"పెళ్ళి కూతుర్ని పిలిచి పిచ్చి ప్రశ్నలు వేయాలి. భయపెట్టాలి. తనంటే ఇష్టం లేదని ఖచ్చితంగా చెప్పాలి..." అనుకున్నాడు.
ఆ రాత్రి ఓ అందమైన కలగన్నాడు శ్రీచరణ్.
ఓ అందమైన అమ్మాయి సన్నగా వుంది. బ్లూకలర్ జీన్స్ మీద వైట్ కలర్ టీషర్ట్ వేసుకుంది. స్ట్రక్చర్ సూపర్బ్.
"హాయ్..." అంటూ తనని విష్ చేసింది.
తను తన స్కూటర్ మీద లిఫ్ట్ ఇస్తానన్నాడు. సరేనంది.
తన స్కూటర్ సెవెంటీ స్పీడ్ దాటింది. చలిగాలి వణికిస్తోంది. ఆ అమ్మాయి స్కూటర్ కు అటోకాలు ఇటో కాలు వేసింది. తన నడుం చుట్టూ రెండు చేతులు వేసింది.
ఒంట్లో వేడి పుట్టింది శ్రీచరణ్ కు.
సడన్ బ్రేక్ పడినప్పుడల్లా మెత్తగా ఆమె వక్షభాగం, మత్తుగా ఆమె శరీర భాగం తగులుతూ వెచ్చగా అనిపిస్తోంది.
తనూ ఆమె యిద్దరూ చెట్టాపట్టాలేసుకున్నారు. టాంక్ బండ్ మీద షికారు, రామోజీ ఫిల్మ్ సిటీలో డ్యూయట్సు ఫ్లయ్ ఓవర్ మీద సరదా వాకింగ్ లూ.....
వర్షంలో చూడీదార్ వేసుకొని ఆమె నడుస్తూంటే ఆ ఒంపులు చూసి, తను టెంప్టయిపోయి పాటందుకున్న ఫీలింగ్. రకరకాల గెటప్స్ లో కనిపించి కనువిందు చేస్తోంది.
ఓసారి జీన్స్ లో....మరోసారి చుడీదార్లో యింకోసారి మిడ్డీలో...
వాహ్...వాటే అల్ట్రా మోడ్రన్ లేడీ...చేసుకుంటే యిలాంటి అమ్మాయినే చేసుకోవాలి. ఇంత ఫాస్ట్ గా ఇంత మోడ్రన్ గా వుండే అమ్మాయిని చేస్కోవడానికి తను ఎన్నిలక్షల కుంకుమార్చనలు చేయడానికైనా రెడీ....
"ఒసే బామ్మా....నేను లక్షొత్తుల నోము చేస్తానే.... నాకు ఆ జీన్స్ అమ్మాయితో పెళ్ళి చేయవే..." అని కలలోనే బామ్మని అడుగుతున్నాడు శ్రీచరణ్.
'ఛీ....ఛీ...చస్తే ఆ అప్రాచ్యపు దాన్ని నీకిచ్చి చేయను. శుభ్రంగా చీరకట్టుకుని, జడతలో మల్లెపూలు పెట్టుకునే నిక్షేపం లాంటి కుందనపు బొమ్మనే నీకిచ్చి చేస్తాను" అంటోంది.
తనకి కోపం వచ్చింది. 'రాదా.....మరి..."
తనకీ ఫాస్ట్ గర్ల్ అంటే యిష్టం. ముద్దపప్పులా, దద్దోజనంలా వుండే అమ్మాయి తనకి ఎందుకు? అందుకే.... కోపంగా...' ఒసే బామ్మా..." అంటూ కేకేసాడు శ్రీచరణ్ నిద్రలోనే...
ఉలిక్కిపడి లేచింది బామ్మ.
'ఒరే....పిచ్చికొండా నా బంగారుకొండ..లేవరా....ఏంట్రా ఆ పలవరింతలు నిద్రలో ఏమైనా పీడకల వచ్చిందా.."?"
బామ్మా శ్రీచరణ్ ని తట్టిలేపి అడిగింది.
కలలోనుంచి తేరుకొని బామ్మను చూసి.
"అదేంటే....మంచి నిద్రలో వున్న నన్ను లేపావు...ఏదైనా పీడకల వచ్చిందా.... భయమేసిందా...? అని అడిగాడు.
బామ్మ అయోమయంగా మనవడివైపు చూసి....
'నువ్వే కదరా పిచ్చి సన్నాసి..."ఒసే బామ్మా..." అంటూ అరిచావు" అంది.
"అలా అరిచానా?" అన్నాడు మెల్లిగా.
"రేపొద్దున్నే ఆచారితో చెప్పి దడుపు మంత్రం వేయించి, మొలతాడుకీ తాయెత్తు కట్టించాలి" గొణుక్కుంది బామ్మ.
"నా మెడక్కూడా కట్టించవే...." కసిగా అనుకుని, అటువైపు తిరిగి పడుకున్నాడు శ్రీచరణ్.
పొద్దున్నే లేసి, హడావిడిగా శ్రీచరణ్ ని తయారుచేయించింది. విజయవాడకు బయల్దేరారు బామ్మ శ్రీచరణ్, కూడా రామస్వామి. పెద్ద బంగళా ముందు ఆగింది ఆటో.
ముందు బామ్మ ఆ తర్వాత శ్రీచరణ్, ఆ వెనకే రామస్వామి దిగారు. యాభయ్యేళ్ళ శర్మ వీళ్ళని సాదరంగా ఆహ్వానించాడు.
"రామస్వామి నువ్వుగేటు దగ్గరే కూచో....ముగ్గురెళ్ళడం మంచిది కాదు..." అంది బామ్మ.
రామస్వామి బుద్దిగా తలూపాడు. బామ్మకు నమ్మిన బంటు అతను.
శ్రీచరణ్, బామ్మ లోపలికి అడుగుపెట్టారు. ఫలహారాలు, కాపీలు అయిపోయాయి.
"ఇక అమ్మాయిని పిలిపించండి" అంది బామ్మ.
శ్రీచరణ్ నిరాసక్తిగా కూచుని వున్నాడు.
అడుగుల శబ్దం చిరుచిరు పట్టీల శబ్దం..."
"ఒరే వెర్రికొండా....నీక్కాబోయే పెళ్ళాన్ని చూడరా...!! అంటూ మోచేత్తో పొడిచింది బామ్మ.
తలెత్తి చూశాడు శ్రీచరణ్....సరిగ్గా అప్పుడే ఆ అమ్మాయి కూడా తలెత్తి చూసింది.
ఆ అమ్మాయే ప్రనూష.
వళ్ళు మండుతోంది శ్రీచరణ్ కు వళ్ళంతా ప్యాక్ చేసినట్టు చీర, ఓ పూలచెట్టుని జడలో పెట్టినట్టు జడలో పాతిక మూరలకు తక్కువలేని మల్లెపూలదండ...అసలేమాత్రం నచ్చలేదు. హాయిగా జీన్స్ లోనో, మిడ్డీలోనో ఈ పెళ్ళిచూపులు ఏర్పాటుచేస్తే ఎంత బావుండును.
ఆ అమ్మాయి అలా పెళ్ళి చూపులకు వచ్చి తనని 'హాయ్' అని పలకరించినట్టు వూహించుకున్నాడు కూడా.
'చూడరా పిచ్చికొండా....మహాలక్ష్మి నడిచొస్తున్నట్టు వుంది కదూ..." మనవడి చెవిలో గొణిగి అడిగింది బామ్మ.
'మరే....వాళ్ళ కజిన్ సంతానలక్ష్మి కూడా జాగింగ్ చేస్తూ వస్తున్నట్టుంది" కసిగా అన్నాడు శ్రీచరణ్.
"అబ్బాయే మంటున్నాడండీ..." అడిగాడు పెళ్ళికూతురి తండ్రి శర్మ.
"అమ్మాయి కుందనపు బొమ్మలా వుంది చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటానని అంటున్నాడు' అంది బామ్మ శర్మతో.
శ్రీచరణ్ కోపంగా బామ్మవైపు చూసి 'ఒసే ముసలీ....నేనలా అన్లేదు..." అన్నాడు లోగొంతుకతో...
"అమ్మాయికేమైందిరా....సలక్షణంగా ఉంది...." అంది బామ్మా.
