బుర్రా కేవ్స్....
డ్రైవర్ కారును ఓ పక్కగా పార్క్ చేశాడు. విరజవెళ్ళి ఎంట్రెన్స్ టిక్కెట్స్ తీసుకు వచ్చింది.
ఆమె చేతిలోని బుల్లి వీడియో కెమెరాను చూసి "మేడమ్ దీనికి కూడా టిక్కెట్ సెపరేట్ గా తీసుకోవాలి" అన్నాడు కౌంటర్ లో వున్న అతను.
అప్పుడు చూసింది అక్కడ ఉన్న బోర్డు దానిపై కెమెరాలకూ, వీడియో కెమెరాలకు తప్పనిసరిగా టిక్కెట్ కొనవలెనని సారాంశం.
విరజ టిక్కెట్స్ తీసుకొని వచ్చింది.
"నా చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్ లో చదివాను. ఫస్ట్ టైం చూడ్డం" అన్నాడు అభినయ్.
"అందుకే కదా.... ఈ ట్రిప్ లో ఏదీ మిస్ చేసుకోకూడదని, బుర్రా కేవ్స్, అరకూ ప్లాన్ చేసింది" అంది విరజ.
టిక్కెట్స్ తీసుకుని, లోపలికి నడిచారు.
దాదాపు అరకిలో మీటరు వరకూ నడిచేక కేవ్స్ మొదలయ్యాయి. దూరం నుంచే బుర్రాకేవ్స్ ను చూస్తుంటే అబ్బురంగా అనిపించింది.
సహజంగా ఏర్పడ్డ గుహ.
లోపలికి అడుగు పెట్టగానే సిమెంట్ బెంచీ వుంది. "జగదేక వీరుడు అతిలోక సుందరి" యిక్కడే షూట్ చేశారు కదూ" అంది అడిగింది విరజ.
"అవును ఈ ముందు భాగంలో షూట్ చేశారు. శ్రీదేవి, చిరంజీవి కాంబినేషన్ అది".
వీళ్ళు మాట్లాడుకుంటూ వుండగానే ఓ వ్యక్తి వచ్చాడు.
"సర్... నేను ఈ కేవ్స్ మొత్తం చూపించనా?" అడిగాడతను.
"నువ్వు గైడ్ వా?"
"అవున్సార్!"
"సరే....." అన్నాడు అభినయ్.
కేవ్స్ లోపల అంతా చీకటిగా వుండటంతో అతను టార్చ్ లైట్ ఆన్ చేసి "రండి సార్" అన్నాడు.
ఇద్దరూ గైడ్ ని అనుసరించారు. కొద్దిగా లోపలికి అడుగు పెట్టగానే గబ్బిలాల వాసన. వాళ్ళకో సామెత గుర్తొచ్చింది. 'ఇంటిపేరు చూస్తే కస్తూరి.... ఇంట్లో మాత్రం లాల వాసన' అని.
"మొదట్లో ఈ గుహను చూడ్డానికి వచ్చేవాళ్ళకు కాగడాలతో చూపించేవాళ్ళం.
ఈ గుహలోపల కరెంట్ అరేంజ్ మెంట్స్ ఈ మధ్యనే జరిగాయి సర్" అన్నాడు గైడ్.
లోపలంతా చీకటిగా ఉంది. లైట్ల వెలుతురు అంతంత మాత్రమే. ఎంతో గొప్పగా దేశ విదేశాల నుంచి వచ్చే యాత్రికులకు కొద్దిగా నిరాశ పరిచే మెయింటెనెన్స్... ఎక్కడా నీట్ నెస్ కనిపించడం లేదు. ఈ చారిత్రాత్మక గుహను సరైన రీతిలో శుభ్రపరిచి కాపాడ్డం లేదేమోననిపించింది అభినయ్ కు.
సహజంగా ఏర్పడ్డ ఆ గుహ లోపల అనేక ఆకృతులు కూడా అతి సహజంగానే ఏర్పడ్డాయి. అన్నీ అబ్బురంగా తోచాయి. కొన్నిచోట్ల చాలా ఇరుకైన దారి.... గుహలు కావటం వలన అక్కడక్కడ కిందికి వంగి నడవాల్సిందే. మరికొన్ని చోట్ల సహజమైన శిలాకృతి. శివలింగాలు.... సర్పజాతుల తలలు.... ఋషి గెడ్డం... దీపాకృతి.... ఇలా అనేక వింత దృశ్యాలు ఆశ్చర్య చకితుల్ని చేసాయి.
గైడ్ వాటి గురించి, ఆ కేవ్స్ ఏర్పడ్డనాటి సంగతులు చెబుతూనే ఉన్నాడు. పైనుండి ధారగా ఒకచోట నీరు పడుతూ వుంది. ఆ ధారపడ్డ చోట శివలింగాకృతి... లాజిక్ కు అందని విశేషాలు చాలా....
విరజ ఫ్లాష్ ఉన్న తన మినీ వీడియో కెమెరోలొ ఆ వింతలన్నీ బంధించసాగింది. ఫోకసింగ్ లైట్స్ పెట్టేరు అక్కడక్కడ. అభినయ్ కు రెండు స్టిల్స్ తీసింది.
తనూ తీయించుకుంది. యిద్దరినీ కలిసి ఆ గైడ్ కి తీయమని చెప్పింది. అతను అలాగే చేశాడు.
అన్నీ చూస్తూ నడవసాగారు. సుమారు అంతా చూడాలంటే రెండు గంటలపైనే పడుతుంది మరి.
"అబ్బ- ఉక్కపోస్తోంది కదూ..." అభినయ్ కి మాత్రమే వినిపించేలా అంది విరజ.
"అవును బయట సన్నటి వర్షం... ఇందులో మాత్రం ఉక్కపోత" అన్నాడు అభినయ్.
"చున్నీ ఒకటి! జారిపోతూ వుంటుంది. చిరాగ్గా వుంది" అంది విరజ.
"ఓ పన్జేయ్. చున్నీతీసి విసిరి పారేయ్... ఫ్యూచర్ లో ఈ బొర్రా కేవ్స్ కు వచ్చేవాళ్ళకు ఇది ఆకాశం నుంచి దేవకన్య శరీరం నుండి జారిపడ్డ వజ్రం.... అని గైడ్ విశేషంగా చెబుతాడు" టీజింగ్ గా అన్నాడు అభినయ్.
విరజ అదోలా చూసింది అభినయ్ వైపు. అతని సిక్స్ త్ సెన్స్ ఏదో వార్నింగిచ్చింది కానీ, పట్టించుకోలేదు.
* * *
దాదాపు రెండు గంటల తర్వాత బయటికి వచ్చారు.
గైడ్ కు యాభై రూపాయల నోటు ఇచ్చాడు అభినయ్. ఆ గైడ్ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయి "ఈసారి వచ్చినప్పుడు కూడా నన్నే గుర్తుపెట్టుకోండి సార్.....నాపేరు వీరమల్లు" చెప్పాడు.
* * *
బుర్రాకేవ్స్ కు ఆనుకుని సత్రాల్లాంటివి వున్నాయి. పెద్దపెద్ద స్టార్ హోటల్స్ గానీ, మామూలు హోటల్స్ గానీ వుండవక్కడ. గృహస్తులే కొద్దిమందికి అన్నం వండిపెడతారు. ఏం కూర కావాలో చెపితే తయారు చేస్తారు. నాన్ వెజ్ కూడా వండుతారు. బుర్రాకేవ్స్ చూడ్డానికి ముందే డ్రైవర్ ద్వారా ఆర్డర్ చేశారు.
కారులో బుర్రాకేవ్స్ దగ్గరికి వస్తూవుంటే ఇళ్ళ ముందు నిలబడి "భోజనం చేస్తారా?" అని స్త్రీలు అడుగుతూ వుండడం విచిత్రంగా అనిపించింది అభినయ్ కి.
కాశీ మజిలీ కథల్లోని పేదరాశి పెద్దమ్మ గుర్తొచ్చింది. ఓ ఇంట్లో వీళ్ళకు భోజనం ఏర్పాటైంది.
వేడివేడి అన్నం, కోడికూర, సాంబారు, వడియాలు, పెరుగు... అరటి ఆకులో వడ్డించిందా ఇల్లాలు.
ఇంట్లో తిన్నంత తృప్తిగా వుంది విరజకు. అభినయ్ కూ... కొసరి కొసరి మరీ వడ్డించింది.
"రోజూ ఏ మాత్రం వస్తుంది?" అడిగింది విరాజ క్యూరియాసిటీతో.
"వందా... రెండు వందలు.... అంతే... మాకు పోటీ వుంది తల్లీ... మాలాంటి వాళ్ళు ఓ పది.... పదిహేను మంది వున్నారు. ఏదో మా ఇంటాయనకు తోడుగా కొంచెం సంపాదించాలని ఈ చిన్ని ప్రయత్నం అమ్మాయిగారూ. మా పిల్లలు స్కూల్ కు వెళ్ళిపోయాక, మాకు మరో కాలక్షేపం ఏముంటుంది. అందుకే యిలా చేస్తుంటాం. ఎంతోకొంత డబ్బు వస్తుంది కదా!" చెప్పిందావిడ.
అడిగిన దానికన్నా యాభై ఎక్కువే ఇచ్చాడు అభినయ్.
విరజకు ఆ యిల్లాలిని చూస్తే అదోలా అనిపించింది. పొట్టకూటి కోసం ఎన్ని పనులు? ఒకరి ఆకలి తీర్చి తమ ఆకలి తీర్చుకోవడం...
అక్కడి నుండి అరకు బయల్దేరారు.
* * *
అరకులో వున్న పార్క్, మ్యూజియం అన్నీ చూసేసి తిరిగి వైజాగ్ బయల్దేరారు.
వర్షం తుంపర తుంపరగా పడుతోంది. కారు నెమ్మదిగా వెళుతూ వుంది. డ్రైవర్ పాటలు స్లోగా పెట్టాడు.
కారు వెనుకసీటులో విరజ, అభినయ్ కూర్చున్నారు. వాన పడటం వలన గ్లాస్ డోర్స్ క్లోజ్ చేసేశారు. వెచ్చగా వుంది లోపల.
అభినయ్ కి మరింత దగ్గరగా జరిగి, వొదిగి కూచుంది విరజ. అలసటగా అతని భుజంపై తల వాల్చింది.
"సార్! అసలు అరుకు అందాలు చూడాలంటే ఎర్లీమార్నింగ్ కిరండల్ ట్రైన్ వుంది. దాంట్లో వస్తే టర్నల్స్ వుంటాయి. అరుకుకు కారు జర్నీ కంటే ట్రైన్ జర్నీయే బావుంటుంది సార్. ఈ సారి మేడమ్ తో ట్రైన్ లో వెళ్ళండి సార్" అన్నాడు.
"అవునా... ఈసారి వెళ్తాంలే" అన్నాడు అభినయ్.
రోడ్డుకి అటు, ఇటు అన్నీ మామిడి చెట్లే చెట్ల నిండా గుత్తుల గుత్తుల మామిడి కాయలు చూస్తుంటేనే నోరూరేలా. విరజ ఉత్సాహంగా లేచింది. అవన్నీ చూడ్డానికి. ఆమెకు చెట్టు నుంచి తెంపిన మామిడికాయలు, నోటితో కొరుక్కుని తినడం ఇష్టం విరజకు.
