Previous Page Next Page 
విరామం పేజి 18


    దొంగనవ్వు నవ్వుతూ అన్నాడు.
    "అసలీ అనవసరమైన సాహసాలెందుకు. యిలా యిబ్బందిలో పడ్డవెందుకు..." నేను.

 

                                 
    "తుక్కూ తుక్కూ.....మీరంటూన్నది మీకే అర్ధం కాదు. సాహసం లేకపోతే జీవితం చప్పగా వుంటుంది....సరే. నన్నెవ్వరూ అనుమానించ కూడదు కదా అడిగినవాళ్ళందరికీ లేదనకుండా యిచ్చా. పెద్ద పెద్ద ఆఫీసర్లు నా అభిమానం కోపం పాకులాడేవారు. ఇక కిందివాళ్ళ సంగతి చెప్పాలా? నాచుట్టూ తిరిగేవారు.
    నే నెప్పుడు స్టాండు విడిచి పెట్టేవాణ్ణి కాదు. ఫిష్ ఫూల్ హత్య తరవాత ఏదో పోలీసు కేసు జరిగే వుంటుంది. నన్ను పట్టుకోడానికి ఎర్రటోపీలు ప్రయత్నిస్తూండొచ్చు. వాళ్ళు అమ్మ నేమీ చికాకు చెయ్యలేరు. ఇక నా జాగ్రత్తలో నేనుండాలనుకున్నా, రాత్రి పదే ఒంటరి గానూ, మరొకస్తే హితుడితోనో చుట్టుపక్కల షికారు తిరిగేవాణ్ణి.
    అగర్తలాలో ఆకలి పిశాచం యెలా తాండవిస్తూందో మీకు తెలుసు. ఎటు చూసినా పీనుగులూ, నడపీనుగులు.
    రాత్రిళ్ళు సిపాయిలు చుట్టుపక్కల పల్లెల మీద విరుచుకుపడుతున్నారు. ఆ పల్లె ప్రజలసలే అమాయకులు, దానికి తోడు పేదరికంతో విల విల్లాడి పోతున్నారు. చీకటిలో నిశ్శబ్దంగా నిద్ర పోతూన్న పల్లెల లో హటాత్తుగా కీచులాటలు, గుద్దులాటలు, పరుగులు, హాహాకారాలు, ఏడుపులు, బొబ్బలు, గృహదహనాలు. ఎన్నో రాత్రిళ్ళు స్వయంగా చూశా- నా గుండెల్లో చిచ్చురేగింది.
    పద్మకోసం, విషప్పురు గులాంటి ఫిష్ ఫూల్ ని చంపా. ఆ కారణంగా అజ్ఞాత వాసినై పోయా. ఇక్కడ అంతకంటే ఘోర దృశ్యాలు చూస్తున్నా. పద్మ ఒక వ్యక్తి కాదు, భారతదేశమే. పరిపాలకులీ యుద్ధాన్ని మనమీద బలవంతంగా రుద్దారు. దేశాన్ని కౌరవసభ చేసి, దేశమాత వస్త్రాపహరణం చేస్తున్నారు, మనవంతా పనికిమాలిన దద్దమ్మ పాండవుల్లా చూస్తూ వూరుకొన్నాం.
    ఈ యుద్ధం ఆపగలవా? నా తరం కాదు, ఈ జులుం నివారించగలనా? నా వశంగాదు, ఏం చెయ్యగలను? ఏం చెయ్యగలను? ఆలోచించి నిర్ణయానికొచ్చా...

                              *    *    *

    "155 ఇ. ఇ. టి, సి...?"
    "జీ సాబ్!"
    "ఇ. ఇ, టి. సి. అంటే?"
    "ఇంజలీర్ ఇక్విట్... నోరు తిరగదు సాబ్..."
    "సరే సరే...మీ యూనిట్ కొత్తగా వచ్చిందా?"
    "ఔను సాబ్.....ఇవాళే..."
    "సరే పద"
    లారీ నిండిపోయింది, బియ్యం, పప్పులు, పంచదార, బంగాళాదుంపలు - ఒకటేమిటి సమస్తం.
    "అచ్చా! నీ పేరేమిటి?"
    "అమర్ సింగ్ ఆహుజా..."
    "అచ్చా అమర్ సింగ్ - ఇక వెళ్ళు.
    లారీ కదిలిపోయింది. కొంతవరకు రస్తామీద, ఆ తరువాత చౌరస్తా మీద, అమర్ సింగ్ లారీని అడవి దారి పట్టించి, అక్కడ దూరంగా ఒక ఏటిగట్టున వున్న రెబడు పూరియిళ్ళ దగ్గిర ఆపాడు, సరుకులు వాటిలో పెట్టి తాళం వేశాడు లారీ ఓ పెద్ద పూరిపాక లోకి వెళ్ళిపోయింది. పాకమీద ఆకులూ తీగలూ దట్టంగా వున్నాయి. అందులో వుంటే లారీ బ్రహ్మదేవుడికి కనిపించదు.
    అమర్ సింగ్ అహుజా పరమ సాహసికుడు. అతను మిలిట్రీవాడు కాదు. కాని పంజాబు మంచి తూర్పు బెంగాలొచ్చాడు. అతని వృత్తి ఘరానా దొంగతనం. మోసం, అతనికెన్నో పేర్లు, వేషాలు, ఏది నిజమైనదీ కాదు. చివరికి గడ్డంకూడా నిజమైనది కాదు.
    కమల్ అతన్ని పట్టాడో, అతనే కమల్ ని పట్టాడో చెప్పలేం. కాని యిద్దరూ ఒక ఒప్పందానికొచ్చారు, కమల్ ఆహుజాకి రేషను ఇండెంటు ఫారాలిచ్చాడు, అతను తరచు అవి నింపి తీసుకొచ్చి, రేషన్లు తీసుకుంటాడు. రేషన్లు ఇప్పించే భారం కమల్ ది, వచ్చినప్పుడల్లా నాలుగైదు వేల రూపాయల ఖరీదు చేసే రేషన్లు కమల్ యిస్తాడు. వాటిలో సగం అమర్ సింగ్ ని. మిగతా సగం బీద ప్రజలని, రాత్రిళ్ళు రహ స్యంగా వెళ్ళి అమర్ సింగ్ సాయంతో పల్లె ప్రజలకి పంచిపెట్టేవాడు.
    "నా కిది సాహసమే..." కమల్
    "నిజంగా గొప్ప సాహసం!" నేనన్నా-
    మళ్ళీ చెట్ల ఆకులు సలసల మన్నాయి. వెంటనే కమల్ టోపీ పెట్టుకున్నాడు. క్రోటన్స్ మొక్కల్ని దూసుకుని ఒక కుక్కవచ్చి మమ్మల్ని చూసి తోక ఝాడించి వెళ్ళిపోయింది. కమల్ టోపీ పక్కని పెట్ట్టాడు.
    "కాని ఆహుజా కిది సాహసంకాదు; అతని లారీ వూసరవెల్లి రంగులు మార్చినట్టు, నెంబరు, రంగు మార్కులు మారుస్తుంది.
    ఈ వ్యవహారం చాలా ప్రమాదకరమైందని నాకు తెలుసు. అయినా దీని మూలంగా గెద్దల్ని కొట్టి కాకుల కేస్తూన్నానన్న తృప్తి కలిగింది, కాని అది అట్టేకాలం సాగలేదు.
    ఆనాడు ఆహుజా లారీ సరుకుతో సహా మిలిట్రీ పోలీసులై దొరికి పోయింది. ఆహుజా చాలా సాహసుడని చెప్పానుకదా. అతని దగ్గర ఎప్పుడూ పిస్తోలు, చురకత్తి, గుప్తంగా వుంటాయి. ఆవేళ అతని లారీ దొరికిపోగానే. పోలీసులకీ అతనికీ మద్య చిన్న యుద్దం జరిగింది. అమర్ సింగ్ ఒక పోలీసుని పిస్తోలుతో కాల్చి చంపాడు. మీదికి ఉరికిన మరో పోలీసుని కత్తితో గాయం చేసి పారిపోయాడు.
    ఈ సందర్భంలో నేను బైట పడొచ్చు. అంచేత రాత్రికి రాత్రి నేనక్కన్నించి పరారి అయిపోయాను.
    నెలరోజులు రహస్యంగా కాలం గడిపాను. గడ్డం మీసం పెంచాను. టోపీపెట్టాను, కరీమ్ అనే మారుపేరుతో ఆర్మీమెడికల్ కోర్ లో సివిలియన్ క్లర్కుగా చేరా. అదీ కథ.
    కథ విని నేను చాలా దిగులుపడ్డా.
    "కమల్! మీరు చాలా జాగ్రత్తగా వుండాలి. మీ అమ్మగారు మీ కోసం చాలా బెంగ పెట్టుకుని వుంటారు."
    "అమ్మ ధైర్యమైనదే. కాని పద్మ గురించి చాలా బాధగావుంది.
    పద్మ ఎక్కడుందో మీకుగాని తెలుసా!?
    ఇప్పటి వరకూ తెలీదు. వాళ్ళు కొమిలాలో లేరు. వాళ్ళ తండ్రి చనిపోయాడు. ఇల్లద్దెకిచ్చి యెక్కడికో వెళ్ళిపోయారు...."
    ఓహ్! పద్మ బతికేవుందా!"
    "మీకెందుకా అనుమానం కలిగింది?"
    "ఏమో నామనసు చెడునే శంకిస్తూంది..."
    "అభిమానం వుంటే అలాగే అనిపిస్తుంది. కాని పద్మ కులాసాగానే వుందని నాకనిపిస్తూంది. పద్మ సంగతి నాకు తెలియగానే మీకు రాస్తా. మీ అడ్రసు?"
    అతను ఢాకాతో తన అడ్రసిచ్చాడు.
    వారం తరవాత నేను ఆస్పత్రి నించి విడుదలై యూనిటీ చేరాను.

                              *    *    *

    ఈసారి మేం నెలరోజులు వెనకుండిపోయేం. ఎలాగూ పురోగమించక తఃప్పదు. కాని సిపాయిల దగ్గిర్నించి అందరికీ "ఎప్పుడు ఎప్పుడు" అనే తహ తహ ఎక్కువైది. అందరికన్న మా ఓ. సీ కి ఈ తపన భరించరాని దైంది. అతను నిజంగా ఖిన్నుడైపోయేడు. ఆఫీసులో ఎప్పుడూ యిదే గొడవ. అతనికి ఎవరిమీదైనా చిరాకొస్తే, "నిన్ను వెనక్కి పంపించేస్తా" అనేవాడు. సైనికుడికి పురోగమించడం అంటే సరదా. గౌరవం. వెనక్కి వెళ్ళడం అవమానం.
    మేం అగర్తలాలో వుండగా ఓసారి అతన్ని ఆఫీసర్ల మెస్ లో "ఫూల్" ని చేసి అంతా పక్కలు విరిగేలా నవ్వి ఆనందించారు, ఆవాళ మార్చి ముఫ్ఫై ఒకటో తేదీ. సాయంత్రం నాలు గంటలకి నా దగ్గిరకి ఎడ్జంటం టొచ్చి ఓ కాగితం యిచ్చి రహస్యంగా టైపుచేసి యిమ్మన్నాడు. అది ఢిల్లీ హెడ్ క్వార్టర్సు నించి మా ఓసీకొచ్చిన బదిలీ ఆర్డరు. అందులో అతనికి బొంబాయి బదిలీ అయిపోయినట్టుంది. నే నది టైపు చేసి ఎడ్జంటంటు కిచ్చా. అది అతను చదివి నన్నేదో సంతకం చెయ్యమన్నాడు. నేను పదివంకర్ల సంతకం చేశా.
    మర్నాడు సాయంత్రం మెస్ లో ఆఫీసర్లందరూ వుండగా ఒక సార్జంటు వెళ్ళి ప్రత్యేక "కారియర్" ద్వారా వచ్చినట్టు ఒక కవరు మా ఓసీ కిచ్చి వెళ్ళిపోయేడు. ఓ సీ కవరు చించి చదివి నీరుకారి పోయాడు. అంతా ఏవిటే విటని ఆతృతగా ప్రశ్నించేరు, అతను యేడుపు మొహం పెట్టి నిరుత్తరంగా ఆ కాయితం టేబిలు మీద పడేసి. రెండు గుక్కలు విస్కీ మింగి పెద్ద ఆస్తి పోయిన వాడిలా కూచున్నాడు. అంతా అతనికి సానుభూతి తెలిపేరు, కొందరు అభినందించేరు. ఏప్రిల్  మూడో తేదీన బొంబాయిలో హాజరు జ్కావాలి. అంటే మర్నాడే ప్రయాణం, వెంటనే పార్టీ యేర్పాటు చేశారు!
    మర్నాడుదయం ఓ సీ ఆర్డర్లీ దేవదాసు నా దగ్గరకొచ్చేడు.
    "సార్ : యూ ఫాడిట్ అంటేయేటి!
    "అదేవిటోయ్? నేనలాంటిమాట వినలేదే...
    "లేదుసార్. అదేమాట. మొదట అసిస్టెంటు సాబన్నాడు. నవ్వేడు. తరవాత క్వార్టరు మార్టు సాబు ఓ సీ తో "యూ ఫాడిట్" అని నవ్వేడు. తరవాత ఒక్కొక్కరే అదే అని నవ్వేరు. అంతా మల్లీ మల్లీ అదే అనటం నవ్వటం. ఓరి బాబో - ఎంత నవ్వులో ఒకటే గోల. ఒకటే నవ్వులు పడిపడినవ్వి మన ఓసీ సాబుని ఓకే తాటాకులు కట్టేరు. తరవాత మన ఓ సీ సాబూ నవ్వేడు. మల్లీ అంతా నవ్వేరు. ఏటిసార్ యూ ఫాడిట్టంతే..."
    నాకు కొంచెంసేపటివరకూ అర్ధం కాలేదు. తరవాత అర్ధమైంది. "మేం పురోగమిస్తున్నాం -నువ్వు" వెనక్కి వెళ్ళిపోతున్నావు- "యూ హావ్ హాడ్ ఇట్" అని.
    "హవల్దార్! మనం యిక్కడింకా యెన్నాళ్ళుండాలో!" బెంగగా అన్నాడు ఓసీ.
    "రెండు మూడ్రోజుల్లో కదలొచ్చు..."
    "ఓహ్! నాకు ఓపిక పోయింది..."
    నే నప్పుడే టపా యిప్పుతున్నా- ఆటపాటల్లోనేవచ్చింది ఆర్డరు మేం చిట్టగాంగు వెంటనే వెళ్ళాలని. ఓసీ యెగిరి గంతేశాడు. ఆఫీసర్లని, సార్జంటు మేజర్నీ పిలిపించేడు. "మిస్టర్ రీడ్! మనం చిట్టగాంగుకి కదులుతున్నాం, తక్షణం..." హుషారుగా చెప్పేడు. ఆర్మీలో లెఫ్టినెంటుని. సార్జంటు మేజర్ని మాత్ర వే "మిస్టర్" అని సంబోధిస్తారు, మిగిలిన వాళ్ళందర్నీ హోదాల తరవాత పేర్లుపెట్టి పిలుస్తారు.
    "చిట్టగాంగ్-చిట్టగాంగ్-చి-అ-గాం" పాట పాడేడు ఓసీ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS