Previous Page Next Page 
అన్వేషి పేజి 16

 

    లోపలకు అడుగులు వేస్తున్నాననే కాని , నా ఆలోచనల్లో ఏడెనిమిదేళ్ళ క్రితం పోయిన మా అమ్మే ఉంది. ఆమె చాలా భారీ మనిషి. తాంబూలం వేసుకునే ఆమె పెదవులు ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవి. లక్ష్మీ వలె ఆమె ఇంట్లో మసులుతూ ఉంటె ఇల్లెంత కళగా ఉండేదో! ఇంటికి దేవత అయితే ఇరుగు పొరుగు వారికి కల్పవల్లి ఆమె. 'లేదు' అన్న శబ్దం ఆమె నోట వెలువడేది కాదు. ఉన్నట్టుండి ఆమె దేవత వలెనె అదృశ్య మయింది. ఆరోజు ఆమెను అంతిమ యాత్ర చేయించడానికి ఊరు ఊరంతా కదిలింది.
    ఈరోజు -- అంటే సుమారు ఒకటిన్నర పుష్కర కాలం తరువాత ఆమె స్థానంలో మరొకామె. నాన్న ద్వితీయం అప్పుడే చేసుకొని ఉంటె.....కాని చేసుకోలేదు. అంటే , అమ్మను మరిచిపోవడానికి అయన కింత కాలం పట్టిందా?
    ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాను. పెళ్ళి పందిరి. వాడుతున్న మామిడాకులతో, స్తంభాలకు కట్టిన కొబ్బరి ఆకులతో , నేల మీద అక్కడక్కడా అక్షింతలు , పసుపు కుంకుమలతో జరిగిన పెళ్ళి కళకు నిదర్శనంగా చిన్నబోయి ఉంది. ప్రహరీ గోడను దాటిన సాయంత్రపు ఎండ క్రమంగా పెళ్ళి పందిట్లో కి వ్యాపిస్తుంది.
    నన్ను చూసినప్పుడల్లా "చదువు పూర్తీ కాగానే వీడినో ఇంటి వాడిని చేస్తే నేనింక సన్యాసుల్లో కలిసినా అడిగేవారు ఉండరు" అన్న నాన్న మాటలు గుర్తు వచ్చాయి. అలాంటి నాన్న కొడుకు సంగతి మరిచి తనే పెళ్లి కోడుకై కూర్చున్నాడు.
    "నాన్నా!"
    "గిరీ! ఎప్పుడురా రావడం! ఆలస్యం చేశావెం? టెలిగ్రాం.....!"
    "అందలేదు, నాన్నా! పరీక్షలవగానే నాలుగు రోజులు స్నేహితులతో సరదాగా గడిపి వచ్చేశాను." అన్నాడు.
    "మంచి పని చేశావు! రా! నీకు తెలియకుండా నేనొక పని చేశాను. అనక నీ వేమనుకున్నా సరే!" అంటూ దారి తీశారు.
    వరండాలోకి వెళ్ళేసరికి అయిదుగురు ముత్తైదువుల మధ్య చాప మీద కూర్చుని ఉంది పెళ్ళి కూతురు. మమ్మల్ని చూస్తూనే అంతా లేచి నిలబడ్డారు.
    "అదుగో--- ఆమె--ఆ పెళ్ళి పిల్ల వేషంలో ఉందే! నీ పిన్నీ అంటే!"
    "అర్ధమయింది , నాన్నా! నమస్కారం పిన్నీ" అన్నాను.
    అంతటితో పని తీరినట్లు వెళ్ళిపోయారు నాన్న.
    ఆమె ఒక్కమారు నా వంక చూసింది. ఏలాంటి చూపు? పురుష జాతి పట్ల ఆమె కేర్పడిన సంపూర్ణ ఏహ్యానికి ఆ క్షణంలో నేనొక్కడినే వారసుడి నయ్యాను.
    ఆ తరువాత ఆమె కళ్ళు వాలిపోయాయి. అలా వాలిన కళ్ళలో ఎడమ కంటి నుంచి జారిన ఒక అశ్రుకణం ఆమె కాళ్ళ దగ్గరున్న అడ్డం మీద పడటం చూశాను. గాని, అది ఎన్ని వ్రక్కలైందో గమనించలేదు.

 

                                *    *    *    *


    కొన్నాళ్ళ నుంచీ నాన్న ఆరోగ్యం సరిగా లేదు. ఆయుర్వేదం మందులు వాడితే అతి వేడి, అల్లోపతీ మందులు పైత్యం చేసి తిన్న ఆహారం కూడా ఇమడదు. అలాంటి నాన్న ఈ పని ఎందుకు చేసినట్లు?
    పిన్ని పేరు అరుంధతి! ఆమె వయసు పాతిక సంవత్సరాలని విన్నాను. కాని పద్దెనిమిదేళ్ళ దానిలా ఉంది. పుడుతూనే అమ్మను యమలోకానికి పంపి తానూ వెనకాలే వెళ్ళిన మా చెల్లి అలా జరక్కుండా ఉంటె ఈసరికి అరుంధతి పిన్నిలాగే ఉండేది.

 

                              *    *    *    *


    రోజులు గడుస్తున్నాయి. ఆమె కళ్ళలో అశాంతి రోజురోజుకూ పెరుగుతుంది. ఆమె కళ్ళ చుట్టూ ఏర్పడే నలుపులు కాటుక అలంకారపు అవసరాన్ని అంతకంతకూ తగ్గిస్తున్నాయి. ఆమె ఎందుకలా అవుతుందో, ఆమెకేం తక్కువైందో గ్రహించలేనంత పసి వాడినా నేను! వంటామే వండి పెడుతుంది. పనివాళ్ళు పనులు చేస్తారు. స్వయంగా చేయవలసిందేమీ అంతగా లేదు. అయినా ఆమెకు విశ్రాంతి , ప్రశాంతి తక్కువైనా యంటే, ఆమె పక్కన నాన్నను కలిపి చూస్తె ఎవరికైనా సమస్య విడిపోతుంది.
    నన్ను చూస్తూనే పిన్ని తప్పుకుని తొలగి పోయేది. ఒకమారు నాన్న చూసి మందలించారు. "అదేమిటి? వాడినలా పరాయి వాడిలా చూస్తావు? వాడేవరునుకుంటున్నావు? నా కొడుకు? నీకూ అంతే!" అన్నారు.
    ఆనాటి నుంచీ పిన్నీకి, నాకూ సాన్నిహిత్యం పెరిగింది. కాలక్షేపానికి లైబ్రరీ నుంచి నవలలు తెచ్చి ఇచ్చేవాడిని. ఆమెతో ఏవేవో సంగతులు మాట్లాడుతూ ఉండేవాడిని. కాని ఆమెను 'పిన్నీ' అని పిలవాలంటే నాకేలానో ఉండేది. అయినా తప్పేది కాదు. కొన్నాళ్ళ కు పిన్నీకి బెరుకు వదిలి నా వైపు సూటిగా చూస్తూ ఏ సంకోచమూ లేకుండా మాట్లాడగలిగిగే స్తితికి వచ్చింది. నాన్న ఈ మార్పు చూసి సంతోషించారు.
    పిన్ని రోజూ నే నిచ్చిన నవలలు చదివేది. వివిధ సాంఘిక పరిస్థితుల పై ఉండేవవి. ఆమె నాతొ వాటిని గురించి తర్కిస్తూ ఉండేది. ఒక్కొక్కప్పుడు పోట్లాడుకున్నట్లుగా వాదించుకునేవాళ్ళం. నాన్న మా మధ్య మధ్యవర్తి అయ్యేవారు. వాతావరణం చాలా సరదాగా ఉండేది. పిన్నికి నాన్న మీద కూడా కోపం లేనట్లు కనిపించ సాగింది. నాకు కావలసిందదే! మా కుటుంబం వల్ల ఆమె కన్యాయం జరిగింది. దాన్ని ఆమె మరిచిపోయేలా చేస్తే మా కుటుంబానికి నిష్కుతి. అసలు ప్రధాన మైన వెలితి పూరించలేనిదే అయినా, ఆమెలో రోజూ రోజుకూ వస్తున్న ఉత్సాహం నాకు కాస్త ఊరటగా ఉండేది. ఆమె మూలంగా నాన్న నా మీద భవిష్యత్కాలంలో నేను మోయలేని ఒక బరువును మోపినట్లుగా భావించేవాడిని. మేమిద్దరం ఒకరి నోకరం అర్ధం చేసుకుంటే ఆ బరువు కాస్త తేలిక అవుతుందన్న అశాలేశం నాలో గుప్తంగా ఉండేది.

 

                                      25


    ఆరోజు పిన్నికి 'దేవదాసు' నవల తెచ్చి ఇచ్చాను. రాత్రి చాలా పొద్దు పోయిందాకా చదివి ఆమె దాన్ని పూర్తీ చేసింది.
    మర్నాడు ఉదయం పీట మీద కూర్చుని కాఫీ తాగుతూ అడిగాను.
    "పిన్నీ! ఎలా ఉంది నవల?"
    "నా బొందలా ఉంది. అలాంటి చెత్త నవలలు తెచ్చి ఇచ్చి నా ప్రాణం తీయకు. బాబూ! నేనేమో ఏ నవలా ప్రారంభించినా పూర్తీ చేయనిదే వదల్లెను మరి."
    "అదేమిటమ్మా! అది చాలా గొప్ప నవల అని అటు బెంగాలీలు, ఇటు తెలుగు వాళ్ళూ కూడా  శరత్ ను ఆకాశాని కేత్తితే--"
    "ఏముందయ్యా అందులో! వాస్తవానికి చాలా దూరంగా ఉంది."
    "అదెలాగో కాస్త వివరించు."
    "ఏముంది? పార్వతి పాత్రలో ఎన్నో స్వభావాలు కనిపిస్తాయి. ముందు పొగరూ, అహంకారం! ఆ తరవాత వృద్దుడి ఇల్లాలు అయింది. అయినా దేవదాసు ను మరిచిపోయిందా? లేదు. పోనీ , ఆ వృద్దుడైనా భర్తను ప్రేమించిందా లేదా అనేది 'శరత్' కే తెలియాలి. పొతే, సవతి పిల్లాలను ప్రేమించినట్లు కనిపించింది. సవతి కూతురుకు నగ లిచ్చింది. కోడలేమో అన్నదని పొదుపు ఉద్యమం సాగించింది. ఏమిటో గొడవగా ఉంది. స్త్రీ ప్రకృతి అంతగా అన్ని రకాలుగా ఉండదు."
    "మరెలా ఉంటుంది?"
    పిన్ని నవ్వి "నీకు నిజంగా తెలుసుకోవాలని ఉందా?' అన్నది.
    "ఉంది గనకే అడుగుతున్నాను."
    "మా మటుకు నాకు -- పార్వతి భర్త ఇచ్చిన నగలన్నీ పెట్టుకుని, అ సవతి కొడుకు లేడూ-- మహేంద్రుడు? అతనితో లేచిపోయి ఉంటె బాగుండే దనిపించింది. పోనీ, జమీందార్ల పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయనుకుంటే -- భ్రమర పుట్టింటి నుంచి రాకుండా ఉండి ముసలి జమిందారు కొడుకు, పడుచూ పెళ్ళాం సాగించే ప్రణయాన్ని చూసీ చూడకుండా ఊరుకున్నట్లు వ్రాస్తే మరీ బాగుండేది."
    నా తల తిరిగిపోయింది. "పిన్నీ!" అన్నాను కంగారుగా.
    "ఏం బాబూ, కంగారుగా ఉందా? నేను పార్వతిని కాదులే! ఒకవేళ నా కిష్టమైన పార్వతి లా నేను మారినా నీవు నా కిష్టమైన మహేంద్రుడివి కాలేవన్నది నాకు తెలుసు! భయపడకు!"
    నేను దిగ్గున లేచి వంట ఇంటిని వదిలాను.
    "పార్వతి ఒక రచనా శిల్పం! శరత్ అభూత కల్పన!" పిన్ని కసిగా అనే మాటలు వెనక నించి వినిపించాయి.
    గుమ్మం దగ్గర నాన్నగారిని చూసి తెల్ల బోయాను. అయినా అలాగే అయ్యారు. తోడూ దొంగల్లా మేము ఒకరి ముఖా లోకరం చూసుకోలేక చప్పున విడిపోయి తప్పుకున్నాం.


    
                             *    *    *    *


    నేను రోజు హాలులో పడుకుంటాను. హాలుకు పక్కగా ఉన్నదే నాన్న పడక గది. అ గదిలోని వాళ్ళు వాకిట్లో కి వెళ్ళాలన్నా, వంటింట్లో నుంచి అవతలకు వెళ్ళాలన్నా హాలులో నుంచే వెళ్ళాలి.
    పిన్నితో ఆ రోజు దేవదాసు పై సంభాషణ జరిగిన నాటి నుంచీ నేను రాత్రులు భయపడసాగాను. ఆ గది తలుపులు చప్పుడైతే చాలు, నేను ఉలిక్కి పడుతున్నాను. నిద్రపోతే సరేసరి. లేకపోతె నిద్రలో ఉన్నట్లు నటిస్తున్నాను. పిన్ని నా దగ్గరకు వచ్చినట్లూ, ఏమేమో అయినట్లూ కలలు వచ్చేవి. నేను యౌవనంలో ఉన్నాను. మేము ఏ మాత్రం ఏమరు పాటున ఉన్నా లోకం ఎన్ని పేర్లు పెడుతుంది! కుటుంబం రచ్చ కెక్కుతుంది.
    పిన్నితో పాటు విశ్రాంతి, ప్రశాంతి లేకపోవటం అనే జాడ్యాలు నన్ను కూడా పట్టుకున్నాయి. పిన్ని లేచి గది తలుపు ఎందుకు తీసినా నాన్న దగ్గటమో, పరాళించటమో చేసేవారు. నేను అభిమానంతో మగ్గిపోయే వాడిని. గాడ నిద్ర నటించేవాడిని.
    నేను సెకండ్ క్లాసు లో పాసయ్యాను. 'అమ్మయ్య ' అనుకున్నాను. ఉద్యోగం దొరికితే ఆ ఊరికి వెళ్ళిపోవచ్చు నన్నది నా ఆలోచన. ఆరోజు నుంచీ పత్రికల్లో కనపడిన నాకు తగిన వేకెన్సీ ల కల్లా అప్లై చేస్తూ ఉన్నాను. కానీ, ఆ ఉద్యోగా లంత తెరగా ఉన్నాయా?

 

                                 *    *    *    *


    ఆరోజు నాన్న నన్ను పిలిచారు . వెళ్ళాను.
    "బాబూ! నీకు పెళ్ళి చేద్దామనుకుంటున్నాను." అదిరి పడ్డాను. అప్పుడే నాకు పెళ్ళా! అదేమాట అన్నాను.
    "ఏం? చేసుకోవలసిందేగా! ఉద్యోగ'మంటావా? కాస్త వెనకో, ముందో వస్తుంది. అయినా నువ్వు ఉద్యోగం చేస్తేనే తప్ప పెళ్ళాన్ని పోషించలేని స్థితిలో లేవు గదా?"
    "అది కాదు, నాన్నా! అంత తొందరేమొచ్చింది?"
    "అందరూ నీలాగే అంటారు. కానీ, నా ఆదుర్దా నాది. నేను పెద్దవాడి నయాను. నీ పెళ్ళి చూడాలని ఆశ."
    నాకు ఒళ్ళు మండింది. పెద్దవాళ్ళు ఏమైనా చేయగలరు. ఎలాగైనా సమర్ధించుకోగలరు. ఏ విషయాన్ని ఎన్ని మలుపులైనా తిప్పగలరు.
    నేనేం చెప్పను? నేను పెళ్ళి చేసుకుంటే -- తన వయసు పిల్ల ఇంట్లో ఈడు జోడైన భర్తతో సుఖపడుతుంటే పిన్ని..... పాపం.....ప్రతి రాత్రి.....అంతకన్నా వేరు నరకం ఉందా?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS