Previous Page Next Page 
తామరకొలను పేజి 16

 

                                      9

    ఇప్పటికి వాళ్ళు మలబార్ హిల్స్ ఎక్కుతూంటారు. నళిని ఏం మాట్లాడుతోందో? ఏమైనా మాట్లాడనీ, రమేశుడి మనసును నొప్పించకుండా ఉంటే, చాలు....
    "ఏయ్ రత్నా! కలగంటున్నావా?" అని రెండు మూడు మార్లు హెచ్చరించింది కుముద.
    రామారామ కుముద వెళ్ళిపోతే చాలు అనిపించింది రత్నకు. ఆమె మనస్సు అక్కడలేని రమేశ్ వెంట తిరుగుతోంది.
    కుముద ఇంటికి వెడతానని లేచినపుడు రత్నకు హాయనిపించింది. కుముద వెళ్ళిపోతే తను నిరాటంకంగా రమేశుడి గురించి ఆలోచించవచ్చుగదూ!
    కుముద వెళ్ళిపోయింది. ఏడింటికి ఇంటికి వచ్చిన ఆశ, తల్లి ఇంట్లో ఉండటం చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దగా చేసుకుని :
    "అమ్మా! ఇంట్లోనే ఉన్నావేం? మామయ్యతో వెళ్ళలేదూ?" అంది.
    "లేదమ్మా, నళిని వెళ్ళింది."
    ఆశా తల్లిని వాటేసుకుని:
    "ఇకమీదట నళినినే పంపమ్మా మామయ్యతో! నువ్వు వెళ్ళిపోతే నాకేం తోచదు" అంది.
    కూతురు-మాట రత్న హృదయాన్ని తాకి గాయపరచింది.
    సుమారు ఎనిమిది ఆ ప్రాంతాలలో నళిని, రమేశ్ ఇంటికి వచ్చారు. అంత తొందరగా వారు వచేసినందుకు రత్న ఆశ్చర్యపడినా, రమేశుడిని చూడగానే ఆమెకు శాంతి లభించింది.
    "ఏం ఇంత తొందరగా వచ్చేశారు?"
    "పార్కు చూశాం. వచ్చేశాం" అంది నళిని ముక్తసరిగా.
    "ఎలా ఉంది మా ఊరి ఒపార్కు" రమేశుడిని అడిగింది రత్న.
    "ఉద్యానవనాల సీమనుండి వచ్చినవారు ఆయన. మన ఊరిపార్కు అంతగా వచ్చినట్టు కనిపించలా" అంది నళిని.
    తన గదిలోకి వెళ్ళిపోబోతున్న రమేశుడిని రత్న ఆపి "రేపు ఎక్కడికి వెడదాం?" అని అడిగింది.
    "అక్వేరియానికి వెడదామని చెప్పాను నేను. లేదా 'విహార్ - లేక్ కు వెళ్ళినా వెళ్ళొచ్చు. రేపు ఆదివారం ఎలానూ డాక్టర్ కు తీరికే కదా. అందరం వెడదాం రత్నా!" అంది నళిని.
    "అవునమ్మా. అందరం వెడదాం" అంది ఆశా.
    "డాక్టర్ నడిగి రాత్రికి ఏ విషయమూ ఫోన్ చేసి చెపుతాను" అంది రత్న.
    ఇద్దరి మధ్యా మూగవాడిలా నిల్చున్న రమేశ్.
    "నేనలా తిరిగి వస్తాను" అన్నాడు.
    "నేనూ వస్తాను మామయ్యా" అంటూ ఆశకూడా బయల్దేరింది.
    ఇద్దరూ కిందికి దిగి వెళ్ళగానే, రత్న కలవరంతో నళినివైపు తిరిగి.
    "ఏమయింది నళినీ? పాపా, ఫేలా" అంది.
    "ఇంత తొందరగా ఎలా చెప్పను? ఇపుడే ఏమీ చెప్పలేను. చాలా మంచివారిలా కనిపిస్తున్నారు."
    నళిని రమేశుడిని మెచ్చుకోవటం రత్నకు ఎంతో ఆనందాన్నిచ్చింది.
    "ఎక్కువ మాట్లాడేవారిలా కనిపించలేదు. ఎంత సేపూ నేను మాట్లాడించాలే కాని, అతనయి అతనే నన్ను పలకరించలా, మొత్తంమీద కుతూహలం, ఆసక్తి కలిగించే వ్యక్తిత్వం అతడిది."
    "అయితే అతడిని వలపించుకోవటానికి ప్రయత్నిస్తావా?" రత్న ఆతృతతో అడిగింది.
    "ఇపుడే ఏమీ చెప్పలేను. నా ప్రయత్నం అంత తొందరగా మానుకోలేనంత అందగాడతను."
    "ఆయనతో ఏం మాట్లాడావ్?"
    "నా కాలేజి సంగతులూ, ఇపుడు నేను టీచర్ గా పనిచేస్తున్న స్కూలు విషయాలూ, బొంబాయి జీవితం...... ఇవే, కాని మా సంభాషణలో ఎక్కువపాత్ర నాదే."
    రత్న మెల్లిగా 'రమేశ్ ఒక్కసారైనా నీ వైపు మెచ్చుకుంటున్నట్టు చూశాడా?' అని అడిగింది.
    ఈ విషయంలో మట్టుకు నళినికి అసంతృప్తిగా ఉంది. బొంబాయి నాగరిక వాతావరణంలో పెరిగిన గడుసు పిల్ల నళిని. ఎంత మందిలో ఉన్నా కనిపించే లావణ్యవతి.
    రమేశుడి ఔదాసీన్యం ఆమె సౌందర్యాన్నే అవమాన పరిచినట్టు నళిని భావించింది. కాని, ఆ ఉదాసీనతే అతడిని మెచ్చుకొనేలా చేసింది. తన సౌందర్యానికి మురువని అతడిని ఎలాగైనా తన వాడినిగా చేసుకోవాలన్న పట్టుదల కలిగింది నళినికి.
    నళిని లేచి నిల్చుని "ఇక వస్తాను రత్నా. డాక్టరు వచ్చాక ఫోన్ చెయ్యి" అంది.
    రమేశ్, ఆశా లోపలికి అడుగు పెట్టారు.    
    నళిని చిరునవ్వు నవ్వి, చేతులు జోడించి "వస్తాను" అంది.
    రమేశ్ కూడా చేతులు జోడించాడు యాంత్రికంగా.
    నళిని వెళ్ళిపోగానే రత్న అడిగింది: "పార్కు ఎలా ఉంది?"
    "ఓ మోస్తరుగా ఉంది."
    "మా బొంబాయికి చెందిన వాటిని మీరు మెచ్చుకున్నట్టు కనిపించదు. అవునా?"
    "కాదు. మీరు పొరపడుతున్నారు. బొంబాయికి చెందిన రెండు వస్తువులు నాకు చాలా వచ్చాయి."
    "ఏమేమిటి" కుతూహలంతో అడిగింది రత్న.
    "ఒకటి సముద్రం, ఇంకొకటి సముద్రంలో దొరికే వస్తువు."
    "అంటే?..... ఓ....." రత్న మొహం క్షణమాత్రంలో కెంపులరాశిగా ఎర్రబడిపోయింది.
    "నిజం చెప్పండి రత్నా! ఈ రోజు నాతో రాకుండా ఎందుకు తప్పించుకున్నారు? నన్ను చూస్తే మీకు భయమా? మీ అనుమతి లేకుండా ఇహ ఎప్పటికీ నిన్నటిలా తొందరపడను. నా తొందరపాటుకు మీరేం శిక్ష విధించినా అనుభవిస్తాను."
    "నిజంగా?"
    రత్న కుడి కనుబొమను పైకెత్తి "నిజంగా?" అన్నపుడు రమేశుడి కంటికి అతిమనోహరంగా కనిపించింది.
    "ఊఁ".
    రత్న చుట్టూ చూసింది. ఆశ కనిపించలేదు. వేగంగా రమేశుడి దగ్గరగా వచ్చి తనకన్నా ఎత్తుగా ఉన్న అతడి తలను రెండు చేతులతోనూ పట్టుకుని వంచి నుదుటిమీది జుట్టు వెనక్కుతోసి నుదుటిమీద మృదువుగా ముద్దు పెట్టుకుని వెనక్కు జరిగి:
    "ఇదే నేను మీకు విధించే శిక్ష" అంది.
    "రత్నా ....."
    "ఉహుఁ ..... ఇక మనం 'సెంటిమెంటల్ గా' ఉండటం మానేద్దాం."
    "రత్నా ....."
    "రమేశ్! ఒద్దు మీకు పుణ్యముంటుంది."
    "రత్నా......"
    "మీరు చుట్టిచుట్టి మళ్ళీ అదే విషయానికి వచ్చారంటే, నాకు పిచ్చెత్తుతుంది. దయచేసి ఇంకేమైనా మాట్లాడుకుందాం."
    ఆమె-గాంభీర్యం చూసి రమేశ్ మెదలకుండా వూరుకున్నాడు.
    "నళిని ఎలాంటి పిల్ల"-రత్న అడిగింది.
    "మంచి అమ్మాయే. కొంచెం మాట  లెక్కువ."
    "చూడటానికి ఎలా ఉంది?"
    "బావుంది."
    "అంతేనా?"
    "కాక, నళినిని నాతో షికారుకు పంపటంలో మీ ఉద్దేశ్యం?"
    "దానిలో పెద్ద ఉద్దేశ్య మేముంది? మీకు మా వాళ్ళను పరిచయం చేద్దామనిపించింది. నళినికి కబురంపాను అంతే."
    "నమ్మమంటారా?"
    "నమ్మండి."
    శేషగిరి వచ్చాక, రత్న విహార్ లేక్ కు వెళ్ళే విషయం కదిపింది. కాని, అతడికి ఇలాంటి విషయాల్లో అంత ఆసక్తి ఉండదు.
    అతను ఆయాసంతో కళ్ళు మూసుకుని "చూద్దాం" అన్నాడు.
    "నళినికి ఏమని చెప్పను?"
    "వెళ్ళేటట్టయితే ఉదయం ఎనిమిదింటికి వాళ్ళింటికి వస్తామని చెప్పు."
    బాల్కనీలో నిల్చుని వీధివైపు చూస్తున్న రమేశ్ ఎందుకో వెనక్కు తిరిగి చూశాడు. శేషగిరి, రత్న మాట్లాడుకుంటున్నారు. రత్న మొహంమీద మందహాసం వెలుగుతోంది. పనిచేసి అలసివచ్సిన శేషగిరి అలసటతో కళ్ళు మూసుకుని ఉన్నాడు. అతడికి రత్న - మాటలవైపు దృష్టి ఉన్నట్టే లేదు.
    కాని, నిరంతరం వెలిగే దీపం - రత్న మందహాసం.
    ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అనే భేదం లేకుండా ఎల్లవేళలా ప్రశాంతంగా వెలిగే నందా దీపం-ఆమె నవ్వు.
    ఆశ నేలమీద కూర్చుని ఏదో బొమ్మల పుస్తకం చూసుకుంటోంది.
    రమేశ్ కళ్ళకు ఓ సుందరమైన చిన్నారి సంసార చిత్రం కనిపించింది.
    అతను ఆ సంసారంలోనివాడు కాడు. తనకూ ఆ సంసారానికి ఏవిధమైన బంధుత్వమూ లేదు.
    తను అక్క డెందుకుండాలి?
    రమేశుడికి వెంటనే తన వస్తువులు సర్దుకుని చప్పుడు కాకుండా వెళ్ళిపోవాలనిపించింది. అతడు రెండు చేతులతోనూ కణతలను అదిమి పట్టుకున్నాడు.
    రెండు నిమిషాలు ఆగి, మళ్ళీ అటువైపే చూశాడు రమేశ్.
    ఈసారి అతడి కళ్ళు రత్న మీదే నిలిచాయి.
    రత్న, శేషగిరి దగ్గర ఉన్నప్పుడు తనకు పరాయి దానిగా అనిపించేది. తన దగ్గర ఉన్నప్పుడు జన్మ జన్మాంతరాల బాంధవి అన్నట్టు స్నేహంగా, ఆత్మీయతతో మెలిగేది.
    అది నటనా లేక నిజమైనదా?
    శేషగిరి కళ్ళు తెరచి రత్నతో ఏమో చెప్పాడు. రత్న నవ్వుతూ బదులు చెప్పినప్పుడు ..... రమేశ్ హృదయం అసూయతో ఉడికిపోయింది.
    తనలో అసూయాగ్ని కణాన్ని రగుల్కొల్పిన రత్నను రమేశ్ ఆ నిమిషంలో బద్ధ శత్రువులా ద్వేషించాడు. అతడు చూస్తూండగానే రత్న వంటింట్లోకి వెళ్ళిపోయింది.
    "ఆశా! అందర్నీ భోజనానికి రమ్మను" వంటింట్లో నుండి పిలువు వచ్చింది.
    వాళ్ళతో కలిసే అధికారం తనకు లేదనిపించి రమేశ్ చీకట్లోనే నిల్చుండిపోయాడు.

 

                              
    శేషగిరి, ఆశా భోజనానికి వంట గదిలోకి వెళ్ళారు కాస్సేపటిలో రమేశుడిని వెతుక్కుంటూ వచ్చింది రత్న. రమేశ్ చీకట్లో నిల్చోవటం చూసి, బాల్కనీ లైటు స్విచ్ వేయటానికి చెయ్యి చాచింది.
    ఆ చేతిని తన చేతిలో అందుకుని రమేశ్:
    "రత్నా .... ....." అన్నాడు.
    "ఏమిటి?"
    "మీరు నన్ను ప్రేమిస్తున్నారా?"
    "ఇదేం ప్రశ్న? వాళ్ళిద్దరూ అన్నం తింటున్నారు. మీరూ రండి."
    "నేను అడిగినదానికి బదులుచెపితేగానిరాను."
    రత్న కొంటెగా "ప్రేమించటం లేదని చెపితేనో?" అంది.
    "ఈ బాల్కనీ నుండి కిందికి దూకేస్తాను."
    రత్న మౌనంగా అతని చేతిని నొక్కి, లోపలకు వెళ్ళింది. రమేశ్ సంతృప్తి చెందాడు.
    మర్నాడు ఉదయం తను విహార్ లేక్ కి రాలేనని చెప్పేశాడు శేషగిరి.
    "మీరు వెళ్ళిరండి. నేను ఇంట్లోనే ఉంటాను" అని ఖచ్చితంగా చెప్పేశా డతడు.
    ఆఖరికి రమేశ్, రత్న, ఆశ ఇంటినుండి బయల్దేరి, నళిని ఇంటికి వెళ్లారు. రమేశుడిని నళిని తల్లిదండ్రులకు పరిచయము చేసింది రత్న.
    నళిని చూపరులకు ముద్ద గొలిపేలా అలంకరించుకొంది. జరీ-పువ్వుల తెల్ల-సిల్కుచీరలోనున్న నళినిపైనుండి తన చూపును మరల్చుకో లేకపోయింది రత్న.
    ఆశా, నళిని కాళ్ళకు పెనవేసుకుని 'అక్కయ్యా ..... నువ్వెంత బాగున్నావ్! నీ జడ ఎంత పొడుగో, నాకు జడే లేదు. .....' అమ్మా! అక్కయ్యెంత బావుందో చూడు .... నేను అంత బాగా లేనుకదూ ...." అంది.
    "అవునమ్మా, నువ్వు నాలాగున్నావు" అంది రత్న.
    రమేశ్ నళినిలను తన మనస్సులో పక్క పక్కగా నిలబెట్టి చూసి రత్న:
    "ఎంత అందమైన జంట" అనుకుంది.
    నళిని ఇంటినుండి బయల్దేరేసరికి తొమ్మిది గంటలయింది.
    ఆరోజు ఆదివారం కావటంవల్ల విహార్ లేక్ అంతా జనసమ్మర్ధంతో నిండిపోయింది. ఆ సందడినీ, అందమైన తోటను చూడగానే, ఎగిరి గంతులు వేసింది ఆశా.
    అందర్నీ వదిలి ఉత్సాహంతో పరుగులు తీస్తున్న కూతుర్ని వెంబడించే సాకుతో రమేశ్ నళినీలను వదిలి ముందుకు వెళ్ళింది రత్న.
    కాని, ఆశా తల్లి-చేతికి దొరికితేనా?
    ఆశా భూతాకారపు బొమ్మల నోటిలో ప్రవేశించి ఆటలాడింది. తల్లి-చేతికి అందకుండా ఏడిపించింది.
    రమేశ్ నళినితో కలిసి వస్తున్నా, అతడి కళ్ళు కూతురితో ఆడుకుంటున్న రత్న మీదనే ఉన్నాయి. నళిని మాటలమీద దృష్టే లేదతనికి. రత్న ఎక్కడైన మనుష్యుల గుంపులో కనుమరుగయినపుడు అతడి కళ్ళు ఆ సమీపంలోనే రత్నకోసం వెతుకుతున్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS