పద్మ నుండి మళ్ళీ జాబు వచ్చింది. రాయన్ అన్న వ్యక్తిని తానూ వివాహం చేసుకొన్నట్లు వ్రాసింది.
"స్వర్ణా! మర్కటం!
మనసు కోతి లాంటిది. రాయన్ గారు నన్ను ఇష్టపడ్డారు. నేను కూడా అతనిని ఇష్టపడ్డాను. అన్ని విధాల నాకు నచ్చాడు. నచ్చని సంగతి ఒక్కటే. వాళ్ళ వాళ్ళకు వ్రాసి అనుమతి పొందుదామంటే , అనవసరమని అన్నాడు. తల్లి లేదుట. తండ్రి చాదస్తుడట. 'వివాహం వ్యక్తిగత విషయం. మనం నిర్ణయించుకుంటే చాలు!' అన్నాడు. వివాహమైన తరవాత, వీలు చూసుకొని మన దేశానికి తిరిగి వచ్చి మామగారిని క్షమాపణ కోరాలని నేను మనసులోనే అనుకొన్నాను. అసలింతకూ రాయన్ గారు తన ఊరి వివరాలేవీ నాతొ చెప్పలేదు. మగవాడి దగ్గర సంగతులు లాగటం ఎంత సేపు!
నా టేబుల్ మీద నీ ఫోటో ఉన్నది. దానిని చూస్తున్నప్పుడు అయన కళ్ళలో ఎంతో మెప్పు కనిపించింది. నేను నీ ఫోటో పరిచయం చేశాను. నీ ఫోటో మీద నుండి చూపు మరల్చలేక పోతున్నారు!
మాటల మధ్యలో, "పద్మా! నీకు డబ్బు ఇచ్చి పంపే బదులు ఆవిడే ఎందుకు రాలేదు?' అని అడిగారు.
నేను నవ్వి, 'మిస్టర్ రాయన్! మీరు నాకు దక్కవలసిన గీత ఉంటె, స్వర్ణ అమెరికా ఎందుకు వస్తుంది?' అన్నాను. ఆయనా నవ్వి ఊరుకొన్నారు. మొత్తానికి నీవు ఆయనను బాగా ఆకర్షించావు! ఈ మాట వ్రాసినందుకు కోప్పడకు నన్ను!
మన వాళ్ళంతా ఎట్లున్నారు? మర్కటం ఏమంటున్నది? నా పెండ్లి సంగతి విని మన వాళ్ళంతా ఏమంటున్నారు?
వివాహం అయినందుకు నాకు సంతోషం గానూ ఉంది. భయంగానూ ఉంది. బహుశా ఇది సహజమేమో!
మీ శుభాకాంక్షలకు ఎదురు చూస్తూ.
నీ పద్మ."
స్నేహిత బృందమంతా వివాహవార్త విని ఎంతో సంతోషించారు.
మరకతం నవ్వుతూ, "పెండ్లి కొందరికి వరం, కొందరికి శాపం అవుతుంది! పద్మ పాలిట ఎట్లా అవుతుందో?' అన్నది . ఆ నవ్వులో మునుపటి మరకతం తొంగి చూసింది.
"వరమే కావాలని ఆశిద్దాము" అన్నది డాక్టర్ సుధేష్ణ.
ఇందిర నవ్వుతూ , "మర్కటం! డాక్టర్! మీరిద్దరూ మరీ 'పేస్ మిస్టులు గా తయారవుతున్నారు. అసలు జీవితమే కొందరికి శాపం, కొందరికి వరం కావచ్చు!" అన్నది.
సుధేష్ణ దిగులుగా వెళ్ళిపోయింది.
* * * *
ఇందిరా, నిర్మలా హడావిడిగా పరుగెత్తుకొంటూ వచ్చారు. స్వర్ణ దగ్గరకు. ఇద్దరి కళ్ళలో నీరు!
"స్వర్ణ! ఘోరం జరిగిపోయింది. మరకతం చనిపోయింది!" ఏడుస్తూ అన్నది ఇందిర.
నిశ్చేష్టురాలయింది స్వర్ణ! నిన్న సాయంత్రమేగా అందరినీ నవ్విస్తూ మాట్లాడింది. చాలా సేపటి వరకూ ఏవేవో కబుర్లు చెబుతూ , బలవంతాన వెళ్ళినట్లు వెళ్ళిపోయింది.
తెల్లవారేసరికి ఇంత ఘోరమా?"
మెదడు మొద్దు బారినట్లయి పోయింది స్వర్ణ కు. యాంత్రికంగా ఇందిరను, నిర్మల ను అనుసరించింది.
మరకతం ఇంటి ముందు జనం. చాలామంది కాలేజీ చదివే అమ్మాయిలు. అందరి కళ్ళలో నీరు.
ఇంటి ముందు మరకతం శవం పండుకోబెట్టబడి ఉంది.
నిన్నటి దాకా ప్రాణరసంతో తుళ్ళి పడిన ఈ శరీరం ఈ వేళ, ఇట్లా వికృతంగా పడి ఉంది! తన చుట్టూ జరిగేదేమిటో ఈశరీరానికి తెలియదు! ఏమయింది ప్రాణం?
జీవితం ఎంత క్షణికం! మరు నిమిషాన వచ్చే చావును చూడలేదు!
"రేపు రేపను మాటకు రూపు లేదు!" యెంత నిజం!
స్వర్ణ కు తల తిరుగుతున్నది. బలవంతంగా నిలదొక్కుకుని మరకతాన్ని చూసింది.
మరకతం పెదవుల మీద సన్నని చిరునవ్వు గర్వంతో కూడిన చిరునవ్వు. ముఖం ఏంతో ప్రశాంతంగా నిద్రిస్తున్నట్లుగా ఉంది. నిజమే! శాశ్వత నిద్ర అది!
నిశ్చలంగా పడి ఉన్న ఆ శరీరాన్ని చూస్తె, ఏదో నిర్వచింపలేని బాధ! దిగులు! వైరాగ్యం ! చావులో కళకళలాడిపోతున్న మరకతం ముఖం, అస్తమించే సూర్య బింబం లా అతి మనోహరంగా ఉంది!
క్రితం రోజు జరిగిన సంఘటన స్వర్ణ మనసులో మెదిలింది.
* * * *
ప్రతి రోజులాగే నిన్న తానూ, ఇందిర మరకతం సుధేష్ణా కూర్చుని కబుర్లు చెప్పు కొంటున్నారు.
ఎన్నో దినాల తరవాత మరకతం ముఖంలో ప్రసన్నత కనిపించుతున్నది. ముఖంలో మామూలు చిరునవ్వు కొంటెతనం ప్రస్పుటమౌతున్నవి.
ఒక్క క్షణం ఫుల్ స్టాప్ లేకుండా అందరితో గలగల మని మాట్లాడుతున్నది.
ఎవరూ వడ్డన కూడదని ముందుగానే నిబంధన పెట్టి అందరికీ బాదాం హాల్వ, రవ్వ దోసె తెప్పించింది.
"స్వర్ణా! ఈ వేళ నీ పాట విని తీరాలి!" అని తనచే బలవంతంగా పాడించింది.
ఇందిర -- "పొద్దు పోతున్నది. మన పాటలు తెగేనా? తెల్లారేనా? రేపు చెప్పుకొందాము" అని లేస్తే , మరకతం -- "రేపు అనేది ఉన్నదో, లేదో మనకు తెలియదు! కూర్చో!" అని బలవంతంగా కూర్చో బెట్టింది.
మరకతం ఎంత సంతోషంగా ఉందొ, డాక్టర్ సుధేష్ణ అంత దిగులుగా కనిపించింది.
తనకు నవ్వు వచ్చింది. డాక్టర్ సుధేష్ణ సాధారణంగా దిగులుగా కనిపించుతుంది. డాక్టర్లు రోజుకో రకపు రోగిని, రోజుకో రకపు చావునీ చూస్తారు. జీవస్మరణాలతో వాళ్ళు ఎంతో సన్నిహితంగా ఉంటారు. న్యాయంగా వాళ్ళ మనస్సులు మామూలు మనుష్యుల కంటే నిర్లిప్తంగా ఉండాలి.
డాక్టర్ సుధేష్ణ అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నట్లుంది. నిరంతరం ఏదో ఆలోచిస్తున్నట్లు కనపడుతుంది. బహుశా జీవస్మరణాలు ఆవిడ కింకా సమస్యగా మిగిలి ఉన్నాయేమో?
వెళ్ళిపోతూ , మరకతం తోటలోని రెండు తెల్ల గులాబీ పూలను తుంచి, టేబుల్ మీద ఉన్న శ్రీ వేంకటేశ్వరుని పాదాల దగ్గర ఉంచి, ఒక్క నిమిషం తదేక ధ్యానంగా చూచింది.
ఇది కొత్త. మరకతం ఎన్నడూ పిల్లను తాకలేదు. గులాబీ ని భగవంతునికి అర్పించడం కొత్త విశేషం!
అడుగు ముందుకు వేస్తూ తనను చూచింది.
తడిగా ఉన్న కళ్ళు. తడి రెప్పల మీద దీపపు కాంతులు పడి, వేలాది ఇంద్ర ధనుస్సులు విరిసి , విరిగి పోతున్నాయి. పెదవి మీద చిరునవ్వు పారిజాతం లాగా, అతి సుకుమారంగా మిలమిల లాడింది.
ఇంటర్మీడియట్ లో తాను వ్రాసిన ఒక పాటలోని చరణం జ్ఞాపక మొచ్చింది, మరకతాన్ని చూస్తూ ఉంటె.
"పెదవి మీద దరహాసం,
,మదిలో మానని గాయం!
కనులలోన కారు మబ్బు,
వీక్షణ మొక విద్యుల్లత!

"స్వర్ణా!
ఒకమారు అన్నీ సమస్యలకు పరిష్కారం 'చావు' అని అన్నాను, జ్ఞాపక ముందా? ఆ మాట అక్షరాలా నిజం!
సుధ అన్న మాట కూడా నీకు గుర్తు ఉండాలే! "పిరికిపందలే ఆత్మహత్య చేసుకునేది, ధైర్యవంతులు జీవితాన్ని ఎదిరించి ముందుకు పోతారు' అని అన్నది. ఎంత నిజం! నేను పిరికిపందను , జీవితాన్ని ఎదుర్కోలేక ఈ ప్రపంచం నుండి పోతున్నాను. నాలాంటి పిరికివాళ్ళని సృష్టించవద్దని భగవంతునితో సముఖం లో చెప్పడానికి పోతున్నాను. ఏమని అంటావో తెలుసా? 'ఓయీ, భగవంతుడా! స్త్రీని సృష్టించకు. స్త్రీ అన్న పదాన్ని సృష్టించడం లోనే నీ పురుషత్వపు చాతుర్యం కనపడుతున్నది. ఆ పదంలో సకారం, తుకారం, రకారం -- మూడూ సత్త్వ, తమో, రజో గుణాలను ఎక్కువగా పెట్టావు! ఇది అన్యాయం. ఇకముందు స్త్రీ ని సృష్టిస్తే , ఆవిడకు రజో , తమో గుణ సహిత మైన మనస్సు ఇవ్వకు. నిర్లిప్తమైన ,మనస్సుతో , యాంత్రికమైన జీవితంతో సంతృప్తి పడేటట్లు సృష్టించు. స్త్రీ కి యౌవనాన్ని, సౌందర్యాన్ని, వాంఛ లతో పొంగి పొరలే మనస్సు నూ, దాన్ని నిగ్రహించుకోలేని బుద్దినీ ఇవ్వకు. ఒకవేళ ఇవన్నీ ఇచ్చినా, స్త్రీ సృష్టి కర్త అయ్యే శాపాన్ని ఇవ్వకు" అని నిగ్గదీసి అడుగుతాను.
