ఆమె మాటలు స్థిరంగా వున్నాయి.
"తిరిగి బీరువాలో పెట్టావా?" విష్ణు ఆశ్చర్యపోయాడు.
అవునన్నట్లు బీరువా క్రింద తను దాచిన ఖాళీ సంచినీ చూపించిందామె.
విష్ణు కళ్ళలో విస్మయం....
బీరువా తెరిచి చూస్తే , క్రింద వున్న సీక్రెట్ షెల్ఫ్ లో డైరీలు భద్రంగా వున్నాయి.
"మిస్ రీటా......తాళం వేసివున్న బీరువా చూసి విలువయిన సంపద దాచి వుంటానని భ్రమతో వచ్చావు. అపారంగా వస్తున్న కోట్లాది రూపాయలు ఇంకెక్కడయినా దాచానేమోనని ఆ వివరాల కోసం డైరీలు తీసుకెళ్ళావు. కానీ నువ్వు ఆశించింది వాటిలో ఏమీ లేకపోవడంతో తిరిగి తెచ్చావు.......అంతేకదూ?" అన్నాడు విష్ణు గంభీరంగా.
"అవును స్వామీ....." రీటా తల వంచుకున్నది.
"కానీ నువ్వు పోరాబడ్డవు. నువ్వు ఏ ధనాన్ని ఆశించి వచ్చావో ఆ ధనాగారం వున్న గదికి తాళం వేయలేదు. హుండీ వున్న గది కూడా తెరిచే వుంటుంది. నా మందిరంలో సంపదను దొంగలించుకు వెళ్ళే ద్రోహచింతన కలిగినవాళ్ళు ఎవరూ లేరు. వేల కట్టలేని అమూల్యమయిన ఆద్యాత్మిక సంపద అందులో వుంది కాబట్టే తాళం వేయవలసి వచ్చింది. 'అయినా నువ్వెందుకోచ్చావో నాకు తెలుసు......" విష్ణు చిరునగువుతో ఆమె ముఖం వైపు చూస్తూ అన్నాడు.
రీటా గతుక్కుమన్నది........
"నేను వద్దంటున్నా భక్తులు కుప్పలు తెప్పలుగా ధనరాశులను కానుకలుగా సమర్పించుకుంటున్నారు. ఆ సంపద ప్రజలదే కాబట్టి ఎవరయినా నిరభ్యంతరంగా తీసుకెళ్ళవచ్చు. అందుకే ధనాగారం వున్న గదికి తాళం వేయలేదు. ఇహ భోగాల మీదనే నీకు ఇచ్చ వుంటే ధనమే కావాలీ అనుకుంటే ధనాగారం అటువైపు వున్నది కాదు నాకు మోక్షం కావాలి అంటావా పర భోగాలను వదలి నా మందిరం వైపు రావచ్చు. అదంతా నీ ఇష్టం. నీకు తోచిన మార్గాన్ని ఎన్నుకో!"
విష్ణు కంఠం ఏందో మృదువుగా సమ్మోహనంగా వుంది.
అయన చెప్పిన మాటలను శ్రద్ధగా వింటున్న రీటాలో ఎలాంటి చలనం లేదు.
ఆమె వైపు లిప్తకాలం పరిశీలనగా చూశాడు "విష్ణు.
అప్పుడు చలనం వచ్చిందామెలో. తన కర్తవ్యాన్ని గుర్తించింది. వెంటనే అద్యాత్మక గ్రంధాలున్న గదికి తాళం వేసి, తాళం చెవి విష్ణు చేతికి అందించింది.
"నా అజ్ఞానాన్ని క్షమించండి విష్ణుజీ.......పవిత్రమయిన మీ మందిరంలోకి దొంగబుద్దితో ప్రవేశించి ఘోరమయిన తప్పు చేశాను. కానీ మీ భోధనలు విన్న తరువాత కానీ నేనెంత తప్పు దారిలో నడుస్తున్నానో అర్ధం కాలేదు. దయచేసి నన్ను మీ శిష్యురాలిగా స్వీకరించండి. మీ ఆద్యాత్మిక భోధనలు విన్న తరువాతనయినా నాలోని స్వార్ధం అంతరించిపోయి మోక్ష సాధన వైపుకు మనస్సు మళ్ళుతుందని నా ఆశ....."
ముకులిత హస్తాలతో రీటా దీనంగా అభ్యర్ధించింది.
విష్ణు లోని గాంభీర్యం సడలలేదు.
ఒకే క్షణం అలోచించి ఆమె తలపై చేయి వేసి నిమిరాడు.
"దైవకృప ఎలా వుంటే అలా జరుగుతుంది. నా మందిరంలో వుండటానికి నాకెలాంటి అభ్యంతరం లేదు....." అనిచెప్పి ముందుకు సాగిపోయాడు విష్ణు.
రీటా కళ్ళలో ఒకవిధమయిన కాంతి చోటుచేసుకుంది.
* * * *
అక్కడ ఎంతో ప్రశాంతంగా వున్నది.
మందిర ప్రాంగణంలోని గదులలో విశ్రమిస్తున్న శిష్యులు ఎవరూ బయటకు వచ్చే జాడలు లేవు
చాలా గదులలోని లైట్లు ఆరిపోయాయి.
రాత్రి పదిగంటలయింది........
అయినప్పటికీ మూడు గదులలో మాత్రం ఇంకా లైట్లు వెలుగుతూనే వున్నాయి.
ఆ విషయం గమనించిన శిష్యులు ఎవరూ కూడా తమకు పట్టనట్టు తమ గదులలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
విష్ణు తన ధ్యాన మందిరంలో అర్ధరాత్రి వరకూ మెలకువతోనే వుంటారు కాబట్టి అయన మందిరంలో లైటు వెలుగుతూనే వుంటుందని శిష్యులందరకూ తెలుసు. ఎటొచ్చి కొత్తగా చేరిన ఇద్దరు శిష్యురాళ్ళు గదులలో కూడా లైట్లు వెలుగుతున్నాయంటే కారణం ఏమై వుంటుందో వాళ్ళకు అర్ధం కాకపోయినా కనీసం ఎందుకో తెలుసుకుందామన్న ఆసక్తి కూడా ఏ శిష్యునిలోనూ లేదు.
ఆ మందిరంలోని శిష్యుల మానసిక పరిపక్వత ఆద్యాత్మిక చింతన అలాంటిది.
కాలం బరువుగా గడిచిపోతున్నది.
ఉన్నట్టుండి భారతి తన గది తలుపును తెరచుకుని బయటకు వచ్చింది.
నలువైపులా పరిశీలనగా చూసిందామె.
అంతటా నిశ్శబ్దం.......
తన గదికి నాలుగు గదుల తరువాత గదిలో లైటు ఇంకా వెలుగుతూనే వుండడం చూసి ఆశ్చర్యంతో తలమునకలైపోయింది.
కొన్ని క్షణాల పాటు తటపటాయించి, ఏమనుకున్నదో ఏమో తన గదిలోని లైటు అర్పి తలుపును దగ్గరగా లాగి అడుగులో అడుగు వేసుకుంటూ ఆ గది వైపు నడిచింది భారతి.
పిల్లిలా చప్పుడు చేయకుండా నడుస్తున్నదామె.
గదికి ఒకవైపున వున్న చిన్న వెంటిలెటర్ ను సమీపించి తల పైకెత్తి గడిలోపలకు తొంగి చూసింది.
