Previous Page Next Page 
పిల్లలతో ప్రేమయాత్ర పేజి 16

 

    కళ్యాణి భర్త వంక చురావ్ చుర మంటూ చూసింది -- "అసలు ఈ అఘాయిత్యానికి కంతటికీ కారణం మీరు!' అన్న భావం ఆ చూపుల్లో అతనికి స్పష్టంగా నే కనిపించింది.
    ఐతే ప్రతి చిన్న విషయానికీ అకారణంగా ఆమె తనని దోషిగా ఎందుకు భావిస్తుందో అతనికేంతకూ అంతు పట్టదు.
    "అసలు ఆడవాళ్ళ మనస్తత్వమే అంతే నెమో. తమకేం కష్టమోచ్చినా దానికి కారణం భర్తే నని అనుకుంటే వాళ్ళ కదో రకమైన సంతృప్తి కలుగుతుంది.' అనుకున్నాడు గది తలుపులకు తాళం వేస్తూ.
    తల్లి తిట్లతో పిల్లలు భయపడి పోయి మౌనంగా ఉండి పోయేరు. కళ్యాణి కూడా బయటకు రావడం వల్ల మౌనంగా ఉండక తప్పలేదు. తుఫాను వెలిసిన తరువాత ప్రశాంతత లా ఒకరకమైన నిర్లిప్తత ఆ కుటుంబాన్ని ఆక్రమించుకుంది కాసేపు.
    హోటల్లో కి వెళ్ళి టేబులు చుట్టూ ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు. పాప కూడా హోటలు కి వెళ్తే విడిగా కుర్చీలో కూర్చుంటానంటుందే తప్ప ఒడిలో ససేమిరా కూర్చోదు. 'ఇప్పట్నుండే బోడి యిండివిడ్యూయాలిటీ , అదీను' అనుకుంటూ తన పక్కనే ఉన్న కుర్చీలో కొంచెం విసురుగా పిల్లను కూలబడేసి తను కూడా కూర్చుంది. బాబు తండ్రి పక్కనే ఎదురెదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని తల్లి ముఖంలోకి దొంగ చాటుగా చూస్తున్నాడు. అమ్మ ముఖంలో యింకా కోప రేఖలు అలాగే ఉండటం చూసి కుదురుగా కూర్చున్నాడు.

                         


    అవి కనుక మాయమయితే తను మాములుగా ఉండవచ్చునని వాడికి బాగా తెలుసు.
    కాంతారావు యేవో టిఫిన్ల కు అర్దరిచ్చేడు. అవి వచ్చేలోగా మోచేతులు బల్ల కానించి అరచేతుల్లో గడ్డాన్ని యిముడ్చుకుని ఆలోచించుకుంటూ కూర్చున్న కళ్యాణి లో క్రమంగా ఆవేశం తగ్గసాగింది. 'పాపం పిల్లలను అనవసరంగా తిట్టేను , కొట్టెను' అంటూ పశ్చాత్తాప పడింది. 'వీళ్ళు చిన్నపిల్లలు. వాళ్ళకి డిసిప్లీను, నీట్ నెస్ అంటే ఏం తెలుస్తాయి? నా పిచ్చి గాని. కొడితే ఎడుస్తారే తప్ప. ఎందుకు కొట్టింది తెలుసుకునేపాటి తెలివితేటలూ కూడా లేని పసి పిల్లలు వీళ్ళు.' అనుకుంది.
    ఇంతలో సర్వరు ప్లేట్ల లో టిఫిన్లు తీసుకు వచ్చేడు. 'తల్లీ నీకేం కావాలమ్మా? పూరీ తింటావా? దోసె తింటావా!" అంటూ పాపను దగ్గరకు తీసుకుంటూ లాలనగా అడిగింది. పూరీ వంక వేలు చూపింది పాప. వో ముక్క తుంపి పాప చేతిలో పెట్టి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. పాప నమ్మలనట్టు తల్లి ముఖంలోకి చూసి, వెంటనే అమ్మ ముఖంలో స్పష్టంగా కనపడుతున్న ప్రేమ వాత్సల్యాలను గ్రహించి నవ్వింది. పాప నవ్వు చూడగానే కల్యాణి మనసు తేలిక పడింది. 'నా కన్న తల్లి ! నన్ను క్షమించింది!' మనసులోనే అనుకుని, రాబోయే కన్నీటిని బలవంతాన అపుకుంది.
    బాబు తల్లి కోపం పోయినట్లు గ్రహించి 'అమ్మా! నాకు కూలా పూలీ పెత్తూ!' అంటూ గారాబంగా అడిగేడు. వో పూరి  తీసి వాడి చేతిలో పెట్టి 'తిను నాన్నా! అంతా తినేయాలి. ఇంకా ఏమీ మిగల్చ కూడదు.' తెలిసిందా? మనం యింకా  అట్టట్ట చాలా తిరిగి రావాలి. ఇప్పుడు సరిగ్గా తినకపోతే ఆ తరువాత ఆకలి వేస్తుంది.' అంటూ తన ప్రేమను మరో రకంగా వ్యక్తం చెయ్యటం చేతకాక ఆ మాటలు అంది కళ్యాణి.
    అందులో బాబు కర్ధమైనదల్లా తనని బాగా తినమని అన్న వాక్యమే! అందువల్ల తల్లి ఆజ్ఞను తు.చ తప్పకుండా పాలించేడు. కడుపు నిండా టిఫిన్లు పడేక పాలిప్పించి, తాము కాఫీ తాగి బయటకు వచ్చేరు.
    'ఇక్కడ ఊళ్ళో చూడవలసిన విశేషాలేమిటి? ' అని హోటలు మేనేజరు ను అడిగేడు కాంతారావు. 'అలివేలు మంగతాయారు గుడి, యూనివర్శిటీ, పద్మావతీ కాలేజీ..... యింకా బజార్లన్నీ చూడొచ్చు..' అంటూ చెప్పేడు మేనేజరు యాంత్రికంగా.
    అతనికి యిలాటి ప్రశ్నలు రోజుకి కనీసం పది సార్లైనా అడిగించుకోవటం, దానికి సమాధానం చెప్పటం అలవాటని అతను చెప్పే తీరుని బట్టే గ్రహించ గలిగెడు కాంతారావు.
    ముందుకు వెళ్తున్నవాడల్లా ఆగి మళ్ళీ వెనక్కి వచ్చి 'యూనివర్శీటీ కి, పద్మావతి కాలేజీ కి వెళ్ళి రావటానికి టాక్సీ కి ఎంత వరకు యివ్వ వచ్చునంటారు?' అనడిగాడు.
    ఆ మేనేజరు విసుగుదలను బలవంతాన అణచుకుంటూ 'వాడితే అడగటం పది రూపాయలకు తక్కువ అడగదు. మీరు ఐదు రూపాయల కంటే ఎక్కువ యివ్వకండి' అని వెంటనే తన పనిలో మినిగి పోయేడు. వో పావు గంట సేపు టాక్సీ వాడితో వాదించి చివరకు ఆరు రూపాయల్లో యూనివర్శీటీ పద్మావతీ కాలేజీ చూపించి మళ్ళా తిరిగి తమ హోటలు వద్ద దింపేట్టు ఒప్పందం చేసుకున్నారు.
    టాక్సీ లో కూర్చునే సరికి పిల్లలకు హుషారు వచ్చింది. తల్లి ఒళ్లో నుండి కిందికి జారుతూ పాప ఒకటే గోల. బాబు టాక్సీ లోనే అమ్మ నుండి నాన్న దగ్గరకు, పరుగు పెడ్తూ , మధ్యలో పాప నెత్తి మీద మొట్టి కాయి వేస్తూ, దాని జడకు ముడి వేసిన రిబ్బను లాగుతూ నానా హంగామా చేస్తున్నాడు. అంతకు ముందే పిల్లలను కొట్టినందుకు గట్టిగా పశ్చాత్తాప పడటం వల్ల మొదట వాడి అల్లరిని చూసి నవ్వింది కళ్యాణి. తల్లి నవ్వు చూసేసరికి బాబు హుషారు మరింత ఎక్కువయింది.
    వాడి హుషారు ఎక్కువౌతున్న కొలది కళ్యాణి లోని సహన శక్తి, క్రమంగా సన్నగిల్ల సాగింది.' 'బాబూ! తప్పు నాన్నా! అల్లరి చెయ్యకూడదు.' అంటూ నచ్చ చెప్పసాగింది బలవంతాన కోపాన్ని అణచుకుంటూ.
    అప్పటికే పాప కూడా అన్నతో చేతులు కలిపింది. ఒకరి నొకరు కవ్వించుకుంటూ కేరింతలు కొడుతున్నారు యిద్దరూ-- 'ఖర్మ!' అంటూ నుదురు కొట్టుకుంది కళ్యాణి.
    కాంతారావు యిదంతా గమనిస్తూనే పైకి మాత్రం గమనించనట్లు నటిస్తూ బయటకు చూస్తూ కూర్చున్నాడు. ఊరు చాలా పాతగా, సనాతనంగా ఉంది. ఊళ్ళో 'గ్లామర్' లేదు. హైదరాబాద్ లోలా  టైట్ పాంట్లు, జీన్సు కనపట్టం లేదు. జడల నిండా తల బరువేక్కే లా పూల చెండ్లు పెట్టుకుని, వాయిల్ చీరలు, వేంకటగిరి చీరలు కట్టుకున్న పడుచు పిల్లలే కనిపిస్తున్నారు కాని, పెదవులకు, కళ్ళకు బుగ్గలకు రంగులు రాసుకుని, శరీరంలోని అర్ధ భాగం కన్నా వో పావు తక్కువ భాగాన్ని మాత్రమే అచ్చాదించే దుస్తులు వేసుకునే హైహీల్సు యానలు, బాబ్ డు హైరు కనపట్టమే లేదు. 'మరీ బాక్ వర్డ్ గా ఉంది ఊరు.' అనుకున్నాడు కాంతారావు.
    టాక్సీ లోపల పిల్లల అల్లరి తారా స్థాయికి నందు కుంటోంది. డ్రైవరు రెండు సార్లు వెనక్కి తిరిగి చూసేడు పిల్లల వంక. దారిన పోయే వాళ్ళు కూడా వాళ్ళ గోల విని టాక్సీ లోకి చూడసాగేరు.
    అదంతా చూసేక యింక కళ్యాణి నిగ్రహించుకోలేక పోయింది. 'ఏమిట్రా ఆ గొడవలు?' కుదురుగా కూర్చోమంటే కూర్చోరేం?' యిద్దరికీ చెరో రెండు అంటించింది. దాంతో కేకలు మాని ఏడుపులు మొదలైనవి. వాళ్ళ ఎడుపులతో చెవులు హోరెత్తిపోతుంటే అది భరించలేక మరో రెండు వాయించుదామనుకుంది. కాని బాగుండదని అతి ప్రయత్నం మీద తనని తాను నిగ్రహించుకుంది కళ్యాణి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS