Previous Page Next Page 
మొగలి పొదలు పేజి 17


    'నీకెంత సిగ్గు లేదు! రాజేశ్వరి పళ్ళు పటపట లాడాయి. 'నన్ను యెంత మాట అంటున్నావూ? నిన్ను మన్నెంచెందుకే అసహ్యంగా వుంది. నీకూతురు విజయ ని పిలిపించి దివాన్ కో ఆ ఎస్టేటు జమీందారు కో సంతోషంగా కానుకియ్యి. నేనూ చదువుకున్నాను. నన్ను అనేందుకు నీకు నోరెలా వచ్చింది?'
    'షటప్.'
    'నా నోరు ముయ్యగలవు కానీ పై నున్న మరొకడి నోరు మూయలేవు.'
    రాజేశ్వరి చేతులు రామదాసు చేతుల్లో యిరుక్కు పోయాయి! ఇన్నాళ్ళూ మీ అమ్మ రక్తం పంచుకు పుట్టావని ఆలోచించాను. నీకింత పోగరేం. పొగరున్న ఆ వెధవ దిక్కులేని చావు చచ్చాడు. నీ బాబు ఎవడూ రాడు యిక్కడికి. నాకింకా పాపం పుణ్యం లెక్క లేదు.'
    'బాబాయ్' నిర్ఘాంత పోయింది; 'నీ కాళ్ళు పుచ్చుకుని బ్రతిమాలాడు కుంటాను బాబాయి. నీ మాట వింటాను నన్ను వదిలిపెట్టు. నువ్వు చెప్పినట్లు చేస్తాను. నన్ను ముట్టుకోవద్దు బాబాయ్. అమ్మని తాకిన నువ్వు...వొద్దు...వొద్దు....'
    రామదాసు చేతులు విడిపడి పోయాయి. అందుకు కారణం లేకపోలేదు. పద్మావతి యెప్పుడూ యే విషయం లోనూ కలిపించుకో లేదు. యిన్నేళ్ళ కి ప్రాధేయ పూర్వకంగా అతన్ని తన వైపు తిప్పుకుని నిశ్శబ్దంగా ఆ కళ్ళల్లో కి చూసింది. అందుకే అతను బందీ అయిపోయాడు.
    రైలు దూసుకు పోతుంటే డుక్కు తోచక హైదరాబాదు కు టిక్కెట్టు తీసుకుంది రాజేశ్వరి. అక్కడ యేవరున్నారు? సర్టిఫికెట్లు కొండంత ధైర్యం యిచ్చాయి. తూరుపు రేఖలు తెల్లబాడుతుంటే వరంగల్ స్టేషను లో రైలు ఆగింది. అంతే సూదంటు రాయికి యినుప రజను తగిలినట్లు రాజేశ్వరి మెదడు కి శ్రీనివాస్ గుర్తుకు వచ్చాడు. చటుక్కున చేతి సంచితో  అక్కడే దిగిపోయింది .
    శ్రీనివాస్ దీర్ఘంగా నిట్టూర్చాడు : 'ఆడది బ్రతకలేదు వొంటరిగా. మగవాడి అవసరం జీవితం పొడుగునా వుంటుంది. ఎవరో అన్నట్లు చంద్రుడి లో చల్లదనం, మేఘాల్లో నీరూ, లతలోని ఆధారపడే స్వభావాన్నీ, శిలలోని కాఠిన్యాన్ని , సూర్యుడి లో వొక విధం అయిన కాంతి కలిపి సృష్టించాడు విధాత. అందుకేనేమో యిలా బ్రతకాలిసి వస్తుంటుంది. యెవరు రాశారో గాని నిజాన్ని యెంత చక్కగా రాశారు?'

               
    'యిప్పుడు నన్నేం చేయమంటారు?'
    'చేసేందుకు యేముంది? మీకు వుద్యోగం ప్రయత్నిస్తాను. మీకు నచ్చితే యిక్కడే వుండి పొండి. లేకపోతె మీకు ఆశ్రయం యిస్తానని అని యెవరైనా చల్లని పిలుపు పిలుస్తే నా దగ్గిర ఉండద్దు.'
    'మీ బ్రతుక్కి వో అర్ధం వుండాలి. మీకు నచ్చిన వ్యక్తీ దొరికితే నాతొ చెప్పండి. నేను మీ బాధ్యత తీసుకుంటాను. యింతకు మించి యేమో యేమో యింకా యింకా చేస్తానని వాగ్దానం చేసి మాత్రం మిధ్యా వాదిని కాలేను.'
    రాజేశ్వరి కళ్ళు తడిశాయి. అతని అపార అనురాగంతో కూడిన రెండు పలుకులకి అప్రయత్నంగా అతని పాదాలు అంటుకుంటుంటే కఠినంగానే అన్నాడు : 'మానవుడి కనీస ధర్మం అది. అంతేగాని మనిషినీ దేవుడినీ యేకం చేయకండి. నా మటుకు నేను భగవంతుడి పాదాలు తప్ప నేను మరో కాళ్ళ ని అంటుకోను. అలా అంటుకోవడం నాకు పరమ అసహ్యం. విశ్వరూపుడి పాదాలు తాకితే చాలు. ఆ పాదాల క్రింద మలినం అయిన అనేక మంది ధూళి మన నెత్తిన వుంటుంది. మామూలు మనిషిలో యేముంది ,' అని ఆగి, 'నా మాట వింటున్నారా.?' అన్నాడు. 'ఆ, ఆ, వింటూనే వున్నాను.' రాజేశ్వరి ;వూ' కొడుతూనే వుంది. అర్ధరాత్రి వరకూ మాటల్లో పడ్డ యిద్దరూ చెరో మూలా వాలిపోయారు నిద్రాదేవి వొళ్ళో కి.

                         *    *    *    *
    రోజులు గడిచేసరికి శ్రీనివాస్ కి రాజేశ్వరి లేనిదే క్షణం జరగదేమో అనిపించింది. శ్రీనివాస్ ప్రయత్నం చేయనూ లేదు. రాజేశ్వరి వుద్యోగం రానూ లేదు.
    'చూడండి రాజేశ్వరి మీరు వుద్యోగం దొరికాక వెళ్ళిపోతే నాకు కావలసినవి యెవరు చూస్తారు?'
    'అందుకే కద వుద్యోగం పేరే ఎత్తడం లేదు. మాటల్తో తేనెలు వూరిస్తున్నారు . నాకింక వుద్యోగం యీ జన్మకి రాదు. నేను యిలాగే నాలుగు గోడల మధ్య........
    'యిరుక్కు పోతుంటే నేను చేతిని అందించి రావోయ్ రాజేశ్వరి వుద్యోగం వీదిలోకి వచ్చేసింది. అని లాక్కుపోతాను.'
    రాజేశ్వరి కోపం యెగిరిపోయింది క్షణం లో. యిల్లు మాటల ముత్యాలతో , నవ్వుల గలగలతో నిండిపోతుంది. యింక వేరే ఆలోచనలే వుండవు యిద్దరికీ.

                            *    *    *    *
    ఆనాడు.....సుభద్ర వెనక్కి తిరిగి చూసింది మాధవరావు అంత క్రితమే వచ్చేసి సుభద్ర వీపుకి చాలా దగ్గరగా నిలబడ్డాడు. అటు తిరిగింది సుభద్ర. నిశ్చేష్టురాలై పోయి అతని శరీరం లోంచి వచ్చే వేడి వూడ్పు కి సుభద్ర మొహం యేర్రబడి పోయింది.
    'ఎందుకీ వచ్చావు యిక్కడికి?' కఠినంగా అంది.
    'అర్ధం లేని ప్రశ్న.'
    సుభద్ర కి అయోమయంగా వుంది. అంతా. 'అసలు యిప్పుడు నా యింట్లో అయన లేకుండా యెవరు రమ్మనారు నిన్ను. ముందు వెళ్ళు బయటికి. నీకెంత ధైర్యం? దౌర్భాగ్యుడా నా చేతులు పట్టుకునేందుకు నీకేవడిచ్చాడు అధికారం?'
    'చెప్పనా?' మాధవరావు గొంతు తమాషాగా పలికింది.
    'వొద్దు నాకేవీ చెప్పద్దు. నువ్వు ముందు బయటికి వెళ్ళు. నువ్వు యెవరో తెలీదు నాకు. నిన్ను రమ్మన లేదు. అయన లేకుండా.......
    'ఆహాహాహ్హహ్హ . ఆయన ఎవడు? వాడా? ఆ ఫూలా నీకు అయన. నీ పేరు సుభద్ర కదూ అవును సుభద్రే. వాడు రాత్రి పేకాట లో బాకీ పడ్డాడు. వంద రూపాయలకి అమ్మేశాడు నిన్ను.'
    'నన్ను....నేను వస్తువునా అమ్మడానికీ, కొనుక్కోడానికీ.' మాధవరావు తగ్గి శాంతంగా అన్నాడు : 'నిన్ను చూస్తె అమాయకురాలిగా కనిపిస్తున్నావు. యిది ప్రపంచం. ప్రతిది అమ్మేందుకు , కొనేందు కూ వుపయోగపడే వస్తువులే చలామణీ అవుతుంటాయి. పశువులో, పక్షులో , జంతువులో అయితే వాటిని ఒకసారి కొనడం తరువాత తినేయడం జరుగుతూ వుంటుంది. మనుష్యులు అయితే.......
    'అయితే అందరు మనుష్యుల్ని అమ్ముతారా?'
    'కుర్రాళ్ళు అయితే పెంపకానికో , పనికో అమ్ముతారు. యింక నీలాంటి ఆడదాన్ని నాలాంటి వాళ్ళు వుపయోగించుకుందుకు .'
    మాధవరావు గారూ!'
    'నీకింక ప్రపంచం పూర్తిగా తెలియదు. నేను చెప్పేది విని అర్ధం చేసుకో. నువ్వు నావోక్కడికి అమ్ముడై పోయావు. నా దగ్గర కానీ లేని రోజున నిన్ను తప్పని సరిగా మరొకళ్ళ కి అమ్మేయాలి.'
    'నేను మంచి కుటుంబంలో పుట్టాను. ఆర్ధిక చిక్కుల వల్ల పరువు- ప్రతిష్టల కోసం వొక వృద్దుడి ని చేసుకున్నాను. జగదీశ్ నన్ను అందని లోకాలకి తీసుకు వెళ్లి ఆశలు పెంచి నన్ను నిలువునా కూల్చేసి యిలా యింత దారుణంగా అన్యాయం చేస్తాడను కోలేదు. అతను ఏడీ?'
    'లేడు. వెళ్ళిపోయాడు. యింకా చాలా మందికీ బాకీ పడ్డాడు. వాళ్ళు తెల్లవారితే బ్రతకనీయరు అతన్ని.'
    సుభద్ర కి యేడుపు రావడం లేదు. 'మీకూ నా వంటి చెల్లెళ్ళు వుంటారు. నా మొహం చూసి చెప్పండి. మీ చెల్లెలు వోక్కరూ గుర్తుకు రావడం లేదూ.'
    'లేదు సుభద్రా . అవన్నీ ఆలోచించేందుకు మాకు టైము వుండదు. ఆ మొహల్నీ నెమరు వేసుకుంటూ కాలయాపన చేసేందుకూ. ఆలోచించేందు కూ టైము వుండదు మాకు. దాని వల్ల లాభం లేదు. నిన్ను వంద రూపాయలకి కొనుక్కున్నాను. అంటే గిరాకీ వస్తే మంచి బేరానికి అమ్మేస్తాను.'
    'మీ కాళ్ళు పుచ్చుకుని వేడుకుంటాను. నన్ను రాజమండ్రి తీసుకు వెళ్ళండి. అక్కడ మా శ్రీనివాస్ వున్నాడు అతని చేత మీకు కావలసిన డబ్బు యిప్పిస్తాను. మీలో మంచితనం లేదని అనుకోను. మొదట తొందర పడ్డా మీలో ఏదో దయాగుణం వుంది. అందుకే నాకు విడమరిచి యిన్ని చెప్పారు.
    మాధవరావు క్షణం అలోచించి అన్నాడు! 'నిన్ను చూస్తె నాకు జాలి వేస్తోంది.' కానీ నేను మాత్రం ఏం చేయను? నా భార్య రోగిష్టి ది. డాన్ని నేను యేలు కోలేను. నిన్ను పెళ్లి చేసుకుని నాతోనే వుంచుకునే ఔదార్యం నాకు లేదు. ఏం చేసినా మగవాడికి లోకం ఆమోద ముద్ర వుంటుంది. నువ్వు అలా కాదు ఒకటికి రెండు సార్లు చేతులు మారావు. నీలో ఏ మాత్రమో సౌశీల్యం వుందని నా అంతరాత్మ కి మభ్యపెట్టి చెబుదాం అనుకున్నా యిప్పుడు నువ్వు మామూలు మనిషివి కావు. నన్నూవుపయోగించుకానీ. వంద రూపాయలంటే మాటలు కావు!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS