Previous Page Next Page 
ది సెల్ పేజి 17


                                    రవి కిరణ్
    
    పవిత్ర దేవాలయ వాతావరణానికి మారుపేరుగా ప్రశాంతంగా వుండవలసిన ఆ కళాశాల ఆవరణ కొద్ది నిమిషాలలో రణరంగంగా మారిపోయింది.
    విద్యార్ధులలో రెండువర్గాలవారు ఆవేశంతో సోడా బుడ్లు విసురుతున్నారు. నల్లని తారురోడ్డు పగిలిన సీసాముక్కలతో నిండిపోయింది. సోడాబండి ఖాళీ అయిపోయింది. భావితరానికి మార్గదర్శకులై భారతదేశ ఉజ్వలభవిష్యత్తుకు బాటలువేస్తూ విజ్ఞాన సముపార్జనకై కలంపట్టవలసిన చేతులు రోడ్డుప్రక్కన వున్న కంకరరాళ్ళను పట్టాయి. తోటి విద్యార్ధులు రాళ్ళు విసురుతుంటే విద్యార్ధి నాయకులూ దూరంగా ఉన్న స్కూటర్లపై కూర్చుని వారి వారి అనుయాయుల బలప్రతాపాలను చూస్తున్నారు.
    అంతలో పోలీసు జీప్ అక్కడికి రావటం, పోలీసులు అక్కడ చేరిన విధ్యార్ధులపై లాఠీచార్జీ చేయటం జరిగింది.
    విద్యార్ధులంతా చెల్లాచెదురై కాళ్ళకు బుద్దిచెప్పగా దూరంగా వుండి అల్లర్లకు కారకులైన విద్యార్ధినాయకులను కస్టడీలోనికి తీసుకున్నారు పోలీసులు. తిరిగి అక్కడ వాన కురిసి వెలిసినట్లయి ప్రశాంత వాతావరణం ఏర్పడింది.
    జీపులో నుండి హుందాగా దిగాడు ఏ.యస్.పి. కిరణ్. సోడాబుడ్లు పగిలిపోయి కళ్ళలో నీరుబుకుతుండగా సోడాబండి పట్టుకుని నిలబడివున్న రవివంక చూసాడు కిరణ్. మనసు ఒక్కసారి గతంలోనికి పరుగుతీసింది.
    .....ఎలక్షన్స్ వచ్చాయి. అవి పార్లమెంటు ఎన్నికలుగాని, అసెంబ్లీ ఎన్నికలుగాని, పంచాయతి ఎన్నికలుగాని కావు, చదువుమీదకన్నా విద్యార్ధులు ఎక్కువ శ్రద్ద చూపుతున్న కాలేజీ ఎలక్షన్లు. ఇరు పక్షాల మధ్య హోరాహోరీగా ఎన్నికల ప్రచారం జరుగుతున్నది. పోలింగ్ తేదీకి చాలారోజుల ముందుగానే చదువుకు స్వస్తిచెప్పి, క్లాసులకు గైరుహాజరయి ఎవరి అభ్యర్ధిని వారు గెలిపించుకోవడానికి పాటుపడుతూ ప్రచారం చేసుకుంటున్నారు.
    కిరణ్ ఇంతకు ముందు ఎన్నడు ఎన్నికలలో పాల్గొన లేదు. ఎంతో కష్టపడి అతికష్టము మీద తనను చదివిస్తున్న తన తల్లిదండ్రుల కలలు పండించాలనే తపన, తన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తన తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలనే పట్టుదల ఒకవేపు, తను ఏ లక్ష్యంతో కాలేజీకి వచ్చాననే ఆలోచనతో చదువే ధ్యేయంగా భావించటం తప్ప మరో ధ్యాస లేదు కిరణ్ కు.
    కిరణ్ కాలేజీ ఆవరణదాటి రోడ్డుమీదకు వచ్చాడు. బయటి ప్రపంచము చూసి ఆశ్చర్యపోయాడు. ఏదో తనతోటి విద్యార్ధులు తనని కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ నాయకుడిగా పోటీకి నిలబెట్టారు. కాలేజీ ఎన్నికలు సామాన్యంగా, ప్రశాంతంగా జరుగుతాయని భావించాడు కాని ఇప్పుడు తన వెనుక నున్న విద్యార్ధులను చూసి, తన మీద వాళ్ళ నమ్మకానికి ఆశ్చర్యపడ్డాడు. తనమీద వాళ్ళకెందుకు ఇంత అభిమానము? తనుగెలిచి వాళ్ళకు ఏమి చేయగలడు? తోటి విదార్దుల ప్రమేయంతో కాదనలేకపోయాడు. ఇప్పటి పరిస్తితి చూస్తుంటే ఇది ఏ పరిణామానికి దారితీస్తుందో అంతు చిక్కట్లేదు. గత వారంరోజులుగా తనను బలపరుస్తున్న విద్యార్ధులు క్లాసులు మాని తన గెలుపుకోసం కృషి చేస్తున్నారు. డిగ్రీ ఆఖరు సంవత్సరం చదువుతున్న విద్యార్ధులు, పరీక్ష ఫెయిలయితే మూడు సంవత్సరాలుగా చదివినదంతా వృధా అయిపోతుంది. పోష్టు గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకే ఉద్యోగాలు లేక బాధపడుతున్న ఈ రోజులలో విద్యార్ధులు అమూల్యమైన కాలాన్ని వృధా చేసుకుంటే నష్టపోయేది ఎవరు? విద్యార్ధులే. తన కుతానే జవాబు చెప్పుకున్నాడు.
    విద్యార్ధి వర్గాలమధ్య వాదం చెలరేగింది. కిరణ్ కు పోటీగా నిలబడ్డ రవి చాలా దూకుడుగా కిరణ్ దగ్గరకు వచ్చాడు." కిరణ్! నేను ఇప్పుడు ఐదువేలు ఖర్చుపెట్టాను. ఏమీ ఖర్చుచేయకుండా చదువులో నీకున్న గ్లామరుతో గెలుద్దామని ఆశపడుతున్నావేమో? ఒకవేళ ఈ ఎన్నికలలో నేను ఓడిపోతే రక్తపాతం జరుగుతుంది. నాకు పోటీగా నిలబడ్డ మీ అందరి అంతు తేలుస్తాను" అని బూతులు తిడుతూ రవి వెళ్ళి పోయాడు.
    కిరణ్ క్షణంసేపు ఖిన్నుడయ్యాడు. ఇప్పటికి ఐదువేలు ఖర్చుపెట్టాడా? ఆశ్చర్యం! ఎందుకోసం? ఎవరిని ఉద్దరించడానికి? ఛ ! ఛ ! ఈ ఎన్నికల ప్రభావం ఎంత విపరీత పరిణామానికి దారితీస్తుందో?
    రెండువర్గాల మధ్య ఘర్షణ మొదలయింది. ఇక జరగబోయే మారణహోమాన్ని ఊహించుకుంటు క్షణంలో ఒక నిర్ణయానికి వచ్చి ప్రిన్సిపాల్ గారి దగ్గరికి పరిగెత్తాడు కిరణ్. కిరణ్ ఆవేదనను గ్రహించిన ప్రిన్సిపాల్ గారు మరుక్షణంలో కిరణ్ పోటీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు మైకులో ఎనౌన్స్ చేశారు. కోపతాపాలు చల్లారాయి. ఆవేశం అణగారింది. కిరణ్ యధాస్థితి తన చదువులో లీనమైపోయాడు. ఓ విద్యార్ధి ఒక లెక్చరర్ ని తిట్టి అసభ్యంగా ప్రవర్తించి నందుకు ఆ విద్యార్ధిని కాలేజీనుండి సస్పెండు చేసారు. ఇది అన్యాయం అని సమ్మె ప్రకటించాడు స్టూడెంట్సు యూనియన్ నాయకుడైన రవి. ఇక ఒక దాని వెంట ఒకటి కాలేజీ ఫీజులు తగ్గించమని, సిలబస్ తగ్గించమని, కంపల్సరీ అటెండెన్సు తీసి వేయమని, పరీక్షలు వాయిదా వేయమని. ఆందోళనలు అలజడులు లేని రోజులంటూ లేవు. అయినదానికి, కానిదానికి ఉద్యమాలంటూ అలజడి రేపుతున్నాడు రవి. ఇంతలో ఆఖరు సంవత్సరం పరీక్షలు వచ్చాయి. పోలీసు బందోబస్తుతో పరీక్షలుజరుగుతున్నాయి. ఒకవైపు చదవకపోవటం వల్లన, మరోవైపు కాపీలు కొట్టేందుకు తన ఆటలు సాగక, సిలబస్ తగ్గించలేదని, లెక్చరర్లు సరిగ్గా చెప్పలేదని, పరీక్షలు వాయిదా వేయలేదని కాలేజీ బయట ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు రవి. మరుక్షణంలో ఆత్మహత్యా ప్రయత్నంగా నేరం క్రింద అరెస్టు చేసి పోలీసులు రవిని తీసుకుపోయారు. ఈ నేపథ్యంలో పరీక్షలు ఎలాగో జరిగాయన్పించాయి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాక పట్టుదలతో చదివి, పోటీ పరీక్షలలో నెగ్గి ఐ.పి.యస్.లో సెలెక్టు అయ్యాడు కిరణ్. కాని రవి రెండింటికీ చెడిపోయాడు. ఎవరూ అతని అతీగతీ పట్టించుకోలేదు. డిగ్రీ చేతికిరాక రవి కాలేజీ నుండి బయటపడ్డాడు. కొద్దినెలల తరువాత వాళ్ళ కుటుంబం ఆస్తులు పంచుకుని విడిపోయింది రవి వాటాకు వచ్చిన ఆస్తి అతని చిల్లరమల్లర తిరుగుళ్ళకు హారతి కర్పూరంలా అయిపోయింది. కాండక్టు అటు కాలేజీలోను, ఇటు పోలీసు రికార్డులోను బాగోక తనకు ఏ ఉద్యోగము రాదని తెలుసుకున్నాడు. వేషభాషలు, ఆపేరు మార్చినా ఏ పని దొరకక చివరకు ఓ బడ్డీకొట్టు ఆసామిని బ్రతిమాలి ఓ సోడాబండి సంపాదించాడు. అలా జీవనం గడిచిపోతున్నది రవికి.
    మూడు సంవత్సరాల నాటి జ్ఞాపకాల తెరలనుండి బయటపడ్డాడు కిరణ్. "సార్ నాసోడాలు సార్. ఒక్క సీసా కూడా మిగల్చకుండా అన్ని పగులగొట్టారు సార్!" అని అంటుంటే రవి కళ్ళంట నీళ్ళు కారాయి. కిరణ్ కళ్ళజోడు, హేట్ తీసేసరికి రవి గుర్తుపట్టాడు. నాటి హీరోని నేటి జీరోని. ఇదంతా స్వయంకృతం. క్రిందాపయినా కనపడక ఆ రోజు పనికిరాని పదవికోసం పదివేలు ఖర్చుపెట్టినందుకు ఫలితం నేడు పావలాకు సోడా లమ్ముకోవడం. కిరణ్ ఐ.పి.యస్. సాధిస్తే తను సాధించిన టైటిల్ "ఏయ్! సోడా" ఆ రోజు ఎన్నికలలో తనే విత్ డ్రా అయి చదువు పూర్తిచేసి వుంటే కనీసం ఐ.పి.యస్. లేకపోయినా చిన్నదైనా గౌరవ ప్రదమైన ఉద్యోగం దొరికేది. ప్రతి కాలేజీ చరిత్రలో తనలాంటి హీరోలుంటారనడానికి తనే నిదర్శనం,....ఆరోజు కాలేజీ ముందు జరిగిన ఇరువర్గాల మధ్య ఘర్షణకు రవి మనసు మూగగా రోదించింది.
    స్టూడెంట్స్ నాయకులిద్దర్ని కిరణ్ జీపులోకి ఎక్కించాడు. బహుశా ఇద్దరూ బాగుపడతారన్న దృష్టితో నేమో? పోలీసుల జీపులు వెళ్ళిపోతుంటే తృప్తిగా నిట్టూర్చాడు రవి. ఇక ఆ కాలేజీ ఎన్నికలలో తనలాగ సర్వస్వం పోగొట్టుకుని నిర్భాగ్యులుగా ఎవరు మిగలరని.
    
                                      * * *   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS