Previous Page Next Page 
అపస్వరం పేజి 16

   
                                      6

    రాత్రి మీర గదిలోకి వచ్చినప్పుడు శాము హృదయం గడియారానికన్నా గట్టిగా కొట్టుకుంటూంది. గదిలోని దీపం కూడా అత్యాశతో మీరవేపే చూస్తూన్నట్టుంది. మీర లోపలికివచ్చి, తలుపు గడియవేసి, తలుపు నానుకుని నుంచుంది. శాము అభిమానంతో తన భార్యవేపే చూస్తున్నాడు. అందమయిన గుండ్రని మొహం గుప్త సౌందర్యానికి తెరవేసినట్టున్న కనకాంబరపు రంగు చీర మెరుస్తున్న దుద్దులు, అంతకన్నా కాంతి వంతంగా మెరుస్తున్న కళ్ళు.....శాము అపూర్వ సౌందర్యాన్ని తిలకిస్తూ తన్మయుడై తన్ను తాను మరచాడు. మీర చేతులను నీవు వెనకగా పెట్టుకొని కొద్దిగా తల పైకెత్త్హి దోమ తెరవేపే చూస్తూంది. చూపు అక్కడున్నా, మనసు అక్కడ లేదని, ఆమె హృదయానికి తెలుసు. నగల బరువు తనూ, ఆయాసంతోనూ నుదుటిమీద స్వేద బిందువులు నిలిచాయి. శాము నెమ్మదిగా నడచి వచ్చి మీర చేతిని పట్టుకొని,
    "మీరా...." అన్నాడు.
    అతని మొరటు చేతిలో మీర కోమలహస్తం కొద్దిగా వణికింది.
    "ఏమిటి అంతగా ఆలోచిస్తున్నావు! ఈరోజు కూడా టికెట్టమ్మాలనా?"
    "........"
    "నన్నే కొనేసుకున్నావు. ఇంకా ఎందుకు అంత ఆలోచన?"
    భర్త ప్రియ వచనాలకు, మీర ముక్తసరిగా
    "ఏమీలేదు" అంది.
    "అయితే నీ మొహం అలా వాడిపోయిందేం?"
    మీర తల అడ్డంగా తిప్పి నవ్వింది. నీలపు రంగు రాళ్ళ జూకాలు గర్వంతో ఆమె నునుబుగ్గల మీద వూగులాడాయి. శాము వూగుతున్న జూకాలను తన చేత్తో పట్టుకొని.
    "ఈ జూకాలను చూస్తే నాకసూయే" అన్నాడు.
    "ఏం?"
    "అవెప్పుడూ నీ బుగ్గల్ని స్పృశిస్తూంటాయి. నాకులేని అదృష్టం వాటికుందికదా అని."
    మీర బుగ్గలు ఎర్రబారాయి.
    "నాకూ ఆ అదృష్టం కావాలి."
    "........"
    "సరేనా?"
    మీర చీరకొంగును తన చేతులతో మెలిపెడుతూ నుంచుంది. ఆమెకు తెలియకుండానే ఆమె చెంప అతనికి దగ్గరగా వచ్చింది. శాము తన బుగ్గను ఆమె బుగ్గమీద ఆన్చి,
    "రాత్రంతా ఇలాగే గడిపేద్దాం" అన్నాడు.
    మీర నొప్పితో నుదురు చిట్లించింది. శాము మొహంమీదున్న మూడు రోజులగడ్డం, ఆమె మృదుచర్మానికి నొప్పి కలిగించింది. మీర మెల్లిగా విడిపించుకొని, తన చెంపను అరచేతిలో రుద్దుకుంది.
    "ఏం నొప్పిగా ఉందా? మేము పల్లెటూరి వాళ్ళం రోజూ క్షవరం చేసుకొనే అలవాటులేదు.......లైటు ఆర్పనా?"
    మీర వద్దని తల అడ్డంగా తిప్పింది. రెండు మూడుసార్లు ప్రయత్నించి, ఆఖరికి ధైర్యం తెచ్చుకొని,
    నే నొక టడగాలనుకుంటున్నాను" అంది.
    "అడిగేసేయ్. దాని కింత సంకోచమెందుకూ? ఇంకా కాలేజి అమ్మాయిలంటే చాలా ధైర్యవంతులనుకుంటున్నానే."
    కాని మీర నోరు విప్పలేకపోయింది. శాము అది గమనించి, చిరునవ్వు నవ్వి,
    "నోటికి వేసిన తాళం నన్ను తెమ్మంటావా?" అంటూ ముందుకు వంగాడు. తరువాత ఏం జరిగిందో మీరకు తెలియలేదు. తల తిరిగినట్టని పించింది. సన్నటి నడుమును చుట్టిన ఆ బలమయిన చేతుల ఆశ్రయమే లేకపోతే మీర క్రింద పడిపోయి ఉండేది. మొహమంతా చెమటపట్టింది. శాము మోహాన్ని వెనక్కి జరిపి,
    "నే నడుగుతానన్నది ఇంకా అడగలా" అంది.
    శాము తన ఆత్రుతకు సిగ్గుపడుతూ "తప్పయింది రాణీ. ఏమడుగుతావో అడుగు" అన్నాడు.
    "మరి......మరి.....నన్నెప్పుడు తీసుకు వెడుతారు పల్లెకు?"
    "ఓ! అప్పుడే మన పల్లె చూడాలని మనసు పుట్టిందా? రేపే వెళ్ళిపోదాం. నిజంగా ఎంత బావుంటుందనుకొన్నావ్. నందనవనమే అనుకో. ఇదివరకు నువ్వులేని నా జీవితం శూన్యం గా వుండేది. నువ్వచ్చావ్. ఇక అంతా వెలుగే. పచ్చని చేలు చూస్తూ వెడుతూంటే......ఎందుకులే రేపు నువ్వే స్వయంగా చూస్తావుకదా?"
    మీర తల దించుకుని, "నే నడుగుతున్న దది కాదు" అంది.
    "మరింకేమిటి? తొందరగా చెప్పకూడదూ? ఎంత మంచి క్షణాలు. వృధాగా గడచిపోతున్నాయో చూడు."
    "నాకు డాక్టరవాలని వుంది. చదవనా?"
    ఈ మాట విని శాము కౌగిలి సడలింది.
    చిరునవ్వు నవ్వి, "ఊఁ నీ విరహంతో బాధ పడుతున్న నా రోగాన్ని నయంచేసే డాక్టరావ్వు చాలు" అన్నాడు.
    "తమాషాక్కాదు. నిజంగానే అడుగుతున్నా."
    "నువ్విక్కడ చదువుతూ కూర్చుంటే నా గతో?"
    "ఇదివరకూ నేనే ఉన్నానా?"
    "గాలి, అన్నమూ, నీరు లేకపోయినా పరవాలేదు. నీ తీయటి ముద్దులులేక నేను బ్రతుకలేను."
    మీర చిన్నబుచ్చుకొని, "అయితే చదువు ఆపేయమంటారా?" అంది.
    "అవును మీరా నువ్వింకా చదివి ఏంచేయాలి? నా హృదయపు రాణిగా నన్ను ఏలుకో. కాలేజీ కుర్రాళ్ళకు రాణిగా ఉండక్కర్లా."
    "నేను కాలేజీ కుర్రాళ్ళలో స్నేహం పెంచుకుంటా నని మీకేమయినా....."
    "ఉహూ అదికాదు. నే నలా అనటంలేదు. నిన్ను వదలి ఒక్క క్షణం కూడ ఉండలేను నేను. నన్ను వదిలి ఉండకు....."
    అలా చెపుతూండగానే, అతనికంఠం భారమయింది. మీరను గట్టిగా తన వేపు లాక్కున్నాడు.
    శాము నిద్రపోయిన గంటసేపటికి కూడా మీరకు నిద్రపట్టలేదు. మనసు అసమాధానంతో హాయిగా పడుకోనివ్వకుండా మొండికేస్తోంది.
    మరుసటిరోజు శాము వేపు బంధువులంతా ప్రయాణమయ్యారు.
    "మనం కూడా ఈరోజే వెళ్ళిపోదాం" అన్నాడు శాము.
    "పెదనాన్నతో చెప్పండి" ఏ భావమూ లేకుండా అంది మీర.
    "నీకేమనిపిస్తూంది రాణీ"
    "నాకేమీ అనిపించటంలా."
    "నేను నమ్మను. మన పల్లెటూరికివెళ్ళి అన్నీ చూడాలనిపించటంలేదూ? నిజం చెప్పు నాకేమో మన మెప్పటికి వెళ్ళిపోతామా? జంట పక్షుల్లా ఎప్పుడు హాయిగా ఉంటామా అనిపిస్తూంది."
    నేనిక వెడతాను. మీ అత్తయ్యావాళ్ళు ప్రయాణమవుతున్నారు."
    శాము 'ఒక్క నిముషం ఇలారా' అంటూ బ్రతిమాలుకున్నాడు.
    మీర ఒక అడుగు వెనక్కివేసి ఏమీ తెలియనట్టు "ఎందుకూ" అంది.
    "దగ్గరికి రా మరి, చెపుతాను."
    "ఉహూ ఇక్కడే ఉంటాను చెప్పండి"
    "సరయితే నేనే వస్తున్నాలే" అంటూ శాము లేవబోయేసరికి మీర అందకుండా పారిపోయింది.
    శాము మేనమామ, అత్తయ్యా వాళ్ళంతా ప్రయాణానికి సిద్దమయారు. శాము మీరను స్టేషనుకు వెడదాం రమ్మన్నాడు.
    "ఎండగా ఉంది."
    "బండిలో వెళ్ళొద్దాంలే"
    మీర విధిలేక ఒప్పుకుంది. తెల్లవాయిల్ చీర కట్టుకుని, హాస్పిటల్ నర్స్ లా వున్న మీరని చూసి శాము,
    "ఈ చీర వద్దు బాగాలేదు" అన్నాడు.
    "ఏమయిందేమిటి. ఇలా సరళంగా ఉండడమే నా కిష్టం."
    "ఊహూఁ. అలా వీల్లేదు. ఏది? నీ చీరలన్నీ చూపించు"
    మీరకు విసుగనిపించింది. పెట్టెలోని చీర లన్ని తీసి చూపించింది. శాము నిశ్చితార్ధం రోజు తను ఏరి కోరి తెచ్చిన లేతాకుపచ్చ జరీ చీరతీసి కట్టుకోమన్నాడు.
    స్టేషన్నుండిరాగానే మీర, "ఎండకూ పట్టుచీరకూ పడదు" అంటూ చీర మార్చుకోవడానికి వెళ్ళబోయింది.
    "అపుడే తొందరేమిటి? కూర్చో"
    "ఎందుకూ"
    "నేనింకా నిన్ను సరిగ్గా చూడనేలేదు."
    "నిజం?"
    "ఆ."
    "మీ కెక్కడో పిచ్చి అంతే."
    "నిజమే నాకు నీ పిచ్చి"
    మామగారి బలవంతానికి శాము ఓ రెండు రోజులు వారి ఆతిథ్యాన్ని స్వీకరించక తప్పలేదు. కాని తన వూరిలో ఉండే స్వేచ్చ, ఇక్కడెలా లభిస్తుంది? పల్లెటూరిలో పుట్టి పెరిగిన మనిషతను. ఎక్కువ రోజులు వూరు విడచి ఉండట మంటే తల్లిని వదలిన పిల్లాడిలా అయిపోయే వాడు. పల్లెటూరంటే తల్లిమీదున్నంత ప్రేమా, అభిమానమూను. అక్కడి ప్రకృతి సౌందర్యం ప్రశాంత వాతావరణం, చూపు ఆనినంతమేరకూ పచ్చగా కనుపించే పొలాలు, చెరువూ ఇవన్ని అతన్ని తమ వాడిగా చేసుకున్నాయ్. వాటి తోడు లేకపోతే అతని ప్రాణం విలవిల్లాడిపోయేది. బస్తీకివచ్చి అక్కడుండి పోవలసినపుడల్లా అతని హృదయం వీటినుండి బయటపడ్డ చేపలా విలవిల్లాడిపోయేది. పల్లెటూరినుండి బయటకు వస్తే మళ్ళీ వూరు చేరేదాకా అతనికి శాంతి లభించేది కాదు. పెళ్ళయ్యాక ఇంకా మైసూరులో ఉండటం చికాగ్గా వుందతనికి. కాని కొత్త పెళ్ళాం, రూప సౌందర్యాలు, సహవాసం అతడికి ఈ రెండు రోజులూ పల్లెనుండి దూరంగా ఉండే శక్తి నిచ్చాయి.
    రెండు రోజులు మీరతో సినిమా, షికార్లు అంటూ తిరిగాడు. దుమ్ము నిండిన రోడ్డు గుండా షికారు వెళ్ళేటపుడు అక్పతక వాతావరణాన్ని చూసిశాము వ్యంగ్యంగా నవ్వి,
    "మన పల్లె అంటే నిజంగా స్వర్గమే. అక్కడ మైమరచి నడిచే ప్రేమికులను ఏ కారు హారన్నూ విడదీయదు. కృతక దీపాలు లేవక్కడ, చంద్రుని కాంతే మనకు పెట్టని దీపం. పాడే పక్షులే స్నేహితులు. పచ్చటి చేల మధ్యలో తిరుగుతూంటే ఇంకేమీ కావాలనిపించదు" అన్నాడు.
    "మీ పల్లెటూరిని పొగడమంటే పరమాన్నం తింటున్నట్టుందికదూ మీకు?"
    "అలాగే అనుకో పరమాన్నమున్నంత తియ్యగానూ ఉంటుంది మా పల్లెటూరు."
    "చూడాలయితే"
    "దానికేం? రేపే వెళ్ళిపోదాం. ఈ రోజే మామగారితో చెపుతాను."
    పల్లెటూరు వదలి వచ్చినప్పటినుండి తల్లి నుండి దూరమయిన లేగదూడలా అల్లల్లాడి పోతున్నాడు శాము. అదీకాక, అతడికి కావలసి నంతగా మీర సాన్నిధ్యం లభించటంలేదు. ఇల్లు ఇంకా కొంతమంది చుట్టాలతో నిండింది. ఎంతో ప్రయత్నం మీద మీర కనిపించినా, అల్లరిచేస్తూ తిరిగే కుర్రాళ్ళ మధ్యన ఏకాంతం లభించేది కాదు. ఇంట్లో అందరూ పనులు చేసుకుంటూండగా తలుపులు బిగించి గదిలో కూర్చోవటానికి మీర ససేమిరా ఒప్పుకునేదికాదు.
    ఆరోజు సాయంత్రం షికారునుండి తిరిగి వచ్చాక గదిలో ఒక్కడే కూర్చోవటానికి విసుగేసింది శాముకు. అందరిముందు మీరని పిలువలేదు. మెల్లిగా పద్దక్క కొడుకు పదేళ్ళ బాలుని పిలచి,
    "అక్కయ్యతోచెప్పి  ఒక్కగ్లాసు నుంచినీరు తెమ్మను" అన్నాడు.
    బాలు "అక్కయ్యా బావకు మంచినీరు కావాలట" అని గట్టిగా అరుస్తూ లోపలికి వెళ్ళాడు.
    మరో నిముషంలో మీర మంచినీటి గ్లాసుతో వచ్చింది.
    "తీసుకోండి."
    "నాకు కావలసినది అదికాదు."    
    "మీకేం వేళాపాళా లేదు" అని కొంటెగా నవ్వింది మీర. శాము బదులు చెప్పకుండా మీరను తన వేపుకు లాక్కున్నాడు.
    "అక్కయ్యా....." అంటూ లోపలి కొచ్చాడు బాలు.
    మీర బెదరి శామునుండి విడిపించుకొని, "ఏవిట్రా బాలూ?" అంది.
    "అందరం తొందరగా భోజనాలుచేసి రెండో ఆట సినిమాకు వెడదామంటూంది అమ్మ"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS