12
"ఎవమ్మోయ్! నేను నా కూతురు పురుడు పొయ్యడానికి వచ్చాను కానీ నీ సాధింపులు పడడానికి, నీ ఆజ్ఞలూ అరళ్ళూ భరించడానికి రాలేదు. ఎవనుకుంతున్నావో " గట్టిగా పెద్ద కంఠంతో అరిచింది రాజమ్మ.
"నేను మాత్రం మిమ్మల్ని ఇప్పుడేవన్నా నండీ! కూరలో కొంచెం కారం తగ్గించి వేస్తూ వుండండి. రెండు పూటల నుంచి అయన కూర ముట్టుకోవడం లేదు. ఆయన తినేది కూరతోటి పెరుగు తోటి అన్నాను. అంతే కదా!" అంది సౌమ్యంగా సునంద.
"మొన్నటికి మొన్నా అంతే పెరుగు విషయంలో. ఏం కుర్ర పీనుగని అనుకున్నావా. లేకపోతె నీ ఇంటి కొచ్చి చాకిరీ చేస్తూన్న దాసీ దాన్ని అనుకున్నావా?"
"పిన్ని గారూ మీరలా మనస్సు కష్ట పెట్టుకుంటానంటే చెప్పకుండానే ఉండేదాన్ని. మొన్ననే వచ్చారు. మీకిక్కడ రోజూ మేం ఎలా చేస్తున్నామో తెలియదు అనే ఉద్దేశంతో అన్నాను. అప్పుడేనా అయన మట్టుకి కొద్దిగా పెరుగు వేరే తీసి, తక్కింది నీళ్ళు పోసి గిలకొట్టె వాళ్ళం. మరి మేము ఎన్ని మాట్లయినా మీరు అలా పెరుగు వేరే తియ్యక, అందరి తో పాటు ఆయనకి నీళ్ళ మజ్జిగ పంపిస్తే , ఆయన మజ్జిగా అన్నం అమట్టునే వదిలేస్తున్నారు కెరియర్ లో. అయన కోసం వేరే పెరుగు తీసి ఉంచేవాళ్ళమో లేదో పోనీ, రత్నాన్ని పిలిచి కనుక్కోండి , నా మాట అబద్దం అయితే"
"ఎవమ్మాయ్ -- నాకు సాక్ష్యాలూ, రుజువులూ అక్కర్లేదు. నువ్వు చెప్పిన ప్రకారం అసలే గిద్దెడున్న ఆ పెరుగు లో కొంచెం మళ్ళీ వేరే తియ్యడం అంటే నా వల్ల కాదు. కావలిస్తే ఆ వ్యవహారం ఏదో మీ తోటి కోడళ్ళు మీలో మీరు చూసుకోండి."
"అలాగనే కదా. మొన్న నేను మజ్జిగ చేయ్యపోతే మీకు కోపం వచ్చింది?"
"అమ్మా...తల్లీ....నేను చాలా కోపదారిని....మీరంతా సౌమ్యవంతులూ సరేనా?" అంది వ్యగ్యంగా రాజమ్మా.
"ఎవిటమ్మా ఆ కేకలు ?.......అయినా అక్కయ్యా. ఆ మనిషికి ఆ మనిషికి యింట్లో పెరిగిన కొద్దీ వేరే పెరుగు తియ్యడం యెలా కుదురుతుంది? పూర్వం జరిగింది అంటే అది పేరు." అంటూ ఆ గొడవలో జోక్యం చేసుకుంది రత్నం. ఈ మధ్య ఆరిందాలా మాట్లాడుతోంది -- "అయినా రత్నం , మీ బావగారు పెరుగు లేకపోతె తినరు. ఆ సంగతి నీకు బాగా తెలుసు కదా"
"నిజమే , బావగారికి పెరుగు కావాలి. మీ మరిది గారికి రోజుకు నాలుగు సార్లు కాఫీ కావాలి. చంటాడికి రెండు పూటలా పాలు కావాలి. మనందరికీ సుష్టుగా మజ్జిగ కావాలి. ఇదంతా శేరు పాలల్లో ఎక్కడ కుదురుతుంది?"
ఏడాది నుంచి నిస్సహాయంగా నీరసంగా పడుకున్న ఆ మనిషికి గరిటెడు పెరుగు తియ్యడానికి ఇంత గొడవా? ఇంత చిన్న విషయానికి ఇంత లిస్టు చదవాలా రత్నం.
'అలాగే అక్కయ్యా బావగారికి పెరుగు పంపించాక తక్కిందాంట్లోనే మనం సర్దుకుందాం. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళం మనం. ఎలా తిన్నా సరిపోతుంది... అయన తినేదే పెరుగు తోటి కదా?" అనద్దూ? ఆ మాటతను అనాలా? అన్న తర్వాత కూడా ఇంత రాద్దాంతమా? అయన కామాత్రం కావాల్సింది వేసి పెట్టుకొనే స్వాతంత్యం లేదు తనకీ/ పూట పూట అయన అర్ధాకలి తోటి లేచి పోతుంటే తన మనస్సు ఎంత వికలం అయిపోతోంది? ఎంత నిస్సహాయం అయిపొయింది తన పరిస్థితి.
ఉడుకుమోతు తనం వచ్చి "మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి" అని గట్టిగా అంది. బొటబొట కన్నీళ్లు కార్చేసింది సునంద. ఆమె కేక విని గోపాలం లోపలికి వచ్చాడు. వదిన కళ్ళల్లో నీళ్ళు చూసేటప్పటికి అతని మనస్సంతా వికలం అయింది. "ఎందుకు వదినా ఏడుస్తున్నావు?' అన్నాడు గద్గదస్వరంతో -- సునంద ఏం సమాధానం చెప్పలేదు.
"రత్నం? ఏం జరిగింది?' అన్నాడు కోపంగా.
"అదేమో.... ఆవిడనే అడగండి ఎందుకేడుస్తోందో " అంది వెటకారంగా రత్నం.
"మీరేదో అని ఉంటారు"
"నా మొహం మండా. నేనేమంటాను? నేనే ఒకళ్ళ ని అనడం కూడానా? మీ ఇంటి కొచ్చి అడ్డమైన మాటలు పడకుండా ఉంటె అదే చాలు" అంది పెద్ద గొంతుకతో రాజమ్మ.
"ఇదిగో అత్తయ్య గారూ .... ఇలా వినండి. ఈ ఇంట్లో ఉండదలుచుకున్నవాళ్ళు శాంతంగా ఒకళ్ళ నొకళ్ళు అర్ధం చేసుకుంటూ, సంస్కారవంతంగా ఉండాలి. లోపల మాట పైకి వినిపించడానికి వీలు లేదు. మా యింట్లో మర్యాదలు అటువంటివి"
"అయ్యో రామ! ఇప్పుడు నేను ఏవన్నా నోయ్!"
"ఏవన్నాడో ఏమో , నాకంతా అనవసరం --మా వదిన మనస్సు కష్ట పడకూడదు. అంతే ఇప్పుడామె ఎందుకు కళ్ళ నీళ్ళు పెట్టుకోవలసి వచ్చింది"

"గోపాలం నువ్వు లోపలికి వెళ్ళు" అంది సునంద కళ్ళ నీళ్ళు పైటతో తుడుచుకుంటూ.
"అయినా నువ్వు కూడా ఏవిటి వదినా వాళ్ళతో సమానంగాను"
"నేనేం వాళ్ళన అనలేదయ్యా"
"ఏమో -- ఈ పద్దతెం నాకు బాగుండడం లేదు వదినా. రోజూ మీ ముగ్గురు దేనికో దానికి తగాదా పడుతూనే ఉన్నారు" అంటూ నిష్టూరంగా వెళ్ళిపోయాడు గోపాలం. ఆ మాట విని గతుక్కుమంది సునంద. ఎంత మాట అన్నాడు. తను తగాదా పడుతోందా వాళ్ళతో? "ఎంతకేనా తగుదునిమ్మా- అనేదంతా అని చివరికి తప్పు మాదే అనిపించేలా తయారు చేశావు" అని రాజమ్మా అంటుంటే స్థాణువు లా నిలబడి పోయిందే కాని సమాధానం ఏం చెప్పలేదు సునంద. అన్నం దగ్గర కూచుందన్న మాటే కాని, ఏం సయించ లేదు." పూట పూటా ఇంతింత అన్నాలు పడేస్తుంటే జమీందార్లమా? సంసారం సొంతం కాకపొతే ఇలాగే ఉంటుంది" అన్న రాజమ్మ మాటలు మనస్సుని కలిచి వేశాయి. ఆ రోజున ఆఫీసు లో అన్నీ పొరపాట్లే వచ్చాయి. మేనేజరు గదిలోకి పిలిపించి , "ఏవిటమ్మా ఈ కాగితాలు? ఇలాగే రాస్తున్నావా రోజూ? ఒంట్లో బాగోలేక పొతే సెలవు పెట్టాలి కాని, వచ్చి ఇలా పనిచేస్తే ఎలా?' అంటూ నెమ్మదిగా మందలించాడు. సునంద కి తల కొట్టేసినట్లయింది . మేనేజరు ఎప్పుడూ తనని అలా అనలేదు.
ఆరోజంతా సునంద మనస్సు మనస్సు లో లేదు.
....ఓ రోజున గోపాలం , రత్నం ఘర్షణ పడుతున్నారు.
"ఇంకో సోలెడు పాలు ఎక్కువ పోయించుకునే స్థోమత లేక అవస్థ పడుతున్నామే, చంటాడి పుట్టిన రోజు అంత ఘనంగా చెయ్యక పోతెయెం?' అన్నాడు గోపాలం.
"ఏమంత పదిమంది ఉన్నారని! ఉన్న ఒక్క కుర్రాడికి సరదాగా పుట్టినరోజు పండగ చేసుకోకుండాను?"
"సరదాకి అంతం ఎక్కడ? ఎంత చేసుకున్నా సరదాయే ఈ వీధిలో ముత్తైదువులు నలుగుర్ని పిలిచి శనగలూ తాంబూలం ఇయ్యి చాలు. ఇప్పుడంత అందని పరుగులు పెట్టక్కర్లేదు."
"చాల్లెండి ఎవరేనా నవ్విపోతారు. పిల్లాడి దగ్గరికి వచ్చేటప్పటికే మీ పొదుపు అంతా ఏవీ తప్పుతున్నాయి గనక? మొన్న వచ్చిన వెయ్యి రూపాయలలోనూ పాత బాకీలు పోగా ఇంకా అయిదు వందలు ఉన్నాయి కదా?"
"ఉంటే వచ్చే నెలలో కావద్దూ? అన్నయ్య ఆపరేషను. నీ పురుడు ఎన్ని ఖర్చులున్నాయి?"
"అన్నింటితో పాటే ఇదీను"
"నీకు తెలియడం లేదు. మనం ఏమన్నా డబ్బున్న వాళ్ళమా హోదా ఉన్నవాళ్ళమా? చేసేది గుమస్తా గిరి. కరువు రోజుల్లో ఎందుకొచ్చిన గొప్పలు ఇవి అంటూ నలుగురూ నవ్వుతారు పేరంటానికి వచ్చి. అయినా వేడుకకి విలువేమిటి. కుర్రాడికి తలంటి నీళ్ళు పొయ్యి. కొత్త బట్టలు తొడుగు అంటే కాని.."
"ఇన్ని వందలు వేలూ తగలేస్తున్నారు ఒక్క వంద రూపాయలు కుర్రాడి పుట్టినరోజు పండుగకి సరదాగా ఖర్చు పెట్టడానికి ఏం?"
"సరదా సరదా అంటావు! అవతల అన్నయ్య అలా అనారోగ్యం గా ఉంటె మనకి సరదా ఏవిటే? నలుగురూ ఏం అనుకుంటారు.
"అందరి కోసం మాన సంతోషాలు మానుకుంటామా నాయనా" అంది రాజమ్మ. "ఈ విషయంలో మీకు తెలియదు అత్తయ్య గారూ మీరూరుకొండి" అన్నాడు గోపాలం చిరాకుగా -- "నాకెందుకు నాయనా -- అయినా మీరూ మీరూ చూసుకోండి. పెద్దదాన్ని ఏదో చెప్పాను అనక మీ యిష్టం. రేపు మీ అన్నయ్య ఆరోగ్యం కుదుటపడి ఇంటికి వస్తే ఈ వేడుక అప్పటికి ఉండొద్దూ. ఎప్పటి అందం అప్పటిది."
"అది సరేలెండి నాకు తెలుసు" గోపాలం విసుగ్గా అన్నాడు.
"ఏవండీ -- అయితే ఒప్పుకోరా?' రత్నం గునుస్తూ అడిగింది.
"వద్దు రత్నం. ఈ ఏటికి ఆ ఆలోచన మానెయ్యి. వచ్చే ఏడు ఇంతకీ రెట్టింపు గ్రాండ్ గా చేద్దాం. అన్నయ్య అనారోగ్యంగా ఉండగా చెయ్యడం బాగుండదు. అప్పటిదాకా పక్క గదిలో కూర్చుని పుస్తకం తిరగేస్తూ వాళ్ళ సంభాషణ వింటున్న సునంద , గోపాలం అన్న ఈ ఆఖరి వాక్యాలు విని వాళ్ళ మాటల్లో జోక్యం కలిగించుకోకుండా ఉండలేక పోయింది.
"ఏవిటి గోపాలం. సరదాగా చెయ్యవలసిన బాబిగాడి పుట్టినరోజు పంక్షన్ కి అంత సంకోచం దేనికి? అంది సునంద.
గోపాలం అక్కడికి వచ్చి "అది కాదు వదిన. ...." అంటూ చెప్పబోయాడు.
"నేను అంతా విన్నానులే -- ఓ వంద రూపాయలకి ఆలోచిస్తే ఎలా? ఇంకొకప్పుడు మనం ఖర్చు పెడదాం అంటే మాత్రం ఈ అవకాశం వస్తుందా?"
రత్నం అది విని "అక్కయ్య ఎంత మంచిదో?" అనుకుంది. తను కూడా అక్కడికి వచ్చి "నేను అదే అంటున్నాను అక్కయ్య. రిపీ వేడుక రమ్మంటే వస్తుందా?" అంది.
"అతని మాటలకేం లే -- రేపు మనిద్దరం బజారు కి వెళ్ళి కావలసినవన్నీ కొనుక్కు తీసుకు వద్దాం" అంది సునంద.
రత్నానికి మరింత ఆనందం అయిపొయింది. "మరి పిలుపు కి మనిద్దరం కలిసి వెళ్ళాలి. ఏం?' అంది.
ఓ....అలాగే అంది సునంద.
మీ ఆఫీసులో వాళ్ళనీ అయన ఆఫీసులో వాళ్ళనీ ఈ వీధిలో వాళ్ళనీ అందర్నీ పిలుద్దాం ఏం?"
"అలాగే"
"పిల్లలకి ఓ ప్లాస్టిక్ ఈలా, ఓ లడ్డూ, పెద్దాళ్ళకిఒ స్వీటు , ఓ పండూ , శనగ లూ , తాంబూలం . కవర్ల లో పెట్టి ఇలా ఇస్తే బాగుంటుందా?"
"ఓ ....ఫస్టు గా ఉంటుంది. రేపు ఇవన్నీ నేను ఆఫీసు నుంచి వచ్చాక బజారు కెళ్ళి తెద్దాం అంది సునంద.
"ఇంకనేం? ఒకళ్లిద్దరు కలిశారు" అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు గోపాలం.
"అక్కయ్య చూడవే అమ్మా, ఆయన్ని ఇట్టే ఒప్పించింది. మనం ఎంత వాదించినా ఒప్పించ లేకపోయాం." అంది ఉత్సాహంతో రత్నం.
