8
పెరిగి పెద్దవాడ్నయిన నేను ఎవ్వరినీ లేక్కచేసే వాడిని కాదు. అన్ని రకాల దుర్వవసనాలకు లోనయ్యాను. జూదం త్రాగుడు మొదలైన దురలవాట్లను బాగా జీర్ణింప జేసుకున్నాను. ఒక మంచి పని చేశాను యిన్ని చెడ్డ పనుల మధ్య. బుద్ది మంతురాలైన ఒక అమ్మాయితో పరిచయం పెంచుకున్నాను. ఆ అమ్మాయి నా దుర్వసనాలను మాన్పెందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. కాని లాభం లేకపోయింది. ఒకసారి మా గ్రామానికి ఒక నాటకాల పార్టీ వచ్చింది. వారు వరుసగా నాటకాలు వేశారు. ఆ పార్టీలో జలజ అనే యువతి నన్ను ఆకర్షించింది. ఆమె నృత్యాలు, హావభావాలు చూసిన నేను కామోద్రేకంతో పిచ్చివాడ్ని అయ్యాను. ఆ అమ్మాయిని ఒకరోజు ఏకాంతం గా కలుసుకున్నాను. మనసులోని కోరిక చెప్పాను. మొదట అంగీకరించలేదు. బ్రతిమాలాను ధన ప్రలోభం చూపాను. బలవంత పెట్టాను. నా హృదయ రాణిని చేస్తానన్నాను. అన్ని విధాల సుఖ పెడతానని మాట యిచ్చాను. చివరకు ఒప్పుకుంది. వాళ్ళ ముఠాతో వెళ్ళినట్లే వెళ్ళి ఒకనాటి అర్ధరాత్రి నన్ను వచ్చి చేరింది.
జలజ-- జూదం, మద్యం . నా అధః పతనం జరిగిపోయింది. కొంతకాలం జలజను వేరే యిల్లు కిరాయికు తీసుకొని ఉంచాను. ఈ విషయం అందరికీ తెలిసిన తర్వాత ధైర్యంగా యింటికే తీసుకు వచ్చాను. ఆరోజు నాన్నగారు ఎంతో ఘర్షణ పడ్డారు; ఆ అమ్మాయిని యింటికి తీసుకువచ్చి నందుకు.
'ఒరేయ్ సూర్యం ....చాలా కాలం నుండీ నీ ప్రవర్తన గమనిస్తూ ఉన్నాను. నీ తల్లి గారభం చేస్తూ నిన్ను పూర్తిగా చెడగొట్టింది. నేను మందలిస్తే పూర్తిగా రెచ్చి పోతావనీ ఆ బాధ్యత తనకే ఒప్పజెప్పవలసిందనీ నన్ను కాళ్ళా వ్రేళ్ళపడి బ్రతిమాలుకుంది. అందుకని ఊరుకున్నాను. ఇక లాభం లేదు. ఎవరో దారిన పోయేదాన్ని ఇంటికి తీసుకు వచ్చావ్! నే సహించను. ఇప్పటికే మన పరువు ప్రతిష్టలను మంట గలిపావు. పెద్దవాడు అలా అయ్యాడు. నీవు యిలా తయారయ్యావు. నా యింట్లో ఉండడానికి వీలులేదు.... దుర్మార్గుడా.'
ఆ ఉగ్రరూపం , కోపం నిండిన ఆ కళ్ళు నాకు ఒక్క నిముషం భయాన్ని కలిగించాయి. కాని జలజ మైకంలో ఉన్న నేను మరు నిముషం లో నాన్నగారిని గాని అతని మాటలను గాని లెక్కచేయలేదు.
'నాన్నా ఏమిటి నీవంటున్నది ? చక్కని చుక్కను కోడలిగా తీసుకు వచ్చినందుకు నన్ను అభినందించక తిడుతున్నావా.... మర్యాద తెలియని నీ బోటి వారితో మాట్లాడడం నాదే బుద్ది తక్కువ' అని జలజ వైపు తిరిగి 'పద జలజా...! లోపలికి వెడదాం....యిది నీ యిల్లే సంకోచపడకు.
నా మాటలకు నాన్నగారు కోపంతో 'అగు దుష్టుడా....ఒక్క అడుగు ముందుకు వేశావంటే ప్రాణాలు తోడేస్తాను. అది నా యింట్లో అడుగు పెట్టడానికి వీలులేదు.
'అడుగు పెడుతుంది....నాతొ కాపురం చేస్తుంది.... ఏం చేస్తావ్....?'
నా తిరస్కారాన్ని సహించ లేకపోయిన నాన్నగారు ఉగ్రనరసింహం రూపంతాల్చి నిలువెల్లా ఒణికిపోతూ ముందుకు రెండడుగులు వేసి....కాలు జారిపడిపోయారు. నేను నిర్లక్ష్యంగా జలజను తీసుకొని మేడ మీదికి వెళ్ళిపోయాను. ఆ రాత్రంతా అమ్మ నన్ను జలజను అడిపోసింది. నాకు ఆ క్షణం లో మంచి, చెడ్డ, పెద్ద, చిన్న తారతమ్యాలు నశించాయి. అమ్మను, నాన్నను నోటికి వచ్చినట్టు తిట్టాను. అమ్మ తిరగబడి తిట్టింది. నన్ను ఒంటరిగా పిలిచి ఏకాంతం లో ఎన్నో నీతులు బోధించింది. అయినా నేను లెక్క చేయలేదు. నాన్నగారు నాతో మాట్లాడడం మానివేశారు. నన్ను కొట్టడానికి ప్రయత్నం చేసినపుడు జారి పడిన ఆ దెబ్బ రెండు రోజుల తరువాత బరువు చేసి మూడవ నాటికి లేచి తిరగాలేక పోయారు. ఆరు మాసాలు గడిచినా వారి కాలు నయం కాలేదు. ....కోలుకోలేక పోయారు. ఆ వ్యాధికి మనోవ్యాధి తోడై జ్వరం, దగ్గు , ఆయాసం, రక్తపోటు ఎక్కువయ్యాయి. అమ్మ కూడా నా ప్రవర్తన వల్ల కలిగే దిగులుతో , నాన్నగారి అనారోగ్య కారణం తో చిక్కి సగమైంది.
పరిస్థితులు ఎంతగా విష మించినప్పటికీ నా ప్రవర్తన లో మాత్రం ఏ మార్పు రాలేదు. చెడు స్నేహాలు... త్రాగుడూ రోజు రోజుకూ పెరిగి పోసాగాయి. ఇంటిని నరకం చేశాను. ఒకరోజు అమ్మ నాతొ బాగా పోట్లాడి, నాన్నగారికీ ఆ పల్లెలో వైద్యం సరీగా జరగదనే భయంతో నాన్నగారిని తీసుకొని పట్నం వెళ్ళిపోయింది.
నాకిక ఆ కొద్ది పాటి అడ్డు, అపూ లేకుండా పోయింది. వ్యవసాయం లో సంసాదించినది . చాలా వెనకేశారు నాన్నగారు. ఆ డబ్బు తీసుకుని అమ్మ, నాన్న వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గాని ఆ విషయం నాకు తెలిసి రాలేదు. చేతిలో చిల్లి గవ్వ లేదు. అమ్మ ఉన్నంత కాలం ఆమెను భయపెడుతూ అవసరాలకు తగినంత డబ్బు ఆమె నుండి రాబడుతూ ఉండేవాడిని. నాలో జీర్ణించుకు పోయిన వ్యసనాలకు డబ్బు ఎంతో ప్రదానం.... వ్యసనాలకు బానిసనైన నేను ఆ వ్యసనాలను ఒడులుకోలేక వాటిని తీర్చుకోనే మార్గం వేరే కనుపించక పొలాన్ని బేరం పెట్టాను...కాని కొనడాని కెవ్వరూ ముందుకు రాలేదు. అందుకు కారణం .... నాన్నగారు, అన్నయ్య ... మిగతా వారసులుగా ఉండడం ఎటూ తోచలేదు. మా ఊరి షావుకారు వద్ద అప్పు చేసి రాబోయే పంటను అతని స్వాధీనం చేసేందుకు ఒడంబడిక చేసుకున్నాను. మళ్ళీ నా పైశాచిక ప్రవర్తన ప్రారంభించాను. ఆ జీవితం ఎంత కాలం ....? అప్పు తీసుకున్న డబ్బు ఐపోయింది. ఎంతో ప్రయాస పడి, నచ్చజెప్పి ఆ షావుకారు దగ్గరే ఆరువేల రూపాయల దాకా అప్పు పెంచాను. జలజకు నగలు చేయించాను. చీరెలు కొన్నాను. నాతో పరిచయం పెంచుకున్న ఆ మొదటి యువతిని ఎన్నోసార్లు జలజ ముందు అవమానించాను. ఆమె చివరి సారిగా యింటికి వచ్చి తను గర్భిణిననీ... ఆదరించక పొతే ఆత్మహత్య తప్ప వేరే గత్యంతరం లేదని ఎంతగానో మొర పెట్టుకుంది. ఆమెను గేలి చేస్తూ నేనూ, జలజ తరిమేశాము. ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమె విషయం నాకు ఏమీ తెలియలేదు. ఆ తర్వాత ఆరు మాసాలు జల్సాగా గడిపాను. క్రమంగా నా ఆరోగ్యం క్షీణించనారంభించింది. పంట చేతికి వచ్చింది... దాన్ని స్వాధీనం చేసుకున్నాడు షావుకారు. మరి కొంత పైకం కావాలని అతని దగ్గరకు వెళ్లి నపుడు రెండు వేలు పైగా నా పై బాకీ తేల్చాడు వడ్డీతో. ఇక ఒక్క రూపాయి కూడా అప్పుగా యివ్వనన్నాడు.

డబ్బు పుట్టించడానికి వేరేమార్గం తోచలేదు. జలజ ద్వారా నాలో స్థిర నివాసం మేర్పరచుకున్న రోగాలు మెల్లిగా తీవ్ర రూపం దాల్చడమారంభించాయి. పిన్న వయసులోనే వృద్దాప్యం సంక్రమించినట్టు అనుమాన పడసాగాను.
జలజ ప్రవర్తన వింతగా మారడం నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. నన్ను ఈసడించుకోవడం, నాపై నిర్లక్ష్యం చూపడం, నా ముందే మరొకరితో అక్రమ సంబందా లేర్పరచుకోవడం నేను సహించ లేకపోయాను.
నాకు బాగా జ్వరం తగులుతూ ఉన్నందు వల్ల రెండు రోజుల నుండీ ఆహారం తీసుకోలేదు. జ్వర తీవ్రత ఎక్కువగా ఉండి మంచంలో పడుకొని మూలుగుతూ ఉన్న సమయంలో నవ్వుతూ, వయ్యారం వలికిస్తూ జడను చేతితోవేగంగా త్రిప్పుతూ నా మంచం ప్రక్క నుండి జలజ లోపలికి వెడుతూ ఉండడం గమనించాను.
'జలజా....'నీరసంతో పిలిచాను.
'జలజా....! జలజా....!'
కొద్ది వోపిక తెచ్చుకొని స్వరాన్ని హెచ్చిస్తూ బిగ్గరగా పిలిచాను.
'ఏం కొంప మునిగింది....?'
నన్ను చూసి అసహ్యపడుతూ , రుసరుస లాడుతూ నా మంచానికి దూరంగా స్టూలు మీద కూర్చుని అంది జలజ.
'చూడు జలజా....! నీ కోసం నా తల్లిని తండ్రిని దూరం చేసుకున్నాను. ఊరంతా మా కుటుంబాన్ని వ్రేలెత్తి చూపుతున్న లెక్కచేయలేదు. పెద్దల నాటి నుండి సంపాదించుకువస్తున్న పేరు ప్రతిష్ట లు నాశనం చేశాను. నీ సంతోషం కోసం.... విలాసాల కోసం వేలకు వేలు డబ్బు క్రుమ్మరించాను. ఇప్పుడు అనారోగ్యంతో నిస్సహాయ స్థితిలో నేనిలా ఉంటె నా మంచి చెడ్డలు చూడకుండా పరాయి వాడితో అందునా నా గర్భ శతృవు తో సరసాలాడడం నీకు న్యాయం కాదు....ఇద్దరమూ పట్నం వెడదాం....నా జబ్బు నయమయెంతవరకూ అక్కడే ఉందాం....ఏమంటావ్?'
"అనేందు కేముంది....? ఏం పెట్టి వేడతావ్...పట్నం...! చిల్లి గవ్వ చేతిలో లేదు.... పట్నం వెడతాడట.. పట్నం ...! ఏం....? నీ రోగానికి యిక్కడ డాక్టర్లు పనికి రావడం లా....? వెళ్ళతలచుకుంటే నీవు వెళ్ళు....నేను మాత్రం రాను.'
'జలజా ....! నీవేనా యిలా మాట్లాడేది? నేను ఆర్ధికంగా నీ అవసరాలను తీర్చినంత కాలం నా అడుగులకు మడుగులోత్తావ్! అన్ని విధాల నేను కృంగి పోయి ఉన్న నన్ను ఈ సమయంలో యిలా అవమానిస్తావా? ఛీ... సీతాకోక చిలుకను చూసి భ్రమ పడ్డాను, రంగులు బయట పడుతున్నాయి. నేనిలా జ్వరంతో యిక్కడ బాధపడుతూ ఉంటే యింత రాత్రప్పుడు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావ్? చెప్పు...ఊ.... చెప్పూ....' చివరి మాటలు వత్తి పలికాను.
'ఏం ...ఎందుకు చెప్పాలి...? నువ్వు నా కట్టుకున్న మొగిడివా...? నీకు సేవలు చేయడానికి యిక్కడ నీ తొత్తు లెవ్వరూ లేరు....ఇదిగో చెబుతున్నాను.... నీ అనుమానాలు నాకు నచ్చడం లేదు. నా యిష్టం వచ్చినట్లు నేను ప్రవర్తిస్తాను..... అయినా నీతో యింతసేపు నిలబడి మాట్లాడడం నాదే బుద్ది తక్కువ...వెళ్ళిపోతున్నాను' అంది జలజ.
'అగు...ఎక్కడికి వేడతావ్....? నీస్వభావం పూర్తిగా తెలిసిపోయింది. అన్నీ ఉన్ననాడు నన్ను జలగ లా పీల్చావ్! ఇప్పుడు వెడతానంటున్నావు. వెళ్ళిపో....కాని నేనిచ్చిన నగలు...చీరెలు....అన్నీ యిక్కడ పెట్టి వెళ్ళిపో....ఛీ... యిక నీ ముఖం చూపించకు... ఊ...అన్నీ తెచ్చి పెట్టి వెళ్ళు....' గుడ్లురిమాను.
'ఏమంటున్నావ్....? నగలూ చీరెలూ నా ....! ఇకేక్కడివి? త్రాగి వాటిని నా దగ్గర నుండి ఏనాడో తీసుకు వెళ్ళావు? గుర్తుకు తెచ్చుకో.... నేను వెడుతున్నాను...'
'ఆ ...రాక్షసీ... అవన్నీ దాటించేసి నంగ నాచిలా చిలక పలుకులు పలుకుతున్నావా? ఉండు ...నిన్నేం చేస్తానో...?'
ఆవేశంతో దాని మీదకు ఉరకబోయి నిస్సత్తువ తో కళ్ళు తిరిగి నేలపై బడి పోయాను.
రెండవ రోజు మా జీతగాడు నేను ఆ స్థితిలో ఉండడం గమనించి డాక్టరు ను తీసుకు వచ్చాడు. డాక్టరు కొద్ది సేపు శ్రమ పడినాక స్పృహ తెప్పించాడట! రాత్రి పూట ఆ విధంగా పడడం ఉదయం వరకూ అలాగే ఉన్నానట! నాకు స్పృహ వచ్చిన తర్వాత జీతగాడు ఈ విషయాలన్నీ చెప్పాడు. జలజ ఎవరితోనో లేచి పోయింది. నాకు తగిన శాస్తి జరిగింది. ఎటూ తోచని పరిస్థితిలో యింటికి తాళం వేసి ఆ తాళం చేతులు మా ఊరి ప్రెసిడెంటు గారికిచ్చి పట్నం వచ్చాను. పొలాలు కూడా వారికే ఒప్పజెప్పి షావుకారు బాకీ తీర్చమన్నాను.
పట్నం వచ్చిన తర్వాత అమ్మ కోసం, నాన్న కోసం వేదకని చోటంటూలేదు. వారు ఎక్కడా కనిపించలేదు.... వోపిక ఉన్న రోజులు వెదికాను....చివరకు వెదకడం మానుకున్నాను. శరీరంలో సత్తువ క్షీణించి నరనరాల్లో రోగం జీర్ణించుకుపోయి సొమ్మసిల్లి రోడ్డు ప్రక్కన పడిపోయిన నన్ను నలుగురూ చేరి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ పది రోజులు ఉన్నాను. అక్కడ ఉండడం వల్ల నా ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం బాగు పడనందున విసిగి పోయి మళ్ళీ వీధిన పడ్డాను. ఆ తర్వాత సంగతి మీకు తెలిసినదే! నాకు యిప్పుడు జీవితం పై విరక్తి కలుగుతూ ఉంది. మీరు కారును నా పై నుండి నడిపించినా బాగుండేది. చనిపోయి ఉండేవాడిని. ఇప్పుడు నేనేం చేయాలో నాకర్ధం కావడం లేదు..... ఇంటికి వెళ్ళను...అక్కడి ఆ జ్ఞాపకాలు.... నే చేసిన ఘోరాలు నిమునిముషానికి నన్ను చిత్రవధ చేస్తాయి. ఇక్కడ ఉండి కూలి పని చేసుకొని బ్రతకడానికి మనస్కరించడం లేదు...ఎక్కువ చదువు సంధ్యలు లేని నాకు ఉద్యోగం దొరకడం కష్టం....! యిప్పుడు నేనేం చేయాలో నాకు తోచడం లేదు . నా చేత వంచితురాలైన ఆ యువతిని గురించిన బెంగ రేయింబవళ్ళు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంది.... ఇన్ని సంఘర్షణల మధ్య నా జీవితం నిరర్ధక మనిపిస్తూ ఉంది.
