"ఈసారి అయినా జాగ్రత్తగా ఆడండి" హెచ్చరించింది. ఆనంద్ తలాడించాడు. అతని దగ్గిర ఒక్క పెద్దకార్డు లేదు. బీటు పెంచాడు. అవతల వాళ్ళు కోస్తుంటే అసహాయంగా చూచాడు.
"ఇంతకాడికి బీటు యెందుకు పెంచినట్టు. బుర్రలేని మనుష్యులు." కార్డ్స్ నేలపై విసిరి లేచిపోయింది. అందరూ బొమ్మల్లా చూడసాగేరు.
"మనము పెట్టిన పేరు బాగా లేదురా. మరో జట్టు ఫైరింజన్ అని అన్నారే, చాలా బావుంది." అన్నాడు గోవిందు నెమ్మదిగా దొంగచూపులు చూస్తూ. ఏ క్షణము లోనైనా సురేఖ రావచ్చని భయపడుతూ.
"సురేఖ ని పేరు పెట్టారు. సురేకారమంటే బావుంటుంది.' అన్నాడు చక్రవర్తి.
"ఏమండీ చక్రవర్తి గారూ, రెండాటలు గెలువగానే చక్రవర్తి అయినట్టు మురిసి పోకండి. ఈసారి కూర్చుందాము " వచ్చి కూర్చుంది.
"ఆటను యింత సీరియస్ గా తీసుకుంటే అడకపోవటమే మంచిది." విలియమ్స్ సలహా ఇచ్చాడు.
"విల్లియమ్స్ మహాశయా కాస్త నోరు మూసుకోండి. ప్రతిది తేలికగా తీసుకుంటే జీవితములో సారమేముంది? మీరంతా చేరి ఆయనను పాడు చేస్తున్నారు."
"ఈ అభియోగము మరీ బావుంది...." విల్లియమ్స్ మాట్టాడ బోయాడు.
"ఊర్కోరా. తరువాత పోట్లాడు కుందాము" కసురుకున్నాడు ఆనంద్. అట ప్రారంభమైంది. ఈసారి ఆనంద్ జాగ్రత్తగా ఆడాడు. మిగతా ఆటలన్నీ గెలిచాడు. సురేఖ ముఖము వికసించింది. వెళ్తామని లేచారు.
"ఉండండి కాఫీ త్రాగి వేల్దురు గాని డబ్బు అక్కర లేదండి చక్రవర్తి గారూ." అని లోపలికి వెళ్ళిపోయింది.
"పెద్ద నీల్గుడు. ఓరోజు పాయసము బాగుందని, గోవిందు మారు అడగబోయాడురా , దానికి వేరే చార్జీ చేస్తుంది జాగ్రత్త అన్నాను' ఆనంద్ గది బయటికి వచ్చి సిగరెట్టు వెలిగించాడు. సురేఖ ఇచ్చిన కాఫీ త్రాగి బయటకు వచ్చారు.
"ఏం రా అందరిని దులుపుతావు. ఆ అమ్మాయి అంతలేసి మాటలంటుంటే మెదలక ఊర్క్కుంటావెం?' చక్రవర్తి విరుచుకు పడ్డాడు.
'పొరపాటు నాది కదరా."
'ఆ ' గోవింద్ చిత్రంగా చూచాడు. ఇక వీడిని ఏమీ అడగవద్దురా . మనము అత్తగారని పేరు పెట్టాము కాని వీడిలా జడుసుకోలేదు చూచావుగా. సిగరెట్ కాల్చడానికి బయటికి వెళ్ళాడు. మనవాడు వీరుడు. జమాదారుడని భ్రమ పడ్డాము. అంతా వట్టిదే.
"చాల్లే మన వీరత్వము ఆడపిల్లల దగ్గరే చూపాలి కాబోలు." అని వారి నోరు మూయించాడే గాని , ఆ అమ్మాయి ముందు అంత సౌమ్యంగా ఎలా వుండగలుగుతున్నాడో అతనికే అర్ధము కాలేదు. అతని ముందు చక్రాల్లాంటి పెద్ద కళ్ళు తీక్షణంగా కనిపించాయి. నవ్వుకున్నాడు. స్నేహితుల బలవంతము పై ఇంగ్లీష్ సినిమా కెళ్ళాడు.
సోమవారము సాధారణంగా చక్రవర్తి లెక్కలు చెప్పడానికి ఉండిపోతాడు. ఆరోజు ఆనంద్ ఉండటము చూచింది సురేఖ.
"మీరు వారము కూడా మరిచిపోయారే. ఈ రోజు మీ వంతు కాదు.
"ఆ గర్వమే వద్దంటున్నాను. వారము మరిచి పోయేటంత మూర్ఖుడిని కాలేదు. నీ ప్రతాపము చదువు చెప్పే వారి మీద చూపితే, వారు రామన్నారు." నవ్వుతూ ప్రశ్నించిన ఆమె ముఖము నల్లబడింది.
"నేను...నేను ఏమన్నాను?' వణుకుతూ అడిగింది.
"నాకేం తెలుసు వాళ్ళకేం రాదనీ వెక్కిరించావట."
"వెక్కిరించానా/ లేదండి. చక్రవర్తి గారు యెక్కము తప్పు చెప్పి నన్నే, గుణకారము తప్పని కసురుకున్నారు. నవ్వాను పొరపాటే." అన్నది.
"పొరపాటు ఇప్పుడు అంగీకరిస్తే ఏం లాభము? గోవిందు కూడా రానన్నాడు."
"అయన వ్యాకరణమంతా తప్పు చెప్పుతాడు."
"చాల్లే, తప్పులు ఒప్పులనుకుంటూ కూర్చుంటే యెలా. వాళ్ళు చెప్పే దానిలో మంచి గ్రహించి , నీ పని సాధించుకోవాలి. అయినా నీ నోరు పెద్దదిలే." అన్నాడు. ఇంతలో సీతారామయ్య గారు వచ్చాడు. విషయము విని అయన కూతుర్నే విసుక్కున్నాడు.
"చిన్నప్పటి నుండి ఇదే తంతు నాయనా అందుకే అతి తెలివి చూపించబోయే వారెప్పుడూ గోతిలో పడతారు. యెలా బ్రతుకుతుందో." ఆమె తండ్రి వంక చురుగ్గా చూచి వెళ్ళిపోయింది. చాలాసేపటికి వచ్చింది. ఆమె కన్నీరు కార్చిందని ఆమె ఉబ్బిన కళ్ళే చెప్పాయి.
'అలక చాలు గాని, పుస్తకాలు తీసుకునిరా పాపా. అతనెంత సేపు కూర్చుంటాడు?' సీతారామయ్య పిలిచాడు.
"నాకు తలనొప్పిగా ఉంది నాన్నా. క్షమించండి." తిరిగి బయటికి వెళ్ళిపోయింది. "బాగా పెంకి తనము అలవడింది. పెరిగిన కొలది తగ్గుతుందనుకుంటే యింకా ఎక్కువే అవుతుంది." నిట్టుర్చారాయన.
"చిన్నతనము లెండి. " అని సర్ది చెప్పి ఇంటికి వచ్చాడు. తండ్రి ఉత్తరము వ్రాశాడు. ఆరోగ్యము జాగ్రత్తని మరి, మరి హెచ్చరించాడు. అతని భోజనము గూర్చి తల్లి ఆందోళనగా వ్రాసింది మరో ప్రక్కన. అంతవరకూ సురేఖ పట్ల కలిగిన కోపము మంచులా కరిగిపోయింది. ఆమె చేతి చలువ వల్లనే కదా, తను తిండికి ఇబ్బంది పడటము లేదు. పాపమూ కాస్త చురుకుదనము పాలు యెక్కువ అనుకున్నాడు. వెంటనే తల్లికి ఉత్తరము వ్రాశాడు. ఇక్కడో దయామయి చలువ వల్ల వంటకేం ఇబ్బంది లేదు. తన ఇంటి లాగే ఉందని వ్రాసి , తృప్తిగా నిట్టూర్చాడు. రాత్రి పడుకోబోతుంటే , యెందుకో సురేఖ ముఖమే గుర్తుకు రాసాగింది. ఆమె పట్ల తను కఠినంగా ప్రవర్తించాడని బాధపడ్డాడు. ఆమె తలపులతోనే నిడురబోయాడు. ఉదయము లేచి చదువు కుంటే కూడా అతనికి పాఠాలు మనసు కేక్కటము లేదు. తొందరగా తయారయి సీతారామయ్య గారిల్లు చేరాడు. తలుపులు చేరవేసి ఉన్నాయి. నెట్టి లోపలికి వెళ్ళాడు. సన్నగా , "పావన గుణారామా" అని పాట వినిపిస్తుంది. యెప్పుడూ లోపలి వైపుకు చూడలేదు. ఆనాడు కుతూహలంగా , పాత చీర కర్టెన్ తొలగించి చూచాడు. చిన్న వరండా వంటి స్థలము లో కుంపటి పై గుండి గలో అన్నము ఉడుకుతుంది. ప్రక్కనే రోటిలో పచ్చడి రుబ్బుతుంది సురేఖ. బరువుగా ఉన్న రుబ్బుగుండును బలవంతంగా దోర్లిస్తుంది, ఆ దృశ్యము చూడగానే అతని హృదయము తరుక్కు పోయింది. అభిమానంగా మాట్లాడే అమ్మాయి ఇంత శ్రమ పడుతుందా , నమ్మలేక పోయాడు, రుబ్బడము ఆపింది.
"తంబీ అక్కడున్న తుండు గుడ్డ పట్రారా. అన్నము గుండిగ దించాలి." అన్నది. అలికిడి వినిపించింది కాబోలు. ఆనంద్ ఏదో కనిపించిన తుండు అందుకు వెళ్ళి ఆమెకు కనిపించేలా పట్టుకున్నాడు.
"నీకు బాగా పొగరు ఎక్కిందిరా. ఇది నా తుండు కదూ, అన్నం గుండిగ దించే తుండే మరిచి పోయావా?' అరవము లో అరిచి, వెను తిరిగి చూచింది.
"మీరా? నేను తంబి అనుకున్నాను." లేచింది. ఆమె ముఖము సెగ దగ్గర కూర్చోవటం వల్ల ఎర్రబారింది. నుదుట స్వేద బిందువులు నిలిచాయి. ఒకటి రెండు, తిలకాన్ని నాన్చుతూ క్రిందికి జారుతున్నాయి.
క్షమించండి మీరనుకోక యేమో అన్నాను. మొన్న పెకాడుతుండగా తొందరబడ్డాను. ఆటలో అంతస్తు మరిచి ప్రవర్తించాను." ఆమె కళ్ళు వాలిపోయాయి.
"నేను యేమీ అనుకోలేదు. మా కోసము ఇంత శ్రమ పడుతున్నప్పుడు , ఆ మాత్రము చనువుగా మాటనే హక్కు లేదా?"
";లేదు, మీ కోసము శ్రమ కాదు, మా భుక్తి కోసము.
"చూడు అప్పుడే కోపము వచ్చింది. నన్ను అన్నావని కోపము కాదు. వాళ్ళనేదో అన్నావు. నీ చదువు పాడవుతుందని తొందర పడ్డావనిపించింది. రాత్రి అనవసరంగా ఎడ్పించాను . వచ్చి నీతో మాట్లాడాలని పించింది." ఆమె తలెత్తి అతని వంక చూచింది. ఆ చూపులో ఏ భావము గ్రహించలేక పోయాడు ఆనంద్.
"ఓ మన్నించండి. చనువుగా ఏకవచనముతో పిలుస్తున్నాను."
"నాకలా పిలిస్తేనే ఇష్టము" తన ముఖము అతనికి కనిపించరాదని దబ్బున వంగి తన చీర చెంగుతో అన్నము గుండిగ దింపింది. మూత వేసి గంజి వార్చింది.
"నేను యేదైనా సాయము చెయ్యనా?"
"ఏం చేయాలో చెబితే మీకు కోపము వస్తుంది లెండి.
"రాదు రేఖా! నిజము. అతను ఓరగా చూచాడు. ఆమె కోపోలాలు రక్తాన్ని నింపుకోవటము గ్రహించాడు. "చెప్పు పచ్చడి రుబ్బటములో సాయము చెయ్యనా? పోనీ కూరకాయలుంటే ఇవ్వు తరిగి పెడతాను."
"ఆ పనులేం చెయ్యొద్దు, ఇక్కడికి భోజనానికి వచ్చేవారంతా మంచి వారు కారు. మిమ్మల్ని ఇక్కడ చూస్తె యెన్నో ఊహిస్తారు. అలాంటి వారిని రానివ్వటము నాకిష్టము లేదు, కాని తప్పదు."
"నిజము, ఆ సంగతి గ్రహించలేదు, వస్తాను వెను తిరిగాడు.
"ఉండండి. ఇప్పుడప్పుడే రారు." అతన్ని గదిలో కూర్చోబెట్టి కాఫీ చేసి పెట్టింది.
'ఇప్పుడు కాఫీ త్రాగితే అన్నమేం సహిస్తుంది."
"నాకు మిగులుబాటవుతుంది లెండి."
"అబ్బ! నీలాంటి వారితో మాట్లాడటమెలాగో ప్రతిదానికి పెడార్ధం తీస్తావు." విసుక్కున్నాడు.
"పరిహాసానికి అన్నానని ఎందుకనుకోరు." అన్నది మూతి తిప్పుతూ.
"అయితే ధన్యులము. ' బయటకు వచ్చేశాడు .
రోజూ రాత్రి తొమ్మిది గంటల వరకు పాఠాలు చెప్పే నెపముతో అక్కడే ఉండి పోయేవాడు. తనకంతగా ఇష్టము లేకపోయినా ఆనంద్ ఏమనుకుంటాడోనని విల్లియమ్స్ కూడా ఒకో రోజుండి ఇంగ్లీష్ చెప్పేవాడు. పరీక్షలు దగ్గర కోస్తున్నాయని విల్లియమ్స్ తప్పించుకున్నాడు. ఆనంద్ మాత్రమూ కూర్చున్నాడు. సురేఖ చదువు కోవడానికి వచ్చే జాడలెం కనిపించలేదు.
"రేఖా! తొందరగా రా, కాలము వృధా కాకూడదు."
"నేను ఆ మాటే చెప్పాలను కుంటున్నాను. నాకోసమని మీ చదువు పాడు చేసుకోవద్దు. నేనింకా ఫీజు కట్టలేదు. కట్టినప్పుడు చూద్దాము. మీ పరీక్షలు దగ్గర కొస్తున్నాయి." "ఇంకా రెండు నెలలకు పైనే ఉన్నాయి. ఇప్పటి నుండే ఆదుర్దా దేనికి?"
"ఆదుర్దా ఉండాలి. ఈరోజు చాలా టైం ఉందనుకుంటారు. మరో నెల గడిస్తే సమయమే లేదు, రాత్రింబవళ్ళు చదువాలని దీక్ష బూనుతారు. మంచి మార్కులతో ఫస్టు క్లాసు లో పాసవ్వాలని అనుకుంటారు. ఆఖరి రోజు వచ్చేసరికి పాసయితే చాలురా భగవంతుడా , అని మొక్కు కుంటారు. మీరలా కాకూడదు. మీరు గత సంవత్సరపు అనుభవాలు నాన్నగారితో చెబుతుంటే విన్నాను."
"వింటావు లే , నీకన్నీ అలాంటి లక్షణాలే." ఆమె నుడికించాలని అన్నాడు.
"మీరెలాగైనా అనుకోండి. నాకోసము మీ చదువు మానుకోవటము సుతరాము ఇష్టము లేదు. మొదట మీ సంగతి మీరు చూచుకుని తరువాత నాకు సాయాము చేద్దురు గాని." ఈ పిల్ల అన్నీ వయసుకు మించిన మాటలే మాట్లాడుతుందే" అని ఆశ్చర్యపోయాడు.
"అసలు నేనుండటము నీ కిష్టము లేదులే." అని వచ్చేశాడు. ఆనాటి నుండి చాలా బుద్ది మంతుడిలా టైం కు వెళ్ళి భోజనము చేసి వచ్చేసేవాడు. వడ్డన జరుగుతుంటే కావాలో, వద్దో చేత్తోనే చూపేవాడు. పొరపాటున కూడా ఆమె వంక చూచేవాడు కాదు. అలా పదిహేను రోజులు గడిచాయి. ఆమెతో మాట్లాడకుండా ఉండటము దుర్భరమనిపించినా అభిమానము ఆడ్డు వచ్చింది. ఆరోజు ఆదివారము భోజనాలు చేసి, బయటికి వచ్చారు స్నేహబృందము.
