చీకట్లో చిరుదివ్వె
ఆరోజు దీపావళి. అమావాస్యరోజు. సాయం సమయము.
సన్నగా తుంపర పడుతుంటే మందుసామాన్లు కాల్చేందుకు తొందర పడుతున్నారు కలవారి పిల్లలు. వాళ్ళు కాల్చేవి చూసి ఆనందపడాలని ఎదురు చూస్తున్నారు లేని వాళ్ళ పిల్లలు.
ఇద్దరి మొర ఆలకిన్చినట్లుగా వర్షం తగ్గిపోయింది. కాసేపటిలో ఇళ్ళన్ని ప్రమిదల వెలుగుతో నిండాయి. పట్టుచీరల గరగరలతో హడావుడి పడుతున్నారు అటుఇటు తిరుగుతూ ప్రమిదలు. ఊరందరికీ పండుగైతే నాకు ఊపిరిసలపనంత పని పెంచిన రోజది. పోలీసు ఆఫీసరుగా నా స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలు కాపాడటం నా బాధ్యత.
ఇంట్లో నా శ్రీమతి, అబ్బాయి రవి నాకోసం ఎదురు చూస్తుంటారు. ప్రతిపండుగనాడు వాళ్ళతో కలిసి భోజనం చేద్దామనుకుంటాను. ఇవ్వాళ కూడా అంతే. కాని నేను బయటకు వెళ్ళక తప్పదు. నా ఒక్క కుటుంబం ఆనందం కన్నా పౌర శ్రేయస్సు ముఖ్యం కదా! నేను స్టేషన్ కు వెళ్లేసరికి కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ళు దిగులుగా కూర్చుని వున్నారు. వాళ్ళు అలా వుండటానికి కారణం నాకు బాగా తెలుసు. ఆరోజు భార్య, బిడ్డలతో గడపాలని, వాళ్ళతో భోజనం చేయాలనీ అనుకోవడం సహజమే. కానీ పోలీసు డిపార్టు మెంటులో పండగలు పబ్బాలు చేసుకోవాలనుకున్నా ఎక్కువగా వీలుకాదు. డ్యూటీ ఎప్పుడు వుంటుందో చెప్పలేము రాత్రి, పగలు, ఆదివారం, పండుగ అంటూ ఏమీ లేదు. వాళ్ళలో ఒకడిగా వాళ్ళ బాధ నేను అర్ధం చేసుకున్నాను. "మీ అందరి బదులు ఇవ్వాళ నేను నైటుగస్తీ తిరుగుతాను" అని నైటుగార్డులని మినహా మిగతా వాళ్ళని పంపించేసాను పండుగ చేసుకోమని.
నేను ఒంటరిగా బయలుదేరాను. బీదా బిక్కి, ఉన్నవాళ్ళు అనకుండా ఎవరి స్థోమతకు తగ్గట్లు వాళ్ళు బాణసంచా కాలుస్తున్నారు. చెవులు గింగురుమంటున్నాయి. తారాజువ్వలు నెత్తిమీద పడతాయా అన్నట్లుగా తలల మీదుగా పరుగులు తీస్తున్నాయి. కాలుకదిపితేచాలు నిప్పు రవ్వలు పడుతున్నాయి. అయినా తిరగక తప్పదు.
సిసింద్రీలు, పిచ్చుకలు, ఎగిరే తారాజువ్వలు, రంగులు వెదజల్లే చిచ్చుబుడ్లు, ఢాం మనే సీమ టపా కాయలు చెవులు హోరెత్తించే తాటాకు టపాకాయలు, వీధివీధి తిరిగాను. ఎక్కడా గొడవలు లేవు. ప్రశాంతంగా ప్రజలు పండుగ చేసుకోవాలనుకుంటున్నారు. శాంతిభద్రతలు కాపాడే నాబోటి అధికారికి అంతకంటే కావల్సింది ఏముంది!
తిరగడంలో బాగా అలసిపోయాను. నిద్రముంచుకొస్తున్నది. ఎక్కడైనా కాస్త టీ దొరుకుతుందేమోనని చూసాను. కాని పండుగ అవడమువలన హోటల్సన్నీ మూసివేసున్నాయి. ఇంటికి వెళ్ళి తిరిగి వద్దామనుకుంటే చాలాదూరం. తిరిగి వచ్చేలోగా ఏమైనా జరుగుతే? మనసు ఒప్పుకోలేదు. ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నాను.
దూరంగా ఎవరివో ఏడ్పులు వినబడుతున్నాయి. నా వళ్ళు ఒక్కసారి జలదరించింది. పండుగరోజున పెళ్ళాం, పిల్లలసంగతి పట్టించుకోకుండా వీధి, వీధి తిరిగి శాంతి భద్రతలు నెలకొల్పే నా ప్రయత్నం ఏమయినట్లు.
అప్రయత్నంగానే బుల్లెట్ అటుపోనిచ్చాను. అప్పటికే అక్కడ జనం గుమిగూడి వున్నారు. నన్ను చూసి ప్రక్కకు తప్పుకుని దారి ఇచ్చారు. అక్కడి దృశ్యం చూడలేక పోయాను. ఆ ఇంటిముందు రోడ్డుమీద ఒక ఆరేళ్ళ పాప వళ్ళంతా కాలిపోయి పడివుంది. హెడ్ కానిస్టేబుల్ ఖాన్ తన పాపమీద పడి గోడుగోడున ఏడుస్తున్నాడు.
ఎవరో తారజువ్వలు విసరగా ఈ పాపమీద పడి ఒళ్ళు కాలిందని అక్కడివాళ్ళు చెప్పారు.
"కాదుసార్! నా కూతురు కాకరపువ్వొత్తులు కాలుస్తుంటే ప్రమాదవశాత్తు గౌను అంటుకుంది" అన్న ఖాన్ మాటలకూ అక్కడ చేరిన జనంతో పాటు క్షణంసేపు నేను కూడా ఖిన్నున్ని అయ్యాను. అది నిజం కాదని అందరికి తెలుసు. అసలే పాతబస్తీ అంతా మతకలహాలతో కుతకుత లాడి ఇప్పుడే కాస్త సద్దుమణిగింది. పాప మీద జరిగిన అఘాయిత్యాన్ని బహిరంగంగా చెప్తే తిరిగి అరాచకత్వం విజ్రుంభిస్తుంది. మళ్ళీ మతకలహాలు రేగి మరిన్ని ప్రాణాలు పోతాయి.
"ఏం చేసినా .... చనిపోయిన నాపాప తిరిగిరాదు ... అల్లర్లు ఆగడాలు తప్ప. పాపచావు మరిన్ని చావులకు దారి తీయకూడదు" మనసులోనే అల్లాకు మొరబెట్టుకుంటున్న ఖాన్ అప్పుడు రామ్, రహీం, జీసస్ లా కనబడ్డాడు నా కళ్ళకు.
* * *
