"మీ మందిరంలో ఏమీ దొంగలించలేదు అని అప్పుడు చెప్పారు. మరి ఇప్పుడు ఏమంటారో! ఈమె దొంగ కాదంటారా!" సూటిగా ప్రశ్నించాడు.
"నన్నడగడం దేనికి? మీ ఎదురుగానే నిలిచి వున్నది కదా ఆమెనే అడగండి" చిరుమందహాసం చేశాడాయన.
"నువ్వు వచ్చింది దొంగతనం చేయడానికి కదూ" గద్దించాడు ఇన్ స్పెక్టర్.
"పొరబడుతున్నారు ఇన్ స్పెక్టర్ .......ఐయాం రీటా"
"పేరులో ఏముందిలే. ఏ పేరయినా చెప్పవచ్చు. అర్ధరాత్రి దొంగలా మందిరంలోకి ప్రవేశించడానికి కారణం?" ఆమె కళ్ళల్లోకి పరీక్షగా చూస్తూ అడిగాడు.
"ఇన్ స్పెక్టర్ ........ఆ ప్రశ్న మీరు వేయకూడదు" అన్నాడు విష్ణు.
వినయ్ ఆయనవైపు ఆశ్చర్యంగా చూశాడు.
"అవును, ఆమె నా మందిరంలోకి అక్రమంగా ప్రవేశించిందని నేను మీకు కంప్లయింట్ చేశానా?"
"లేదు......"
"ఆమె వివరాలు తెలుసుకోకుండా, అప్పుడే ఆమెను దొంగను చేసి ప్రశ్నించడం న్యాయం కాదు. అయినా ఇది నా మందిరానికి చెందిన విషయం. నేను కంప్లయింట్ చేయలేదు సరికదా అనుమానంగా వుంది రమ్మని కూడా మిమ్మల్ని ఆహ్వానించలేదు. మరి మీరెందుకు ఇలా దొడ్డి దారిన వచ్చారో తెలుసుకోవచ్చా?" గంభీరంగా ప్రశ్నించాడు విష్ణు.
ఇన్ స్పెక్టర్ తెల్లబోయాడు.
"చెప్పండి ఇన్ స్పెక్టర్......" రెట్టించాడు విష్ణు.
"ఆమె దొంగతనం చేయడానికి వచ్చిందనేది నిజం. ఎందుకంటే పోయినసారి మీ మందిరం లోంచి ఒక పెద్ద సంచిని తీసుకు వెళ్ళడం నా కంటితో నేను చూశాను. ఇప్పుడూ అందుకే వచ్చింది. అయినా నేరం చేయలేదు అనడమే కాక దొంగతనానికి కూడా రాలేదు అంటున్నారు. అసలు మీ మాటలను ఎలా అర్ధం చేసుకోవాలో ......ప్చ్....." అన్నాడు వినయ్ కుమార్ అయోమయంగా.
వాళ్ళ సంభాషణ వింటూ మౌనం వహించిందేకానీ రీటా అవునని కానీ......కాదని కానీ చెప్పడం లేదు.
ఉన్నట్టుండి ఆమెను సమీపించి వెనక్కి పెట్టుకుని వున్న రెండు చేతులను ముందుకు లాగాడు వినయ్.
ఆమె చేతులలో తాళాల గుత్తి.....
అందరిలోనూ అశ్చర్యం!
అవి ఆ గదిలోనే వున్న బీరువా తాళాలు......
"ఇప్పుడేమంటారు విష్ణుజీ..."
అప్పుడూ అయన ముఖంలో చెరిగిపోనీ చిరునగవునే చిందులు వేసింది.
"మీ అజ్ఞానానికి చింతిస్తున్నాను. ఆ తాళాలు ధనాగారానికి చెందినవో, హుండీకి చెందినవో అనుకుంటున్నారు. ఆ బీరువాలో వుండేవి ఆద్యాత్మిక గ్రంధాలు మాత్రమే. దైవ చింతనతో ఆ పుస్తకాలను తీసుకోవడానికి వచ్చిన ఆమెను ఇంకా మీ దృష్టిలో దొంగగానే చూడడం విచారకరం" హుందాగా అన్నాడు విష్ణు.
వినయ్ కుమార్ బిత్తరపోయాడు.
విష్ణు అంతర్యం ఏమిటి?
ఆమె దొంగ కాదా? ఆమెను కాపాడడానికి విష్ణు ప్రయత్నిస్తున్నాడనేది వాస్తవం? ఎందుకు అలా చేస్తున్నాడు....అసలు ఆమె ఎవరు? ఆమెకూ, ఆయనకూ వున్న పరిచయం ఏమిటి? వాళ్ళిద్దరి మధ్య ఏం సంబంధం వుందో ఎంత ఆలోచించినా ఏ అనుమానానికి సమాధానం దొరకని ప్రశ్నలుగానే అతనిలో మిగిలిపోయాయి?
తాళాల గుత్తి తీసుకుని బీరువా తెరిచాడు.
విష్ణు చెప్పినట్టుగానే పొందికగా దొంతర్లు పేర్చి వున్నాయి ఆద్యాత్మిక పుస్తకాలు. అతనికి తల కొట్టేసినట్టయింది. ఏమనాలో తోచక గిర్రున వెనుదిరిగాడతను.
అర్ధరాత్రివేళ పనిగట్టుకుని ఆ గ్రందాల కోసం ఆమె దొంగతనానికి వచ్చిందీ అంటే వినయ్ కుమార్ నమ్మలేక పోతున్నాడు.
కానీ, తన అనుమానాన్ని ఏ విధంగానూ నిరూపించలేక పోతున్నాడు. అందుకే పరాభవం పొందిన సైనికుడిలా తిరుగు ముఖం పట్టాడు వినయ్ కుమార్.
ఇన్ స్పెక్టర్ వెళ్ళిపోయాక , శిష్యులందరినీ పంపించి వేశాడు విష్ణు.
"మిస్ రీటా........"
విష్ణు నోటి వెంట ఆ పిలుపు విన్న ఆ యువతి ఉలిక్కిపడింది.
క్షణం ఆమెలో తడబాటు.....
"నా డైరీలు నీకు ఏవిధంగానూ ఉపయోగపడవు కదూ, ఏం చేసుకుంటావు వాటిని?' ఖంగుమంటూ ధ్వనించింది విష్ణు కంఠం.
'అవును డైరీలే.....పోయినసారీ నువ్వు మూట కట్టుకుని వెళ్ళింది ఆ డైరీలే ఇప్పుడు ఇంకేం తీసుకు వెళదామని వచ్చావు?"
విష్ణు ప్రశ్న మీద ప్రశ్న వేశాడు.
"స్వామీ......నేను మీ డైరీలు దొంగలించిన మాట నిజమే కానీ వాటిని తిరిగి బీరువాలో పెట్టాలనీ వచ్చాను. పెట్టి వెళుతుండగా ఇన్ స్పెక్టర్ గారు వచ్చి దొంగలా నిలబెట్టారు.'
