Previous Page Next Page 
మెయిడ్ ఇన్ ఇండియా పేజి 16

 

    "ఐసీ......."
    "మీరు ఊహించినట్టుగానే ఒక స్త్రీ విష్ణు మందిరంలోకి వెళ్లిందంట సర్"
    "వ్వాట్.....ఈ సమయంలోనా? వెళ్ళి ఎంతసేపయింది?"
    జస్ట్ ఇప్పుడే సార్, పావుగంటవుతోంది"
    క్షణాల మీద డ్రెస్సెప్ అయి, బయట వున్న జీప్ ను స్టార్టు చేశాడు ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్, అతని ఆలోచనలు మాత్రం జీప్ కంటే వేగంగా పరుగులు తీస్తున్నాయి.
    తన మందిరంలో ఎలాంటి దోపిడీ జరగలేదు అని విష్ణు చెప్పినప్పుడే ఒక పధకాన్ని రూపొందించుకున్న వినయ్ కుమార్, తిరిగి వచ్చిన వెంటనే తన ఆలోచనలను అమలులో పెట్టాడు.
    కాలేజీ కాంపిటీషన్స్ లో ఎన్నోసార్లు తను లీలా మాత్రంగా చూసిన బొమ్మలను యధాతధంగా చిత్రించి లెక్కలేనన్ని ప్రశంసలు పొందిన రోజులను జ్ఞప్తికి తెచ్చుకున్నాడతను.
    బైనాక్యులర్స్ ద్వారా విష్ణు మందిరంలోకి చొరబడుతున్న ఆమె రూపాన్ని అప్పుడు స్పష్టంగా చూసి వున్నాడు కాబట్టి , తనలోని సృజనాత్మక కళను ఉపయోగించి ఇప్పుడు ఆమె రూపానికి కుంచె తో రంగులు దిద్దాడు.
    ఆ చిత్రాన్ని ఫోటో కాపీలు తీయించి తొమ్మిది మంది కానిస్టేబుల్స్ కు ఇచ్చాడు. ముగ్గురు చొప్పున వాళ్ళను మూడు బ్యాచ్ లుగా విభజించి ఒక్కొక్కరు ఎనిమిది గంటల డ్యూటీ చేసేలా విష్ణు మందిరం దగ్గర వుండేలా ఏర్పాటు చేశాడు.
    అడదొంగ మరల విష్ణు మందిరానికి రావచ్చునన్న అతని వూహ వమ్ము కాలేదు.
    ఫలితంగా సెంట్రీ డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్స్ దృష్టిలో ఆమె పడనే పడింది.
    తను దగ్గరవున్న ఫోటోలోని యువతే లోనికి వెళ్ళడం గమనించిన వెంటనే వాళ్ళు తమ భాధ్యతను నిర్వర్తించారు.
    పది నిమిషాలలో ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్ జీప్ ను విష్ణు మందిరం ముందు ఆపాడు.
    "సర్.....ఆమె ఇంకా లోపలే వుంది.'
    షూ తీసి చప్పుడు చేయకుండా ప్రహరీ గోడ దూకి లోపలకు అడుగు పెట్టాడు వినయ్.
    ఒక్కొక్క గదినీ దాటుతూ వెళుతున్నాడతను.
    ఒక గదిలో విష్ణు శిష్యులు ఆరమరచి నిద్రపోతున్నారు.
    రెండు గదుల తరువాత గది తలుపు కొద్దిగా తెరచి వుండటం గమనించిన వినయ్ కుమార్ కు ఆసక్తి రెట్టింపయ్యింది.
    మెల్లగా సమీపించి తలుపు సందులో నుంచి లోపలకు చూశాడు.
    ప్యాంటు షర్టు వేసుకున్న యువతి అటు తిరిగి నిలిచి వున్నది. ఆమె వీపు భాగం మాత్రం కనిపిస్తుండడంవల్ల ఆమె ఏం చేస్తున్నదో తెలిసే అవకాశం లేకపోయింది.
    ఇక ఆలస్యం చేయదలుచుకోలేదతను.
    తలుపులు తెరచుకుని లోనికి అడుగు పెట్టాడు.
    ఆ చప్పుడుకు అదిరిపడుతూ వేనుదిరిగిందామే.
    అచ్చం తను చిత్రించిన చిత్రంలోని రూపమే అమెది. అందుకే కానిస్టేబుల్స్ వెంటనే పోల్చుకోగలిగారని అర్ధమయిందతనికి.
    ఎదురుగా ఇన్ స్పెక్టర్ ను గమనించగానే బిత్తరపోయిందామే.
    అప్పుడే మరొక సంఘటన జరిగిపోయింది.
    ఉన్నట్టుండి మందిరంలోని లైట్లన్నీ వెలిగాయి.
    ఇరువురూ గాభరాగా దిక్కులు చూశారు. బిలబిల,మంటూ నలువైపుల నుంచీ శిష్యులు చేరిపోతున్నారు.
    గాంభీర్యాన్ని పుణికి పుచ్చుకున్న అడుగుల సవ్వడి.....
    ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్ చివ్వున తల తిప్పి చూశాడు.
    చెరిగిపోనీ చిరునగువుతో విష్ణు నిలచి వున్నాడు.
    క్షణం తొట్రుపడినా వెంటనే తేరుకుని ఆయనవైపు తీక్షణంగా చూశాడతను.
    "నా అనుమతి లేకుండా అర్ధరాత్రి సమయంలో దొంగల్లా రావలసిన అవసరం మీ ఇద్దరికీ ఎందుకు కలిగిందో?" అన్నాడాయన.
    "సర్వమూ ముందే తెలుసుకోగల ప్రజ్ఞాపాటవాలున్నవారూ కదా! మమ్మల్ని అడగడం ఎందుకు? ఈ మాత్రం మీరు తెలుసుకోలేరా?" ఎత్తి పొదుపుగా అన్నాడు ఇన్ స్పెక్టర్.
    'అది నాకు తెలియక కాదు అడిగింది. మీరేం కట్టుకధలు చెబుతారో విందామని. ఆమెను పట్టుకోవడానికి వలపన్ని వుంచారు మీరు. ఆ విషయం తెలియని అమాయకురాలు నా మందిరంలోకి ప్రవేశించి మీ ఉచ్చులో చిక్కుకున్నది అంతే కదూ........"
    అంత కరెక్టుగా ఎలా చెప్పగలిగాడో క్షణం పాటు విస్మయం కలిగింది. అయినా వినయ కుమార్ లోని గాంభీర్యం సడలిపోలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS