"నేనా అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడాలి..." అన్నాడు శ్రీచరణ్.
"వాళ్ళదసలే సాంప్రదాయమైన కుటుంబం...బావోదురా...అంది బామ్మ.
"అయితే ఈ సంబంధం క్యాన్సిల్...." అన్నాడు శ్రీచరణ్.
"ఏంటీ అబ్బాయి మళ్ళీ ఏదో అంటున్నట్టున్నాడు" అనుమానంగా శ్రీచరణ్ వైపు చూస్తూ అడిగాడు శర్మ. "అదీ...అదీ...." అంటూ నసిగింది బామ్మ.
"చెప్పండి ఫర్లేదు మనవి సాంప్రదాయమైన కుటుంబాలు. మీకు తెలుసుగా.... పిల్లల్ని క్రమశిక్షణతో పెంచాను. ఇక్కడ తలవంచితే కాలేజీలో తలెత్తుతారు నా పిల్లలు..."
"మరి అలా తలవంచుకుని వెళ్తే ఎదురుగా వచ్చే లారీలు, బస్సులు ఎలా కనిపిస్తాయో పాపం." అని అడగాలని నోటిదాకా వచ్చింది శ్రీచరణ్ కు.
"మా అమ్మాయని చెప్పకూడదు కానీ, మేలిమి బంగారం అనుకోండి నేను గాడిదని చేసుకోమన్నా తలొంచి తాళి కట్టించు కుంటుందే తప్ప...."అదేంటి నాన్నా...నేను గాడిదను చేసుకోవాలా?" అని అడగదు గర్వంగా చెప్పాడు శర్మ.
గతుక్కుమన్నాడు శ్రీచరణ్." అంటే.... తను...." శ్రీచరణ్ ఫీలింగ్ గమనించి...
"మాట వరుసకు అన్నానులే..." అన్నాడు శర్మ.
లాభం లేదు. డైరెక్ట్ గా విషయానికొచ్చేయాలి..." అనుకున్నాడు శ్రీచరణ్.
ప్రనూషని అతనెదురుగా వున్న సోఫాలో కూచోబెట్టారు. తలొంచుకుని వుంది.
ఇంతదమైన అమ్మాయి కాస్తస్టయిల్ గా మోడ్రన్ గా వుంటే బావుండేది.... అనుకున్నాడు శ్రీచరణ్.
వెంటనే కర్తవ్యం గుర్తుకొచ్చి....చిన్నగా దగ్గాడు.
"ఏంటిబాబూ.... దగ్గా....కోరెక్స్ వాడకపోయావా? శర్మ అనడంతో కోపం నషాళానికి అంటింది శ్రీకరణ్ కు.
"నేనందుకు దగ్గలేదు. మామూలుగా ఏదైనా విషయం చెప్పేప్పుడు చిన్నగా దగ్గుతారుగా....అందుకు."
"నువ్వు తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తావా బాబూ..." అడిగాడు శర్మ.
"మళయాళ సినిమాలు కూడా చూస్తాను" అని చెప్పాలన్న బలమైన కోరిక కూడా కలిగింది కానీ, పక్కనే వున్న బామ్మ మోచేత్తో పొడిచి నందుకు ఆ కోరికను సమాధిచేసి..."
"నేను మీ అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడాలి" అన్నాడు ధైర్యంచేసి.
"మా అమ్మాయితోనా? ఏం మాట్లాడతావు. అయినా మా ఇంటావంటా ఇలాంటివి లేవు. పెళ్ళయ్యాకే మాటలైనా, ముచ్చట్లయినా...."సీరియస్ గా అన్నాడు శర్మ.
"మాట్లాడనీయండి శర్మగారూ! ఏదో కుర్రతనం...వాళ్ళ భావాలు వాళ్ళకుంటాయిగా ..." అంది బామ్మ.
శర్మ భార్య కూడా భర్త దగ్గరికి వచ్చి చెవిలో ఏదో గొణిగింది.
"నాకిలాంటివి ఇష్టం వుండదు. అయినా ఏదో పెద్ద వారు చెబుతున్నారని..." అని కూతురివైపు తిరిగి...
"అమ్మాయి ప్రనూషా....వెళ్ళమ్మా..." అన్నాడు. ప్రనూష పెరట్లోకి నడిచింది.
ఆమె వెనకే బలిపశువులా శ్రీచరణ్.
మీపే....పేరేంటి? -'పాపం నత్తేమో అనుకుంది ప్రనూష. ఆ మాటే అతన్ని అడిగింది' 'మీకీ నత్తి ఎప్పట్నుంచి వుందని?"
"నాకు....నత్తేమిటి?" కోపంగా అన్నాడు శ్రీచరణ్.
"మీకు నత్తిలేదా....మరి రెండు "పేలు ఉపయోగించారు." శ్రీచరణ్ కు వళ్ళు మండింది కానీ తమాయించుకుని..."
"నా మీద మీ ఓపీనియనేమిటి?"
"నాట్ బ్యాడ్..." అంది పెదాలు విరుస్తూ.
"నాకు సిగరెట్ తాగే అలవాటుంది. రోజుకు నాలుగైదు ప్యాకెట్లు కాలుస్తాను."
థూ.... యాక్...." అంది ప్రనూష.
"మందు విషయం ఔటరే....రోజూ క్వార్టర్ తప్ప....అంతకన్నా పిసరంత కూడా ఎక్కువ తాగను."
"వాక్..."
"తాగినప్పుడు మాత్రమే నా పక్కవుండే వాళ్ళని తిడతాను, కొడతాను మామూలు సమయాల్లో నేను చాలా మంచి వాడిని..."
"ఛీ.....ఛీ...."
"నాకు అమ్మాయిల వీక్నెస్ వుంది. అఫ్ కోర్స్....ఎవరి కష్టమూ వుంచుకోను....డబ్బులిచ్చే వెళ్తాను."
మళ్ళీ "యాక్..." అంది ప్రనూష.
"అయినా నీకు, నాకన్నా మంచి సంబంధం దొరకదనుకో నేనసలే ఖల్నాయిక్ టైప్..." అన్నాడు గొంతును గంభీరంగా పెట్టి.
ప్రనూష ఏదో గొణిగింది కానీ అది శ్రీచరణ్ కు వినిపించలేదు.
"అయినా మీ మొహమేమిటి మాడిన పెసరట్టులా...నాకేం నచ్చలేదు కన్నాంబ కాలంనాటి చీర....సావిత్రి కాలంనాటి బ్లౌజు, శాంతికుమారి కాలం నాటి బొట్టు..." అన్నాడు శ్రీచరణ్.
ప్రనూష కోపంగా చూసి ఏదో అనబోయింది.
అప్పటికే శర్మ అక్కడికి రావడంతో ఆ టాపిక్ ఆగిపోయింది.
శ్రీచరణ్ కు హుషారుగా వుంది. "తనన్న మాటలకు పెళ్ళికూతురు బాగా 'హర్ట్ అయి వుంటుంది తప్పక. పైగా తన అలవాటు, ఉన్నవీ, లేనివీ కల్పించి చెప్పడంతో బిక్కచచ్చి పోయివుంటుంది. ఈ సంబంధం ఛస్తే.... ఓ.కె, అవ్వదు. ఖచ్చితంగా వద్దనే చెబుతుంది. సకల దుర్గుణుడి లెవల్లో తను అబద్దమాడేశాడు. ఈ దెబ్బతో అయిపోతుంది" అనుకున్నాడు.
"ఒరే...బంగారు కొండా...." ఇంత సంతోషంగా నువ్వువుండడం ఎప్పుడూ చూడ్లేదురా...ఆ అమ్మాయిని చూడగానే మనసు పారేసుకున్నవా?" అడిగింది మనవడి మొహంలోకి చూస్తూ బామ్మ.
"కాదు పదిరూపాయల నోటు పారేసుకున్నాను" అన్నాడు శ్రీచరణ్.
"అదేంట్రా..." అంది తెల్లబోతూ.
"ఊర్కే అన్నాన్లే కానీ బామ్మ....ఒకవేళ ఆ అమ్మాయికి నేను నచ్చకపోతే..."
"అదేంట్రా పిచ్చిసన్నాసి....నీకేమైందిరా....కన్నొంకరా? మూతొంకరా.....నువ్వు రాజకుమారుడివిరా..."
"మరి మహేష్ బాబు ఎవరే..." అనాలనుకున్నాడు శ్రీచరణ్.
"నీకా అమ్మాయి నచ్చినట్టేనా....ముహూర్తాలు పెట్టమని రాసేదా?"
"వెంటనే పెట్టించేయమని చెప్పవే. నాకైతే ఎప్పుడెప్పుడా అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలా? అని పిచ్చి తొందరగా వుంది" అన్నాడు శ్రీచరణ్.
"నాకు... తెలుసురా.... అన్నీ తాత బుద్దులే వచ్చాయి. మీ తాతయ్య అంతే....నన్ను చూడకముందు "పెళ్ళే చేసుకోననీ, బ్రహ్మచారిగా వుండిపోతానన్న మనిషి నన్ను చూసాక....పెళ్ళయ్యే వరకూ ఒకటే గొడవ..." అంది మురిసిపోతూ బామ్మ.
శ్రీచరణ్ నవ్వుకున్నాడు.
ఎలాగూ...ఆ అమ్మాయి తనతో పెళ్ళికి ఒప్పుకోదు....అలాంటప్పుడు చేసుకోనని తన నోటితో చెప్పడమెందుకు.....ఆ నెపమేదో ఆ అమ్మాయి మీదే వేసేస్తే పోలా....!! అనుకున్నాడు.
సరిగ్గా అప్పుడే అతని ఖర్మకాలి పోస్ట్ వచ్చింది. అడ్రస్ చూశాడు శర్మ....ఫ్రమ్ విజయవాడ....అని వుంది.
ఎగిరి గంతేసాడు.
ఖచ్చితంగా అశుభవార్తే. ఉత్తరం చదవకుండానే అందులో ఏముందో వూహించాడు.
