Previous Page Next Page 
గూడు చేరిన పక్షులు పేజి 17

 

    డాక్టర్ గారూ...మీరు నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించారు. ఆజన్మాంతం కృతజ్ఞుడిని. కర్తవ్యమ్ కూడా మీరే బోధిస్తే జన్మజన్మ లకు కృతజ్ఞుడనై ఉంటాను. నా ఈ కధ విన్న మీరు నన్ను అసహ్యించుకుంటారు....ఆ సంగతి నాకు తెలుసు . చిన్నప్పటి నుండీ ఎంతో అభిమానంతో, పౌరుషంతో బ్రతికిన వాడను నేను. కాని యిప్పుడు అవమానమే నా దినచర్య గా మారింది. మీరు ఏ సలహా యిచ్చినా తల వంచి పాటిస్తాను.... నా స్వవిషయాలు చెప్పి మిమ్ములను విసిగించాను. క్షమించండి....'
    నే చెప్పినదంతా వోపికతో విన్నారు డాక్టరు గారు.... ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నారు; ఏదో ఆలోచిస్తున్న వారిలా....!
    'మీ అన్నయ్య పేరేమిటి సూర్యం ....?'
    'ప్రసాద్....;' అన్నాను నేను తడుము కోకుండా --
    'ప్రసాద్....ప్రసాద్ ....!' ఒకటికి రెండు సార్లు వారు ఆ పేరును ఉచ్చరించారు. ఆ తర్వాత నన్ను చూస్తూ 'బాబూ! సూర్యం అన్న పేరును మార్చి శివం అని ఎందుకు చెప్పావు రాధతో ?' ప్రశ్నించారు.
    'ఆ పేరుతొ ఆ పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి , నన్ను ఆ పేరుతొ పిలిచి నప్పుడల్లా బాధపడడం జరుగుతుందని ఊహించి పేరు మార్చి చెప్పాను.'
    'బాబూ శివం .... ప్రతి వాళ్ళూ తప్పులు చేస్తారు...వాటికి ఒక హద్దంటూ ఉంటుంది.....నీవూ తప్పులు చేశావు.... ఆ తప్పులు హద్దులు దాటాయి... జీవితంలో గొప్ప నేరస్తుడిని...కాదనడానికి వీలులేదు.... అయినా తప్పులు తెలుసుకొని సక్రమంగా గడుపుతానని నాకు మాట యిచ్చే పద్దతిలో నావద్ద ఉద్యోగం యిస్తాను. అప్సత్రి లో ఉండి పనిచెయ్యి. రోగులకు రాత్రింబవళ్ళు సేవ చేసి నీ పాపాలను సాధ్యమైనంత వరకు పరిహారం చేసుకో...మంచిని పెంచుకో ...ఇదే నా సలహా.... పద బాబూ వెడదాం.... ఆస్పత్రికి వెళ్ళే సమయం అయింది.....
    వారిని దేవతలుగా భావించాను.... మనసు లోనే వేయి దండాలు పెట్టుకున్నాను వారి సలహాను శిరసావహించ దలచు కున్నాను. మౌనంగా వారి ననుసరించాను-------

                                                                                               రమణయ్య  
    'ఎంత పని చేశావే....? గంగగోవు లాంటి నా బిడ్డడిని నాకు దూరం చేశావు. అందుకే భగవంతుడు తగిన శాస్తి జరిపాడు. నాకు...నీకూ.... తల్లి లేని బిడ్డడు కదా....! వాడి పై అంత కాఠీన్యం  ఎందుకు చూపావ్....? అమాయకుడు....ఆ పిన్న వయసులో యింటి నుండి తరిమేశాను.... కసాయి వాణ్ణి ...ఎన్నిదెబ్బలు కొట్టినా పల్లెత్తు మాట మాట్లాడలేదు.. ఎన్ని పాట్లు పడుతున్నాడో ....? ఎక్కడున్నాడో?'
    'చేయరాని ఘోరమే చేశానండీ! మూర్కురాలిని. ఒకవేళ మీరు క్షమించినా నన్ను భగవంతుడు క్షమించడు. ఉన్నదంతా కన్న కొడుకుకు కట్టబెట్టాలని ఆ పాపం చేశాను. తగినట్లు అనుభవిస్తున్నాను. నా పాపాలకు నిష్కృతి ఉందంటారా....? రాత్రి అక్కయ్య 'ప్రసాదు తల్లి' కలలో కనిపించింది. తన కన్న బిడ్డడికి అంత ద్రోహం చేశాను గద...పల్లెత్తు మాట అనలేదు. 'చెల్లీ....వాడు నీకేమన్యాయం చేశాడమ్మా? తండ్రికి వాడిని దూరం చేశావ్....యిప్పుడైనా వారికి నిజం చెప్పు. వారింకా ప్రసాదు దొంగ అనే అనుకుంటున్నారు.... చేసిన పాపం చెబితే పోతుందమ్మా....!' అంతే! ఆ తర్వాత మాయమైంది. ఎంత అందంగా ఉందండీ....? ఆ మాటాడే తీరు.... ఆ ముఖ వర్చస్సు.... ఒక దేవతలా ఉంది.'
    'అలాగా....! నా లక్ష్మీ కలలో కనుపించిందా....? లక్ష్మీ....నా లక్ష్మీ.... దానితో కాపురం చేసినన్నాళ్ళు యిల్లు స్వర్గం లాగా ఉండేది కదే...! అది నన్ను విడిచి పెట్టి పోయింది. నాకు శని పట్టుకుంది. నీవు కాపురానికి వచ్చాకే నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఎప్పుడూ కోపతాపాలు ..రుసరుసలూ! మళ్ళీ ఆ సుఖం ...ఆ శాంతి కన్ను మూశాకే నాకు లభిస్తుంది. కాంతం నీవు అదృష్ట వంతురాలవే! లక్ష్మీ నీకు కలలో కనుపించింది.... మాట్లాడింది, నేను ఆ కొద్ది పాటి భాగ్యానికి కూడా నోచుకోలేదు.... అవును. నా పై కినుక వహించింది... అందులో తప్పేముంది? సహజమే! నాయనా ప్రసాద్ ...నీకు చేసిన అన్యాయానికి ఒకవేళ నీవు మన్నించినా.... ఆ భగవంతుడు నన్ను మన్నించడు. అందుకే మమ్ములను మా యింటికి దూరం చేశాడు.... గూడు విడిచిన పక్షుల మయ్యాము. మళ్ళీ గూటికి ఎప్పుడు చేరుతామో? ఆ గూడు ఎప్పుడు కళకళ లాడుతుందో? ఈ విధంగా దిక్కు మొక్కు లేని అధ్వాన్నపు బ్రతుకు బతక వలసి వస్తుందని కలలో కూడా తలచలేదు. అంతా చేసుకున్న పాపం.... కాంతం....యిదంతా నీవల్లే జరిగింది, నా లక్ష్మీ తో గడిపిన ఆ కొద్ది కాలమే నా పూర్తీ జీవితంగా భావిస్తున్నాను. అందుకే ఎక్కువ మంచితనం చాలా కాలం నిలవదని అంటూ ఉంటారు. ఆ విధంగానే లక్ష్మీ పిన్న వయసు లోనే నాకు దూరమై పోయింది. నా జీవితంలో నీవు శనిలా ప్రవేశించావు. జరగకూడని అనర్ధాలన్నీ జరిగిపోయాయి. సర్వనాశనం జరిగింది.' బాధతో విలవిలలాడిపోతున్న నాకు గతం గుర్తుకు వచ్చింది. జరిగిన సంఘటన లన్నీ కళ్ళకు కట్టినట్లు కనుపించసాగాయి.
    లక్ష్మీ కొత్తగా కాపురానికి వచ్చిన ఆ రోజులు ఎంత హాయిగా గడిచి పోయాయి. యుగమొక క్షణం లా మధురంగా నడిచాయి. లక్ష్మీ....నిజంగా నా పాలిట లక్ష్మే....!  ఆ లక్ష్మీ నా యింట అడుగు పెట్టిన తర్వాతే లక్ష్మీ ప్రసన్న మై యిల్లు కళకళ లాడింది... నే పట్టింది బంగార మైంది. ఎటువంటి అణుకువ? ఎంత మంచితనం....? వినయ విధేయతలు. ఊరంతా మంచి పేరు తెచ్చుకుంది. ఇబ్బంది లో ఉన్నవారిని చూసి జాలిపడేది. ఆపదలో ఉన్నవారికి ఉత్సాహంతో ముందుకు ఉరికి సహాయం చేసేది. ఎదుటి వారికి సాయం చేయడం లో తనకు రాబోయే ప్రమాదాన్ని కూడా గుర్తించేది కాదు.
    ఒకసారి మా యింటి ప్రక్కనే ఉన్న రాఘవయ్య గారి భార్య కు కలరా వ్యాధి సంక్రమించింది. ఏదో పెళ్ళికి వెళ్ళి వచ్చింది ఆమె... వచ్చీ రావడం తోనే విరేచనాలు ప్రారంభ మయ్యాయి. ఆమెకు పరిచర్యలు చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. సమయానికీ రాఘవయ్య గారు కూడా ఊరిలో లేరు. ఆమెకు కలరా తగిలిందని తెలిసిన మరుక్షణం లోనే ఎంత వారించినా వినకుండా వారి యింటికి పరుగెత్తింది లక్ష్మీ. రెండవ నిముషం లో ఆదరా బాదరాగా తిరిగి వచ్చింది.
    'ఆమె పరిస్థితి ఏమీ బాగాలేదండీ! రాఘవయ్య అన్నయ్య గారు కూడా ఊరిలో లేరు. మీరు వెంటనే సైకిలు మీద వెళ్లి పొరుగూరి లో ఉన్న డాక్టరు గారిని ఉన్న పళంగా తీసుకు రావాలి. లేకపోతె ఆమె బ్రతకదు. వెళ్ళండి ....ఇంకా నిలుచున్నారేం? ఒక నిండు ప్రాణానికీ ముప్పోస్తుంటేనూ...!'  
    'లక్ష్మీ నీకేమైనా మతిపోయిందా? కలరా రోగి దగ్గరకు వెళ్ళి వచ్చావా? అదసలే అంటురోగ మౌతేనూ....?'
    'అయితే అయింది. చావు బతుకులలో ఉంది ఆమె. అంటురోగమని , చూస్తూ ఎలా ఉండగలం? మీరు త్వరగా వెళ్ళి రావాలి....మీరు డాక్టరు గారిని తీసుకు వచ్చేంత వరకు నేను ఆమె దగ్గరే ఉంటాను?'
    నేనేదో మాట్లాడబోతూ ఉంటె నన్నింకేమీ మాట్లాడవద్దని సంజ్ఞ చేస్తూ మళ్లీ ఆ రోగి దగ్గరకు వెళ్ళిపోయింది. గత్యంతరం లేక డాక్టరు గారి కోసం పొరుగూరు వెళ్లి డాక్టరు గారితో సహా గంటలో తిరిగి వచ్చాను. ఊరు దగ్గిరే కావడం వల్ల వెంటనే రాగలిగాను. డాక్టరు రోగిని పరీక్ష చేసి ఏవేవో మందులు యిస్తూ వాటిని వాడే విధానము రోగికి తీసుకోవలసిన జాగ్రత్త లూ అన్నీ లక్ష్మీ కి తెలియజేస్తూ 'చూడండీ రోగి పరిస్థితి ప్రమాదకరం గానే ఉంది... ఈ రాత్రి గడుస్తే ఫరవాలేదు. ఎందుకైనా మంచిది. అందరికీ కబురం పించండి. రాత్రంతా ఎవరో ఒకరు రోగి వద్ద ఉండి ఆమెకు పరిచర్యలు చేస్తూ ఈ మందులన్నీ వాడుతూ ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్త పనికి రాదు. మళ్ళీ రేపు నేనువచ్చి చూసి వెడతాను.' అని వెళ్ళిపోయారు.
    డాక్టరుగారు వచ్చి వెళ్ళడం చూసిన కొందరు యిరుగు పొరుగు వాళ్ళు విషయమేమిటో తెలుసుకోవాలని ఆదుర్దాగా వచ్చారు. కలరా అని తెలిసి ఎంత ఆదుర్దాగా వచ్చారో ...అంత ఆదుర్దాగా అక్కడి నుండి వెళ్ళిపోయారు.
    'ఏమండీ....! ఇక తప్పేటట్లు లేదు. ఎవ్వరూ ముందుకు రావడం లేదు. రాఘవయ్య గారు ఎక్కడికి వెళ్ళారో తెలుసుకొని వారికి వెంటనే కబురు చేయండి.... మీరు కూడా యిక్కడికి ఎక్కువగా రాకండి.'
    'లక్ష్మీ .... ఏమిటిది? రోగం ఎటువంటిదో ...? రోగి ఏ పరిస్థితిలో ఉందొ నీకు తెలియడం లేదా? నీకు ప్రమాదం సంభవిస్తే నాగతెం కావాలి? వద్దు లక్ష్మీ.... నన్ను అన్యాయం చేయవద్దు. వెళ్ళిపోదాం... వచ్చేయ్! ఎవరి ఖర్మ ఎలా ఉంటె అలా జరుగుతుంది.'
    'చూడండీ ఆ విధంగా అనుకుంటూ ఒక నిండు ప్రాణాని ఒదిలి వేయడం నాకు చేత కాదు. నాకు ప్రాణ భయమేమి లేదు. మీరు ఏమీ గాభరా పడవద్దు. ఈ విషయంలో మీరు యిక నన్ను బలవంత పెట్టవద్దు. ఎలా జరగవలసి ఉంటె అలా జరుగుతుంది. నేను మాత్రం చూస్తూ, చూస్తూ, నిస్సహాయ స్థితిలో ప్రమాదకరమైన రోగంతో బాధపడుతున్నతోటి యిల్లాలిని ఒదిలి రాలేను ....క్షమించండి.'
    ఇక చెప్పి లాభం లేదని నేను యింటికి వచ్చేసి రాఘవయ్య గారికి కబురు పెట్టాను. వారు రాత్రి ఒంటి గంట దాటిన తర్వాత కంగారు పడుతూ ఇల్లు చేరారు. అనుకోకుండా నేను కూడా అప్పుడే అక్కడి కి వెళ్లాను.
    లక్ష్మీ రాఘవయ్య గారిని చూస్తూ 'వచ్చారా అన్నయ్య గారు....? హమ్మయ్య! కొంత ధైర్యం వచ్చింది.' అని నా వైపు తిరిగి 'ఏమండీ ...యిక ఫర్వాలేదు. ఇప్పుడిప్పుడే విరేచనాలు తగ్గు ముఖం పట్టాయి. నాకు ధైర్యం కలుగుతూ ఉంది. మీరు వెళ్ళి యింటి దగ్గర జాగ్రత్త గా ఉండండి.... అన్నయ్యగారు వచ్చారుగా ...నాకు తోడుగా ఉంటారు.'
    'లక్ష్మీ! రాఘవయ్య గారు వచ్చారు గదా! మన యింటికి వెడదాం పద....నిద్ర లేక నీ కళ్ళు ఎంత ఎర్రబడ్డాయో....?'
    'భలేవారండీ మీరు....అన్నయ్యగారు ఆమెకు ఏం సాయం చేయగలుగుతారు? మగవారు కదా! అయినా మందులు ఎప్పుడెప్పుడు వేయాలో యిప్పుడే యింటికి వచ్చిన వారికేం తెలుస్తుంది? ఎలాగో సగం రాత్రి పైగా గడిచి పోయింది...తెల్లవార గానే వచ్చేస్తాను. డాక్టరు కూడా ఈ రాత్రి గడుస్తే ఫర్వాలేదన్నాడు. దయచేసి యిక మీరు వెళ్ళండి.'
    'అమ్మా లక్ష్మీ.... ఎంత దయాగుణం తల్లీ నీది...? నాకు యిన్ని ఏండ్లు పైన బడినాయి. నీ అంత ఎక్కువగా ఒకరి కోసం తాపత్రయపడే మనిషిని చూడలేదు తల్లీ! నీవు దేవతవమ్మా.... మనుష్యులలో తప్పబుట్టావు. నా యిల్లు నిలబెట్టావు తల్లీ! ఇవి చేతులు కా.....'
    అని యింకా ఏవేవో మాటలనబోతున్న రాఘవయ్య గారి నివారిస్తూ 'అన్నయ్య గారూ....ఈ మాత్రానికే మీరింత యిదిగా మాట్లాడాలా? ఇరుగు పొరుగున ఉన్నవాళ్ళం ఒకరికి మరొకరం ఈ మాత్రం సాయపడక పొతే ఎలా? మీరు బాగా అలసి వచ్చి నట్లున్నారు...వెళ్లి పడుకోండి. అవసరముంటే లేపుతాను.'
    ఇక లాభం లేదనుకొని యింటికి తిరిగి వచ్చాను. నిద్రపోవడానికి ఎంతగా ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. ఆవిధంగా ఆ రాత్రి ఒక గండం లా గడిచిపోయింది. ఆ యిల్లాలు బ్రతికింది. ఈ విషయం అంచెల మీద ఊరి వారందరికి తెలిసింది. అంతా లక్ష్మీ ని పొగడడానికి వచ్చారు. రాఘవయ్య గారి సంతోషం వర్ణించ లేము. డాక్టరు గారి వచ్చి రోగిని పరీక్ష చేసి యిక ప్రాణ భయం లేదని చెప్పి వెడుతూ "నిన్న ఈమెను పరీక్షించినప్పుడు ఈమె జీవిఅస్తుందని నాకు తోచలేదు. చాలా జాగ్రత్త గా పరిచర్యలు చేయడం వల్ల బ్రతికింది.' అని వెళ్ళిపోయారు.
    ఆయనగారు వెళ్ళిపోగానే రాఘవయ్య గారు 'లక్ష్మీ .... నా యిల్లు నిలబడిందమ్మా....! అమ్మాయి పుడితే నీ పేరు పెట్టుకుంటాము. నీకు ఉన్న యిన్ని సద్గుణాలలో ఏ ఒక్కటి వచ్చినా చాలు. నీ ఋణం ఎన్ని జన్మల కైనా తీర్చు కోలేమమ్మా....' ఆనంద భాష్పాలు రాలుస్తూ గద్గకంఠం తో అన్నారు. నాకు కూడా ఆ సమయంలో కళ్ళు చెమ్మ గిల్లాయి. లక్ష్మీ నాయిల్లాలై నందుకు ఆ క్షణం లో నా హృదయం గర్వంతో పొంగి పోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS