"సిస్టర్ దయచేసి సిగరెట్ తీసుకో...నేను.
ఆమె "థ్యాంక్సు" చెప్పి తీసుకుంది. ఇద్దరం సిగరెట్లు ముట్టించాం.
"నా ఆపరేషను చాలా సేప్పడుతుంది..."
"ఉహు....మహా అయితే అరగంట..."
"మత్తుమందిస్తారా?"
"తప్పకు డా...భయంగా వుందా?"
"అబ్బెబ్బే.....నేనిదివరకెప్పుడూ ఏ ఆనరే క్షనూ చేయించుకోలేదు.
"ఏం ఫరవాలేదు"
ఇలా మేం మాట్లాడుతూంటే నైటు డ్యూటీ నర్సొచ్చింది. ఆమెకూడా ఆంగ్లో ఇండియనే. పేరు షీలా, ఇరవై నాలుగేళ్ళుంటాయి. కొంచెం పొట్టి చకచక నడుస్తుంది. నడుస్తూనే రోగుల్ని పలకరిస్తుంది. పలకరిస్తూనే పాటలు విసురుతుంది.
షీలా చకచకా నా దగ్గర కొచ్చింది, "గుడీ వె నింగ్, హౌ ఆర్ యూ.." అంటూనే నా పెట్టెలో ఒక సిగరెట్టు తీసుకుంది. నా నోట్లో ఒక సిగరెట్టు పెట్టి. తనదీ నాదీ తనే ముట్టించింది.
ఏడు గంటలకి హెలెన్ వార్డంతా షీలాకి నచ్చజెప్పి వెళ్ళిపోయింది. షీలా తొమ్మిదింటికి రోగులందరికీ మందులిచ్చి, పెద్ధదీపాలు ఆర్పి చిన్నలైట్లు వెలిగించి, డ్యూటీ నర్సుండే గదిలోకి వెళ్ళిపోయింది.
మర్నాడుదయం పదకొండుగంటలకి నన్ను థియేటరులోకి తీసుకెళ్ళేరు. ఆపరేషను బల్లమీద ఒకపక్కకి కాళ్ళు వేలేసి కూచున్నా. మేజర్ బ్లిన్ ఎదురుగా నిల్చుని చిరునవ్వు నవ్వేడు. నన్నే మో కుశల ప్రశ్నలు వేశాడు.
"నీకొక చిన్న ఇంజక్షనిస్తాం. భయపడకు."
నేనతని వే పదోలా చూశా. అతను నన్ను ముందుకి వంచి నా తల తన కుడి చంకలో యిరి కించుకున్నాడు. వెనకనించి కెప్టెన్ రూద్ నా వెన్నులోకి ఇంజక్షనిచ్చింది. మేజరు నన్ను ఒదిలిపెట్టి, "అయిపోయిం"దన్నాడు. మళ్ళీ కొన్ని కుశల ప్రశ్నలు వేశాడు. ఐదు నిమిషాలు తరవాత నన్ను కాళ్ళు తీసుకుని బల్లమీద పడుకోమన్నాడు. నాకు కాళ్ళురాలేదు. మేజర్ నవ్వి, నా కాళ్ళు బల్లమీదపెట్టేడు. నా మొహంమీద ఒకగుడ్డ కప్పేరు.
మేజరు నన్ను మాట్లాడిస్తూనే వున్నాడు. కత్తి తనపని చేసుకుపోతూంది, ఆపరేషను కెప్టెన్ రూద్ చేసింది. అరగంటైందేమో, తిరిగి నన్ను వార్డులో చేర్చేరు. పగటి నర్సు నాకొక ఇంజక్షనిచ్చింది, నాకు నిద్రపట్టింది.
సాయంత్రం నాలుగ్గంటలకి నాకు బాగా తెలివొచ్చింది నర్సు నా చేత కాఫీ తాగించింది. మూడువారాలు అలాగే పడుకోవాలంది.
వారంరోజులు తరువాత నన్ను పక్కగదిలోకి బదిలీవేరు. అది A-2 వార్డుగది. దాంట్లో ఆరుమంచాలున్నాయి. అన్నీ పెద్ద ఆపరేషను కేసులే.
నా పక్క మంచం మీద "సాంపరియా" అనే అతనున్నాడు. ఇరవై రెండేళ్ళవాడు. అతని కడుపులో తుపాకీ గుళ్ళుండి పోయేయిట. శస్త్ర చికిత్స చేసి అది తీసేశారు. కాని పెద్ద పేగు లాంటిదేదొ రెండు మూడంగుళాలు బైట కొచ్చింది. కట్టు విప్పితే ఆ గాయం చూడ్డానికి భయంకరంగా వుంది.
సాంపరియా ఐదు నెలల్నించీ అలాగే వున్నాట్ట. బహుశ ప్రమాదమైన కేసు. పెద్ద డాక్టరీ కల్నల్ రాస్ రోజూ వచ్చి అతన్ని చూస్తున్నాడు.
"హలో మైడియర్ సాంపరియా, ఎలావున్నా నివాళ?" అని పెద్ద డాక్టరు పలకరించేవాడు. సాంపరియా నీరసంగా నవ్వేవాడు. కల్నల్ తో లెఫ్టినెంటు మీనా అనే యువ డాక్టరు వచ్చేది. ఆమె సాంపరియాకు ఫ్రయిడ్ ఎగ్, గ్లూకోజ్ కలిసిన పెరుగు యింకా పుష్టికరమైన ఆహారం స్వయంగా తినిపించేది. అప్పుడప్పుడు వెనక్కు తిప్పిన కల్నలు మొహంలో విషాదం గోచరించేది.
"ఇది నిజంగా నెగ్గే కేసు కాదు. పాపం అతను మరణంతో యుద్ధం చేస్తున్నాడు. మన విడిచి పెట్టేద్దాం..." ఆనాడు ఫలితం దేవుడికి విడిచిపెట్టేద్దాం...." ఆనాడు కల్నలు లెఫ్టినెంటు మీనాతో అంటూంటే నా చెవిని పడింది.
నా ఆలోచనలు పరిగెత్తేయి. సాంపరియా. ఎక్కడి వాడు! అతని స్వగ్రామం అక్కడికెన్ని వేల మైళ్ళ దూరంలో వుంది! ఎక్కడి స్వగ్రామం ఎక్కడ ఢాకా! అతనికి పెళ్ళయిందో లేదో తెలీదు. కాని తల్లి బతికే వుటుంది. ఆమె యిప్పుడు తన కొడుకెలా వున్నాడను కుంటూంది?
యుద్ధరంగంలో, అడవిలో, కొండకోవలో, శత్రువుల గుండుదెబ్బకి ఆహుతై ఒక సిపాయి పడిపోతే-చచ్చిపోతే-ఎక్కడో వున్న తల్లిపేగు కదుల్తుంది. ఇల్లాలి గుండె అదురుతుంది, తల్లి స్తవ్యం గుడుస్తూన్న బిడ్డ కెవ్వుమంటుంది. వీటికంటే చిక్కనైనది నెత్తురు.
ఒకరాత్రి పదిగంటలకి సాంపరియా శాశ్వతంగా కన్నుమూశాదు, కల్నల్ రాస్, లెఫ్టి నెంట్ మీనా వచ్చేరు. రాస్ నడ్డిమీద చేతులేసుకుని సాంపరియా కళేబరంవేపు కదలకుండా, రెప్ప వాల్చకుండా ఐదునిమిషాలు చూశాడు. మీనా బుగ్గల మీంచి కన్నీరు పాముల్లా జారింది. కల్నలు గిరుక్కున తిరిగివెళ్ళిపోయాడు. మీనా అతని వెనకే వెళ్ళింది. షీలా సాంపరియా శవం మీద దుప్పటి కప్పింది.
యుద్ధం కొనితెచ్చుకున్నది. మానవత్వం పుట్టుకతో వచ్చింది.
17
రాత్రి డ్యూటీ నర్సు షీలా పాడుతూ వార్డు ప్రవేశించింది. ఆంగ్లో ఇండియనైనా హిందీ పాటలు పాడుతుంది. "పసీహారే....పసీహారే.... మెరిసియాసె కహియో బాయ్....హౌ ఆర్ యూ మైడియర్ సీతారాయ్....ఓకే మై హుఁకితనీ ఫాస్ పియాకే.....ఓహ్! లవ్లీ.....కేపర్ సింగ్....పుస్తకం చదూతున్నావే.... సంతోషం....సంతోషం.... ఫిర్ లి కితనీ దూర్... మైగాడ్? ఆర్డర్లీ ఆర్డర్లీ - ఎక్కడున్నావు....రా....ఏవిటిదంతా వేరుశనక్కాయ తొక్కలు, బఠాణి పొట్టు,
"ఏటమ్మా గోల!"
"గోలా....మైగాడ్.....ఇదంతా యేవిటి....
"తొక్కు...."
"స్వీపర్ని పిల్చి తీయించాల్ని తెలీదు....వెంటనే తుడిపించు, మేజరు సాబ్ వస్తారు....మిల్ నేసే మజుబూర్...నసీహరే...హల్లో మైడియర్ రావ్! ఎలావుంది? కులాసా....? వచ్చి స్టూలుమీద కూచుంది.
సాయంత్రం ఏం తిన్నావు.? ప్రశ్న వేస్తూ సిగరెట్టు తీసుకుని ముట్టించింది.
"మామూలే....చపాతీ కరీ..."
"బ్రెడ్ ముక్కలు కోసి వెన్నరాసియిచ్చేవా?"
"ఒద్దు..."
"వేడి పాలు...?"
"ఇప్పుడేం ఒద్దు ప్లీజ్..."
"చూడు డియర్.... ఉన్న పళంగా యివ్వడానికి నాదగ్గిర పాలేవు, నిద్రపోయే ముందు..."
కొంటెగా నవ్వింది, నేనూ నవ్వా.
నేనా ఆస్పత్రిలో వున్నన్నాళ్ళూరాత్రి డ్యూటీ షీలాదే. ఆమె తన విధి భక్తిశ్రద్దలతో. ఉత్సాహం ఓపికతో చేసేది. రాత్రీ తియ్యవలసిన వాళ్ళకి టెంపరేచరు తీసి, ఇవ్వవలసిన వాళ్ళకి మందులు మాకులు యిచ్చి, పాలిచ్చి, గుడ్ నైట్ చెప్పేది.
ప్రతిరాత్రి పదకొండుదాటాకా ఆమెకోసం యెవరో వచ్చేవారు, సాధారణంగా తెల్లవాళ్ళే వచ్చేవాడు,
రాత్రి రెండైంది, నిద్ర రావడం లేదు. షీలా సన్నగా కూనిరాగంతీస్తూ వెళ్ళిపోతూంది.
'సిస్టర్! ఇందాకా నీకోసం యెవరో వచ్చి నట్టున్నారు..."
"ఒహ్! నువ్వింకా నిద్రపోలా? ఔను. ఫ్రండ్...."
"నీకు బాయ్ ఫ్రండ్స్ డజన్లకొద్దీ వున్నట్టుంది."
"చిచ్చీ? అసహ్యంగా మాట్టాడకు." ఆమె మొహం ఎర్రబడింది.
"కోపం వచ్చిందా? హాస్యానికన్నా..."
"కోపం దేనికి? నువ్వు బాయ్ వి కావా? నాకు ఫ్రండువి కావా?"
నాగుండె అదిరింది ఎప్పుడో నేనే అన్నా ఆ మాట. ఎప్పుడు? ఔను....లాంచిలో.....పద్మతో పద్మ....ఎక్కడుంది? ఎలా వుంది?
నా ఆలోచనలు పరుగెడుతున్నాయి, షీలా వేపు చూస్తూన్నానన్న మాటేగాని నా ధ్యాస మరో వేపుంది. షీలా నన్ను పరిగా అర్ధం చేసుకో లేకపోయింది, పైగా అపార్ధం చేసుకుంది.
ముద్దు వెట్టుకోవాల్నుందా?" మొహం మీద మొహం పెట్టి అడిగింది.
మట్టి ప్రశ్న- ఔనంటే తప్పేమో! కాదంటే పిరితనమేమో, నేనామె మొహంలోకి చూస్తూ అలాగే వుండిపోయా.
ఆమె నా కింది పెదిమని నిమ్మళంగా ముద్దు పెట్టుకుంది.
"నిద్రపో..."
నేను కళ్ళు మూసుకొన్నా.
"ఒక సిగరెట్టు తీసుకొంటున్నా..."
నేనేమి అనలేదు. ఆమె నోటిలైను పరిమళపు మత్తు తలకెక్కుతూంది.
"నీకోటి కావాలా?"
"కళ్ళు మూసుకునే వొద్దని తల వూపా"
ఆమె అలా తిరిగొచ్చేసరికి నేను పక్కమీద కూచున్నా. టైము రెండున్నర అయింది.వార్డు గాఢ నిద్రలో ములిగిపోయింది. శరీర బాధలేనివాళ్ళు సహజ నిద్రలో, బాధవున్న వాళ్ళు మత్తు మందు కౌగిట్లో మైమరిచేరు!
"నువ్వింకా యేమిటాలోచిస్తున్నావు? నా గురించేనా? ఔను. నేను విచ్చలవిడిగా వుంటున్నా. స్మోక్ చేస్తా, తాగుతా, అన్నీ చేస్తా. తప్పనిసరి"
"కాని నేను నీ గురించి ఆలోచించడం లేదుసిస్టర్..."
"కాని నే చెప్తున్నా విను. నాకు సిగ్గులేదు. నేను హాయిగా వుండాలి. కాని అంతటితో సరి పోదు. బజల్ పూర్ లో నాకు ముసిలి తల్లిదండ్రులున్నారు. తల్లి పక్షవాతపు రోగి, నాకొక అక్కవుంది. పిచ్చిది, తమ్ముడు అక్కడే ఆర్డినెన్సు ఫ్యాక్టరీలో పన్జేస్తున్నాడు. మేం బీదవాళ్ళం, నేను ప్రతి నెలా యింటికి మూడువందలు పంపాలి. తప్పదు. అంచేత నాకు చాలామంది స్నేహితులవసరం."
ఆమె కళ్ళంట నీళ్ళొచ్చేయి.
