మళ్ళీ తన గొంతే.
"అన్నం తినకుండా ఆ కప్స్యూల్స్ వేసుకోకూడదని తెలియదా?"
"తెలుసు."
"అతను నిరాహారంగా మూడు సార్లు వేసుకో వలసిన కాప్స్యూల్స్ ఒకేసారి అన్నీ వేసుకున్నాడు."
"అన్న మెందుకు తినలేదు?"
"పిల్లి పడగొట్టిందట."
"మరి నేనేం చెయ్యను?"
"నీకు అశ్రద్ధ పెరిగిపోయింది. దాన్ని జాగ్రత్తగా పెట్టకూడదూ. నీ కంత తీరికెక్కడిదీ-నీ షోకులకూ, సింగారాలకే సరిపోదాయె. మా నాన్నను పరామర్శించే సమయంకూడా ఉంటుందా నీకు..."
"ఎందుకలా నోటికొచ్చినట్టల్లా..."
మళ్ళీ-
ఈసారి శోకాలు-తను పడిపోయింది.
"మహాతల్లీ, నీ దయ నేను సహించలేను. మా నాన్న బాగవగానే పంపించేస్తాను. నీతో ఈ నరకం చాలు. అతను చచ్చేవాడు - ఎంత గొడవయ్యేదో - నువ్వు..."
అతనికి మాటలు దొరకటం లేదు. ఐనా ఏదో తిడుతూనే ఉన్నాడు. తులసి మంచం మీద పడి కళ్ళు మూసుకుంది - తనకు స్మృతి తప్పే సమయంలో కూడా- ఇంకా అరుస్తూనే ఉన్నాడు.
14
గాయపడిన మనసే మిగిలింది గాని సీతాపతి తన శపథాలేమీ నిలబెట్టుకోలేదు. రెండు రోజులు హాస్పిటల్లో ఉన్న ముసలాయన మళ్ళీ వచ్చేశాడు. ఈలోగా సీతాపతి అతణ్ణి గట్టిగా మందలించి నట్టుంది, "ఈ వెధవకొంపలో ఉండలేను. వెడతాను" అంటూ సణిగాడు. కాని మరెక్కడికీ పోలేనని తెలుసుకుని తులసిని మంచి చేసుకున్నాడు.
సీతాపతి ఓదార్పులు, తను మళ్ళీ ఏడ్పులు, అతడు అక్కున చేర్చుకుని క్షమించమని, కొట్టిన తన పాపిష్టి చేతులను శపించి, దెబ్బలు తిన్న బుగ్గలను మరిమరి ముద్దు పెట్టకుని, మరింత బిగ్గరగా కౌగలించుకుని.... నరాల తీవ్రత తగ్గగానే అటు తిరిగి పడుకుని తెల్లవారి మామూలుగా లేచాడు. తులసి అంతకన్నా ఎక్కువ ఆశించలేదు కూడాను.
ఈ ప్రయోగాలన్నీ జరుగుతున్నప్పుడే, క్రితం రోజు వచ్చిన కవరును చించి చూసింది. అది తనకు హైదరాబాదు సిటీ సర్కిల్లో పోస్టల్ క్లర్కుగా ఉద్యోగం వచ్చినట్టుగానూ, పదిహేను రోజుల్లో ట్రెయినింగుకు హాజరు కావలసిందిగానూ ఉత్తరువు. ఒక్కసారిగా సంతోషమూ, సందేహాలూ వచ్చి భర్తను కేకవేసింది. అతడు వెంటనే చేరిపొమ్మన్నాడు.
"మూడు నెలల ట్రెయినింగండీ. జీతం లేదు. ఏదో కొద్ది స్టైపెండ్ మాత్రం ఇస్తారు" అంది.
"ఐతే ఐందిలే, గొర్రెతోకవంటి ఈ ఉద్యోగం కన్నా కొంత మెరుగే చేరిపో" అన్నాడు భర్త.
తను ఇన్నాళ్ళూ పనిచేసిన ఆఫీసులో రాజీనామా ఇచ్చేటప్పుడు తులసికి చేతులు వణికేయి. నలుగురూ నాలుగు రకాలుగా అన్నారు.
"జీతం కొంచెం ఎక్కువేననుకో. కాని ఏం పని - కుక్కపని" అని కొందరు.
"ఫరవాలేదులే. సుఖపడతావు. కష్టం అలవాటై పోతుంది" అని మరికొందరు.
ఎలాగో పెద్ద సంభ్రమంతో ఆఫీసు దాటింది తులసి.
సీతాపతి ఆ రెండు రోజులూ తులసి వెంటే తిరిగి, అవసరమైన ఫార్మాలిటీలన్నీ పూర్తిచేసి, జాయినింగ్ ఆర్డర్స్ తెచ్చాడు. ట్రెయినింగ్ కు వెళ్ళిన మొదటి రోజు తులసి వెంట ట్రెయినింగ్ సెంటర్ దాకా వచ్చి, ఆ రోజంతా అక్కడే ఉండి వచ్చాడు. తులసికి ఆ రోజు ఇల్లు చేరేటప్పటికి చేసిన పనమీ లేకపోయినా ఒళ్లంతా నెప్పివేసింది. తను రోజూ ప్రయాణం చేయవలసిన దూరం-ఇంటినించి, కోఠీనించి, సికిందరాబాదు స్టేషన్ నించి, మళ్ళీ బస్సు మారితేగాని అక్కడికి చేరదు - తలుచుకుంటే గుండె గుభేలుమంది.
భర్త ఈ ఉద్యోగం విషయంలో చాలా సంతోషంగా ఉన్నాడు. బస్సు ఖర్చులే రోజుకు రూపాయన్నర దాకా అవుతున్నవి. అదీగాక పొద్దున్న ఏ ఎనిమిదిన్నరకో బయలుదేరితే మళ్ళీ ఇల్లు చేరేసరికి ఏడుకు తక్కువ కాదు. సినిమాల్లో హింసిస్తూంటే కళ్ళు సగం తెరిచి, పళ్ళమధ్య బాధను బిగపట్టి, భరిస్తున్న రాకుమారిలా ఊహించుకుంది తనను తాను.
ట్రెయినింగ్ క్లాస్ లో మరొక్కతే స్త్రీ ఉంది, శశిరేఖ. శశిరేఖ రెండేళ్ళక్రితం స్కూలు ఫైనలు పాసయిందిట. ఇంకా పెళ్ళి కాలేదట. క్లాస్ లో సుమారు యాభై మందిదాకా ట్రెయినీలు ఉన్నా, అదొక క్లాస్ రూంలా లేదు. వేరే ఉద్యోగాలతో విసిగి, మెరుగైన మరో ఉద్యోగం దొరుకుతుందనే ఆశతో వచ్చిన ఉద్యోగస్థులే చాలామంది. ఇన్స్ ట్రక్టరు వచ్చి డిపార్టు మెంటల్ మాన్యువల్స్ ఇచ్చాడు. రోజూ అవి పారాయణ చెయ్యమన్నట్టుగా మాట్లాడేడు. ట్రెయినింగ్ సెంటర్ చేరేసరికే తులసి అలిసిపొయ్యేది. ఎక్కడ ఆలస్యమౌతుందో ననే భయంతో రొప్పుతూ, రోజుతూ, నడకో, పరుగో తెలియకుండా వచ్చేది.
ఆ ఫస్టుకు మొదటిసారిగా పోస్టల్ డిపార్టు మెంటు వాళ్ళ కాగితాల మీద సంతకం పెట్టి స్టైపెండ్ తీసుకుంది. అదే రోజు చివరిసారిగా తన పాత ఆఫీసుకి వెళ్ళి తనకు రావలసిన అరియర్స్ తీసుకున్నప్పుడు తులసికి మనసులో ఏదో వెలితి తోచింది.
క్రమంగా పోస్టాఫీసంటే తనకున్న భయం కొంచెం కొంచెమే తగ్గుతున్నట్టుగా గ్రహించింది. కౌంటర్ల వెనక కూర్చుని, ఎంతో సమర్దంగా పని చేస్తున్న గుమాస్తాలను చూస్తే ఆమె హృదయం గొప్ప సంతృప్తితో నిండిపోయేది. తనూ ఆ సీటులో కూర్చోవాలి ఓ నాడు!
ట్రెయినింగ్ పుణ్యమా అంటూ తనకు ఆలోచించే తీరికకూడా లేకుండా పోయింది. పొద్దున్నే లేచి, గబగబా వంట పూర్తి చేసి తను తినేటప్పటికే ఏడున్నర అవుతుంది. అప్పుడు కాఫీ తాగి తొందరగా ముస్తాబై ఎనిమిదింటికి బయలుదేరేముందు స్టౌ మీద నీళ్ళు పడేస్తుంది. ఇంక మిగతా ఇంటి విషయాలన్నీ భర్తే చూసుకుంటాడు. సాయంత్రం వచ్చిన తరవాతకూడా తను ముందు కాఫీ చేసుకుని తాగి, ఓ రవ్వ విశ్రాంతి తీసుకుని, స్నానం చేసి, వంట పూర్తి చేస్తుంది. ఈలోగా భర్త తప్పకుండా వస్తాడు. తినేసి పడుకోవటం. అంతే. ఈ ఉద్యోగంలో చేరిన తరవాత భర్త తనకు అట్టే పనులు పురమాయించటం లేదు. తనమీద విసుక్కోవటం లేదు. ఎంతో శ్రద్దగా వచ్చేటప్పుడు రోజూ సుల్తానుబజారులో కూరగాయలు, తన కోసం పూలూ తెస్తున్నాడు. తనకు వంటలో సహాయం చేస్తానంటాడు. కానీ తనే వద్దంటుంది. తను చాలా చిక్కిపోయిందిట. అందువల్ల ఓవల్టీసు డబ్బా తెచ్చాడు. బలవంతం చేసి తనచేత పడుకునే సమయంలో తాగిస్తాడు.
* * *
"ఈ రోజు మీరు మా ఇంటికి రావాలండీ" అంది శశిరేఖ. అది ట్రెయినింగ్ చివరిరోజు. గ్రూప్ ఫోటో అదీ అయింది.
తులసికి, శశిరేఖతో వెళ్ళాలని లేకపోయినా, ట్రెయినింగ్ లో శశిరేఖ లేకుంటే తనెంత ఒంటరిగా గడిపేదో అనుకుంది.
"మీది ఇల్లుకాదు గద. హాస్టల్ ఇల్లెలా అవుతుంది?" అంది తులసి.
"అవునండీ, అదే మా ఇల్లు. మరేం చెయ్యం" అంది శశిరేఖ.
"ఇవాళ మా ఆయన ఊరికెళుతున్నాడు, శశీ. మరోసారి వస్తాను" అంది తులసి.
"ఔనులెండి, మీ రెందుకు వస్తారు" అంది శశిరేఖ.
"కాదమ్మా, అలా తీసుకోక. నీ కెలా చెప్పేది? నే వెళ్ళటం చాలా అవసరం" అంది తులసి.
శశిరేఖ నవ్వింది.
"రేపటినించీ నువ్వు సికిందరాబాదులో, నేను హైదరాబాదులో ఇంక ఇలా రోజూ కలుసుకోలేం. మరి అప్పుడప్పుడూ ఫోన్ చేస్తుంటావా? నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తాను" అంది తులసి.
"మనం కలుసుకోలేమనుకుంటే బెంగగా ఉంటుంది, తులసిగారూ" అంది శశిరేఖ. ఆమె కంఠంలోని సాన్నిహిత్యం తులసిని చకితురాల్ని చేసింది. వాళ్ళిద్దరూ అంత దగ్గరగా వచ్చారని తమకే తెలియదు అప్పటిదాకా.
"అంతమంది మగవాళ్ళతో పని చేయటమంటే ఏమిటో భయంగా ఉంటుందండీ. ఇంతకన్నా టి. ఒ. నైనా బావుండేది" అంది శశిరేఖ.
"ఏదో లెద్దూ. ఏదైనా అంతే. నా ఉద్దేశం ఏమిటంటే ఆడవాళ్ళమధ్య పని చెయ్యటంకన్నా, మగవాళ్ళతో కలిసి పనిచేస్తేనే బావుంటుంది. కొందరు కోతివెధవలు ఉన్నా, మగవాళ్ళకు ఆడవాళ్ళంటే కొంత సానుభూతి, ప్రిఫరెన్సు అలాంటివి ఉంటాయి సామాన్యంగా. కాకపోతే, మనం జాగ్రత్తగా ఎవర్ని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి. మనవాళ్ళ మధ్యనే పనిచేస్తే మనకేం ప్రత్యేకత ఉంటుంది? అది మన మాశించలేం. వాళ్ళివ్వరు" అంది తులసి.
"ఏమోలెండి, నాకేం నచ్చలేదు మీ మాటలు" అంది శశిరేఖ.
"నేను చెప్పేది వినూ. ఇక్కడేమవుతుందో తెలుసా. నువ్వు ఎవర్నీ పట్టించుకోనట్టుగా ఉండు. కొందరు నీ కోసం ప్రయత్నిస్తుంటారు. మరికొందరు నిన్ను రక్షించటానికి రెడీ అవుతారు. కొందరు నీ చేత కృతజ్ఞతలు చెప్పించుకోవాలని పడి చస్తుంటారు. ఇలా వీళ్ళలో వీళ్ళే పోట్లాడుకుంటారు. కక్షలు పెంచుకుంటారు. కొందరు బస్సులో నీ వెంట ప్రయాణం చేస్తారు, బాడీగార్డుల్లా మరికొందరు నీ గతచరిత్ర అంతా తవ్వి ప్రకటించాలని చూస్తుంటారు. నువ్వు దొరక్కపోతే నిన్ను తిట్టుకుంటారు. గొప్ప డ్రామా ఉంటుందిలే. నువ్వు చెయ్యవలసిందల్లా ఏమిటంటే, కొన్ని రెడీ చిరునవ్వులూ, 'థాంక్యూలూ', 'నో, ప్లీజ్' లూ దగ్గిర అట్టే పెట్టుకుని అవసరాను కూలంగా ప్రయోగించటం. అంతే. నీ మార్గం సునాయాసంగా, సుఖంగా సాగుతుంది" అంది తులసి.
"మీకు బాగా అనుభవమనుకుంటాను" అంది శశిరేఖ.
"రెండేళ్ళ ఉద్యోగం మరి. నువ్వింకా ఎక్కువే తెలుసుకుంటావులే" అంది తులసి.
"రేపు జాయినవ్వాలేమో మీ కెలా ఉందండీ?" అంది శశిరేఖ.
"ఛట్. ఎలా ఉండటమేమిటీ" అంది తులసి నవ్వు ఆపుకుంటూ.
* * *
తెల్లవారి -
ఇంట్లో దేవుడికి మొక్కి, భర్త చిరునవ్వులు తీసుకుని, పర్సులో డబ్బు కొంచెం ఎక్కువ వేసుకుని పోస్టాఫీసు కి వెళ్ళింది తులసి.
"నమస్కారమండీ" అంది.
"మీ పేరు తులసీదేవిగదూ" అన్నాడు పోస్టుమాస్టర్.
తులసి తల ఊపింది.
అక్కడే రిజిస్టర్ లో స్టాఫ్ క్లర్కు పేరు రాశాడు. తులసి సంతకం పెట్టింది.
"ఇదిగో, మిస్టర్ శాస్త్రీ, ఈవిణ్ణి రిజిస్ట్రేషన్ సెక్షన్ లో వెయ్యి" అని స్టాఫ్ క్లర్కు కు చెప్పి, తులసితో, "వెళ్ళండి. బాగా పని నేర్చుకోండి. శ్రద్దగా పనిచెయ్యండి. లేకపోతే మీకే మోసం వస్తుంది. జాగ్రత్త" అన్నాడు పోస్టు మాస్టర్.
స్టాఫ్ క్లర్కు తులసికి కౌంటర్ చూపించాడు. అక్కడ పనిచేస్తున్న మరో క్లర్కుకు పరిచయంచేసి వెళ్ళిపోయాడు.
"అప్పుడే ఎందుకొచ్చారండీ, పన్నెండులోపున ఎప్పుడైనా రిపోర్టు చెయ్యొచ్చుగదా" అన్నాడు క్లర్కు నవ్వుతూ.
తను మాట్లాడలేదు.
కౌంటర్ ముందర గేటుదాకా నిలిచిన క్యూ తన వైపు వింతగా చూసింది.
క్లర్కు తనకు రిజిస్టరు ఇచ్చాడు. పోస్టేజి రేటు చూపించి, కార్బన్లు ఎలా సెట్ చెయ్యాలో చెప్పి, "తొందరపడకండి. నెమ్మదిగా బుక్ చెయ్యండి. పబ్లిక్ ఊరికెనే గొడవ చేస్తారు. మీరే మాత్రం గాభరాపడకూడదు. మీ మొహంలో తొందర చూస్తే వాళ్ళు మరింత గొడవ చేస్తారు" అని చెప్పి వెళ్ళిపోయాడు.
మొదటి ఉత్తరం బుక్ చేస్తుంటే తనకు చెయ్యి కంపించింది. ఒక్కో లెటర్ కూ జాగ్రత్తగా పోస్టేజి చెక్ చేస్తూ, అడ్రస్ చదివి, రసీదు రాసి, దానిపైన స్టాంప్ వేసి, పోస్టేజీ డిఫేన్ చేస్తూ తనను తాను మరిచిపోయింది. ఈలోగా క్యూలో గొడవ మొదలైంది. జనం అల్లరి చేస్తున్నారు, "ఈ ఆడవాళ్ళ నెందుకు వేశారు బాబూ కౌంటర్లో, మా ప్రాణాలు పోతున్నాయి, ఎంతసేపు నిల్చోవాలి క్యూలో" అంటూ.
