Previous Page Next Page 
నీళ్ళు రాని కళ్ళు పేజి 16


                                       10
    పది రోజులు దాటినా వారి దగ్గర్నుంచీ ఉత్తరం రాలేదు. ఈలోగా నేనొక ఉత్తరం రాసినా అందుకూ సమాధానం రాలేదు. నా మనోవేదన చూసి 'అన్నయ్య జైలు నుంచి ఎప్పుడు తిరిగోస్తాడే" అన్నది అమ్మ, ఆ తేదీ తెల్సు కనుక లెక్క వేసి ఇంకా రెండు మసాల పద్దెనిమిది రోజు లుందని చెప్పెను. ఇంకా అంత వ్యవధి ఉన్నదా అన్నట్లుగా చూసింది అమ్మ.
    'అన్నయ్య రాగానే వాడి కాళ్ళు పుచ్చుకుని బ్రతిమాలు కుంటాను. ఎక్కడన్నా వంటలు చేసన్నా బ్రతుకుతాను. బ్రతుకు మీద ఆశ వుండి కాదు. ఈ నికృష్ట జీవితం ఈ జన్మలోనే వదిలిపోతే ఈ పాపం వచ్చే జన్మ క్కూడా అనుభవించ కుండా పోతుంది. మొగదిక్కు లేకుండా అక్కయ్యను నెత్తిన పెట్టుకుని ఎక్కడ కూర్చునేది. తాళి కట్టిన భర్తకు దాని అంద చందాలతో పాటు తెలివితేటలూ కూడా కావాలి. కాని అది అందాన్ని చూసి భ్రమపడే వారికి దానితో అనుభవమే కావాలి గాని తెలివితేటలూ అక్కరలేదు. ఇటువంటి ఆడపిల్లను నేను సంరక్షించలేను. వాడు కనక ఉంటె వాడి రౌడీ తనమే దాన్ని కాపలా కాస్తుందేమో? ఫలానీ రౌడీ వాణీ నాదం అక్కగారంటే దానికీ కాస్త గౌరవంగా అంగరక్ష గా ఉంటుందేమో" అంటూ కంట తడి పెట్టింది అమ్మ.
    అక్క విషయం లో అమ్మ ఇంత బాధాకరంగా మాట్లాడుతున్నదంటే పరోక్షంగా అమ్మ వార్ని దుయ్య బడుతున్నదనే వాస్తవాన్ని నా మనస్సు కాదనలేక పోయింది. కోర్టు పరిష్కారం యెట్లా ఉంటుందన్న ఆందోళన కన్నా అక్కయ్య ను కాపాడ్డమే అమ్మ కోక పెద్ద సమస్య యింది.
    "అన్నయ్య విడుదలై వచ్చాక బుద్దిగా ఎక్కడైనా ఉద్యోగం చేస్తూ మీ ఇద్దరితో ఎక్కడైనా ఇల్లు తీసుకుని ఉంటాడనే ఆశ గాని, నమ్మకం గాని నాకు లేవమ్మా. దొంగకు , మోసానికి చాలా తేడా ఉంది. దొంగకు మనస్సు మారవచ్చు నెమో గాని మోసగానికి మనస్సు మారదు" అన్నాను.
    "నీ మాట అసత్యం కావాలనే నా కోరిక. నేనింక ఇక్కడ ఉండలేను. మేం విడిగా వుంటే మా బ్రతుకులు ఎట్లా ఉన్నా నీ కాపురమన్నా బాగుపడుతుంది."
    అమ్మ మనస్సు విలవిల్లాడింది. ఆ మర్నాడు పోస్టులో ఒక ఉత్తరం వచ్చింది. వారి వద్ద నుంచి కవరు వచ్చిందేమోనని చూశాను. దస్తూరి వారిది కాదు. పైగా అడ్రసు వారి పేరుతొ ఉన్నది. ఆదుర్దాగా కవరు చించి ఉత్తరం చదివాను.
    అది వారి మేనత్త కూతురు రాధ రాసిన ఉత్తరం. అమ్మాయి బి.ఎ. పాసైంది. ఏదైనా ప్రైవేట్ కంపెనీ లలో ఉద్యోగ ప్రయత్నానికి వస్తున్నాననీ ఇల్లు జరగటం చాలా కష్టంగా వుందనీ , తప్పకుండా ఏదయినా ఉద్యోగం ఇప్పించి పుణ్యం కట్టుకోమనీ ఆ ఉత్తరం సారాంశం.
    ఇటీవల రాధనెప్పుడూ నేను చూడలేదు. మా పెళ్ళిలో చూశాను. అప్పుడు స్కూల్ ఫైనల్ చదువుతూ ఉండేది. సన్నగా, పొడుగ్గా చామనచాయ రంగులో వుండేది. మంచి తెలివి కలది. చిన్నప్పుడే తండ్రి పోయాడు. వాళ్ళూ ఇద్దరు ఆడపిల్లలు. యిద్దరు మొగ పిల్లలు. రాధ అన్నయ్య భీమవరం లో బి.ఇడి టీచరు అతనికి ఇద్దరు పిల్లలు. భార్య తండ్రి పోయాక తల్లినీ, ఇద్దరాడ పిల్లల్నీ, తమ్ముడ్నీ భీమవరం లో తన దగ్గరే వుంచుకుని సంరక్షిస్తూ పిల్లలకూ చదువు చెప్పించాడు. ఆ స్థితిలో వున్న ఆ కుటుంబానికి భగవంతుడు తీరని ద్రోహమే చేశాడు. సంవత్సరం క్రితం రాధ అన్నయ్య గుండె జబ్బుతో కన్ను మూశాడు. రాధ వదినే, యిద్దరు పిల్లలూ పుట్టింటికి చేరారు. ఆ కుటుంబానికి అర ఎకరం పోలం మినహా వుండటానికి ఇల్లు కూడా లేదు. ఇప్పుడు తల్లినీ, యిద్దరు మగ పిల్లల్నీ , చెల్లెల్నీ రాధ ఉద్యోగం చేసి పోషించాలన్న మాట. ఆ కుటుంబ సంగతి నాకు అంతవరకే తెలుసు.

 

                                
    ఆనాటి రాధ మనస్సూ, వయస్సూ ఎంతో పెరిగి వుండొచ్చు. చాలా తెలివైనది కనుకనే స్కాలర్ షిప్ లతో బి.ఎ పాసయిందని ఒకసారి ఎప్పుడో వారే చెప్పారు. ఆ రాధ ఇన్నేళ్ళ కు గాను ఈ పరిస్థితిలో మా ఇంటికి వస్తానని ఉత్తరం రాసింది. రాధ భీమవరం నుంచి వస్తున్నది. వారికి కాకినాడ బదిలీ అయిందని తెలీదు.
    అత్తయ్య కు ఈ విషయం చెప్పగానే ఎంతో సంతోషించింది.
    "రాధ చాలా తెలివైన పిల్ల సుభా. యెట్లా గోట్లా నాలుగు కబుర్లు చెప్పి దాని ఉద్యోగం అది సంపాదించుకుంటుంది. దాని మాటలు చిన్నప్పట్నుంచీ తెల్సు. చాకులా ఉంటాయి. దాని కబుర్లు వింటుంటే ఎంతటి బాధనైనా మర్చిపోతాం' అన్నది అత్తయ్య.
    ఉత్తరం వచ్చిన మూడో రోజున రాధ వచ్చింది. రిక్షా దిగి పెట్టె ఇంట్లో పెడుతూనే......
    "ఏం సుభాషిణక్కయ్యా. గుర్తుందా. నేను రాదని. మీ పెళ్ళిలో చూశాను. అవునూ ఇద్దరు పిల్లలకే అంత పాడయి పోయావెం. ఏడీ మా బావేడీ, మా అక్కయ్యను ఇంత కాల్చుకు తింటున్నావేమోయ్ మగరాయుడా అని ముక్కుచ్చుకుని అడుగుతాను" అన్నది. మా పిల్లల్ని చూసి "ఏరోయ్ పెద్దోడా నువ్వు మీ బాబు పోలికే. కాని బావ మాదిరి తలలు తీసి మొలలు కట్టించే వాడివి మాత్రం కాకు. అబ్బ చిన్నవాడు అచ్చు మా అక్కయ్య పోలికే వాడి బుర్ర గట్టిది. ఎన్నో ఆలోచనలు. బుర్రకు మేధ ఉన్నా మనిషి మాత్రం మేదకుడు. వాడి చూపులోనే తెలుస్తున్నది. ఏం అత్తయ్యా కులాసా. అమ్మ మిమ్మల్ని అడిగానని చెప్పమన్నది" అన్నది.
    కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళిచ్చి, చల్లని మంచినీళ్ళు ఇచ్చాను. రాధ నాకన్నగుప్పెడు పొడుగున్నది. సన్నం మాత్రం అంతే.
    "ఎంత చుట్టమైనా నేను ఆడపిల్లను గాని మగరాయుణ్ణి కాదు అక్కయ్యా. పెరట్లో కి వెళ్ళి కాళ్ళు కడుక్కుంటాను. మంచి నీళ్ళు మాత్రం ఇక్కడే తాగేస్తాను" అన్నది. రాధ మాటలకు నవ్వొచ్చింది.
    కాళ్ళు కడుక్కుని కుర్చీలో కూర్చుంది. వాళ్ళ కుటుంబ పరిస్థితులు కాసేపు సమీక్షించాము.
    "అవును గానీ. బావ గవర్నమెంటు గుమస్తా కామాలు. అందుకనే ఆదివారం నాడు కూడా ఆఫీసుకు వెళ్ళేడు. అవును, అక్కయ్యా నువ్వు కూడా వాళ్లాఫీసులోనే టైపిస్ట్ వనుకుంటాను" అన్నది కిలకిల నవ్వుతూ. ఆ మాటలు ఆ తెల్లని పలు వరుసా చూసి అత్తయ్య అన్నట్లే మానసిక వ్యధని కాస్త అవతలకు నెట్టాను. మా ఉద్యోగ పరిస్థితి చెప్పెను. ముక్కు మీద కుడి చేతి చూపుడు వేలితో కొట్టుకుంటూ "కొండంత ఆశతో వచ్చాను బావ ఉద్యోగం ఇప్పిస్తాడని. ఆశ అందలం ఎక్కించినా అవకాశాలు శూన్యం లోకే లాక్కు వెళుతూన్నాయ్యి. అయితే తిరుగు రైల్లో వెళ్లి పోతాను" అన్నది.
    "మీ బావ లేకపోతె మేమంతా లేమా రాధా. అదృష్టం బావుంటే నీ మాటలు చూసే ఎవరయినా ఉద్యోగం ఇస్తారు, అది లేకపోతె బావే కాదు మీ అన్నయ్య బ్రతికున్నా నీకు ఉద్యోగం దొరకదు, తరువాత చూద్దాం కాని స్నానం చెయ్యి. భోజనం చేద్దువు గాని" అన్నాను.
    భోజనం చేస్తూ అమ్మ అక్కయ్య ను గురించి అడిగింది. చెప్పాను. కర్ణాకర్ణిగా వాళ్ళకూ అన్నీ తెల్సు. నేను దాచినందు వల్ల ప్రయోజనమూ లేదు. అక్కయ్య ను పలకరించింది రాధ.
    "మీ పేరు రాధ కదూ"
    "భలేవారే . రాధ మీ పేరు, నా పేరు సునంద"
    "ఓహో. నాదే పొరపాటు , మీ శ్రీవారి పేరు."
    అక్కయ్య సిగ్గుపడి తల వంచుకున్నది.
    "కోర్టు లో దావా పడేసిన భర్త పేరు చెప్పటానికి సిగ్గేమిటి. అట్లా అయితే ఈ కేసు మీ పక్షం కాదు" అంతా తనకే తెల్సినట్లుగా అన్నది రాధ. అక్కయ్య మనస్సు మరో కోణం నుంచి తెల్సు కోటానికే ఈ ప్రశ్నలన్నీ రాధ వేస్తున్నదనుకున్నాను.
    "శ్రీవారి పేరు ఆనందరావు గారు."
    "వారెం చేస్తున్నారు? ఎక్కడున్నారు?'
    "అదే వారేదో ఆఫీసు లో ఉద్యోగం , కాకినాడ లో ఉన్నారు."
    "భర్త ఉద్యోగం సంగతి కూడా తెలీక పొతే నువ్వేం భార్యవు. అక్కయ్యా. ఆలోచించే చెప్పు."
    అక్కయ్య ఆలోచిస్తున్నది.
    "ఆ. గుర్తొచ్చింది . ఇన్ కం. ఇన్ కం, ఇన్ కంటాక్స్ ఆఫీసు లో గుమస్తా."
    "గుమస్తా నా. క్లార్కు న్నదే సుభాషిణి" అక్కయ్య కాస్త నవ్వింది.
    "ఇంగ్లీషు లో క్లార్కంటారు. తెలుగులో గుమస్తా అంటారు."
    "హిందీ లో ."
    అక్కయ్య పకపకా నవ్వింది.
    "నాకు హిందీ రాదు" అన్నది.
    "మీ శ్రీవారంటే మీకు ప్రేమ ఉందా"
    "ఎందుకు లేదు, ఉన్నన్నాళ్ళూ ప్రేమగానే ఉన్నాను."
    "ఎంత ప్రేమ, కిలోనా, మణుగా."
    "ప్రేమనేది వస్తువు కాదండీ తూచి చెప్పటానికి. అయినా మీకు పెళ్ళి కాలేదు కదూ. భార్యభార్తాల ప్రేమ పెళ్ళయితేనే కాని తెలీదు."
    నోటికి చెంగు అడ్డు పెట్టుకుని అన్నది అక్కయ్య.
    "ఇటీవల కాకినాడ వెళ్లాను. ఆనందరావు గారు కనిపించారు. నేను కాస్త చనువుగా మాట్లాడేసరికి నన్ను పెళ్ళాడుతానని నా వెంట పడ్డారు. మీ భర్తని నాకు తెలీనేతెలీదు. ఇంకా నయం పెళ్ళాడేశాను కాదు కొంపతీసి."   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS