మిస్ మార్లిన్ ను వారిమధ్యకు తీసుకువెళ్ళాలి అనుకున్నాను.
తెల్లవారింది. నేను చేసే శ్రమ ఫలితానికి వచ్చే సమయం యిది.
నేను రోజూకన్నా ముందే నా ఆఫీసుగదికి వెళ్ళాను. మిస్ మార్లిన్ తో నేను మాట్లాడవలసింది అంతా గుణించుకుంటూ, ఆమె వుండబోయే స్థితిని వూహించుకుంటూ కూర్చున్నాను.
డ్రైవర్ని పిలిచి నాకు తెలిసిన ఒక డాక్టర్ దగ్గరకు పంపాను. అతను వెళ్ళగానే ఫోను యెత్తి ఆ డాక్టర్ని పిలిచి పరిస్థితి వివరించి చెప్పాను. డ్రైవర్ ద్వారా స్మెల్లింగ్ సాల్ట్ పంపవలసింది అని అడిగాను. ఒకవేళ మిస్ మార్లిన్ తీవ్రమయిన అనుభూతులకు గురి అయి వాటికి తట్టుకోలేని స్థితికి వస్తే వుపయోగిస్తాయి.
డాక్టరు దగ్గర మత్తు యింజక్షన్లు సిద్దపరచి వుంచవలసిందని అడిగాను. నా యేర్పాట్లు అన్నీ పూర్తి అయినాయి. యిక మిస్ మార్లిన్ కోసం యెదురుచూస్తూ కూర్చున్నాను. క్షణాలు దొర్లిపోతున్నాయి.
ఆరోజు రాజమాతను కాని రంగారావుగారిని కాని కలుసుకునే వీలుండదు. వాళ్ళు వ్రతంలో వుంటారు. పాతకోటలో 'బోనాలు' వుంచేందుకు కొంతమంది వెళ్తున్నారు యిహ వేళ అయింది.
నేను సిద్దంగా వున్నాను మిస్ మార్లిన్ రాకకోసం యెదురుచూస్తూ.
మిస్ మార్లిన్ గబ గబా మెట్లుదిగి నా గదిలోకి వచ్చింది. ఆమె ముఖం యెర్రగా కందిపోయి వుంది. కళ్ళు నిప్పులు చిమ్ముతున్నాయి. కాలికి చెప్పులు లేవు. పెద్ద పెద్ద అంగలువేస్తూ గదిలోకి వచ్చింది.
ఇటువంటి స్థితి నేను వూహించిందే కనుక చలించకుండా లేచి నుంచున్నాను. ఆమె సరాసరి వచ్చి నన్ను ప్రక్కకు తోసి కుర్చీలో కూర్చుంది. నా యెదురుగా వున్న ఆమె మిస్ మార్లిన్ అని నాకుకూడా అనిపించలేదు. మహాదేవి మల్లమ్మే అనిపించింది.
5
నేను యేమీ మాట్లాడకుండా కళ్ళు అప్పగించి చూస్తున్నాను. ఆమె ఆ గదిలో వున్నా నన్ను కాని: లేక మరే యితర వస్తువుని కాని చూస్తున్న రవి నాకు అనిపించలేదు. ఎటో చూస్తోంది. ఆమెకు కన్పించే దృశ్యాలేమిటో నా వూహకు అందలేదు. వుచ్చ్వాస నిశ్వాసాలు దీర్ఘంగా వున్నాయి వట్టి బలవంతాన వూపిరి పీలుస్తున్నట్లుగా అనిపిస్తోంది.
చివరకు యెలాగో ధైర్యం కూడదీసుకుని 'మహాదేవి!' అని పలకరించాను మొదట పిలుపు ఆమెకు అందలేదు. యింకొకసారి పిలిస్తే నావంక చూచింది. రాణికి వుండవలసిన ఠీవితో అలవోకగా చూచింది.
"దామెర్ల ధర్మారాయుడు బాబాయిని పిలువు" ఆజ్ఞాపించింది.
"బాలకవి బొబ్బిలి వచ్చారట. వారిని చూచేందుకు బాబాయి వెళ్ళారు" అన్నాను.
"బాలకవి వచ్చారా? యెప్పుడు?" అడిగింది మిస్ మార్లిన్ ఆశ్చర్యంతో.
"రంగారావుగారిని చూడవచ్చారట" అన్నాను.
"విమలాంగీ పరిణయం పూర్తి అయిందా?" అని అడిగింది మిస్ మార్లిన్.
అదిరిపడ్డాను యీమె మిస్ మార్లిన్ కాదు. మహాదేవి మల్లమ్మ అని నాకు అనిపించింది. అనుమానం తీరిపోయింది.
బాలకవి అసలు పేరు కొట్ర వెంకటేశ్వర్లు వారికి బొబ్బిలిరాజులు 'యిల్లంరాజుల వలన' గ్రామాన్ని అగ్రహారంగా యిచ్చారు. బాలకవి అక్కడే వుంటారు. ఆ వూరు రాజాముకి దగ్గర. అప్పుడప్పుడూ బొబ్బిలి వచ్చి రాజును పరామర్శించటం కవి కుటుంబానికి ఆనవాయితీ. ఆయన మాంధాత విమలాంగిల ప్రేమకధ పెళ్ళిగా పరిణమించటాన్ని కార్యంగా వ్రాశాడు. యీయన అడిదము సూరకవికి సమకాలికుడు. అడిదము సూర కవి విజయనగర కవి. ఆస్థానకవి అని చెప్పటానికి కూడా ఎన్నో ఆధారాలున్నాయి.
బాలకవి గురించి అతని సమకాలికులైన సూరకవి గురించి, సత్య వరంలో రాజ్యం చేస్తున్న కాకర్లపూడి గోపాలరాయల దగ్గర కవిత్వం చెప్పిపొట్టపోసుకుంటున్న సోమప్పకవి గురించీ నేను చదివాను. వారిలో బాల కవి గురించీ, ఆయన వ్రాసిన విమలాంగీ పరిణయం గురించీ మాట్లాడుతోంది మిస్ మార్లిన్. వాటె వండర్!
ఆమె మల్లమ్మదేవి కాదని యెట్లా అనుకోను?
"ఇనుగంటి నరసారాయుడు మహామంత్రిని పిలిపించండి" అని అడిగిందామె నేను సమాధానం యివ్వకుండా ఆలోచనలో పడటం చూచి.
నేను యెలా చెప్పను? వారంతా చనిపోయి యిప్పటికి రెండు వందల యిరవై మూడు సంవత్సరాలు అయిందని చెప్తే ఆమె తట్టుకొనగలుగుతుందా? అని ఆలోచిస్తున్నాను.
తట్టుకోలేదని చెప్పకుండా ఊరుకుంటే ఆమె 'తల తీయిస్తా' అంటోంది యీ కధని యెట్లా మలుపు తిప్పుకుపోవాలి. నాపని కత్తిమీద సాము అయింది. కత్తి అంచున నడవటం అయింది.
అప్పుడప్పుడే వీరంగాలు, డప్పులూ ధూపాలు ప్రారంభం అయినాయి. వాకిట్లోంచి విన్పించే డప్పులమోత ఆమెకు మరింత వుద్రేకాన్ని యిస్తోంది. ఆమెకిప్పుడు వెంగళరాయుడు పెళ్ళి గొడవ పట్టింది.
నాకు చరిత్ర పిచ్చిపట్టింది ఆమె గొడవకోసం ఆమె, నా పిచ్చి కోసం నేనూ ఒకర్ని ఒకరు విడిచిపెట్టకుండా కూర్చున్నాం రోడ్డుమీద జక్కులవాళ్ళ పాటలు విన్పించినాయి.
వాళ్ళు మల్లమ్మదేవి గురించి పాడుతూ వుంటే అది విని మిస్ మార్లిన్ కుర్చీలోంచి లేచి రోడ్డుమీదికి పరుగెట్టింది.
వెంట నేనూ వెళ్ళాను పాతకోట చేరాక జక్కులవాళ్ళ కధ తారస్థాయికి వచ్చింది మల్లమ్మదేవి మంటల్లో కాలిపోతున్న దృశ్యం అది. మిస్ మార్లిన్ ఆ ఘట్టం విని వాళ్ళమీద విరుచుకుని పడింది.
