"ఆ వెధవలకి నీవు లేందే పార్టీలో రంజులేదనే స్థాయికి వచ్చారంటే నీవు వాళ్ళని ఎంత ఎంకరేజ్ చేసి వుంటావో నాకు తెలుస్తూంది. ఏం వాళ్ళకంటే మంచివాడెవరన్నా యింటి దగ్గిర దొరికాడేమిటి, నన్నలా పార్టీకి వెళ్ళనిచ్చి యిలా ఎవడినన్నా యింట్లోకి పిలుస్తావా?" చదువు సంస్కారమున్న ఓ ఉన్నతోద్యోగి యిలా మాట్లాడగలడంటే ఎవరూ నమ్మరు. కాని ఆయన్ని ఎంతహీనస్థితికెనా దిగజార్చేస్తూంది ఆయన అనుమానరోగం! ఆయన మెంటల్లీసిక్ అన్నది నాకర్ధం అయినా ఎంతకని ఈ మాటలు భరించగలను. ఆయననే ఒక్కోమాట శూలాల్లా హృదయాన్ని తూట్లు పరుస్తూంటేసహించలేక ఎదిరించేదాన్ని ఆయనన్న దానికి చెప్పుదెబ్బకొట్టినట్లు జవాబిస్తూంతే, నోరు కాకుండా చేయి చేసుకోవడం ఆరంభించారు, ఆయనకి ఓ రకమైన ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ వుంది. అందమైన దాన్నని ఆశపడి గొప్పకోసం చేసుకున్నారు, చేసుకున్న తరువాత నా అందం ఆయనకి ఆనందం కలిగించడానికి బదులు యిబ్బంది కలిగించింది. తను నాముందు, ఎవరికీ ఆనరని, నేనందమైన దాన్ని కనుక అందరూ నన్ను చూస్తారని, మాట్లాడి స్నేహం చేసుకుంటారని, తన గురించి ఎవరూ పట్టించుకోరని, ఎలా మాట్లాడిన వాళ్ళతో నేను ఎట్రాక్షన్ లో పడతానని ఒక భయము అనుమానం. తనని నిర్లక్ష్యంచేస్తానని బాధ, ఉక్రోషం - తన అనుమానం కోసం నన్ను ఇల్లు వదలకుండా కట్టడిచేసి, గుమ్మం కదలకుండా వత్తిడిచేసి పెడితే నేను సహించకుండా ఎదురుతిరిగేనని కోపం, కసి, నన్నింట్లో కట్టిపడేయడానికి వీలు లేకుండా తన ఉద్యోగరీత్యా పార్టీలకి వాటికి వెంటపెట్టుకు వెళ్ళాల్సి రావడంవల్ల బాధ, యివన్నీ కలిసి ఆయన్ని అదోరకం కాంప్లెక్స్ లో పడేశాయి.
"భార్య కదా తనేంచేసినా పడుండాలి అన్న ఆయన ఊహని నేను ఆమోదించకుండా ఎదురు తిరగడంతో ఆయన అహం దెబ్బతినడం, ఆ కోపం కసి తీర్చుకోడానికి 'కూర బాగాలేదు, నీళ్ళు చల్లగా తగలబడ్డాయి, షర్టు బొత్తంకుట్టి ఏడవలేదేం' లాంటి కారణాలు వెతికి తిట్టి, నన్ను మాట లతో చిత్రహింసపెట్టి ఆనందించే శాడిస్ట్ మెంటాలితీ అలవరచుకొని కొంతవరకు కసి తీర్చుకునే ఆయన మనస్తత్వం రానురాను నా కర్ధం అయినా ఆయన నీచత్వాన్ని, హేయమైన మాటలని ఆమోదించేటంత శాంతి, సహనం నాలో తగ్గిపోయి, ఫలితంగా యిద్దరం ప్రతిరోజు ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ, బతకసాగాం. ఆయన అనే మాటలు, విసుర్లు, తిట్లు అన్నీ సహించి మూడేళ్ళు ఎలా పడున్నానా అని యిప్పుడు నాకనిపిస్తుంది. కొత్తలో కొన్నాళ్ళు ఆయన తత్వం అర్ధం చేసుకోడానికి, అర్ధం అయ్యాక మారుతారేమోనని ఆశ కొన్నాళ్ళు-తరువాత కాపురం వదిలి మొగుడ్ని వదిలి ఎలా వెళ్ళాలి, వెడితే అందరూ ఏం అంటారోనని జంకు, బిడియం ఓ పక్క కన్నవాళ్ళకైనా ఈయన గురించి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అన్న ఆలోచన కొన్నాళ్ళు యిలా రకరకాల ఆలోచనలతో ఏడాది గడిచిపోయింది. ఈ లోగా నెలతప్పడం....నా ప్రమేయం లేకుండానే ఏదీ ఆలోచించే వ్యవధి లేకుండానే పాప పుట్టేయడం...పాప ఆలనా పాలనా మధ్య అట్టే యిల్లు వదలకపోవడంతో ఆయన అనుమాన రోగం కాస్త తగ్గి పైశాచిక ప్రవృత్తి తగ్గడం జరిగింది. తగ్గింది అన్నది కూడా నేను గుర్తించలేనంత బిజీగా పాపతో రోజులు గడిచిపోయాయి. అసలు మనిషిని ఒక స్థితికి చేరాక కొన్ని విషయాలు అలవాటయి బాధించడం మానేస్తాయేమో ఒకరకమైన విరక్తి, వైరాగ్యం మనిషిని చుట్టుముడుతుందనుకుంటాను. ఏమిటీ మనిషి నా ఖర్మకొద్దీ దొరికాడు ఈ భర్త నేనేం పాపం చేశానని ఇలా జరిగింది - అందరిలా నన్ను ఎందుకు ఆదరించడు నా భర్త అని కుమిలిపోయే ఆలోచనలు పాప పుట్టాక అంతగా బాధించడం మానేశాయి. యింతేకాబోలు నా అదృష్టం యింతే పెట్టిపుట్టాను గాబోలు. జీవితం అంటే కోరిందల్లా దొరకదు. దొరికిన దానితో సరిపెట్టుకోవాలి గాబోలు పెళ్ళయి, పిల్ల పుట్టాక మొగుడిని కాపురాన్ని వదిలి పెడితే ఎవరు హర్షిస్తారు. ఎక్కడికి వెడతానసలు.....యీ పిల్లని వంటరిగా ఎలా పెంచుతాను. ఆ కష్టాలకంటే ఏదో మొగుడిని రాజీపడి బతకడం నయమేమోనన్న ఆలోచనలతో, బతుకుతో రాజీపడిపోయి, ఏదో యింట్లో ఆయనతో అట్టే మాటలు పెంచకుండా, అంటీ ముట్టనట్టుగా వుంటూ పని పాటలు చూసుకుంటూ, పాపతోటి లోకంగా కాలం వెళ్ళదీయడానికి అలవాటు పడ్డాను.
అదేం మనిషో......కట్టుకున్న భార్యని ఆదరించలేకపోయినా కన్నబిడ్డని కూడా ముద్దుగా దరికితీయని ఆయన వింత మనస్తత్వాన్ని చూస్తే ఆశ్చర్యం అనిపించేది. పాప ఎంత తెల్లగా, బొద్దుగా నల్లజుత్తు, చక్రాల లాంటి కళ్ళతో రబ్బరు బొమ్మలా ముద్దులు మూటకడ్తూ చూసిన ప్రతి వాళ్ళూ ఎత్తుకుని ముద్దాడేట్లుండేది. ఆయన మాత్రం అంటీ ముట్టనట్లుండే వారు. పాప ఏడిస్తే యిదిగో పాప ఏడుస్తూంది అనడం తప్ప ఏ బాత్ రూమ్ లో నేనున్నా నేను వచ్చి ఎత్తుకోవాల్సిందే. ఆయనగారి మూడు బాగుండి పాప నవ్వుతూ కబుర్లు చెపితే చిటికలువేసి, యీలవేసి పిలవడం అపురూపం. గునగునా పాకివచ్చి బోసినవ్వులు నవ్వే పసిపాపని చూసీ చూడనట్టు తప్పుకు వెళ్ళే ఆ మనిషిని ఏం అనుకోవాలో నాకర్ధం అయ్యేది కాదు. అంతగా ఎప్పుడైనా ఏడుస్తుంటే ఎత్తుకుని ముళ్ళమీద వున్నట్టు అబ్బ అది లేచినప్పుడే బాత్ రూమ్ కి వెళ్ళాలా.....ఏడ్చిందంటే వదలదు మొండి...' అంటూ విసుక్కుని రెండు నిమిషాలలో చేతిలో పెట్టేవారు. తప్పటడుగులు వేసి వచ్చి ఎత్తుకోమని చేయిచాచే కన్నబిడ్డని ఎత్తుకోకుండా వెళ్ళే తండ్రి మనస్తత్వం అర్ధం చేసుకోవాలంటే ఎవరికన్నా కష్టమే. నేనెప్పుడన్నా నొచ్చుకుని ఏదన్నా అంటే "నాకు చిన్న పిల్లలని ఎత్తుకోడం అలవాటు లేదు, ఉచ్చ పోస్తారు. అయినా ఎత్తుకుని మోస్తేనే ప్రేమ వున్నట్టా, దానికెన్ని గౌనులు కొన్నాను, బొమ్మలు కొన్నాను. మహా నీ కొక్కర్తికే అన్నీ తెలిసినట్టు మాట్లాడకు. అన్నింటిలో నా తప్పులు వెతకడమే నీకు పని" అని చిరచిరలాడేవారు. పాలడబ్బాలు కొనడం, బట్టలు కొనడంతో ఆయన తండ్రి బాధ్యత తీరిపోయినట్లు మాట్లాడే మనిషికి యింకేం చెప్పగలం.....రాజేష్ గారూ.....మూడేళ్ళంటే....ఓ వెయ్యి రోజుల కాపురంలో....యిద్దరు కల్సిమెల్సి బతకాల్సిన భార్యాభర్తల మధ్య గుర్తుంచుకోదగ్గ ఒక్క తీపి గురుతయినా నాకు దక్కలేదు. ఆ వెయ్యి రోజులలో ఎన్నో వేలసార్లు ఈ పెళ్లెందుకు చేసుకున్నానా అని ఏడ్చిన రోజులు తప్ప నవ్విన రోజులు, ఆనందంగా గడిపిన రోజులు లెక్కపెడితే ఒక చెయ్యి వేళ్ళు కూడా పూర్తిగావు అంటే మా యిద్దరి మధ్య కాపురం ఎంత సామరస్యంగా గడిచిందీ అర్ధం చేసుకోండి."
