Previous Page Next Page 
ముద్ద మందార పేజి 16

 

    ఆ రాత్రంతా టేబులు మీద పెట్టిన మందార పువ్వును చూస్తూ కాలం గడిపాను. మనస్సంతా విష కుంభం అయిపొయింది. సింహాచలానికి సంవత్సరంలో వస్తానని మాటిచ్చి నాలుగేళ్ళు దాటింది.... ఎలా వుందో.... అసలు వుందో.... లేదో..... ఆమె కొడుకు.... నా పెద్ద కొడుకు.....

                             *    *    *    *
    రోజూ వుదయం ఏడు గంటలకు వచ్చెదామే. అప్పటికి రామం స్నానం వగైరాలు పూర్తీ చేసుకుని మరీ కూర్చునేవాడు. అప్పటితో నరసమ్మ గారు వంట పనికి పోయేది. ఆమె వచ్చి కధలు చెప్పడం , బొమ్మలు వేయించడం, లాటివి చేయించి ఎనిమిదిన్నర ప్రాంతంలో వెళ్ళిపోయేది. "టీచర్ తో చెప్తా" నంటే రామం ఎంత పంతాన్నయినా వదిలేసేవాడు.
    రోజూ ఆమె మందారపువ్వు పెట్టుకుని వచ్చేది. మందారకూ ఆమెకు కూడా ఏదైనా సంబంధం వుందేమో ననిపించింది నాకు.
    ఆమె రెండు జీతాలు పుచ్చుకుంది.
    ఏవిటో ఆమె యింట్లో తిరుగుతుంటే నాకు సింహాచలం గుర్తుకు వచ్చింది. ఆవిడను గురించి మాట్లాడుకునే టపుడు 'టీచర్' అనడమే గాని, ఆమె పేరు తెలియక పోవడం ఏవిటని పించింది ఒకనాడు. ఆవిడనివాళ అడిగి తీరాలి అనుకున్నాను.
    ఆరోజామె పాఠం చెప్పి వెళ్ళిపోతూ "మనబాబు కొన్నాళ్ళు పొతే నాకే చదువు చెప్పేలా వున్నాడు అబ్బ.... ఎంత తెలివి" అంది రామం బుగ్గ ముద్దు పెట్టుకుంటూ నేను నవ్వేసి, "అల్లరి వెధవ, మీ పేరు చెపితే గాని ఏ మారామూ మానడు " అని, "అన్నట్లు మిమ్మల్ని టీచరు గారనడమే గానీ మీ పేరు తెలీనే తెలీదు" అన్నాను.
    ఆమె సిగ్గుపడింది.
    "సుశీల" అంది.
    నేనామె కేసి, కళ్ళ కేసి చూశాను. మత్తెక్కించే ఆమె కళ్ళు నేలచూపులు చూస్తున్నాయి. నాలో ఆ క్షణం లో వింత కోర్కెలు చెలరేగాయి. అతి కష్టం మీద నిగ్రహించుకున్నాను.
    ఆమె "శలవు" అని నమస్కరించి వెళ్ళిపోతుంటే తలెత్తి ఆమె కేసి చూశాను. నల్లని త్రాచుపాములా చక్కగా చిక్కగా నిగనిగలాడే జడ...... తలలో మందార పువ్వు..... నడుస్తుంటే అటూ యిటూ తాళయుక్తంగా వూగి, కోర్కెలను రేకెత్తించే జడ! సన్నని నడుము.....
    నిట్టూర్చి కూలబడ్డాను.

                               *    *    *    *
    మర్నాడు సుశీల పాఠం చెప్పడానికి వచ్చేసరికి నేను ముస్తబయి కూర్చున్నాను. పదయ్యేసరికి "నమస్తే" అంటూ ఆమె వచ్చింది. నేనూ "నమస్తే" అన్నాను. నా కళ్ళు మిరమిట్లు గొలిపాయి. ఆకుపచ్చటి అంచున్న తెల్లటి చీర, ఆకుపచ్చటి రవిక వేసుకుంది. జడ వదులుగా వేసుకోడం వల్ల చెవుల మీద పడుతోంది. చక్కగా కాటుక పెట్టుకున్న ఆమె కళ్ళు మిలమిలా మెరిసి పోతున్నాయి.
    బాబుకి ప్రయివేటు చెప్పే గదిలోకి వెళ్ళిపోయింది ఆమె. రాధ చనిపోయిన యిన్నాళ్ళ కి నా మనస్సు స్త్రీ అందం మీదకు పోయింది. యాంత్రికంగా కుర్చీలోంచి లేచి, ఆ గది వైపు వెళ్ళాను. సుశీల గదిలో రాసుకుంటున్న రామం వెనక నిలబడి వంగి పలక కేసి చూస్తోంది. అలా వంగడం వల్ల ఆమె మెళ్ళో గొలుసు క్రిందకు వాలి, చిన్నగా వూగుతోంది. అలా ఓ నిముషం చూసి చైతన్యంలో కొచ్చి, అది మర్యాదకరం కాదని వెనక్కి వచ్చి కుర్చీలో కూర్చున్నాను. ఇంతలో నరసమ్మగారు వచ్చింది.
    "టీచరు గారిని పాఠం అయ్యాకోసారి రమ్మని చెప్పండి" అని నేను నా రూముకు వెళ్ళి కూర్చున్నాను. హృదయంలో ఆరాటం బయలుదేరింది. సుశీలని ఏమైనా నాదానిగా చేసుకోవాలి.... చేసుకు తీరాలని పట్టుదల నిమిషాల మీద కొండంతయ్యింది. ఆవేశంతో వళ్ళు వేడెక్కింది. నుదుట చెమట పట్టింది. ఒకవేళ సుశీల అంగీకరించకపోతే.....
    ఏమయితే అదయ్యింది. అడిగి తీరాలని నిశ్చయించుకున్నాను. నేనడిగితే వినక పొతే నాన్నగారి చేతా, సుభద్రమ్మ గారి చేతా కూడా అడిగించచ్చు అనుకున్నాను. ఓ గ్లాసుడు మంచినీళ్ళు తాగాను. నావూహాలకు ఒక సభ్యత కలుగ జేసుకుంటూ ఆమెను అడిగే విధం ఆలోచించసాగాను.
    "పిలిచారట" అందామె.
    "ఆ....అవును....కూర్చోండి" అన్నాను. ఆమె బల్ల కెదురుగా వున్న కుర్చీలో కూర్చుంది. నేను గొంతు సవతించుకునే లోగా రామం వచ్చి " నాన్నగారూ ఈరోజు టీచరు పుట్టిన రోజట. ఇదిగో యీ తినను యిచ్చారు నాకు" అన్నాడు. "సరేలే వెళ్ళాడుకో" అన్నాను. రామం వెళ్ళిపోయాడు.
    "ఈరోజు మీ పుట్టినరోజా" అన్నాను.ఆమాట అనేసరికి విపరీతమైన ఆయాసం వచ్చింది. "అవును" అందామె చాలా నెమ్మదిగా. నేను ధైర్యం చేసి," "మరి మావాడికి స్వీట్స్ తెచ్చిస్తే చాలా" అన్నాను. ఆమె తలెత్తి నాకేసి చూసింది. నేనామె కళ్ళలోకి చూడలేక, తలదించుకున్నాను.
    "మీ వంటి వాళ్ళకు ఏమివ్వగలము." పైగా మీ పంచన బ్రతుకుతున్న వాళ్ళం. అయినా, మీరు నిండు మనస్సుతో తీసుకుంటారనే నమ్మకంతో యీ చాకలేట్లూ తెచ్చాను." తీసి టేబిల్ మీద పెట్టండి.." మీరివ్వడం నేను తీసుకోపోడమూనా విషమిచ్చినా తింటాను" అంటూ ఒక చాకలేట్ తీసుకుని కాయితం వొలిచి, చాకలేట్ నోట్లో వేసుకుంటూ, "మీరూ తినండి" అన్నాను.
    సభ్యత కోసం ఆమె ఒక చాక్లెట్ నోట్లో వేసుకుంది. పెదిమలు విడకుండా నముల్తుంటే ఆమె మూతి నాకు వింతగా కనుపించింది. ఇంతలో ఓ చిన్న వూహ తట్టి , డ్రాయర్ లోంచి కొత్త పార్కర్ పెన్నూ ఓ వంద రూపాయలూ తీసి టేబుల్ మీద పెడుతూ "మీరు పుట్టిన రోజుకి నా ప్రజెంట్స్" అన్నాను. ఆమె ముఖం వివర్ణమయ్యింది. లేచి నిలబడింది. ఆ సమయంలో ఆమె వక్ష స్థలం చురుకుగా పైకి క్రిందకూ ఆడసాగింది. నేనూ లేచి నిలబడ్డాను.

                                     9

    
    "క్షమించండి" అందామె.
    నా శరీరం చల్లబడి పోయింది. ఇక ఆలస్యం చేస్తే, రేపటి నుంచీ అసలు పాఠానికి రావడమే మానేయవచ్చు. అందుకని, "ఆవేశ పడకండి. మీతో ఒక విషయం చెప్పాలి. వినేముందు శాంతంగా కూర్చోండి" అన్నాను. ఆమె యాంత్రికంగా కూర్చుంది. నేనూ కూర్చుని ప్రారంభించాను.
    "నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మీ అభిప్రాయం తెలుసుకోవాలని వారం రోజుల నుంచీ అనుకుంటున్నాను. మీరేదో కూటికి లేక మా పంచకి చేరారని, మీ మీద దౌర్జన్యం చేస్తున్నానని అనుకోకండి. చాలా పవిత్రమైన ఆలోచనతో యీ నిర్ణయానికి వచ్చాను. నాకు మొదటి భార్య పోయి నాలుగేళ్ళవుతోంది. రామం నా కొడుకు. ఆ సంగతి మీకూ తెలుసు. మీ నిర్ణయాన్ని యిప్పటి కిప్పుడే చెప్పక్కర్లేదు. సావకాశంగా ఆలోచించుకునే నిర్ణయానికి రండి. మీరు వప్పుకుంటే నాన్నగారితో చెప్తాను. మీరు సమ్మతించాలనే దేముణ్ణి ప్రార్ధిస్తాను." అని, "మరొక్క విషయం . ఇలా అడిగాననీ, దౌర్జన్యం చేశాననీ అనుకోవద్దు. నా మనస్సులో కోర్కెను వెల్లడి చేశాను. మీ కిష్టం లేకపోతె క్షమించండి. దాని కోసం పాఠం మానుకోనక్కరలేదు.' అన్నాను. గుండె దడదడ లాడింది.
    సుశీల లేచి నిలబడింది.
    టేబులు మీది అద్దం మీద రెండు కన్నీటి చుక్కలు టపటప రాలాయి. నీళ్ళు నిండినకళ్ళతో ఆమె నా వంక వక్కసారి చూసి వెళ్ళిపోయింది,
    మళ్ళీ నా జీవితానికి సమస్యలు ఏర్పడ్డాయి. నా మనస్సులోకి వివాహ వాంఛ మళ్ళీ చొప్పించారు. ఇప్పుడుసుశీలని చేసుకుంటానని నాన్నగారికి చెప్పగలనా-- చెప్పి వొప్పించగలనా. సుశీల అసలు నన్ను చేసుకోడానికి సమ్మతిస్తుందా? అన్నీ సమస్యలే....
    సాయంత్రం అయ్యేసరికి ఒక నిశ్చయానికి వచ్చాను. ఏది ఏమైనా సరే సుశీల నా సొత్తు. నాన్నగారితో యీ విషయం ధైర్యంగా చెప్పి తీరాలి. సుశీలని బ్రతిమాలయినా సరే వోప్పించాలి-- నాలో ఆరాటం  ఎక్కువయ్యింది. రాత్రి నాన్నగారి గదికి వెళ్లాను. "కూర్చో" అన్నారు. కూర్చున్నాను.
    నాన్నగారు సిగరెట్టు వెలిగించి, "నీ వివాహ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చి వుంటావనుకుంటాను. ఎవరిని చేసుకున్నా నాకభ్యంతరం లేదు. కానీ, నువ్వు వివాహం వీలైనంత త్వరలో చేసుకోవాలి" అన్నారు.
    "ఓ వారంలోగా చెప్తా"నని వచ్చేశాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS