Previous Page Next Page 
విరామం పేజి 17


    "సిస్టర్..." నా గొంతు పెగల్లేదు.
    "ఔను. నేను పూర్తిగా చెడిపోయాను. కాని అది నా తప్పుకాదు. ఒక పెద్ద కుటుంబం బాధ్యత యీ చిన్న వయసులో నామీద పడింది. నేను సెలవలో వెళ్ళినప్పుడు ఇంటిదగ్గిర వారం కన్నా ఎక్కువవుండను. కలకత్తాలోనో, నైనీ టాల్ లోనో, డార్జిలింగులోనో వుంటా. అక్కడ పదిరోజులుంటే సునాయాసంగా రెండు వేలు సంపాయిస్తా. నేను సిగ్గు సిరం లేనిదాన్నను కుంటున్నావు కదూ. నిజం అంతే. నాకు ఆర్మీ యిచ్చే జీతం చాల్దు. నా తప్పుకాదు...."
    నేను లేవబోయా.
    "లేవకు. నువ్వింకా నిల్చోకూడదు..."
    నేను మంచ మీద వాలిపోయా.
    "సిస్టర్! నాకు నిద్రపట్టడానికి మాత్ర యిస్తావా?"
    నాకు నిద్ర వస్తూంది.
    "సిస్టర్! నేను నీకేవైనా సాయం చెయ్యగలనా....చెయ్యగలవా.....య్యగలనా....నా..."
    మరొక వారం గడిచింది. అంటే నా కాపరేషనై మూడోవారం ప్రవేశించింది. లేచి వార్డులో కొంచెం తిరుగుతున్నా, షీలా నన్ను "డార్లింగ్" అని పిలుస్తూంది. నా పెన్నుతో టెంపరెచరూ మొదలైన వార్డు రికార్డు రాస్తూంది. అది బాగా రాస్తూందంది, ఆమె కది బహుమతి చేశాను. అది నా జ్ఞాపకార్ధం అపురూపంగా దాచుకుంటానంది, నా సిగరెట్టు అడ్డులేకుండా కాలుస్తూంది. నా దగ్గర యాభై రూపాయలప్పు తీసుకుంది. అవి తిరిగి యివ్వక్కర్లేదన్నా. అలా వీల్లేదంది. కాని యివ్వలేదు, నాతో అసలు సెక్స్ కాని. "చిన్నరకం సెక్స్ కలాపాలు" చెయ్యడానికి ప్రయత్నిస్తూంది. నేను చిక్కులో పడుతూండే వాడిని.
    మా ఏ-2 గదిలో సాంపరియా మరణం తరవాత అతని బెడ్డు,మీదొక ఆపరేషను కేసొచ్చింది, ఆరోగిపేరు "టాండస్." అతని రెండు అరికాళ్ళూ పూర్తిగా కాలి బొబ్బలెత్తి పోయాయి? బాంబు స్ప్లింటరు గుచ్చుకుని కుడి కన్ను పోయింది. ఒకడిని శరీరంలో పది పన్నెండు ఎముకలు విరిగేయి. ఇంకొకడికి కుడికాలు తొడవరకూ తీసేశారు. ఇద్దరికి పొట్టలో గుండెల్లో గుళ్ళు దూరితే ఆపరేషను చేసి అవి తీశారు. ఇంకొకడికి తుంటె ఎముక విరిగింది.
    టాండాన్ కి కోర మీసాలున్నాయి. అరికాళ్ళు కింద మోపలేక పోయినా, ఒక కన్ను పోయినా, నర్సులొచ్చినప్పుడు బెడ్డుమీద కూచుని, చిరునవ్వుతో మీసాలు దువ్వుతూ, ఒంటికంటెతో వాళ్ళని తాగేసేవాడు.
    ఈ వారం మధ్య "బాబూ" వచ్చాడు. అతనొక్కొక్క బెడ్డు దగ్గరకీ వెళ్ళి, స్టూలు మీద కూచుని, రోగినడిగి ఏవో రికార్డులు రాసుకుంటున్నాడు. అతను సివిలియన్ "బాబూ."
    నా దగ్గరకొచ్చి స్టూలుమీద కూచుని కొత్త ఫారం తీసి తల వంచుకుని ప్రశ్నలేస్తూ రాసుకుంటున్నాడు. అతనికి బెత్తెడు గడ్డం వుంది. కొసలు సూదితేరిన మీసాలున్నాయి, బొచ్చుటోపీ వుంది. అతను నా మొహంలోకి సూటిగా చూడడంలేదు, జంకుతున్నాడు, చెయ్యి వొణుకుతూంది.
    అతన్నెక్కడో చూసినట్టుందనిపించింది, ఎక్కడ చెప్మా!
    "మీ పేరడగొచ్చా..." నేను,
    అతను దించిన తలయెత్తకుండా, ఓమాటు నా వేపు దొంగచూపు విసిరి "కరీమ్" అన్నాడు.
    పొరబడ్డా. మనిషిని పోలిన మనిషుంటాడు.
    "మీరు నన్నెరుగుదురా?" కరీమ్ స్టూలు నా తలదగ్గిరగా యీడ్చుకుంటూ అన్నాడు.
    "క్షమించండి - నేను పొరబడ్డా."
    అతనటూ యిటూ చూసి నిమ్మళంగా అన్నాడు.
    "పొరబళ్ళేదు. నన్ను మీ రెరుగుదురు. మొదట పద్మానది మీద లాంచిలో చూశారు. తరవాత అగర్తలా రేషన్ స్టాండులో చూశారు. తిరిగి యిక్కడ చూస్తూన్నారు.
    నేను అదిరిపడ్డా.
    "కమల్!!"
    అతను తిరిగి అటూ యిటూ చూసి అన్నాడు "గట్టిగా పిలవకండి. నా పేరు కమల్ కాదు-రాయ్ కాదు- కరీమ్, నేను ముస్లింని.


                                     18

    నేను A-2 వార్డులో కొచ్చి మూడోవారం పూర్తిగా వస్తూంది. రెండ్రోజుల్లో నన్నక్కన్నించి జనరలు వార్డులోకి మార్చేస్తారు. అక్కడ రెండు మూడు వారాలున్నాక డిశ్చార్జి చేస్తారు.
    నా గాయం పూర్తిగా మానిపోయింది. ఇక మామూలుగా తీసుకోవచ్చు.
    ఒకసారి ఆస్పత్రి అంతా చక్కరు కొట్టాలనిపించింది. అది ఒక వూరంత ఉంది. సుమారు రెండువేల పడకలున్నాయి.
    జనరలు వార్డులో సంతలా వున్నాయి, క్రమ శిక్షణ లేదు. పరిశుభ్రత లేదు. అన్న పానాల సత్రపు భోజనంలా వున్నాయి. అక్కడ రోగులు దొంగల్లా వున్నారు. ఆస్పత్రిని మెదలకుండా గబ్బిలాల్లా వేళ్ళాడుతున్నారు - సిబ్బంది యమదూతల్లా ఉన్నారు.
    ఆ వార్డుల్లో మందూ మాకూ లేదు. డాక్టర్లు రారు. నర్సు లెప్పుడో గాని రారు. వచ్చినప్పుడు రోగులు వాళ్ళతో మోటుసరసాలాడతారు.
    ఆస్పత్రి పక్కనే ఓ బజారుంది. దాన్ని "మరీజ్ బజారు" అంటారు. అంటే రోగుల బజారని అర్ధం, రోగులెప్పుడూ అక్కడే వుంటారు. అడ్డవైనగడ్డ కొనుక్కుతింటారు, రోగాలు తిరగ బెడతాయి. అదే వాళ్ళక్కావాలి. నయవైతే తిరిగి యూనిట్లకి వెళ్ళిపోవాలి. కాకుంటే రెస్టు క్యాంపులకి వెళ్ళాలి. అక్కడపని చెయ్యాలి. ఆస్పత్రిలోవుంటే పని చెయ్యక్కర్లేదు. అక్కడ ఆరేసి నెలల్నించీ వున్న రోగులున్నారు.
    ప్రతి బుధవారం ఆస్పత్రి పెద్ద అధికారి కల్నల్ సాబ్ వార్డులన్నీ తనిఖీ చేస్తాడు, ఆరోజు ఒక గంటసేపు వార్డులు క్రమపద్దతిలో, పైకి నీటుగా వుంటాయి, తనిఖీ ముగిసిన మరుక్షణంలో వార్డులు కోతుల బాగోతంలా తయారవుతాయి.
    ఆ ఆస్పత్రిలో వందమందికి పైగా భారతీయ డాక్టర్లు - ఆదా మగా వున్నారు. వాళ్ళలో చాలా మందికి వైద్య విషయమైన జ్ఞానం తక్కువ. దొంగ మెడికలు స్కూళ్ళ డిప్లొమాలు సంపాయించి కమీషన్ హోదా సంపాయించిన వాళ్ళూ వున్నారు.
    ఆ డాక్టర్లకి వైద్యం రాదు. అందుకే పటాలంలో చేరారు. హోదాలు చలాయిస్తూ, సిగరెట్లు కాలుస్తూ, తాగుతూ కాలక్షేపం చేస్తున్నారు. పోతే, వ్యబిచరించడం ఉండనే వుంది. డాక్టర్లూ నర్సులూ స్వేచ్చ గా వుంటారు. కొందరు ప్రత్యేక నిపుణులు మినహా. మిగిలిన డాక్టర్లు చాలావరకూ చావల్ ఖరాభీ అన్నది నిర్వివాదం.
    నేను ఇరవైరెండో వార్డులో చేరా. అందులో యాభై పడకలున్నై. అది ఒక రైల్వే స్టేషను దగ్గిర మూడో తరగతి ప్రయాణీకులుండే స్థలంలా వుంది.
    నా ఎడంపక్క "సూర్జు" అనే రోగి వున్నాడు. అతనికి పెద్ద పేగులో కురుపుంది. అది ఎప్పటికీ మానదు. అతనికి ఆపరేషనై నాలుగు నెల్లైంది. అతను కారం తినకూడదు. కాని అతని పక్క కింద యెప్పుడూ రెండుశేర్ల పచ్చిమిరపకాయ లుండేవి. అతనికి ఆస్పత్రి విడిచి వెళ్ళటం యిష్టంలేదు, అతను బిస్తీ, అంటే నీళ్ళుమోసే వాడు. ఆ పని అతనికిష్టం లేదు. అందుకే మిరప కాయ లొదల్దు.
    నా కుడిపక్క ఒక బాబు వున్నాడు. పేరు మూర్తి కన్నడదేశస్థుడు అతనికి 'వారికోన్ లీను" ఆపరేషనై ఆర్నెల్లైంది, క్రమేణా వార్డు పెద్ద అయాడు మూర్తి లేకపోతే వార్డుపని బందై పోతుంది. అతనిక్కూడా స్వంత యూనిట్ కి తిరిగి వెళ్ళాలనిలేదు, కారణంవుంది.
    మూర్తిచాలా మంచివాడు. నన్ను ప్రేమగా గౌరవంగా చూస్తాడు. తెలుగు బాగా మాట్లాడతాడు. స్వగ్రామం బెంగుళూరని చెప్పకపోతే తెలుగువాడనుకోవచ్చు.
    అతను మంచి యౌవనంలో వున్నాడు తెల్లగా, పొడూగ్గా వుంటాడు. ఉడిపి కృష్ణ విగ్రహం మొహం. స్త్రీలని యిట్టే ఆకర్షించే అందం చందం వుంది. వార్డు రాత కోత లేగాక కెప్టెన్ మీనా ఆఫీసు పనికూడా చేస్తాడు. ఆవిడకి మూర్తి లేకుండా ఒక్క నిముషం గడపద్దు. వాళ్ళిద్దరికీ వున్న సంబంధం అందరికీ తెలుసు మూర్తిని చూసి చాలామంది లేడీ డాక్టర్లు, నర్సులు గుటక లేసేవారు. కాని కెప్టెన్ మీనా అతన్ని నీడలా వదల్దు.
    నా ఎదురు బెడ్డుమీద "యాదవ్" అనే మరాఠీ రోగి వున్నాడు. అతను వంటవాడు. అతనా ఆస్పత్రిలో చేరి ఆర్నెల్లు దాటింది. ఇంత వేగం కదల్దు.

 

                              
    యాదవ్ కండలు తిరిగిన యువకుడు, నాటకాల్లో వేషాలేస్తాట్ట. గిరజాల జుట్టుంది, హాయి హాయి మనిపించేలా పాడతాడు. హిందీ సినిమా పాటలు తఃరుచు పాడేవాడు. కూచుని పాడుతూ కళ్ళూ చేతులూ తమాషాగా తిప్పుతూ, చిరునవ్వుతో అభినయం చేసేవాడు. అతను గొంతెత్తి "మేరే బుల్ బుల్ సో రహా హై కోరుగుల్ నమచా" అని పాట విసిరితే వార్డంతా నిశ్శబ్ధమైపోతుంది.
    యాదవ్ ది షొలాపూరు. ఒక వకీలుగారింట్లో వంట చేసేవాడు. వంట చేస్తూ పాడేవాడు. ఆ వంటగది కిటికీలోంచి ఒక గొప్ప వర్తకుడి మేడవుపిస్తుంది. ఇతను గొంతెత్తగానే, ఆ వర్తికుడి కూతురు మేడ బాల్కనీ మీద కొచ్చి పాట వినేది.
    "బాబూజీ! ఆ పిల్ల బియ్యే చదుతూండేది చక్కని చుక్క నా పాటవిని మైమరచిపోయేది. నేను.
    "గేలా దర్జియా సార్' అని గొంతెత్తగా చదువుతున్న పుస్తకాలు పడేసి బాల్కానీమీద కొచ్చేది.
    "పాట వినడమేనా, యింకేమైన జరిగిందా? నేను.
    "తొందరపడకు బాబూ" అన్నాడు యాదపీ కళ్ళు తిప్పుతూ, చిరునవ్వుతో....
    "ఆ పిల్ల పేరు హంస. మొదట్లో పాడుతూని, నా వేపు చూచి నవ్వేది. తరువాత కనుసైగలు చేసేది. చివర కొక రోజు నన్ను రహస్యంగా 'ఐ లవ్యూ అంది. నాకు కంపరమెత్తి పోయింది. నే నొద్దని ఎంతో బతిమాలా వింటేనా!!
    "తరువాత..."
    "పద మనిద్దరం బొంబాయి పారిపోదాం అంది. ఎంత చెప్పినా విన్లేదు, చివరకో రాత్రి యిద్దరం బొంబాయి వుడాయించాం. కానీ, వాళ్ళ నాన్న మా మీదికి పోలీసుల్ని తోలాడు. నేను హంసని బొంబాయిలో వదిలేసి సరాసరి మిలిట్రీలో చేరిపోయా...
    "మరి హంసేమైంది?"
    ఫర్వాలేదు, ఇంటి కెగిరిపోయుంటు చూశావా బాబూజీ! ఐ లవ్యూ నా కొంపదీసింది.
    నిజమే ఆశ్చర్యం లేదు. యాదవ్ కంఠంలో స్త్రీ హృదయాన్ని రగిల్చే చిచ్చువుంది. అతని క్కూడా ఆ ఆస్పత్రిలో రెండు మూడు లంపటాలున్నాయి.
    ఈ వార్డులో మూడు వారాలుండడం నాకు దుస్సాద్యంగా తోచింది. వేగం వెళ్ళిపోయేమార్గం ఆలోచిస్తున్నా మరేం ఫరవాలేదన్నాడు మూర్తి పది రోజుల్లో విడుదల చేస్తానన్నాడు. ఆరు వారాలు మెడికల్ లీవుకూడా యిప్పిస్తానన్నాడు.
    ఆదివారం సాయంత్రం నాలుగ్గంటలకి రాయ్- కాదు కరీమ్ వచ్చాడు. ఇద్దరం మరీజ్ బజారు వెంపు షికారు వెళ్ళాం. బజారు నానుకుని ఒక చర్చి వుంది. అందులో ఒక చక్కని తోట వుంది. అటెవ్వరూ రారు. ప్రశాంతంగా వుంటుంది.
    ఆతోటలో ఒకమూల కోటన్సు మొక్కల కింద కూచున్నాం. కరీమ్ టోపీ తీసి పక్కన పెట్టాడు.
    "మిషర్ రావ్! నన్నుచూస్తే అసహ్యం వేస్తూంది కదూ!"
    "లేదు ఆశ్చర్యం వేస్తూంది. ఆందోళన కలుగుతూంది మొదట మనం పద్మానది మీద కలిశాం. త్వరలో మీరు పద్మా వివాహం చేసుకుని సుఖంగా వుంటారని అనుకొన్నా మళ్ళా కలుస్తామో కలవమో అని విచారించా. కాని మళ్ళీ మనిద్దరం కలిశాం, అగర్తలలొ, మీ ఆశ్రమం మారిపోయింది. నాకు చాలా బాధ కలిగింది. తిరిగి కలపమేమో అనుకొన్నా. కాని యిక్కడకలిశాం. మీ మతమే మారిపోయింది. ఎంచేత?
    ఇద్దరం సిగరెట్లు ముట్టింఛాం. అతను శంఖం వూదినటు దమ్ము లాగి పొగ ఒదిలాడు.
    "మతం మారలేదు. ఏం మారలేదు, స్తలం మారా అంతే.
    "మళ్ళీ ఏం ప్రమాదం జరిగింది?
    "చెప్తా.... అంతా చెప్తా....సావకాశంగా చెప్తా...అతను తిరిగి ఘాటుగా దమ్ము లాగాడు.
    "అగర్తలా రేషను స్టాండు ఎంతుండేదో మీరు చూశారు కదా, ఆ స్టాండు అంతా నా గుప్పిటిలో వుండేది. నా సీటు అలాంటిది, కాయితాల పనంతా నా దగ్గిర కొచ్చేవరకే. రేషను యివ్వడం నా యిష్టం.
    ఇది చాలా ఆశ్చర్యంగా తోస్తుంది. కాని నిజం, కారణం- ఆ గోడౌన్ల లో వున్న సరుకు లెక్క పెట్టడం మానవ మాత్రుడి తరంకాదు. రేషను సప్లైలు నిత్యం సముద్రం పొంగినట్టు వస్తూ పోతుంటాయి, అయితే నన్నెవరూ అనుమానించకుండా వుండాలి కదా....
    నావేపు చూసి తిరిగి దమ్ములాగాడు, చిన్న గాలేసి చెట్ల ఆకులు కదిలేయి. వెంటనే టోపీతీసి పెట్టుకుని అటూ యిటూ చూశాడు.
    'ఎవ్వరూ లేరు, గాలి, నే నన్నా.
    అతను తిరిగి అటూ యిటూ చూసి టోపీతీసి పక్కన పెట్టాడు.
    "మనం ఈ టోపీతోటే ప్రస్తుతం లో కొన్ని టోపీలేస్తున్నాం"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS