Previous Page Next Page 
అతని లక్ష్యం పేజి 16

 

    'ఊ, కానివ్వండి నాకూ మళ్లీ జ్ఞాపకం చేసినట్టవుతుంది .' అంది ధైర్యంగా నిర్మల.
    'వో సారెం?-- ఆ! జ్ఞాపకం చేసుకొనీ'
    'నా మొహం లాగే వుంది. నిజమైన రసికత గలవారైతే --మీకీ --'
    'ఈ జన్మ లో మళ్లీ అనుభవించతరం గాని ఆ మధురాతి మధుర సన్నివేశాన్ని మరుస్తానా?' అంటావ్. అంతేనా?' అంటూ, భార్య ప్రారంభించిన వాక్యాన్ని తనే పూర్తీ చేశాడు తిలక్.
    "ఆ, అదీ,' అంది దాన్ని ఆమోదిస్తూ నిర్మల.
    'ఉష్! మన పెళ్లి కి ముందు వో మంచి బహుమానాన్ని అతి రహస్యంగా నీకు తెచ్చిస్తే, అది పట్టు కెళ్లి పదిమంది మధ్యా కుర్చునున్న మీ అమ్మ చేతుల్లో పెట్టినట్టూ! జ్ఞాపకం వచ్చేలోగా హడావిడి చేసి, నీ తెలివి తక్కువతనం చూపిస్తే ఎలాగా!' అన్నాడు చెప్పదల్చుకున్న రహస్యాన్ని ఉపమానం చెప్పినట్టుగా బయట పెడుతూ తిలక్.
    'అబ్బబ్బ ఏ వబద్దాలు గద,' అంది రోషంగా నిర్మల.
    'పైగా ఇదొటా , అసలందు వల్లనేగా, అప్పట్నుంచీ మళ్ళీ మన పెళ్ళైన అరుమసాల వరకూ, బహుమతులు కాదు కదా, మళ్ళీ ఎక్కడ వాళ్ళమ్మ కిచ్చి చదవ మంటుందో నన్న భయంతో చివరికి వొక్క ఉత్తరం కూడా రాయడం మానుకుంటా' అన్నాడు కన్ను మీటుతూ హాస్యంగా తిలక్.
    'మరీ ఇంత అబద్దాలాడేస్తే ఎలాగ తిలక్' అన్నాడు నవ్వుతూ మురళీ.
    'ఆ, అలా అడగండి' అంది తప్పట్లు కొట్టి నవ్వుతూ నిర్మల.
    'నేనా అబద్దమాడుతుంటా ' అన్నాడు రోషంగా తిలక్.
    'లేకపోతె ఏవిటి! పెళ్ళికి ముందల్లా నువ్వు రాసిన ఉత్తరాల్నీ అతి రహస్యంగా పోస్టు చేసిందీ! పుట్టిన రోజూ వగైరా లకు నువ్వు కొన్న బహుమతుల్ని రహస్యంగా పార్శిల్ చేసెనవాణ్ని, నేనైతే ఏకంగా అంత కోత కోసేస్తే! ఎవమాటవీ? ఏవంటావ్ వదినా' నవ్వుతూ చల్లగా అంటించిన ఈ మాటకి ఎరుపెక్కిన మొహంతో నిర్మల తలోంచేసుకుంటే, 'నాపరువు కాస్తా , తీశేశావు కదురా?' అంటూ లేచాడు తిలక్.
    'ఇంతకీ  మీ విషయం తెముల్చుకొనే లేదు' అంది నిర్మల. అసలు ఊర్లో వున్నప్పుడు కూడా ఒక్క రాధ తప్పితే మిగతా వారంతా, రాజమ్మ గారి వద్ద కన్నా వదినైనా నిర్మల వద్దనే చనువుగా వుండడం అలవాటు.
    'అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈ వారం లో నేను కాంపు వెళ్తున్నాను గానీ! మీ పనులన్నీ నే తిరిగొచ్చే లోగా ముగించు కొండి. మళ్లీ నే తిరిగి రావడం తోనే మా ఫాక్టరీ వార్షికోత్సవాలు ప్రారంభమై పోతాయి. అప్పుడింక ఊపిరి తీసుకుందుక్కూడా తీరుబడుండదు నాకు తెలిసిందా.' అన్నాడు తిలక్.
    'రక్షించావ్ . నువ్వే ఇలా వొక గడువు వంటూ పెట్టె శావంటే! ఇక వదినేను హెచ్చరించాల్సిన అవుసరమే వుండదు నాకు' అంటూ తనూ లేచాడు మురళి. వాళ్ళిద్దరూ మళ్ళీ పని మీద వెళ్లిపోవడంతో బాబు లేచే లోగా మిగతా పన్లు పూర్తీ చేసుకుందుకు తలపడింది నిర్మల. అనుకున్న ప్రకారం ఒక నాలుగు రోజులున్నాక రాధ నిక్కడ వదిలేసి తను తిరిగి విజయవాడ వెళ్లిపోయారు రాజమ్మ గారు. ఆరోజు నుంచీ రాధ లేని సమయం చూసి ఆలోచన్లు జరుపుతున్న వదినా మరుదులిద్దరూ చివరికీ నళినీ వాళ్ళింటి కెళ్లి రావడం కోసరం ఒక సాయంత్రాన్ని నిశ్చయ పరుచు కున్నారు.
    'నీ అభిప్రాయం ప్రకారం ఇవాళ నిన్ను మీ ఇంట్లో కల్సుకుందామా వదినోస్తుంది.' అన్నాడు విడిగా ఒక్కర్తే హాస్పిటల్ వేపు వెళుతున్న నళిని వద్ద కెళ్ళి మురళి.
    'అబ్బ, ఈ మిగతా ఏడాదీ అయ్యేలోగా ఎందుకో ఇంత తొందర.' తలోంచుకునే అంది నళిని.
    'ఎవరో ఒకరు త్వరపడితేగా రెండో వారి ప్రయత్నం సులువవడం.'
    'అయినా అపరిచితురాలిన మా ఇంటికి ఆవిణ్ణి ముందుగా రమ్మనడం భావ్యం కాదు. కావలస్తే బీచి లో కల్సుకుందాం.'
    'ఇదీ వో మంచి ఐడియాయే. అలాగే చేద్దాం....అయితే రేపు సాయంత్రం ఈ బ్లాక్ వద్దే స్థిరంగా ఉండూ.'
    'అలాగే.' గబగబా వెళ్లిపోయింది నళిని.
    నళినిది చాలా దూరాలోచన బుద్ది ఎంతో పరిశీలిస్తేనే గానీ ఎవ్వరితోనూ స్నేహం చెయ్యదు. ముక్కుకి సూటిగా పోవడమే తప్ప తిప్పించీ, మళ్ళింఛీ మాట్లాడ్డం అలవాట్లేదు. అందువల్లనే చిన్నప్పట్నుంచీ అదే ఊర్లో వుంటున్నా, ఆవిడ కున్న స్నేహితులు బహు కొద్ది మందే.
    నళిని తో చెప్పిన ప్రకారం మర్నాడు సాయంత్రం చెప్పిన టైం కి సరిగ్గా నిర్మలతో సహా నళిని పనిచేస్తుండే బిల్డింగ్ వేపు కొచ్చి 'హారన్ ' ఇచ్చాడు మురళి. మరో అయిదు నిమిషాల కల్లా గబగబా మేడ మెట్లు దిగొచ్చి నిర్మల కి నమస్కరించి, నిర్మల పక్కనే తనూ కూర్చుని, తలుపు మూసింది నళిని. కారు బీచి చేరుకొని ముగ్గురూ వో విడి ప్రదేశం లో కూర్చునే దాకా ఎవ్వరూ మాట్లాడలేదు.
    'మీ బాబా?' పల్కరిస్తూ బాబు నందుకుంది నళిని. 'ఈ ఒక్క పాపేనా?!'
    'ఔనండి. వీడు చాలు. పదిమంది పెట్టు. ఏ పనీ చేసుకోనివ్వ కుండా.'
    'ఔనా బాబూ?' బాబు బుగ్గల్ని నిమిరింది నళిని.
    'కొత్తన్న మాట లేదు.'
    'అదే చూస్తున్నా.' చనువుగా అంది నళిని.
    కొత్తవారితో పరిచయం అందులోనూ ఇటువంటి విషయం లో చూడ్డానికని రావడం అన్నది తెలిసుండే ఉన్నదున్నట్టూ అలాగే వచ్చేసిన నళిని నిరాడంబారత్వాన్ని మెచ్చుకుంది నిర్మల. రాధ లాగ కొట్టోచ్చినట్టు కనిపించే  ఆడంబరపు అందం గాకుండా నిరాడంబరంగా ఇంపితంగా సంసార స్త్రీ కి తగినట్టూ ఆ చక్కని చామన చాయలో మరుగున పడి ఉన్నట్టుగా వుండే సౌందర్యం నళినిది. మొత్తానికి నళినికి నిర్మలా నిర్మలకు నళిని ఒకరికోకరుగా నచ్చినందున అరమరికలేవీ లేకుండా సూటిగా నడిచింది సంభాషణ.
    'రాధకి మీరింకా కొత్తనుకుంటా' అంది నిర్మల.
    'అవునండి అయినా ఆవిడ పద్దతులు నాకంతగా నచ్చనందున మా ఇద్దరి పరిచయం ఎప్పటికీ పాతబడదనుకుంటా' అంది నళిని. కొంతసేపు మనుషుల తత్వాల పై విమర్శనం నడిచాక 'సరే ఇలా లేద్దామా? ఏదో ఈ కాల పరిస్థితుల్ని బట్టి పిల్లల కెంత స్వేచ్చ ఇచ్చినా పెద్ద వారితో సంప్రదించడమ్మన్నది ఒకటుందిగా! అదీగాక అలా చెయ్యడమే ఉభయత్రా క్షేమం కూడా. అందువల్ల ఈ విషయం అత్తగారికి రాసి త్వరలో వారి అభిప్రాయం తెలియ జేస్తాం' అంది లేస్తూ నిర్మల.
    'అదే మంచి పద్దతని నా అభిప్రాయం కూడా. అందుకే మిస్టర్ మురళి ని కూడా' ఏదో చెప్పెయ్యబోయిందల్లా దబ్బున నాలిక్కోరుకుంటూ తలోంచేసుకుంది నళిని.
    'పోనీలే నాతొ చెప్పొద్దు. ఆ తోలి అనుభవాలు అంతరంగిక రహస్యాలూ అలానే నీ హృదయం లో పదిలం చేసుకున్నావంటే భవిష్యత్తు లో ఏ కారణం వల్ల నైనా కల్గుతుండే వేదన్లను మరిచేందుకు ఈ మధుర స్మృతులు అమూల్యంగా పనిచేస్తాయి ' అంది నళిని తలని ప్రేమతో నిమురుతూ నిర్మల ఆ తరవాత మెల్లిగా ముగ్గురూ బయల్దేరారు.
    మొత్తానికి ఒక రెండు గంటల కాలాన్ని వారక్కడ సంభాషణ లో గడిపినా ముఖ్యమని తోచినప్పుడు ఏ ఒకట్రెండు విషయాల్లోనో తప్ప మురళి కల్పించు కోలేదు.
    'అబ్బ ఈ బీచి కొస్తే ఇదే అవస్థ .' అంది దార్లో కనిపించి పల్కరించిన ఒకరిద్దరు స్నేహితుల్ని చూసి నళిని.
    'ఈ పాటికే ఇంత ఫీలైతే ఎలాగా. ఇంతకీ మనిద్దరం కలిసి పనిచేస్తున్నా మన్నది ఎవరెరగరనీ' అన్నాడు మురళి.
    'అదే పొరపాటు . ఊరంతా ముంచడానికి ఏరంతా గండి పడాలా? ఒక్కచోట కట్ట తెగిందంటే చాలు. అంది కార్లో' వెనకాతల కూర్చునున్న నళిని.
    'నిజం అసలిటువంటి ప్రచారాలకి జంకేది ఆడవారూ, అనువిచ్చేది మగవారూనూ, ఎక్కడా ఇంతే' అంది నిర్మల.
వారు హాస్పిటల్ వద్దకి చేరుకునేసరికి , నళిని వాళ్ళ కారక్కడాపుకుని! సిద్దంగా కూర్చునున్నాడు డ్రైవరు.
    మురళినీ, నళినిని మార్చి మార్చి చూస్తూ వోసారి నవ్వుకుని నళినీ కోసరం తలుపు తెరిచాడు డ్రైవరు. వెంటనే వీడ్కోళ్లు చెప్పుకుని ఎవరి దార్ని వారు వెళ్లిపోయారు.
    ఇంటికొచ్చిన నళినిని చూడగానే ముసిముసిగా నవ్వుల్నాపుకుంటూ వాళ్ళ మేనమామ అవతలి కెళ్ళిపొతే! 'ఏమే మనవరాలా? ఇంకా అక్కడా, ఇక్కడా అని మేం సమ్మందాల్ను వెతుకుతుంటే?'-- అంటూ రాగం తీసింది నళిని అమ్మమ్మ అర్ధ భావంతో?
    'అలా మీ కందరికీ అంత శ్రమివ్వడం ఎందుకనీ -- అని సూటిగా బదులిచ్చింది తల్లి చేతుల్లోని కప్పు సాసర్ల నందు కుంటూ నళిని.
    'అబ్బో? నీకాపాటి తెలిసోచ్చిందంటే మాకింక కావల్సిందేం వుంది కానీ' మరి ఆ నువ్వెంచుకున్నవాడి కులం గోత్రం ----
    'నాకూ ఆపాటి తెల్సు నమ్మమ్మా. ఊర్కే అందరూ వినేలా అరవకూ' విసుక్కుంది నళిని.
    'అందరూ వినకుండా రహస్యంగా పెళ్లి చేసుకుంటావా అయితేనూ....' నళిని తల్లి మందలించింది.
    'అబ్బబ్బ....అసల్సంగతోదిలేసి దాన్నూర్కే అలా అల్లరి పెట్టేస్తారేవిటర్రా అంతానూ....' అంటూ అక్కడకొచ్చిన జోగారావు గారు ఏవిటమ్మా అసలు విషయం అని లాలనగా అడిగారు పిల్లల ఆశయాలకి బాగా ప్రాముఖ్యత ఇవ్వాలనుకునే జోగారావు గారు.
    'ఏవీ లేదు నాన్న, నా క్లాస్ మేట్ ఒకతను ఇప్పుడు నాతోటే పని చేస్తున్నాడు. అతడు తన అభిప్రాయాన్ని వాళ్ళ వదిన గారి ద్వారా అడిగించాడు. నేనూ మా వాళ్ళని కనుక్కుని సమాధానం పంపుతా నన్నాను. అంతే.
    'మరి ఈ విషయాలేవీ నాతొ చెప్పలేదేం?
    'ఏదీ సాయంత్రమే అవిడోచ్చి నాతొ మాటాడ్లారు రాత్రి మీతో ఈ విషయం చెప్పాలని అనుకున్నా, ఇంతలోనే ఈ బీచి మకాం మావయ్య గారీ కబురుకీ చిలవలూ, పలవలూ పెట్టి చెప్పినట్టున్నాడు వీళ్ళంతా ఏక గొడవ చేసేస్తున్నారు.'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS