ధిస్తూ.'
ఊరికే ఉన్నప్పుడు తప్ప-- ఆఫీసుకు వెళ్ళేటప్పుడు పలచని సిల్కు బట్టలు కట్టవద్దని అజ్ఞ జారీ చేశాడు. అది మొదలు ఉల్లి పోరకన్నా సన్నని వన్నె వన్నెల చీరలే కట్టటం ప్రారంభించింది. రోడ్డు మీద అణకువగా నడవ మన్నాడు. ఠీవిగా నడిచింది. నవ్వ వద్దన్నాడు. నవ్వింది. ఎదురించవద్దన్న వాణ్ణి అదరగొట్టి వదిలిందని వేరే చెప్పనక్కర్లేదు.
