ట్రీట్ మెంట్
"సిష్టర్! ఎనీ మోర్ పేషంట్స్?"
అప్పటిదాకా పేషంట్సుతో ఉక్కిరి బిక్కిరై తీరిక దొరకటంతో విసుగ్గా అడిగాను.
"ఇంకెవరూ లేరు సార్"
నర్స్ అనగానే క్లినిక్ నుంచి బయటకు రాబోయాను.
అంతలోనే "డాక్టర్..." అంటూ పిలిచాడు ఓ మనిషి గబగబా వస్తూ. అతని వెనుక ఓ స్త్రీ వుంది. ఆమె శూన్యం లోకి చూస్తోంది.
"...మీకు శ్రమ యిస్తున్నందుకు క్షమించండి. నా కోసం కొన్ని నిముషాలు ఓపిక పట్టలేరా? వైద్యం కోసం కాదు కేవలం సలహా కోసం" సంశయిస్తూ అడిగాడతను.
అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలని నేను కన్సల్టింగ్ రూమ్ వైపు వెళుతుంటే అతను నన్ను అనుసరించాడు. ఆమె బయటే ఉండి బెదురు చూపులు చూస్తోంది.
"....డాక్టర్ నేను క్రిందటేడు మీ దగ్గర ఆపరేషన్ చేయించుకున్నాను. నా భార్య కిప్పుడు మూడోనెల. అదెలా సాధ్యం? ఇలా జరగడానికి వీలుందా?" చెప్పి నిట్టూర్చాడతను.
కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. నా బుర్ర చురుగ్గా, పనిచేయటం ప్ర్రారంభించింది. అతని సంశయం, అతను పడుతున్న మానసిక బాధ నాకర్ధమయ్యింది. ఆ పరిస్థితుల్లో అతడామెనెలా హింసిస్తాడో కూడా అంచనా వెయ్యగలిగాను.
నా సలహామీదే ఒక పచ్చని సంసారం మనుగడ ఆధారపడి వుంది. నా గుండె బరువెక్కింది. ఏం చెప్పి ఆ కుటుంబాన్ని రక్షించాలో అర్ధంకాలేదు. నా వైద్య ప్రావీణ్యాన్ని కాదనాలా? లేక అతని భార్య శీలాన్నే కించపరచాలా! ఒకవేపు నా ప్రాక్టీసు, మరోవేపు "డాక్టర్ ... రక్షించండి" అన్నట్లున్న ఆమె జాలి చూపులు-ఎటూ చెప్పలేని పరిస్థితిలో పడ్డాను. అయినా పరీక్ష చేయాలి. అతను నా పేషంటు లేకపోతే అతను మరో డాక్టర్ దగ్గరికి వెళ్ళే ప్రమాదం ఉంది.
చాలాసేపు పరీక్ష చేసాను. ఓ నిర్ణయానికి వచ్చాను.
"ఆపరేషన్ లో లోపం ఉంది. దోషం మీ భార్యది కాదు మీ పచ్చని సంసారం నాశనమవుతుంటే నా ప్రతిష్ట నా ప్రాక్టీసుకోసం నిజాన్ని దాచలేను. ఆమెపై లేని పోని అపోహలేమి పెట్టుకోవద్దు. మీ సంసారం చక్కదిద్దుకోండి" అన్నాను.
అప్పటికే ముగ్గురు పిల్లలకి తండ్రి అతడు. నాలుగో బిడ్డ కావాలనుకోలేదు. అందుకే ఆమెకి ఎబార్షన్ అతనికి ఆపరేషన్ సరి చెయ్యడానికి తేదీలు నిర్ణయించాను. అతడు సంతృప్తిపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఆమె నా దగ్గరగా వచ్చి కృతజ్ఞతతో నమస్కరించింది.
"మరోసారి ఇలా జరిగితే నిన్నిక ఆ దేవుడు కూడా రక్షించలేడు" అని మెల్లిగా ఆమె భర్తకి వినిపించకుండా అన్నాను. వెనువెంటనే ఆమె కళ్ళవెంట కన్నీటిని చూశాను. ఇక మీదట ఆమె మారుతుందనుకోవటానికి అది నిదర్శనం అనిపించింది నాకు.
* * *
