ఆరోజు ఆదివారం కాకపోయినా బీచి సందడిగానే ఉంది. వెళ్ళి దూరంగా ఒకచోట పడుకున్నాడు ఉమాపతి. దూరంగా యిద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. వాళ్ళకు అటు వేపుగా ఒక జంట కూర్చుని ఉన్నారు. ఉన్నట్టుండి ఉమాపతి మీద ఒక పెద్ద రబ్బరు బంతి పడింది. దాన్ని తీసుకుని కోపంతో సముద్రంలోకి విసిరాడు. మరు క్షణం లోనే అది గట్టుకు వచ్చింది. ఉమాపతి మనస్సు చివుక్కుమంది. బంతి పిల్లలకు ఇచ్చేయ్యాలనుకున్నాడు. పిల్లలు దూరంగా బిక్కుబిక్కుమంటూ నిలబడి ఉన్నారు. తను వాళ్ళ వద్దకు బయలుదేరేసరికి వాళ్ళు పరుగెత్తారు.
అ జంటలోని స్త్రీ బహుశా వాళ్ళ తల్లేమో అంతా క్షణంలో గ్రహించింది.
"తీసుకో రాజా! మామయ్య వద్ద బంతి తీసుకో" అంది. పిల్లలు బంతి తీసుకున్నారు.
"కూర్చోండి" అన్నాడు ఆవిడ భర్త.
తనకు తెలీకుండానే కూర్చున్నాడు ఉమాపతి.
"ఈవిడ నా భార్య -- పేరు సునంద. నా పేరు చక్రవర్తి. మైలాపూర్ లో డాక్టర్ని" అన్నాడు అతడు.
"నా పేరు ఉమాపతి."
"అరె! మా అబ్బాయి పేరు కూడా అదే!' ఆశ్చర్యపోయింది సునంద.
ఉమాపతి సునంద కేసి చూశాడు. తాను అంత ప్రశాంతమైన ముఖాన్ని జీవితంలో చూడలేదు. చెట్ల నీడల్లో కదలని నీటి చెలమల్లాంటి కళ్ళు సునందవి. ఆ కళ్ళలో కాఠిన్యం, వ్యామోహం, దాహం ఏమీ లేవు. కళ్ళు చాలా సాగగా ఉన్నాయి. కనురెప్పలు పైకి వంపు తిరిగి ఉన్నాయి. సునంద ముఖాన్ని చాలాసేపు చూడలేక పోయాడు ఉమాపతి.
"బంతి నెందుకు , నీటిలోకి విసిరేశారు?" ప్రశ్నించింది సునంద మెల్లగా , నవ్వుతూ.
ఉమాపతి త్రుళ్ళిపడ్డాడు.
"సరదాకి" అన్నాడు.
"కాదు. మీకు కోపం వచ్చింది" అన్నాడు చక్రవర్తి.
వీళ్ళెం ధ్వనీ, ప్రతిధ్వనీ లాగున్నారే అనుకున్నాడు ఉమాపతి.
"వెడదామండీ. పిల్లలకు ట్యూషనుకు మేష్టారు వస్తారు." అంది సునంద.
చక్రవర్తి లేచాడు. పిల్లలు కూడా అట చాలించి వచ్చారు. వాళ్ళు సెలవు తీసుకుని వెళ్ళిపోయారు.
"వెళ్తాం మామయ్యా గారూ!' పిల్లలన్నారు.

ఎవరో ఆత్మీయులను పోగొట్టుకున్నట్లనిపించింది ఉమాపతికి. వాళ్ళు లేకుండా బీచిలో కూర్చోలేక పోయాడు. అస్తంగత సూర్యకాంతి వల్ల సముద్రం మేఘాత్రున్న ఆకాశం లా ఉంది. మెరుపులు మెరిసినట్లుగా అక్కడక్కడా నీళ్ళు తళతళలాడుతున్నాయి. మేఘాలు గర్జిన్చినట్లు కెరటాలు హోరు మంటున్నాయి.
సరాసరి హోటలుకు భోజనానికి వెళ్ళాడు. చేతులు కడుక్కొంటుంటే అద్దంలో తన ముఖం కనిపించింది. పెదవులు ఎందుకో ముడి వేసుకున్నాయి. కనుబొమ్మలు కూడా గుసగుస లాడు కుంటున్నాయి. కళ్ళు అదోరకంగా ,అశాంతి గా ఉన్నాయి. సునంద కళ్ళలో ఎంత శాంతి ఉంది! తన కళ్ళలో ఎందుకంత అశాంతి? సునంద కు జీవితంలో చాలా తృప్తి ఉన్నదేమో! అలాగైతే తనకు జీవితంలో అసంతృప్తి ఉందా? ఆ మాటే కదూ విమల కూడా అన్నది? తన ముఖాన్ని చూసుకోలేక పోయాడు ఉమాపతి.
భోజనం చేసి గదికి వస్తుంటే దారిలో సారధి కనిపించాడు. పెరిగిన గడ్డం, మాసిన గుడ్డలూ-- సారధి చాలా దీనంగా కనిపించాడు.
"ఓ పది రూపాయలుంటే యివ్వండి." అన్నాడు. ఉమాపతి పది లేవని ఐదిచ్చాడు. మహదానందంతో పుచ్చుకున్నాడు సారధి.
"ఏమైనా ఈలోగా రాస్తున్నారా?" సారధిని ప్రశ్నించాడు.
"ఏమి రాయాలో అర్ధం కావటం లేదు. అసలు నేనే రాయకుంటే వచ్చే నష్టమేమిటో కూడా నాకు బోధ పట్టం లేదు. మనసంతా చాలా గందరగోళంగా ఉంది. ఈ సంఘర్షణ తేలేవరకూ యేమీ రాయదలుచుకోలేదు" అన్నాడు సారధి.
ఉమాపతి కి సారధి మాటలు చాలా కొత్తగా ఉన్నాయి. ఉమాపతి సారధిని అనేక విషయాలు అడిగాడు. తనకు ఉద్యోగం పోయిందని, త్వరలో ఉద్యోగం దొరుకుతుందన్న విశ్వాసం లేదని చెప్పాడు సారధి.
"మనమిద్దరం జీవితంలో పోరాడుతున్నాము. గెలుపెవరిదో మనకే తెలియదు. అప్పుడప్పుడు కనిపిస్తుండండి. అనుభవాలు చెప్పుకొందాం!' అంటూ విడిపోయాడు సారధి.
విమల ఉత్తరంలో మొలక ఎత్తిన అశాంతి నిమిషనిమిషానికి అధికమై సారధి మాటలతో ఉమాపతి హృదయమంతా ఆక్రమించుకుంది.
* * * *
పంచాయితీ బోర్డు ఎన్నికల ప్రచారం ఏప్రిలు నెల ఎండల కన్నా చండ ప్రచండంగా ఉంది. జగన్నాధం తన బలగంతో పల్లెలు తిరుగుతున్నాడు. విశ్వనాధయ్య గారు, ప్రకాశం కూడా ఎన్నికల్లో తల మునకలుగా ఉన్నారు. కొడుకు చింతతో ఏకు,లాగై పోయింది సుందరమ్మ. రత్నమ్మ ఎక్కడుంటుందో కూడా తెలియటం లేదు. తాను ఎంత ప్రయత్నించినా శారద పెళ్ళిని ఆపలేకపోయానన్న అసంతృప్తి ని అణగద్రోక్కుకుని జీవితం లాగుతుంది. శారద కీ ప్రపంచమే కాబట్టం లేదు. ఎంతసేపూ ప్రకాశాన్ని గూర్చిన తలపులతో మురిసి పోయేది. ఎవరైనా ప్రకాశాన్ని గురించి, అతని ధైర్యాన్ని గురించి విశ్వనాధయ్య తో చెబుతుంటే ఒళ్ళంతా చెవులు చేసుకుని వినేది. ప్రకాశం యిచ్చిన పుస్తకాలు చదివేది. శారదకు జీవితమూ, ప్రపంచమూ ప్రకాశమే అయిపొయింది.
భానుమూర్తి పూర్తిగా హైస్కూలు గొడవల్లో ఉన్నాడు. విద్యార్ధులపాలిటి కతడు దేవుడై పోయాడు. బడి క్రమశిక్షణ అతని కనుసన్నలతో సరిపోతున్నది. భానుమూర్తి విద్యార్ధులకు ఎంత దగ్గరగా రాగాలడో వారిని అంతదూరంగా ఉంచగలడు. భానుమూర్తి ఆ హైస్కూలుకు చక్రావర్తి.
భానుమూర్తి కీ, ఇందిరకూ ఉన్న ప్రేమ వ్యవహారం జగన్నాధం చెవులకు సోకింది. మొదట అతడు నమ్మలేదు. కానీ భానుమూర్తి వ్రాసిన ఉత్తరం ఒకటి అతని కంట బడింది. జగన్నాధం అగ్గి రాముడై పోయాడు. ఇందిరను పిలిచి నానా హంగామా చేశాడు. ఇందిర ఉత్తరం చదివింది. అందులో తాను భానుమూర్తి ని ప్రేమిస్తున్నట్టు ఏమీ లేదు. "చూశారా, నాన్నగారూ! ఎంత అవమానం! నాకు ఒక్క సెగలు రేగుతుంది. నాకు ప్రేమలేఖ వ్రాస్తాడా! నేనంటే ఎవరు! జగన్నాధం గారి కూతుర్ని! ఏదో తెలివైనవాడు కదా అని ట్యూషను కెడితే నన్ను అంత లోకువగా చూస్తాడా? నాకు ప్రేమ లేఖ రాస్తాడూ?' అంటూ కోపంతో ఉత్తరం ముక్కలు ముక్కలుగా చిన్చేసింది.
జగాన్నాధం మొదట బిత్తరపోయినా చివరకు తన కూతురి తప్పేమీ యిందులో లేదన్న నిర్ణయానికి వచ్చాడు. అందువల్ల భానుమూర్తి మీద కోపం మరింత ఎక్కువైంది.
"వెధవ! ఏమనుకున్నాడో, జగన్నాధమంటే! మన పాలేరు రాముడు తో చెప్పి కాళ్ళు విరిచేయమంటాను." అన్నాడు.
"అయ్యయ్యో! అలాంటి పనెక్కడయినా చేసేరు! అతడి మాటంటే ఆ హైస్కూలు పిల్లలకు సుగ్రీవాజ్ఞ. చూశారుగా , వాళ్ళు ఒక్కొక్కరూ మన రాముడి లాంటి వాళ్ళకు నలుగురికి సరిపోతారు" అంది ఇందిర.
అదీ నిజమేననిపించింది జగన్నాధానికి. కానీ ఎలా అతడి కైపు దించటం? మరో మార్గం కోసం ఆలోచించాడు. కాస్సేపటికి బంగారం లాంటి ఆలోచన స్పురించింది. పొలం వద్దకు వెడతానని చెప్పి సరాసరి హెడ్మాస్టరు గారింటికి వెళ్ళాడు.
జగన్నధాన్ని చూడగానే హెడ్మాస్టారు గారు కాస్త రిచ్చ పడ్డారు. ఉపోద్ఘాతం లాంటి దేమీ లేకుండా విషయాన్ని చెప్పాడు జగన్నాధం.
"మీ మేష్టారు భానుమూర్తి గ్రామ రాజకీయాల్లో జోక్యం కలిగించుకొంటున్నారు."
"ఎలాగ?" అడిగారు హెడ్మాస్టరు.
"ఎలాగేమిటి, అరచేతిలా అంతా చక్కగా కనబడుతుంటే! ఆ ప్రకాశం యింట్లోనే మీ భానుమూర్తి మకాం. ప్రకాశం ఇల్లు ఈ గ్రామ రాజకీయాలకు రచ్చబండ. అక్కడ చేరి అతడు చేస్తున్న పనులు సామాన్యమైనవి కావు."
"వాటికి నన్నేం చేయమంటారు?బడి వరకు అతని డ్యూటీ చాలా సక్రమంగా ఉంది. నా పదిహేనేళ్ళ బడి జీవితంలో అంత చక్కని టీచర్ని నేను చూడలేదు. అంతటి డిసిప్లివేరియన్ని, కూడా చూడలేదు. భానూమూర్తి మీద మీరు చెబుతున్న విషయాలు నాకు నమ్మ శక్యంగా లేవు."
తన కూతురు విషయం చెబుదామనుకున్నాడు. కానీ మరీ తనకే నామోషీగా ఉంటుందని మానుకున్నాడు జగన్నాధం.
"సరే, అలాగైతే జిల్లాబోర్డు కు విచారణకు పెడతాను." అన్నాడు ఉగ్రంగా.
"పెట్టండి మంచిదే! నాకు చాలా పనులున్నాయి " అన్నారు హెడ్మాస్టరు.
తల కొట్టిసినట్లయి బయట పడ్డాడు జగన్నాధం.
రెండవ రోజు యీ విషయాన్ని భానుమూర్తి తో అన్నారు హెడ్మాస్టారు. దాచుకోవడ మెందుకని అన్ని విషయాలూ వివరంగా చెప్పేశాడు భానుమూర్తి.
"ఇక మనకు ఆరు రోజులే బడి. బడి మూసే రోజే నేనూ, ఇందిరా బయలుదేరి వెడతాము. తిరుచానూరు లో వివాహం చేసుకొంటాం. పెద్దలు, మీకు చెప్పని విషయాలేమున్నాయి?' అన్నాడు భానుమూర్తి.
"సరే! కానీ జాగ్రత్త. ప్రమాదాన్ని మాత్రం కొని తెచ్చుకోకు" అన్నారు హెడ్మాస్టరు.
* * * *
