Previous Page Next Page 
స్వర్గంలో ఖైదీలు పేజి 16


    "ఆమ్లెట్ అయితే బావుంటుంది!" అన్నాడు.
    "ఓ......అదెంతపని, నువ్వు క్రిందికివచ్చేలోగా వేస్తాను "క్రిందికి పరిగెత్తింది.
    విద్యహాల్లో సోఫాలో కూర్చుని ఇదంతా గమనిస్తోంది. "వర్షా.....మెట్లమీద పరిగెత్తకు...... పడిపోతావు తల్లీ!" అంది.
    వర్ష ఆమ్లెట్స్ వేస్తుండగా "వర్షా.......వర్షా......" సంజయ్ మళ్ళీ పిలిచాడు.
    "ఆవస్తున్నా.......అబ్బా.....చచ్చిపోతున్నానుబాబు! వరమ్మా వీటి సంగతి చూడు!" అంటూ వర్ష హడావిడిగా పైకి పరిగెత్తుతుండగా కాలు కాస్త బెసిగి క్రిందపడింది.
    వెంటనే "అ......మ్మా....." అని అరిచింది.
    విద్య ఒక్క అంగలో కూతురి దగ్గరకొచ్చి "అయ్యో తల్లీ......బెణికిందా? నెప్పిగా వుందా..... వరమ్మా వెంటనే డాక్టర్ కి ఫోన్ చెయ్యి....." అంటూ హడావుడి చేసింది.
    సంజయ్ ఈ గోలకి బైటకి వచ్చి "ఏం జరిగింది వర్షా?" అన్నాడు.
    "అబ్బా.....ఏంకాలేదు సంజయ్, కాస్త స్లిప్ అయింది" అంది వర్ష.
    "ఏం కాలేదంటావేంటే, కాలు మెలికపడ్తేనూ......అయినా అలా మీదకీ కిందకీ పరుగులు పెట్టించడం ఎందుకు బాబూ! ఇందాక వచ్సినప్పుడే ఏమేం కావాలో చెప్పలేకపోయావా?" అంది విద్య.
    సంజయ్ నెమరకణత బిగుసుకుంది. పనివాళ్ళముందు అత్తగారు అలా మాట్లాడటం అతనికి నచ్చలేదు. గిరుక్కున వెనుతిరిగి గదిలోకి వెళ్ళిపోయాడు. అతను బ్రీఫ్ కేస్ తీసుకుని మెట్లు దిగివచ్చాడు.
    "సంజయ్.......బ్రేక్ ఫాస్ట్ రెడీ" వర్ష లేవబోయింది.
    "నువ్వు రెస్ట్ తీసుకోమ్మా వరమ్మ పెడ్తుంది" అంది విద్య.
    సంజయ్ చురుగ్గా వర్ష కేసి చూసి "అక్కర్లేదు.....నాకు టైం అయింది" అంటూ కదలబోయాడు.
    విద్య ముందుకి వచ్చి "సంజయ్......అసలు ఈ ఉద్యోగం నీకెందుకూ? ఇంకొకళ్ళ దగ్గర పనిచేసే ఖర్మ నీకేమిటీ? మానిపారేయ్? వసుంధరా, నేనూ కూడా అదే అనుకున్నాము. హాయిగా మన వ్యాపారం మనకు ఉండనే ఉందిగా!" అంది.    
    సంజయ్ బ్రీఫ్ కేస్ విసురుగా సోఫాలోపడేసి "అసలు అక్కా, మీరు ఎవరండీ ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడానికీ? పెళ్ళికిముందు నా ఉద్యోగం విషయంలో అడ్డురానన్నారుగా, అదీమానిపించేసి ఈ ఇంటికి కాపలా కుక్కలా కట్టిపడేయాలనా? ఆ రోజు నా పెళ్ళికి మీరు ఒప్పుకున్నప్పుడు నా కండిషన్ కి మీరు దిగివచ్చారనుకున్నా. కానీ మీ పంతమే నెగ్గించుకుంటారని పెళ్ళయ్యేదాకా నాకు తెలీనే తెలీదు!" అన్నాడు.
    విద్యకి పనివాళ్ళముందు తల కొట్టేసినట్లుగా ఫీలయి మ్రాన్పడిపోయి చూస్తూండిపోయింది.
    "కనీసం నా పర్సనల్ విషయాల్లోనైనా కలుగజేసుకోకుండా ఉండండి" అతను చేతులు జోడించి చెప్పాడు.
    విద్య బాధగా "సారీ సంజయ్, నన్ను మన్నించు! నాకు వర్ష ఎంతో నువ్వూ అంతే అన్నావుగా, అందుకే అలా బావుంటుందనుకున్నాను. ఇంతగా ఫీల్  అవుతావనుకోలేదు" అని లోపలికి వెళ్ళిపోయింది.
    ఇదంతా విభ్రాంతిగా చూస్తున్న వర్ష తేరుకుని "సంజయ్! అమ్మని ఇంత బాధపెట్టాలా? నీకు ఇష్టంలేకపోతే ఇప్పుడు ఎవరు బలవంతంచేసారనీ? ఇంత చిన్న విషయానికి ఆవిడ చేతసారీ చెప్పించుకుంటావా?" అంది కోపంగా.
    సంజయ్ మాట్లాడకుండా ఓ సారి సీరియస్ గా చూసి బైటికివెళ్ళిపోయాడు.
    డ్రైవర్ కారు తియ్యబోతుంటే, "నాకు నా వెహికల్ ఉంది!" అని విసురుగా వెళ్ళి మోటార్ సైకిల్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు.
    వర్ష ఏడుస్తూ అక్కడే కూర్చుని పోయింది. అతనికోసం తను ప్రొద్దుట్నుండీ ఎంత ముచ్చటపడి బ్రేక్ ఫాస్ట్ తయారుచేసిందీ తలుచుకుంటేనే ఆమెకి దుఃఖం ఆగడం లేదు 'ఛీ! ఏం అనుకుంటే ఏం జరిగిందీ' అనుకుంది. అంతలోనే తల్లి గుర్తొచ్చి, తల్లిగదిలోకి వెళ్ళి "అమ్మా......" అని పిలిచింది.
    మంచం మీద పడుకుని దిండులో మొహం దాచుకున్న విద్య గభాల్న లేచి "ఏంటమ్మా?" అంది.
    అప్పటిదాకా ఏడ్చినట్లుగా ఉబ్బిపోయి ఉన్న తల్లి కళ్ళను చూడగానే వర్ష తట్టుకోలేకపోయింది.
    "అమ్మా.......ప్లీజ్ ఫర్ గివ్ సంజయ్! అతన్ని క్షమించెయ్!" అంది.
    "ఛ! ఏదో చిన్నతనంకొద్దీ అలా ఉద్రేకంగా మాట్లాడాడు అంతే. నాకు సంజయ్ సంగతి తెలీదా?" అంది విద్య.
    ఆ రోజు ఇద్దరూ సాయంత్రందాకా అన్యమనస్కంగానే గడిపారు. వర్ష లంచ్ టైంలో సంజయ్ కోసం క్యారేజ్ పంపిస్తే అతను లంచ్ బైటచేశాను అని తిప్పిపంపించేశాడు.
    వర్ష ఫోన్ చేస్తే "బిజీగా ఉన్నాను. ఇంటికొచ్చాక మాట్లాడ్తాను" అని పెట్టేశాడు.
    వర్షకూడా భోంచెయ్యలేదు. విద్య తల్లి మనసుకొట్టుకుపోయింది.
    "తల్లీ రెండు ముద్దలు తినమ్మా!" అని బ్రతిమాలింది కానీ తినిపించలేకపోయింది.
    సంజయ్ సాయంత్రం ఇంటికివచ్చేదాకా వర్ష మూడ్ ఆఫ్ గా పడుకుని ఉంది. కూతుర్ని అలా చూస్తుంటే విద్యకి చాలా బాధగా ఉంది. కానీ ఏం చెయ్యలేనిపరిస్థితి.
    "అమ్మా! నాకు చందమామకావాలి!" అని రాముడంతటి వాడు గోలచేస్తే తండ్రి అద్దంలో చందమామని చూపించి మాయచేసి మరిపించాడుట! కానీ విద్య అయితే కూతుర్ని చంద్రమండలానికి తీసుకువెళ్తేనో అని ఆలోచించేది. అంత ప్రేమ ఆమెకి కూతురంటే. అదే ఆమె బలహీనతకూడా!
    సంజయ్ గదిలోకి వెళ్ళి "వర్షా......" అని పిలిచాడు.
    వర్షపలకలేదు. అలకగా పడుకునే ఉంది.
    "సారీ.....లంచ్ లో బిజీగా ఉండి మాట్లాడలేకపోయాను "ఆమె భుజాలు పట్టుకుని తన వైపుతిప్పుకుంటూ అన్నాడు.
    "సారీ!.....హూ! ఆ రెండు అక్షరాలు చెప్తే అయిపోయిందా? ప్రొద్దుట్నుంచీ నేను ఎంత చిత్త క్షోభపడ్డానో తెలుసా? అసలు నేను ఏమీ తినలేదుకూడా......" వర్ష ఏడ్చేసింది.
    "సారీరా......పద......పద బైటికిడిన్నర్ కి వెళ్దాం. త్వరగా డ్రెస్ అవు."
    "బైటికా? మరి అమ్మా?" అడిగింది.
    సంజయ్ ముఖం సీరియస్ గా మారిపోయింది. "అన్నింటికి అలా చిన్నపిల్లలా ప్రవర్తిస్తావేంటి వర్షా? మన మధ్యన ఆవిడెందుకూ? ఆవిడొస్తే మనం సరదాగా చిలిపిగా ఉండగలమా? ఆలోచించు!" అన్నాడు.
    "అమ్మని వదిలేసి ఎలా వస్తాను సంజయ్? తనూ ప్రొద్దుట్నుంచీ మూడ్ ఆఫ్ గా అలా పడుకునే ఉంది. ఆవిడ్ని అలా వదిలేసినా ఎంజాయ్ మెంట్ నేను చూసుకోగలనా? అర్ధం చేసుకో.
    అసలు నువ్వు ప్రొద్దుట ఆవిడతో ప్రవర్తించిన తీరు ఏమీ బాలేదు. అందుకునువ్వు ఆవిడకి సారీ చెప్పుకోవాలి!" అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS