Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 16

 

    "ఓసి నీ దుంపతెగ! నీకు నేనంటే మరీ అలుసైపోయిందే......నా కొడుకు నిన్ను చేసుకున్నట్ల;అయితే నీ పని పట్టేదాన్ని" అంది కోడల్ని మురిపంగా చూసుకుంటూ.

    "ఇప్పటికయినా మించిపోయిందేమీ లేదు నన్ను చేసుకోమను నీ కొడుకుని" అంది జయంతి.

    "చేసుకుంటాడే మీ ఇద్దర్ని చేసుకోమన్నా చేసుకుంటాడు. వాడికి పోషించే స్థోమత లేకపోతేగా" అంది నవ్వుతూ.

    "నీ కొడుక్కి స్తోమతున్నా మా అక్క వూరుకోలేదులే అత్తా నిన్ను తన్ని తగలేస్తుంది" అంది గిరిజను చూసి నవ్వుతూ.

    "అధన్ని మాటలంటుంటే నేవ్వెంమాట్లాడవేమే" అంది గిరిజతో.

    "పోనిలే అత్తయ్యా! దాని సంతోషం దానిది. ఏదో చిన్నపిల్ల అంది గిరిజ.

    "ఓయ్....ఏంటి చిన్నపిల్లా? నాకంటే నువ్వు రెండేళ్ళే పెద్ద తల్లి పెళ్ళికూతురివై పోయినంత మాత్రాన పెద్ద అరిందలా మాట్లాడుతున్నావే అంది జయంతి.

    ఆ మాటలకు భ్రమరాంబ పగలబడి నవ్వింది.

    "అబ్బో అప్పుడే ఇంటిలో పెళ్ళికల వచ్చేసిందే " అన్నాడు సోమసుందరం లోపలికొస్తూ.

    "అవును బాబాయ్, ముందు గిరిజక్కకు వచ్చింది. తరువాత నాకొచ్చింది. ఇప్పుడు ఈ బట్టలన్నీ కొనటంతో ఇంటిల్లిపాది వచ్చేసింది" అంది జయంతి.

    "అవునా? పనిలోపని మరి నిక్కుడా చేసేస్తే ఓ పనై పోతుంది కదా?" అన్నాడు సోమసుందరం.

    "మీ పనై పోవటం కోసం నేను పెళ్ళి చేసుకోవాలా?" అంది జయంతి సిరియన్ గా.

    "అమ్మో! నీతో మాట్లాడటం కష్టంలేవే! ఏది పిన్ని ఎక్కడ కొంచెం టి పెట్టి ఇవ్వమను తలనొప్పిగా వుంది" అన్నాడు.

    అంతలోనే అక్కడికొచ్చింది శివపార్వతి.

    "మిరేప్పుడోచ్చారండి" అంది నవ్వుతూ.

    "ఇప్పుడే వచ్చాను గానీ కాస్తా టి పెట్టివ్వు" అన్నాడు.

    "పెడతాగానీ అప్పటివరకూ ఇవిగో ఇవి తినండి" అంటూ చిన్న కవర్ లో జిలేబి, ఉల్లిపాయ పకోడీ వేసి యిచ్చింది.

    వాటిని అందుకుని "బట్టలు అందరికి తీశారా?" అన్నాడు.

    "తీశాం బాబాయ్! నీక్కూడా తలా రెండు జతలు సెలక్షన్ అంతా నాదే" అంది జయంతి ఆనందంగా.

    "అలాగా! అయితే ఇంకేం బ్రహ్మాండంగా వుండి వుంటాయి" అన్నాడు పకోడీముక్క నోట్లో వేసుకుంటూ.

    "అబ్బో, కూతురంటే ఎంత ప్రేమో" అంది శివపార్వతి.

    "అవునే ప్రేమే! ఏం నీకు అసూయగా వుందా? నిన్ను కూడా ప్రేమిస్తూనే వున్నానుగా" అన్నాడు మెల్లగా.

    "ఏంటి బాబాయ్ గొనుగుతున్నావ్? పెద్దగా చెప్పు" అంది జయంతి నవ్వుతూ.

    "ఏం లేదులే....అయన అనటానికి, నువ్వు అడగటానికి బావుంది" అంది సీరియస్ గా నవ్వుతూ శివపార్వతి.

    "ఇవిగో బాబాయ్ నీ బట్టలు....రెండు ప్యాంటులు, రెండు షర్టులు ఎలా వున్నాయి?" అడిగింది జయంతి.

    "ఓహో బ్రహ్మాండంగా వున్నయిరా....నీ సెలక్షనా? అందుకే ఇంత బావున్నాయి. మీ పిన్ని సెలక్షనయితే ఇక నేను వేసుకున్నట్లే" అన్నాడు ఆమెను ఉడికిస్తూ.

    శివపార్వతి మూతి మూడు వంకర్లు తిప్పి, "ఇదిగో టి తీసుకోండి" అంది సీరియస్ గా.

    "పాపం బాబాయ్! పిన్నికి కోపం వచ్చినట్టుంది: అంది జయంతి.

    "ఎందుకే, ఏం చేశావ్...?" అంది అప్పుడే అక్కడికొచ్చిన దాక్షాయణి.

    "నేనేం చేయలేదు పెద్దపిన్ని! బాబాయ్, చిన్న పిన్నిని ఎడిపిస్తున్నాడు" అంది జయంతి నవ్వుతూ.

    "ఏం కాదు వదినా! నా తప్పేం లేదు, టి ఇవ్వమన్నాను, తిరిగి తిరిగి వచ్చాను, నేనే పెట్టివ్వాలా? మీరు పెట్టి నాక్కూడా ఇవ్వొచ్చుగా అంది. "చాలా అన్యాయం కదూ వదినా" అన్నాడు అమాయకంగా సోమసుందరం.

    "ఏంటి- నేను మిమ్మల్ని టి పెట్టమన్నానా" అంటూ అతని చెవి మెలితిప్పింది.

    "అమ్మో - చచ్చాన్రో దేవుడో" అని పెద్దగా అరిచాడు.

    "వీళ్ళకు ఇంకా చిన్నపిల్లల బుద్దులు పోలేదు" అంది దాక్షాయణి వాళ్ళిద్దర్నీ మురిపంగా చూస్తూ.

    "భలే.... భలే రోజు ఇలా చెవి మెలేస్తావా చిన్నపిన్ని, బాబాయ్ తప్పు చేస్తే" అడిగింది కుతూహలంగా జయంతి.

    "ఆ చెవులే కాదు, చెంపలు కూడా వాయిస్తాను" అంది.

    "ఓ ఐసీ! అందుకేనా బుగ్గలు అలా వుబ్బి వున్నాయ్" అంది జయంతి సీరియస్ గా.

    ఆ మాటలకు దాక్షాయణి పగలబడి నవ్వింది.

    "ఏంటి దాక్షాయణి! అంతగా నవ్వుతున్నావ్?" అంది కస్తూరి.

    "ఏం లేదోదినా, ఉత్తినే" అన్నాడు సోమసుందరం కంగారుపడి.

    "అన్నట్టు వదినా! మరి బంగారం కొన్నారా?" అనడిగాడు మాట మారుస్తూ.

    "లేదయ్యా మీ అన్నయ్య సేటుగారినే ఇంటికి పిలిపిస్తానన్నారు అంది నవ్వుతూ.

    "ఓ అలాగా. అదే మంచిదిలే వదినా" అన్నాడు గంబిరంగా. సోమసుందరం.

    "జయంతక్కా. జయంతక్కా! ఇంకో జిలేబి ఇవ్వవా?" అంటూ వచ్చాడు చంటి.

    "ఏంట్రా ఇక అన్నం తినేది లేదా? ఇప్పుడివ్వను , అన్నం తిన్న తురువాత ఇస్తాను" అంది జయంతి.

    "ఒక్కటే అక్కా! ఒక్కటంటే ఒక్కటే" అన్నాడు వాడు బతిమాలుతూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS