7
అతి విశాలమైన ఆవరణ లో తరతరాలుగా తమకు నీడనిచ్చిన - మండువా యింటిని వదిలి - మంగపతి కట్టించిన రెండంతస్తుల కరెంటు మెడలోకి కాపురం మార్చారు. రాజయ్య గారు సీతమ్మ గారికి యిష్టం లేక పోయినా - ఎగువదేశం నుంచి గమిడి గేదెను దిగుమతి చేయించి "కమ్మగా తినవయ్యా బావా! మనం ఏం చేసుకోవాలి ఈ సంపాదనంతా? నాకూ ఒక్కగా నొక్క కూతురు, నీకూ ఒక్కగానొక్క కొడుకు. ఆ మూడుముళ్ళూ పడ్డాయనిపిస్తే రెండు ఆస్తులూ వాళ్ళవే గదా? మా శంకరం గాడికి తాతగారిచ్చింది ముట్ట చెప్పినా?" అనేవాడు మంగపతి.
వ్యాపారం మరికొంత జోరు హెచ్చడంతో 'మనమే కట్టుకుందాం బావా ఒక రైసుమిల్లు -- ఏమంటావ్?' అని కేవలం సలహా ఆర్జించిన బావమరిది మాటలను నల్ల మందు తిన్న కామందులా జోగుతూ, కడువు మీద పడి సర్కసు చేస్తున్న కోడలు పిల్లతో మధ్య మధ్య ఆడుకుంటూ, ఆవులిస్తూ వింటూ 'కట్టించవయ్యా బావా- నాదేముంది? ఏం కట్టించినా నీ కూతురిదీ అల్లుడిదీనూ, నా కాలం అయిపోవడంలా?' అంటూ కన్నుమూసి అటు ప్రక్కకు వత్తిగిల్లెవారు రాజయ్యగారు.
నిజానికి రాజయ్య గారి కాలం అయిపొయింది. ఫ్యాక్టరీ కట్టించడానికి రహదారీ వంతెన ప్రాంతంలో స్థలాలు చూసి, జీపు కారు 'తోలుకుంటూ ' తిరిగి వస్తున్న రాజా లాంటి రాజయ్యగారు -- ఏనుగులాంటి రాజయ్యగారు - గమిడి గేదె పాడి కడుపు నిండా త్రాగి బావమరిది సలహా ప్రకారం ' పాడు బిజినెస్ గొడవలు' తగ్గించుకుని నున్నపడి లావెక్కిన రాజయ్యగారు - ఆకస్మికంగా గుండె ఆగి కన్నుమూశాడు శాశ్వతంగా.
రాజయ్యగారు కన్నుమూయడంతో స్వామి జీవితం తారుమారై పోయింది.
రాజయ్యగారి కుటుంబంలో ఒకటిగా పెనవేసుకు పోయిన మంగపతి కుటుంబం- మళ్ళీ దూరమైపోయింది.
'నీకు కోడలు పుట్టింది సీతమ్మా! అన్న మంగపతే బ్రతికుండగా నీగాడప తోక్కను సుమా?' అంటూ రెండోసారి బెదిరించి సకుటుంబంగా తరలి వెళ్ళిపోయాడు!!
* * * *
ఆకస్మికంగా -- ఎన్నడో తెగిపోయిన బంధాన్ని మరొకసారి కలుపుకుంటానికి - మేనమామ మళ్ళీ తమ యింటికి రావడం -- ఆశ్చర్యమనిపించింది స్వామికి. చనిపోయిన భర్త శరీరం మీద పడి ఏడుస్తున్న తల్లినిచూసి - తనూ ఏడ్చాడు.ఆ దృశ్యం తన జీవితంలో మరుపురానిది. తండ్రి ఆ ఉదయమే తనను దగ్గరకు తీసుకుని తల నిమిరి 'నీకోసం ఫ్యాక్టరీ కట్టిస్తున్నాడురా మామయ్యా' అనడం తనకు గుర్తుంది.
'బయలుదేరవయ్యా బావా! మరీ అంత బద్ధకం బలిసి పోతున్నది నీకు, అంతంత భారీ శరీరాలు పెంచుకోవడం సుఖం లేదు సుమా' ఇలాగే మేనమామ తండ్రిని వేళాకోళం పట్టించడం తనకు గుర్తుంది.

'ఒక్కక్షణం - అంటూ సీతమ్మ గారు లోపలకి పోయివచ్చి భర్తకు దిష్టితీసి 'ఊళ్ళో వాళ్ళ కళ్ళన్నీ మీమీదే' అనడం తనకు గుర్తుంది.
ఈ వయస్సులో నాకు దిష్టేమిటే వేర్రిదానా? ఎవరన్నా విన్నా నవ్వి పోతారు?' అంటూ నవ్వుకుంటూ జీపెక్కి బయలుదేరిన తండ్రి ముఖం తాను మరిచిపోలేదు.
వెళ్ళిన నాలుగు గంటలకు బండిలో ప్రాణం లేని తండ్రిని మేనమామ యింటికి చేరవేసిన దృశ్యం కూడా తాను మరిచిపోలేదు.
అంతకుముందు ఎటువంటి అనారోగ్యపు జాడలు కనిపించలేదు. రాజయ్యగారిలో. అటువంటి రాయి లాంటి మనిషి గుండె ఆగి మరణించాడంటే - ఎవరూ -- నమ్మలేక పోయారు ఆ ఊళ్ళో.
అంతకుమించి --
మరొక వార్త ఆ పరగణా మొత్తాన్ని ఆశ్చర్యంలో ముంచివేసింది అడవి మంటలా.
'రాజయ్యగారి సంగతి విన్నావా/
'ఔనట! కాలం తీరకుండా పోయాడు కలికాలం. నాలుగు కాలాల పాటుంటే కోట్లకు పడగలేత్తేవారు.'
'సరిసరి! తమకు తెలీదా ఏమిటి? రాజయ్య సాంతం మునిగిపోయాడు.'
'లక్షలు సంపాదించారన్నారు?'
'అన్నారు మరి'
'మరింకా మునిగి పోవడమేమిటి అంట?'
'అంతకు పదిరెట్లు అప్పులట. అప్పు పెట్టిన అసామీలకు రూపాయికి అర్ధ వచ్చే మార్గం కనిపించడంలా'
'మంగపతి ముంచేశాడంటారా?'
'సరిసరి! బావగారే తనను ముంచినట్లు ఆయనగారి గుండెలు బాదుకుంటూ కాకిగోల పెడుతున్నాడు.'
'అంతే నంటారా?'
;అసలు రహస్యం ఆ పరమాత్మకు తెలియాలి.'
అసలు విషయం ఏమైనా అందరికీ తెలిసిన విషయం ఒకటి. నిజానికి రాజయ్య కుటుంబానికి విలువ నీడ లేకుండా పోయింది!
అక్షరాలా!!
'నా మాట వినుంటే యింత జరిగేది కాదు' అంటూ ఊళ్ళో ప్రతి పెద్ద మనిషి దగ్గరా -- మహా భారతమంత కధ చెప్పి- మూలుగుతూ రోదించాడు మంగపతి.
'అన్నయ్య' అన్నమాట వినలేదు సీతమ్మగారు.
'అప్పుల సంగతి అలా ఉంచు సీతమ్మా. వ్యాజ్యం నడుస్తుంది అడవిటి పర్రల అక్కడ పెద్ద ఫ్యాక్టరీ కడుతున్నారట ముందు ముందు గవర్నమెంటు వాళ్ళు. అది జరిగితే ఎకరం పది వేలవుతుంది. మూడు లక్షల ఆస్తి. ఆ వ్యాజ్యం నడిపించటాని కన్నా నాలుగు రాళ్ళు దాచుకోక పొతే ...'
'అయన అప్పులన్నీ ముందు రాగి పైసలతో తీర్చవలసిందే. బ్రతికినంతకాలం మహారాజులా తిరిగారు. ఆయనకు ఎంగిలి పేరు తెచ్చి పెట్టలేను. తెచ్చిపెట్టి బ్రతకలేను' అంటూ నిశ్చయంగా చెప్పింది సీతమ్మగారు.
'అలా అనుకుంటే రావలసిన రెండు లక్ష లాస్టే -- హారతి కర్పూరమైపోతుంది. ప్లీడరు యిప్పటికే గోల పెడుతున్నాడు రాజయ్య శ్రద్ధ తీసుకోలేదని -- రేపు ఆ ఎంగిలి కూడూ గూడా లేకుండా పోతావు'
'భగవంతుడున్నాడన్నయ్యా!'
'పలకడమ్మా ఆ పెద్దమనిషి ఎలుగెత్తి అరిచినా '
'కానీ అన్నయ్యా! నిండా మునిగిన దాన్ని'
సీతమ్మగారు నిర్ణయం మార్చుకోలేదు.
'సమస్య అర్ధం కాకపోయినా ఆ దృశ్యం లీలగా ఈనాటికి గుర్తు స్వామికి.
'నీ పాట్లు పిచ్చి కుక్క లకు గూడా పట్టవు' అన్నాడు మంగపతి తన తల్లిని. మామయ్యను కొట్టాలనిపించింది. 'నువ్వే కుక్కవి -- అనుకున్నాడు తల్లిని బల్లిలా కరుచుకుని.
'సత్తెకాలపు మనిషి పైసలతో భర్త బాకీలు తీర్చింది' అనుకున్నారు పరిపరి విధాలుగా అమ్మలక్కలంతా. 'మంచి పేరు తెచ్చుకుంది.' నిజమే. ఆ మంచి పేరు తోనే చెట్టు క్రింద నిలబడవలసి వచ్చింది సీతమ్మగారు.
తన సలహా వినకపోవడం వల్లనే యింత జరిగిందని కేకలు పెట్టిన మంగపతి - 'రోడ్లమీద పడి అడుక్కుతినేరోజు వస్తుందని నే ముందే చెప్పాను. నా మాటలు గడ్డి పోసంత విలువిచ్చావా? నీ గడప తోక్కవలసిన పనుందంటావా?' అంటూ తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోయి ఆ మాట యింతకాలం నిలబెట్టుకున్న అన్నయ్య - తనకు లేడనుకుంటూనే స్వామిని పెంచింది సీతమ్మగారు.
'అందుకనే స్వామితో 'ఈ సంబంధం కలిస్తే మీ నాన్నగారి ఆత్మ శాంతించదురా నాయనా' అంది నిశ్చయంగా.
సీతమ్మగారి మనస్సులో దృడంగా నిలిచినా ఆ నిశ్చయానికి చాలా వయస్సుంది. మంగపతన్నయ్య మళ్ళీ ఏళ్ళ తర్వాత తన గడపలో కాలుపెట్టి - 'జరిగి పోయింది మరిచిపో చెల్లమ్మా! నీ యింట్లో పాదం పెట్టడం కోసమే శ్రీదేవి నా కడుపున పుట్టిందని నీకు తెలుసు.' అంటూ శాశ్వతంగా తెగిపోయిందనుకున్న సంబంధాన్ని కలుపుకుంటానికి ప్రయత్నించినప్పుడు 'అబ్బాయితో మాట్లాడి ఏ సంగతి తెలియజేస్తా నన్నయ్యా. ఆ ముచ్చట యిదివరకే ఎన్నడో జరుగవలసింది . వయసొచ్చాక రెక్కలు విరిచి మెడలు వంచి చేయవలసిన కాలం కాదయ్యె.' అంటూ నిర్లిప్తంగా సమాధానం చెప్పినట్లు కనిపించిన సీతమ్మగారితో సంవత్సరాల తరబడి మండుతున్న మనస్సులో సుడులు వెడుతూ, జీర్ణం కాక పైకి రాక,బుసలు కొట్టిన అవమానాగి,ప్రజ్వ రిల్లింది నిజానికి.
'నేవెళ్ళి వాడితోనే మాట్లాడివస్తా' అన్నాడు మంగపతి.
'కాదన్నయ్యా! నేనే మాట్లాడి ఏ సంగతి నీకు కబురు పెడతా. ఈ సంబంధం కాకపోతే నువ్వు కూడా మరొకటి చూసుకోవాలి గదా? ఈడేరిన పిల్లాయే'
చెల్లెలి మాటల్లోని వ్యంగ్యాన్ని -- చూపుల్లోని పౌరుషాన్ని- ఆవులించకుండానే ఆవలి మనిషి పేగులు లెక్క పెట్టెటంత తెలివిన్న బుర్ర గనుక - ఆనవాలు కట్టి గూడా -- పైకి పోక్కనీకుండా - తమ చిన్నతనాల నాటి ముచ్చట్లు కళ్ళకు కట్టినట్లు కొన్ని వర్ణించి- పోయిన తల్లిని తలచుకుని కళ్ళు తుడుచుకుని- జీవితాలు శాశ్వతం కాదనే రహస్యం ప్రకటించి - 'మాటదక్కించు సీతమ్మా' అంటూ పరిపరి విధాల ప్రాధేయపడి -- తిరిగి వెళ్ళి పోయాడు మంగపతి.
సీతమ్మ గారి నిర్ణయం మారింది కాదు.
తల్లి పట్టుదల ఎరిగిన స్వామి కూడా అందుకనే తనకు ఆ సంబంధం యిష్టం లేదని చెప్పాడు.
చెప్పి - తల్లిని బస్సు ఎక్కించి తిరిగి వస్తున్న స్వామికి- ఎదురు వచ్చిన పోస్టు బంట్రోతు ఒక ఉత్తరం యిచ్చి పోయాడు. 'ఆనందం రాసింది గామల్సు' అనుకుంటూ కవరు విప్పి స్వామి -- మొదటి పిలుపూ - చివరి సంతకం చూసి నివ్వెర పోయి - చెదరిన కళ్ళతో ఒకటికి పదిసార్లు చదువుకున్నాడు ఆ ఉత్తరం -
'బావా...'
ఆ ఉత్తరంలో మొదట కనిపించిన పిలుపు.
'యిట్లు నీ శ్రీదేవి'
అది చివరి సంతకం -
* * * *
'ప్రేమలేఖా ఏమిటి? ఏ భామ వ్రాసిన దేమిటి మేష్టారు?" అంది పావని.
త్రుళ్ళి పడ్డాడు స్వామి.
'చెప్పగూడదాండీ?'
'అబ్బే అదేం లేదండీ'
'ఏమీ లేకపోతె అంత కంగారెందుకు మాష్టారూ? నిజం చెప్పండి. మా భూతద్దాల కళ్ళ జోడుంది చూశారు?
