Previous Page Next Page 
మొగలి పొదలు పేజి 16


    'యేమో ?' ప్రశ్నలూ, జవాబులూ మనసులోనే జరుగుతున్నాయి. 'నేను యిక్కడికి వచ్చాను. కారణం అడగలేదు మీరు' రాజేశ్వరి అంది. నవ్వాడు శ్రీనివాస్. 'మీరు వచ్చారు. కనిపిస్తూనే వుంది. యేవీ అనక ముందే నా మీద లక్ష నిష్టూరాలు వేస్తున్నారు. నేను వాటికే హడలెత్తి పోతున్నాను.'
    'జడుపు విభూది పెట్టించ మంటారా'
    'యింకా రాత్రి కాలేదు కదా! అంత భయం లేదు లెండి. ప్రభాకరం యెలా వున్నాడు.'    
    చప్పున ఏదో గుర్తుకు వచ్చిన దానిలా అంది. 'మీరు నాకు గవర్నమెంటు వుద్యోగం చూసి పెడతారా?'
    శ్రీనివాస్ కళ్ళ ప్పగించి చూశాడు. కాస్సేపాగి 'నాకంత యిన్ ప్ల్హుయీన్స్ లేదు. నేనేం చేయగలను? ప్రయత్నం చేద్దాం. మీకంత తొందరేం , నాకు ఉద్యోగం వుంది. యింకా వూడలేదు' అన్నాడు.
    'అందుకు కాదు'
    'మరెందుకని.'
    'నేను రాకమండ్రి నుంచి యేకాయేకి యిక్కడికే వచ్చేశాను. నాకు మళ్లీ యింటికి వెళ్లేందుకు అర్హతలు లేవు. అవి నిన్నటితో ఆఖరయ్యాయి. ఈ ప్రపంచంలో మిత్రులూ, అప్తులూ సన్నిహితులూ నాకు మీరు' రాజేశ్వరి వెక్కి వెక్కి యేడుస్తోంది.
    'యిప్పుడెం జరిగింది. అసలు సంగతి ఏదో దాస్తున్నారు. ఏడవకండి. ప్రభాకరం నా ప్రాణం. అతను కూడా మిమ్మల్ని అదుకోలేదంటే ఆశ్చర్యంగా వుంది.
    రాజేశ్వరి మౌనంగా వుండిపోయింది. చాలాసేపు. గంటలు గడుస్తుంటే అంది: 'నాకు ఆకలి దహించుకు పోతోంది. వంటకు కావలసిన సామాను యెక్కడున్నాయో? ఇల్లు కొత్త. తెలీదు నాకు. మీరు అందిస్తే....'
    శ్రీనివాస్ నొచ్చుకున్నాడు. ఏవో పనికి రాని కబుర్ల తో కాలం వృధా పుచ్చాడు యింతసేపూ. రాజేశ్వరి కి మరి సమాధానం యివ్వలేదు. వంట సామాగ్రి అందివ్వడంలో నుమగ్నుడయ్యాడు. రెండు గదులు. వంట యిల్లు మరీ యిరుకుగా వొక మనిషి మేసిలెందుకే సరిపోనంత చిన్నదిగా వుంది. రెండో గదిలోనే డ్రాయింగ్ రూమ్, డ్రైనింగ్ రూమ్. యిలా ఆ గదినే అనేక రూపాంతల్లోకి మళ్లిస్తూ అతను గడిపేస్తున్నాడు. వీధిలో గాని, యింట్లో గాని ఎలక్ట్రిక్ దీపాలకే నోచుకోలేదు. అతను మనసులో సందేహ పడుతున్నాడు. ఎలా ఈ చిన్న యింట్లో గడపడం అని?
    'ఇల్లు పెద్దదే. యిద్దరి కన్నా యెక్కువ మనుషులే వుండవచ్చును సునాయాసంగా.' రాజేశ్వరి ఫక్కున నవ్వింది.
    శ్రీనివాస్ మొహం ముడుచుకు పోయింది. 'మీరిలా చిటికీ మాటికీ వేళాకోళం ఆడుతుంటే యీ ప్రపంచం లోనే మనకి ఇల్లు దొరక కూడదని ప్రార్ధిస్తాను.'
    'ధన్యురాలను?'
    "దేనికి?'
    "ఇల్లు కొంచెం పెద్దగా వుంటే మరో బాచ్ లర్ వచ్చేసి 'బాబ్బాబు' అనో 'అమ్మమ్మా' అనో యింటి కోసం రావడం హైరానా పెట్టడం అవుతూంటుంది. అందుకని ఈయిల్లె స్వర్గ ధామం లా చేసుకుంటే మనం హాయిగా దేవతల్లా.....'
    'నోట్లో వేలేసుకుని విహరిద్దాం అంటారు. ఆ పప్పులెం ఉడకవు రేపే యిల్లు చూస్తాను.'
    రాజేశ్వరి నవ్వులతో యిల్లు ప్రతిధ్వనిస్తోంది. శ్రీనివాస్ గుండెల మీద చేతులు వేసుకుని పరుపుకి వెనక్కి వాలి రాజమండ్రి విశేషాలు అడుగుతున్నాడు. అతను యెన్నో రోజుల తరువాత తృప్తిగా భోజనం చేశాడు.

                                  8
    రాజేశ్వరి కొంగు లో మొహం దాచుకుని ఏడుస్తుంటే నెమ్మదిగా అడిగాడు : 'గట్టి కారణం ఏదో వుంటే గాని రారు మీరు. మీరు నా యింటికి వచ్చినందుకు నాకేం అభ్యంతరం లేదు. కానీ అక్కడ ఏం జరిగిందో చెబితే నాకు ఆరాటం తగ్గుతుంది.'
    'చెబుతాను. తప్పదు. చెప్పకుండా ఎన్నాళ్ళు దాచగలను. ప్రభాకరన్నయ్య.......
    'ఏం? వాడే మన్నాడు.' ఆదుర్దాగా అడిగాడు శ్రీనివాస్.
    'అన్నయ్య అనేవాడు అయితే యింత దూరం వచ్చేదాన్నా. అన్నయ్య పోవడం మీకు తెలీదు.'
    'ఆ ప్రభాకరం చచ్చిపోయాడా.' శ్రీనివాస్ గుండెల్లో వేలకొలది గంటలు మ్రోగుతున్నాయి. లక్షల కొలది పిడుగులు పడుతున్నాయి. అగ్నిపర్వతాలు బ్రద్దలౌతున్నాయి. సముద్రాలు వురకలు వేస్తున్నాయి. ఝుంఝూమారుతం లాంటిది వూపిరి సలుపుకో నివ్వడం లేదు అతన్ని. అతను యేడుస్తున్నాడు. అతని గుండెల్లో  ప్రతి వస్తువూ కరిగి కన్నీటి బిందువులు గా మారి కిరసన్ దీపం కాంతిలో తప్పుమని బుగ్గల మీదుగా నేలమీదికి పడుతున్నాయి. 'నాకు తెలుయనే లేదు' పదే పదే అనుకుంటున్నాడు యీ మాటల్ని.
    అప్పుడు అన్నది రాజేశ్వరి : 'మీకు టెలిగ్రాం యిప్పించాను. అది వాపసు వచ్చింది.'
    'అవును ఆ టైములో పిన్ని కోసం వెళ్లాను. ఎలా పోయాడో.......'
    'వరదలు ఉదృతంగా వచ్చాయి. ఆ రూమ్ లో దిక్కు మొక్కు లేని అన్నయ్య కి కలరా వచ్చింది. ఏం బాధపడ్డాడో చచ్చిపోయాక యింటికి కబురు చేశారు. అదీ నా ఖర్మే.'
    'మీ అమ్మ.'
    'అమ్మ ఏం చేస్తుంది. చేతనైనంత సేపు యేడవడం తప్ప బాబాయి యెదుట యేడవడం కూడా భయమే'
    రాజేశ్వరి క్రమ క్రమంగా అతనికి జరిగిన సంగతులన్నీ మాలగ్రుచ్చి వేస్తోంది....
    'నువ్వు యిన్నాళ్ళు యిక్కడ వున్నావు. నేను అందుకు అభ్యంతరం యేవీ చెప్పలేదు. మీ అమ్మని నేను చేసుకున్న విశ్వాసం తో చెప్పునట్లు చెయ్యాలి అంతే....' రామదాసు శాసించాడు.
    'యేవిటి బాబాయ్ అది?'
    'నిన్ను చదివించాను. వాడు పోనే పోయాడు. నీకు పెళ్లి అవడం కష్టం. విజ్జికి పెళ్లి చేయాలి. నువ్వు మార్గం వెతుక్కో.'
    'అంటే.'
    'యీ యింట్లో నే గోప్యంగా యీ ముసలితనం లో తల్లినీ నన్నూ పోషించవలసిన బాధ్యత నీమీద వుంది.'
    'అలాగే బాబాయి. వుద్యోగం యిప్పించండి.'
    'నన్ను నలుగురిలో అల్లరి పాలు చేయకు రాజేశ్వరీ. నాకు తెలుసు నీ వుద్యోగం వల్లే మేం బ్రతికి పోతున్నాం అని నలుగురూ చెప్పుకోవాలనా?'
    'మరి నన్నేం చేయమంటావో చెప్పరేం బాబాయ్? మాట్లాడవేం అమ్మా' .
    'మీ అమ్మ అనవసరం యిక్కడ. రేపు గోపాలపురం దివాను వస్తాడు. అతన్ని సంతోష పెట్టు. అతను యేటా మనకి తిండి గింజలూ, కొబ్బరి కాయలూ చూస్తాడు.'
    'బాబాయ్.'
    'విజ్జి చదువు కోసం ఖర్చు చేయగా మిగిలిందాంతో డానికి పెళ్లి చేయాలి వింటున్నావా.'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS