ఆమెను గాయత్రీదేవిగారి దగ్గరకు తీసుకుపోయాను రాజలదేవికీ అప్పటికి మిస్ మార్లిన్ సంగతి అంతా తెలిసింది కాబోలు. ఆశ్చర్యంతో చూస్తోంది. అప్పటికే రంగారావుగారు టేబిల్ దగ్గర వున్నారు.
మిస్ మార్లిన్ కూర్చోవలసిన కుర్చీ చూపించాను.
పలుక్ నామాలో విచిత్రమయిన డైనింగుహాలు వుంది. పెద్ద డైనింగ్ టేబిల్ కి అటూ యిటూ కలిసి నూటఒక్క కుర్చీలుంటాయి. అది యింగ్లీషు రెసిడెన్సీలకు నవాబు వుస్మాన్ ఆలీఖాన్ విందు యిచ్చే డైనింగుహాలు అందులో ఒక కుర్చీని మరొకచోట వేసి కాస్సేపు అయ్యాక చూస్తే మనం మార్చివేసిన కుర్చీ యేదో పోల్చుకోవటం అసాధ్యం అచ్చులోంచి తీసినట్లు అన్నీ ఒకే విధంగా వుంటాయి.
కాని నవాబుగారి కుర్చీ ఒక్క అంగుళం యెత్తుగా వుంటుంది అదీ ఆ రోజుల్లో వాళ్ళకి సాగిన నవాబు దర్జా.
అలాగే యీ యింట్లోనూ డైనింగు టేబిలు దగ్గర విశేషాలు కొన్ని వున్నాయి తూర్పు ముఖంగా ఒక కుర్చీ పెద్దది వేసి వుంటుంది అందులో రాజమాత కూర్చుంటారు. కుడివైపున మొదట కుర్చీలో రంగారావుగారు కూర్చుంటారు. ఆయనకు కుడి ప్రక్కన ప్రధానమయిన అతిధులు యెవరైనా వస్తే కూర్చుంటారు. రాజమాతకు ఎడమ ప్రక్క వరుసగా ఆ యింటిమీద ఆధారపడి పొట్ట పోసుకుంటున్న బంధువులు అంతా కూర్చుంటారు.
మిస్ మార్లిన్ ప్రధానమయిన అతిధి కనుక ఆమెను రంగారావు గారి కుర్చీకి ప్రక్క కుర్చీలో కూర్చోవలసిందని చెప్పాను.
మిస్ మార్లిన్ కోసం వెస్ట్రన్ స్టయిల్ లో కొన్ని వంటకాలు చేయబడినాయి. డిషెస్ లో సూపు, హైపన్ చికెన్ రైసూ వున్నాయి. సెకింగ్ డెక్ ఫ్రై వుంది. మామూలుగానే రంగారావుగారు తినే భోజనం పాతిక రూపాయల పైన ఖరీదు చేస్తుంది. యివ్వాళ అంతకన్నా ఏర్పాట్లు అధికంగా వున్నాయి. బీదవాడుగా పుట్టి, దరిద్రానికి "తోడు పెళ్ళికొడుక" పెరిగిన నాకు యిది ఆశ్చర్యమే!
నేను హోటలులో తింటే మూడున్నర అవుతుంది. యింట్లో చెయ్యి కాల్చుకుంటే రెండు రూపాయలు అవుతుంది. కాబట్టి యెంత కాదనుకున్నా ఆ ప్లేట్ల గురించి ఆలోచించకుండా వుండలేకపోయినాను.
బ్లడీ మేరీ సీసా రెండు చేతులూ ముందుకు చాచి కౌగిలించుకుంటానంటోంది. అందులో యే ఒక్క వస్తువూ నా నాలుకమీదికి రాలే దెన్నడు. రావాలని నేను కోరుకోను.
కాని వాటి గురించి వివరంగా ఆలోచించటం నా తత్త్వం.
కాస్సేపు అక్కడే నిలబడ్డాను. రంగారావుగారి ప్రక్కన కూర్చుని మిస్ మార్లిన్ అవేమీ అంటుకోలేదు. ఆయన అటువంటి యేర్పాట్లు చెయ్యటం అనవసరం అని నిరూపించింది.
బ్లడీమేరీ సీసా ప్రక్కకు జరిగింది. డిషెస్ గుర్రున మూలుగుతూ అవతలకు నెట్టివేయబడినాయి. బ్రెడ్ టోస్ట్ కు చాకుతో వెన్న రాసుకుంటోంది మిస్ మార్లిన్ తలవంచుకుని.
గాయత్రీదేవి యిద్దరినీ మార్చిచూస్తోంది. ఆమె మనసులోని ఆలోచనలు యేమిటో పరమాత్మకు తెలియాలి. డైనింగు టేబిలు దగ్గరకు వచ్చాక మర్యాదకు ఒక్కసారి నవ్వుతూ పలకరించారు రంగారావుగారు. అంతే వంచిన తల యెత్తలేదు. మళ్ళీ మార్లిన్ వంక చూడనూలేదు.
ఆమె యెటువంటి అరమరికలు లేకుండా వాళ్ళతో కలిసిపోయింది. నేను యిహ అక్కడనించి కదిలాను. నా గదికి వచ్చాను.
డాక్టరుగారు యింకా కూర్చుని యేదో విషయం ఆలోచిస్తున్నారు.
"ఇది విచిత్రమయిన కేసు" అన్నారు నేను వెళ్ళి కూర్చోగానే.
"ఎలా చెయ్యటం మంచిది?" అని అడిగాను.
"ఆమెను నాతో విశాఖను పంపితే కొన్ని పరీక్షలు చేస్తాను. ఆ తరువాత కేసు గురించి అర్ధం చేసుకోవటానికి వీలు అవుతుంది" అన్నాడు.
"అది జరుగుతుందా?" నా అనుమానం చెప్పాను.
"బహుశా ఆమె యిప్పట్లో ఒప్పుకోకపోవచ్చు. సీతాదేవిగారు యిచ్చిన అడ్రసు ప్రకారం ఆమె తల్లిదండ్రులకు వుత్తరం వ్రాయండి. నేను కూడా యీ విషయం హైద్రాబాదుకు వ్రాసి స్పెషలిష్టుల్ని పిలిపిస్తాను" డాక్టర్ వైకుంఠం అలా చెప్పటం నాకు నచ్చింది. రేపు జరిగే బోనాల పండుగకు ఆమె యిక్కడే వుండటం మంచిది అనుకుంటున్నాను నేను.
"ఆమెను యిక్కడనించి కదిలించితే కేసు స్వరూపంలో కొన్ని తేడాలు కనపడవచ్చు యిక్కడే వుంటే ఆమెకు మల్లమ్మదేవిని నేనే అన్న ఆలోచన మరింత దృఢంగా వుంటుంది కాబట్టి ఆమెమీద జరిపే పరీక్షలు యిక్కడే జరపటం మంచిది" అన్నాను.
వైకుంఠం నా సూచన ఒప్పుకున్నారు.
డాక్టర్ వైకుంఠం తిరిగి పోవటానికి నిర్ణయించుకున్నారు. చెక్కు వ్రాసి రంగారావుగారిచేత సంతకం తీసుకుని యివ్వబోయాను. వైకుంఠం గారు తీసుకోలేదు. "యిటువంటి కేసులకు మేం చెయ్యవలసిన వైద్యం యేమిటో యింతవరకూ తెలియదు. అటువంటప్పుడు నేను యేమి చేశానని ఫీజు పుచ్చుకోవాలి" అన్నారు.
ఆయన కేసు వివరాలన్నీ వ్రాసుకుని వెళ్ళిపోయారు.
ఆమెకు మల్లమ్మదేవి ఆత్మస్పర్శ వుండటం నిజమే అయితే బోనాల పండుగకు ఆమె అనుభూతులు అధికం కావాలని నేను అంచనా వేశాను. ఆ సమయంలో చరిత్రమీద నాకున్న అనుమానాలు తీరవచ్చు. నా ప్రశ్నలకు ఆమె సమాధానం యివ్వవచ్చు. అలా జరిగితే నిజమయిన బొబ్బిలి కధ లోకానికి తెలుస్తుంది.
నేను మిస్ మార్లిన్ ని అని మర్చిపోయిన క్షణాల్లో ఆమె ఆనాటి సంగతులు నిరాఘాటంగా చేస్తోంది. అటువంటప్పుడు ఆమెచేత చెప్పించగలిగితే నిజమయిన బొబ్బిలి యుద్ద దృశ్యాలూ, బొబ్బిలివీరుల చరిత్రా తెలుస్తాయి. అటువంటి సమయం వస్తుందా?
ఆ రోజంతా నా ఆలోచనలతో గడిచిపోయింది. తెల్లవారితే బోనాల పండుగ. రాజమాత దీక్షలో వుంటారు. వూళ్ళో అన్ని కుటుంబాలవాళ్ళూ 'బోనాలు' చెల్లిస్తారు. బలులుకూడా యిస్తారు.
డప్పు మ్రోతలూ, వీరంగాలూ, ధూపాలూ యివన్నీ కలిసి యెవరికైనా రవ్వంత వుద్రేకం కలిగేలా వుంటుంది దృశ్యం. ప్రతివారి మనస్సు లోనూ బొబ్బిలి యుద్ద దృశ్యాలే మెదులుతుంటాయి.
