"సరే మళ్ళి ఇది అయిపోయిన తరువాత మళ్ళి అడగకూడదు సరేనా?" అంది జయంతి.
"సరే!" అన్నాడు వాడు.
"ఇంద తీసుకో" అంటూ పొట్లాంలో నుంచి ఒకటి తీసి ఇచ్చింది.
"జయంతి! పిల్లలందరికీ నీళ్ళు తోడు, స్నానాలు చేస్తారు, పొద్దు దిగింది. స్నానాలు చేసి భోంచేసి పడుకుంటారు. మనం ఎంతసేపయినా మాట్లాడుకోవచ్చు" అంది కస్తూరి.
"అలాగే, అలాగే" అంటూ కేకేసింది జయంతి.
9
"అక్కా, అక్కా! ఈరోజు డాబా పైన పడుకుందామా!" అడిగింది వనజ గిరిజని.
"ఎందుకు, వద్దు" అంది గిరిజ.
"అక్కా నువ్వయినా చెప్పవే ఈరోజు డాబా పైన పడుకుందాం బ్రతిమాలుతూ జయంతిని అడిగింది వనజ.
"ఓ అలాగే! సురేంద్ర బావని నిచ్చెన వేయమందాం. అసలు పెద్ద నాన్నగారిని అనాలి. ఇంత పెద్ద డాబా కట్టించి మెట్లు లేకుండా చేశారు" అని విసుక్కుంది జయంతి.
"ఏంటే మీ గుసగుసలు? భోంచేయండి. త్వరగా ఇప్పటికే పొద్దుపోయింది " అంది భ్రమరాంబ.
"అబ్బ! ఈ ముసలామె ఒకటి ఎప్పుడు భోజనం నిద్ర ఈ రెండూ తప్ప వేరే పనుండదు" అంది వనజ.
ఆ మాటలకు జయంతి కిసుక్కున నవ్వింది.
"ఎందుకే నవ్వుతావు, ఇప్పుడు నేనేమన్నాని?" అంది మళ్ళి భ్రమరాంబ.
"ఏం లేదులే! ఎందుకు నవ్వానో చెపితే గుండాగిపోతోంది" అంది జయంతి.
పక్కనే వున్న గిరిజ జయంతి తోడమీద గిచ్చింది.
"వామ్మో దీని పక్కన కూర్చోకూడదు రోయ్ దేవుడో. తొడపాశం పెట్టి చంపుతుంది" అంది జయంతి పెద్దగా.
సురేంద్ర పెద్దగా నవ్వాడు.
"బావ! భోం చేయటం అయిపొయిందక్కా! నువ్వే అడుగు పైకి నిచ్చెన వేయమని" అడిగింది వనజ.
"అడుగుతాలే నువ్వు గమ్మున ఉండు. మళ్ళి ముసల్ది ఏంటే మీ గొడవా" అంటూ సాగదిస్తుంది" అంది జయంతి.
ఈసారి వనజ కిసుక్కున నవ్వింది.
"జయంతి! ఇంకాస్తా అన్నం పెట్టుకో " అంది కస్తూరి.
"అమ్మో, వద్దమ్మా ఇవ్వాళ పైతిండి ఎక్కువైంది ఇక చాలు అంటూ కంచం తీసుకుని లేచింది.
వెంటనే వనజ కూడా లేచింది.
సురేంద్ర భోంచేసి ఆరుబయట మంచంపైన కూర్చున్నాడు. దూరంగా రామశేషు, సర్వోత్తమరావులు మంచాలపైనే పడుకుని మాట్లాడుకుంటున్నారు. మాధవరావు, సోమసుందరంలు తమతమ పనుల్లోనే వున్నారు. దాక్షాయణి, శివపార్వతిలు కూడా భర్తలతో ఏదో మాట్లాడుకుంటున్నారు. కస్తూరి వంటగదిలో గిన్నెలు సర్దుతోంది. భ్రమరాంబ భోజనం చేసి ఆరుబయట మంచం పైన కూర్చుంది. జయంతి మెల్లగా సురేంద్ర దగ్గరకు వచ్చి.....
"బావా! నేను, గిరిజక్క, వనజ దబాపైన పడుకుంటాం, నిచ్చెన పెట్టావా?" అనడిగింది.
"అత్తయ్యను అడిగావా?" అన్నాడు.
"అడుగుతాలే. నువ్వు నిచ్చెన పెట్టు" అంది.
"ముందు నువ్వు అడిగిరా, నిచ్చెన ఎంతసేపు పెట్టడం" అన్నాడు.
"వెనక వేపునుంచి పెట్టు, ముందునుంచి అయితే నాన్నగారు, పెద్దన్నన్నాగారు ఒప్పుకోరు" అంది జయంతి.
"సరేలే! అలాగే ముందు నువ్వు అత్తయ్యను అడిగిరా" అన్నాడు నవ్వుతూ.
జయంతి లోపలికి వెళ్ళింది.
"పిన్ని ఒప్పుకుంటుందో లేదో" అంది మెల్లగా వనజ.
"అడిగేది ఎవరు తల్లీ! జయంతి ఎవర్నయినా ఒప్పిస్తుంది అన్నాడు సురేంద్ర.
పది నిమిషాల అనంతరం వచ్చింది జయంతి నవ్వుకుంటూ.
"ఎంటాక్కా, పిన్ని ఒప్పుకుందా?" అనడిగింది వనజ.
"ఆ ఒప్పుకుంది బావా! నువ్వు పద, ఎవరికి తెలియకుండా వెనుక వేపునుంచి నిచ్చెన పెట్టు, నేను పెద్దపిన్ని, చిన్నపిన్నిలను కూడా పిలుచుకు వస్తాను. ఓ గంట కబుర్లు చెప్పుకుని కిందకు వచ్చేద్దాం" అంది జయంతి.
సురేంద్ర నవ్వుకుంటూ మంచం పైనుంచి లేచాడు.
"ఏయ్ గిరిజా! పదవే, పెరటివేపుకు పద, వనజను తీసుకుని నేను పది నిమిషాల్లో వస్తాను" అంది జయంతి.
గిరిజ నవ్వుతూ పెరటివేపు దారితీసింది.
జయంతి లోపలికి వెళ్ళింది.
* * * *
డాబా పైన దుప్పట్లు పరిచారు. వరుసగా దిండులు వేశారు. జయంతి, ఆమె పక్కనే గిరిజ, దాక్షాయణి, శివపార్వతి, చివరగా వనజ వరసగా పడుకున్నారు. దూరంగా పిట్టగోడ మీద సురేంద్ర కూర్చున్నాడు. వెన్నెల పిండి ఆరబోసినట్లుంది. ఆ పున్నమి చంద్రునితో వెండిమబ్బులు దోబూచులాడుతున్నాయి. చకోర పక్షులు అరుస్తూ గాల్లో పల్టీలు కొడుతూ వెళుతున్నాయి.
దూరంగా ఎక్కడో కోయిల కూస్తోంది.
దానికి అనుగుణంగా వనజ 'కుహు' అనరుస్తోంది. ఎవరికి నోటివెంట మాట రావటం లేదు.
ఆ వెన్నెల రాత్రిని నిశ్శబ్దంగా ఆస్వాదిస్తున్నారు.
"జయంతి! ఇంత చక్కటి ఆలోచన నీకు ఎలా వచ్చిందే?" అడిగింది దాక్షాయణి.
