వాళ్ళు భయంతో బెదిరిపోయారు.
మల్లమ్మదేవికి చాలామంది బోనాలు పెట్టుకుంటున్నారు. బలులు యిస్తున్నారు. మిస్ మార్లిన్ ఆ ప్రదేశాన్ని గుర్తుపట్టింది.
తాను యెక్కడెక్కడ యేమేమి చేసిందీ వివరించి చెప్తోంది. ఆమె మాటలకు యెదురు చెప్పకుండా సాయంత్రం వరకూ ఆమె వెంట తిరిగాను. ఆమె చెప్పేదంతా గుర్తుపెట్టుకుంటున్నాను.
చీకటి పడింది బాగా ప్రొద్దుపోయింది. అయినా ఆమెకు ఆ చోటు వదిలిపెట్టాలన్న ధ్యాసలేదు. వుదయంనించీ నిరాహారంగా వుండటంనించి ఆకలి దంచుతోంది. ఆ ప్రాణికి ఆకలిదప్పులు తెలియటల్లేదు.
ఆకాశంలో చుక్కలు మెరుస్తున్నాయి. జరీపూలు కుట్టిన నల్ల దుప్పటిలా వుంది ఆకాశం. అక్కడ యే నదురూ బెదురూ లేకుండా ఆమె ఓక్కు బిక్కుమంటూ నేను తిరుగుతున్నాం.
మిస్ మార్లిన్ చివరకు ఒకచోట కూర్చుంది. కాళ్ళు పీకుతూ వుండటంనించి నాకూ కూర్చోవాలని వుంది.
అక్కడ కూర్చున్న మరుక్షణంనించీ మిస్ మార్లిన్ బిగ్గరగా యేడుస్తోంది.
"ఇక్కడే......యిక్కడే......నా బిడ్డను.....చైనా వెంకటరాయుడిని.....దేవులపల్లి పెద్దన్నకు యిచ్చి సామర్లకోటకు పంపాను. నా బిడ్డ యేమయ్యాడు? నా చెల్లి జగ్గమాంబనించి యింకా కబురు అందలేదు. యెందుకని? యుద్ధం యేమయింది? అయ్యో అంతా సర్వనాశనం అయింది. ఆడతనం అవమానించబడింది. గోపాలస్వామి ఆలయాన్ని కోటలోనే కట్టుకుని పూజించావే! యిదా ఆ స్వామి నాకు యిచ్చిన కానుక. అసలు యేమయింది? నేను మల్లమ్మదేవిని కానా? యెందుకు నాకిలా అంతా అయోమయంగా వుంది. ఏమిటిదంతా?" అని అరుస్తోంది. ఏడుస్తోంది.
నేను ఆమెనించి రాబట్టదలుచుకున్నది యేమయినా వుంటే అందుకు యిదే సరిఅయిన సమయం! యిహ కాలాన్ని వృధా చెయ్యకూడదు.
"మహాదేవి మల్లమ్మా!" అంటూ పల్కరించాను.
"ఏమిటి? యేమిటిదంతా? నేనెవరిని?" ఆమె అడుగుతోంది.
"మల్లమ్మదేవి మళ్ళీ పుట్టింది మిస్ మార్లిను" అన్నాను. ఆమె కళ్ళలోకి సూటిగా చూచాను. ఆ నీలికళ్ళ వెనుక కదలాడుతున్న నీడలు, వాటి వెనుకవున్న అర్ధాలు యెన్నో కన్పించినాయి.
"అయ్యో భగవంతుడా? ఏమిటిదంతా? నాకేమయింది?" ఆమె ఏడుస్తోంది. అయోమయంగా చూస్తోంది.
"విజయరామరాజు కన్పిస్తున్నారా?" అని అడిగాను.
అంత యేడుపూ క్షణంలో మాయమైపోయి ఆ చోట్లో పౌరుషమూ, ప్రతీకారమూ కన్పిస్తున్నాయి నానా మాటలూ అంది.
"పరాసు ప్రభువుం తొత్తు. అతడు కన్పిస్తే కత్తికి ఒక కండగా చీల్చివేస్తాను" అంటూ వుగ్రమూర్తి అయింది మిస్ మార్లిను.
"ఆ పనిని మీ తాండ్ర పాపారాయుడు అన్నయ్య యెప్పుడో పూర్తిచేశాడు. శాంతించండి" అన్నాను.
ఈ మాట వినగానే ఆమెకు చాల సంతోషం అయింది. "అవును మా అన్నయ్య వుపాయశాలి. అవుసరమనుకున్న క్షణంలో యెంత దుస్సాహనమయినా చెయ్యగలిగినవాడు విజయరామరాజు విదేశీయుడు. యెక్కడ బుందేల్ ఖండ్ నించి వచ్చిన బొందిలీ! అతడికి ఆశ్రయించటం కాక పరాక్రమం యెక్కడనించి వస్తుంది?" అని అంటోంది.
అది ఆ రోజుల్లో బొబ్బిలివారి గురించి వున్న ఒక అపోహ. అయినా మిస్ మార్లిను శాంతించినందుకు నాకు ఆనందమే అయింది. నేను దానిని ఖండించలేదు.
"రేగులవాక ప్రభువుల పూర్వీకులు అలా వచ్చారా?" అని అడిగాను.
"అవును కళింగదేశానికి వచ్చిన తొట్ట తొలిబొందిలీ విజయభూప్ అనే పేరుగలిగిన వ్యక్తి ఆ తర్వాత వచ్చిన వారసుల్లో విజయరామరాజు లాగ ఆశ్రయించే తత్త్వం కలిగినవాళ్ళు యెవరూ లేరు. బొబ్బిలి సిరి సంపదలు చూచి అతనికి కళ్ళు కుట్టినాయి" అన్నది ఆమె.
నేను నవ్వాను.
"గోదావరినించి కటకం వరకూ విస్తరించిన కళింగప్రభువు యిరవై చదరపుమైళ్ళు పరిపాలించే బొబ్బిలివాళ్ళని చూచి యెందుకు అసూయపడాలి?" అన్నాను. బొబ్బిలి కధ వినగానే యెవరికైనా కలిగే అనుమానం యిది.
"అందుకు చాలా కారణాలు వున్నాయిలే బొబ్బిలివారికి గడ్డనీరు కావలసినంత వుంది. వాళ్ళు ఎవరికీ తలవంచకుండా బ్రతుకుతున్నారు. అదీ విజయరామరాజు అసూయ" అంది. గడ్డ అంటే సెలయేరట.
"మహాదేవి మల్లమ్మగారూ! మరి మీ బొబ్బిలి పద్మనాయక ప్రభువుల కుటుంబాలు యిక్కడికి యెలా వచ్చినాయి? మీరు ప్రభువులు యెలా అయినారు?" అని అడిగాను.
"కధ చెప్పమంటావా? వింటావా?" ఆమె నాకేసి చూస్తోంది.
నేను తలూపాను. ఆమె చెప్పటం ప్రారంభించింది. నేను కళ్ళు మూసుకుని వింటున్నాను. నిజంగా మల్లమ్మదేవి చెప్తున్నట్లే ఫీలయ్యాను.
ఆమె చెప్పేది కధలా కాక కళ్ళముందు కన్పించే దృశ్యంలా కన్పించుతోంది. నేను ఆ దృశ్యాల్లో లీనమై చూస్తున్నాను.
* * *
అవి శ్రీకాకుళాన్ని మొగలు ప్రభువుల గవర్నరు షేరు మహమ్మదు ఖాను పరిపాలించే రోజులు. షేరు మహమ్మదుఖాను కర్కోటకుడు.
పది సంవత్సరాల వయసున్న తన కొడుకుని గుర్రంమీద తన ముందు కూర్చోపెట్టుకుని మన్యం అడవుల్లో ప్రయాణం చేస్తున్నాడు షేరు ఖాన్.
అతని వెనుక కొన్నివేల అశ్వికదళం వస్తోంది.
ఆ సైన్యం కిరాతకమయిన పనులు చెయ్యటానికి బాగా అలవాటు పడిపోయి వుంది. వాళ్ళ నాయకుడు షేరు ఖాన్ క్రూరుడు. భారతీయులు ముఖ్యంగా మన్యప్రాంతంలోని అడవులలో నివసించే ద్రవిడ జాతీయులైన కోదు, సవర, కోయజాతివాళ్ళ స్వేచ్చా జీవితం అంటే అతడికి వళ్ళుమండుతుంది. వాళ్ళు నిశ్చింతగా బ్రతికిపోవటం అతనికి కళ్ళలో నిప్పులు పోసింది.
