"అయితే నేనెందుకు, సర్?"
"అదేమిటయ్యా, ఎక్కువ టైము పట్టదులే! అటునించి ఇంటికి వెడదాం." మారు మాట్లాడకుండా కారు ఎక్కాడు మనసులో ఇష్టం లేకపోయినా.
కారగగానే కృష్ణమూర్తిగారు దిగమనటంతో మనసులో విసుగు మరింత ఎక్కువయింది. 'ఏమిటీయన ఉద్దేశం?' అనుకున్నాడు చిరాగ్గా. కాని ఇంటిగుమ్మంలోకి అప్పటికే ఇల్లుగలాయన రావడంతో మారుమాట్లాడకుండా దిగి కృష్ణమూర్తిగారిని అనుసరించాడు. లోపల రోగి పరీక్ష మొదలైనవి పూర్తి అయ్యాక ప్రొఫెషనల్ విజిట్, సోషల్ విజిట్ గా మారింది. "డాక్టర్ శ్రీనివాస్" అని కృష్ణమూర్తిగారు పరిచయం చెయ్యగానే ఇంటాయన ఆనందంగా కరచాలనం చేస్తూ, "మీ అబ్బాయా? మీలాంటివారిని ఇంకొకర్ని తయారుచేస్తున్నారన్న మాట!" అన్నాడు.
అవునవునని గట్టిగా చెప్పాలనిపించింది కృష్ణమూర్తిగారికి. "అబ్బే. కాదండి. ఇతను మా స్నేహితుడు" అన్నారేగాని నాకు పిల్లలు లేరనడానికి అయన మనస్సంగీకరించలేదు. ఇదంతా ముళ్ళమీద కూర్చున్నట్లుంది శ్రీనివాస్ కు.
"నీ ఒపీనియన్ ఏమిటి?" అన్నారు కారెక్కి.
"నాదా? నాకేం తెలుసండి ఈ విషయాలు!"
"అదేమిటి? ఏదో ఒక అభిప్రాయం ఏర్పడిఉండాలి కదా!"
"ఏమో, నా అభిప్రాయానికి నేనంత విలవ ఇవ్వను. కాని నాకీ కేస్ అంత ఆశాజనకంగా లేదు."
"నీ సలహా ఏమిటి?"
ఆయన ముఖంవంక నిశితంగా చూచాడు. ఆయన భావాలు ఏమాత్రం అందలేదు. ఆయన అతిసామాన్యంగా యథాలాపంగా రోడ్డుమీద వచ్చే పోయె జనాన్ని చూస్తూ కూర్చున్నారు. మనస్సులో ఒక నిట్టూర్పు విడిచాడు. 'ఈ పెద్దవాళ్ళలో వచ్చిన చిక్కే ఇది! వాళ్ళని గట్టిగా కాదనలేము! అలా అని కావలసిన విధంగా సంభాషణ మార్చుకోనూలేము!' అనుకున్నాడు.
"సర్జరీతో ఏమయినా ఫలితం కనిపించవచ్చు."
"సరీగా అదే నేనూ అనుకున్నాను" అన్నారు విపరీతమయిన ఉత్సాహం ముఖంలో వ్యక్తంచేస్తూ.
ఆయనవంక కొంచం ఆశ్చర్యంగా చూసి, "అప్పుడే నా విషయం మీదాకా ఎలా వచ్చింది?" అని అడిగాడు అధోవదనుడై.
పెళ్ళున నవ్వారు. "నీకంటే మొహమాటంకాని, మా అమ్మాయి అనూరాధా లేదూ?"
"దయచేసి మరోవిధంగా భావించకుండా తిరిగి ఇలాటి పరిస్థితి కలగ చెయ్యవద్దని నా కోరిక."
"కారణం?" అడిగారు తీవ్రంగా.
"నే నెవరో తెలిసినవారి దగ్గిరనుండి, మీకు మిగిలిన విషయాలుకూడా తెలిసే ఉండాలే!"
"తెలిశాయి అనుకో. అయినంతమాత్రాన, విని వదిలెయ్యడం స్నేహధర్మ మనుకోను?"
"మీరు నిజంగా నేను కోరినట్లు చేస్తే, మీ స్నేహానికి ఇచ్చే విలవ మరెప్పుడూ దేనికి ఇవ్వలేనేమో?"
"అది స్నేహధర్మంగా భావించలేను. తనది కాని వస్తువును తనయుడు దాచుకుంటూ ఉంటే మందలించని తల్లి ఉంటుందా?"
"దానికి, దీనికి సంబంధమేముంది? అయినా ఇందులో నాది కాని దేముంది? అయిదేళ్ళు కష్టపడ్డాను. డిగ్రీ సంపాదించుకున్నాను. అది నా స్వంతం కాకుండా ఎలా పోతుంది?"
"కరెక్ట్! అయిదేళ్ళు కష్టపడి చదివిన చదువు నీ స్వంతం ఎలా అవుతుంది? నువ్వు చదివిన చదువు లోకోపకారంకోసంగాని, నీలో నువ్వు దాచుకోవడానికి కాదు."
"నా శ్రమ, నా డబ్బు వెచ్చించి సంపాదించినది పూర్తిగా నా స్వంతమని భావిస్తున్నాను. అది ఏ విధంగా ఉపయోగించుకోవడానికైనా అవసరమయిన హక్కు, అర్హత ఉన్నాయి."
"అర్హత ఉందేమో! హక్కు ఎప్పుడూ లేదు. నువ్వు చదివిన వైద్య విద్య నీ ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకుంటానంటే ఎలా కుదురుతుంది? వైద్యంలో మెళుకువలన్ని నీకు తెలుసునని, వైద్యందృష్ట్యా చట్టవిరుద్ధమయిన పనులు చేస్తూంటే నీకు శిక్షపడకుండా ఉంటుందా?"
"చట్టవిరుద్ధ మయిన పనులు చేస్తే కదా శిక్ష? అసలు చట్టానికి, వైద్యానికి కావలసిన పనే జరగనప్పు ఇంక శిక్షేముంది?"
"తప్పుడు పనులను చేసిడరిని శిక్షించి, సన్మార్గంలో నడపవలసిన బాధ్యత ప్రభుత్వానిది. చెడుగా మరి, మంచిగానూ ఉపయోగించకుండా వృథా అయ్యేవారిని బాగుపరిచే బాధ్యత స్నేహితులది. నీ డబ్బు ఖర్చుచేసి, నీ శక్తి వెచ్చించి చదివినంతమాత్రాన నీ విద్య నీ స్వంతం కాదు. ఇదేం నీ స్వంత పొలం పుట్రా కాదు కదా, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవడానికి? ఆఖరికి స్వంత ప్రదేశంలోకూడా ఇతరులకు అసౌఖ్యం కలిగించేది శిక్షార్హం కదా! మరి ఇలాంటిది శిక్షార్హం ఎందుకు కాకూడదు?"
శ్రీనివాస్ అభిమానం దెబ్బతిన్నది. అదె కృష్ణమూర్తిగారు ఆశించింది కూడా. అతని ముఖం ఎర్రబడ్డది. "ఎవరిచ్చారీయనకు ఇంత స్వాతంత్ర్యం, స్వంతవిషయాలలో జోక్యం కలిగించుకునేందుకు? నేను ఏ ఒక్కరి అసౌఖ్యానికి కారకుడు కానంతవరకు, ఎవరి అభివృద్దికి నిరోధకుడను కానంతవరకు, నేను చేస్తున్నది చట్టవిరుద్ధం కాకుండా, నా మనస్సుకు నచ్చి, నాకు సంతృప్తి కలగ చేస్తున్నంతవరకు ఈ విమర్శలకు లెక్కపెట్టదలుచుకోలేదు" అని మనస్సులో అందామనుకుని పైకే అనేశాడు.
"ఒకరి అభివృద్ధి నిరోధకుడవు ఎందుకు కాలేదు? నీవు ఆచరించలేని వృత్తి ఎన్నుకుని, అందులో పరీక్షలలో వచ్చిన ఎక్కువ మార్కులమూలంగానో, మీ నాన్నగారి పరపతిమూలంగానో సీటు రప్పించుకుని, నీకంటే అన్నివిధాలా తక్కువగా ఉన్న ఓ నిర్భాగ్యుడికి సీటు రాకుండా చెయ్యలేదా? నువ్వీ చదువు చదివి ఉండకపోతే నీ స్థానంలో మరొకడు డాక్టరయి, పదిమందికి ఉపయోగపడుతూ ఉండేవాడే!"
"డాక్టర్!" ఖంగుమంది శ్రీనివాస్ కంఠం. "ఇందులో మా నాన్నగారి ప్రసక్తి లేదు. నేను మెడిసిన్ చదవడానికి ఆయన కారకులు అయినంతమాత్రాన, కాలేజీలో సీటు రావడానికి, ప్రతి పరీక్ష పాసవడానికిమాత్రం కారకులు కాదు. అదంతా నా స్వయంకృషి. నాకు చదివేందుకు స్తోమతు, సీటు సంపాయించేందుకు తగిన తెలివి ఉన్నాయి. ఈ రెండిటిలో ఇతరుల ప్రసక్తి అనవసరం. నా ఆస్తిని దుర్వినియోగ పరిచేందుకు ఎంత హక్కు ఉందో, నా చదువు దుర్వినియోగపరిచేందుకుకూడా అంత హక్కు ఉంది."
"నీ ఆస్తి సంగతి ఎలా ఉన్నా, నీ చదువు దుర్వినియోగపరిచేందుకు మాత్రం వీలులేదు! నువ్వు నీ ఉద్యోగంపై వచ్చే డబ్బు ఆశించకపోవచ్చు. కాని నీ స్థానంలో మరెవరు ఉన్నా, ప్రజాసేవే ధర్మంగా ఆచరిస్తారు."
"ఆఁ, ప్రజాసేవ! అది కేవలం అక్షరాలలోతప్ప ఆచరరించేందుకు కాదు. ఎవరు చేస్తున్నా రీ ప్రజాసేవ? ఇది చదువుకునేరోజుల్లో ఉండే ఆదర్శపు ఆవేశంతప్ప. ఎక్కడ జరుగుతూందీ ప్రజాసేవ? ఆఖరికి చావుబతుకుల్లో ఉన్న వారిని, డబ్బుముఖం చూడందే చూచేందుకుకూడా వెళ్ళని మీ డాక్టర్లు మాత్రం కాదు ప్రజాసేవకులు! చివరికి బీద ప్రజలకోసం నెలకొల్పబడ్డ ధర్మాసుపత్రిలో కూడా జరగటం లేదు ఈ ప్రజాసేవ! ఎక్కడ డబ్బు ఉందో అక్కడే సేవ ఉంది! ఎక్కడ పరపతి ఉందో అక్కడ సౌకర్యం ఉంది. మీరు చెప్పే ఈ ప్రజాసేవ అంతా హంబగ్! నిజంగా ఆచరించేవారిని నేను చూడలేదు."
